31, ఆగస్టు 2015, సోమవారం

సాక్షిలో నా వ్యాసం – ఓ కొత్త అనుభవం


‘మాది పేద బ్రాహ్మణ కుటుంబం. ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. మా చిన్నమ్మాయికి మూత్ర పిండాల వ్యాధి అని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో ‘ఆరోగ్యశ్రీ అక్కరకు వచ్చింది. మా అమ్మాయి బతికి బట్ట కట్టింది’
ఈరోజు సాక్షిలో నేను రాసిన వ్యాసం చదివి వరంగల్ నుంచి వచ్చిన ఫోను ఇది. అంతే కాదు ఆయన మరో విషయం కూడా చెప్పాడు. ‘మా అబ్బాయి ఇంజినీరింగు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ చదువు చదివించడం నా వల్ల అయ్యేపని కాదు. ఫీజు రీ ఇంబర్స్ మెంటు పధకం  పుణ్యం అది’
‘మా నాన్న గారికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు. గుండె జారిపోయింది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ జరిగింది. ఏడేళ్ళు హాయిగా బతికారు. తరువాత ప్రోస్టేట్ ఆపరేషన్ అంటే అమ్మ నగలు కుదువబెట్టి చేయించాము. అరవై వేలు అయింది. అయినా మనిషి మాకు కాకుండా పోయారు. ఆయన బతికున్నన్నాళ్ళు  అంటుండేవారు. ‘నన్ను బతికించారు. ఆయన పోయారని’ మహబూబ్ నగర్ నుంచి మరో ఫోను.    
ఆదిలాబాదు నుంచి, సత్యవేడునుంచి ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల నుంచి ఫోన్లు వచ్చాయి. వాళ్ళెవరికీ రాజకీయాలతో సంబంధం లేదు. దాదాపు అందరూ ఆరోగ్యశ్రీ పధకం వల్ల ఏదో మంచి ప్రయోజనం పొందిన వాళ్ళే. లాభాలు కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళు పొందారని ఆరోపణలు వున్నాయి. అవి నిజమే అయినా ‘ప్రయోజనం’ పొందిన పేద ప్రజలు కూడా చాలా మంది వున్నారు.
ఈ స్పందనలు సరే. కొన్ని అక్షింతలు కూడా పడ్డాయి. ఈ పధకం పురుడు పోసుకోవడం వెనక మా హస్తం కూడా వుందని కొందరు ఫోన్లు చేసారు. వారిలో మంద కృష్ణ మాదిగ ఒకరు. ఒకప్పుడు వికలాంగులకోసం, గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకోసం వీధి పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆరోగ్యశ్రీ పధకం రూపు దాల్చడంలోను, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలోనూ  తన పాత్ర కూడా ఉందన్నారు. అదీ నిజమే. అయన పేరు మరచిపోవడం నా పొరబాటే. కానీ, ఒక నాయకుడి వర్ధంతి సందర్భంగా సంస్మరణ వ్యాసం రాసేటప్పుడు కొన్ని పరిమితులు, పరిధులు వుంటాయి. వాటిని అర్ధం చేసుకుంటే ఇలాటి అపార్ధాలు రావు.
కొద్ది సేపటి క్రితం ఉజ్వల అనే ఆవిడ ఫోను చేసారు. ఆరోగ్యశ్రీ పధకం గురించి రాసేటప్పుడు ‘కిరణ్ కుమార్ రెడ్డి’ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ఆవిడ అభ్యంతరం. నాకు కొంత ఆశ్చర్యం వేసింది కూడా. మామూలుగా నా ఆలోచన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపు మళ్ళింది. ‘కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యశ్రీ పధకానికి అసలు సిసలు రూపశిల్పి’ అంటూ ఉజ్వల గారు లేవనెత్తిన వాదన నన్ను కొంచెం అయోమయంలో పడేసింది. కొద్దిసేపటి తరువాత ఆవిడ మాటల్లోనే నా సంశయ నివృత్తి జరిగింది. ఉజ్వల గారు ప్రస్తావించింది ఆరోజుల్లో ముఖ్యమంత్రి పేషీలో ఆరోగ్యశ్రీ వ్యవహారాలు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి. ఆయన స్వయానా ఉజ్వల గారికి సోదరుడు కావడం వల్ల ఆరోగ్యశ్రీ పధకం రూపకల్పనలో ఆయన పడ్డ శ్రమదమాదులు వారికి తెలిసివుంటాయి. అయితే ఈ వ్యాసం కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి రాసింది కాదు. ఆరోగ్యశ్రీ పధకం అమల్లోకి తేవడంలో  రాజశేఖరరెడ్డి గారిని ఏ అంశాలు ప్రభావితం చేశాయి అన్నదాన్ని గురించి మాత్రమె.
ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధాని కానీ ఒక అద్భుతమైన ఆలోచనకు పధక రచన చేసే సమయంలోను, దాన్ని అమలుచేసే సమయంలోను అనేకమంది అధికారులు, అనధికారుల  పాత్ర వుంటుంది. వారందరూ మమేకమై పనిచేస్తేనే  కొన్ని పధకాలు విజయవంతం అయి, ప్రజల ఆదరణ పొందుతాయి. కాకపొతే సహజంగా వాటికి  సంబంధించిన కీర్తి ప్రతిష్టలు ఆ నాయకుల ఖాతాలోనే పడతాయి. సహకరించిన అధికారులు, ఇతరులు ఆ పధకాలు విజయవంతం అయినందుకు సంతోషించాలి. ఇది రాజులు, మహారాజుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ.
ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టడానికని ఇలా  ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పధకం అవసరమే వచ్చేది కాదు. ‘అమ్మా పెట్టదు...తిననివ్వదు’ అనే సామెత చందంగా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల గడప తొక్కగలిగే విధంగా  కొందరి ప్రాణాలు ఆరోగ్యశ్రీ వల్ల , 108 అంబులెన్సు సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు మార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంతో ‘మచ్చ’ పడిన నాయకులు  కూడా ఎంతో కొంత మంచి చేస్తారు. ఆ మంచి చెడులను హంస మాదిరిగా వేరు చేసి చూసినప్పుడు అసలు వాస్తవాలు బోధపడతాయి. 

పొతే, చివర్లో ఒక మాట.
ఒక సందర్భంకోసం ‘సాక్షి’ పత్రికలో నేను రాసిన ఒక వ్యాసం ఇంత స్పందన తెస్తుందని అనుకోలేదు. బహుశా దీనికి ప్రధాన కారణం నేను రాసింది వై ఎస్సార్ గురించి కావడం, ప్రచురించింది మంచి పాఠకాదరణ వున్న పత్రిక కావడం కావచ్చు.


-భండారు శ్రీనివాసరావు  (31-08-2015)              

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆరోగ్యశ్రీ పేరు చెప్పి దారుణంగా దోచుకున్నారు. ఉపయోగపడినవాళ్ళు చాలా తక్కువ. ఒక శాతం కూడా లేరు. కార్పొరేట్ హాస్పిటల్స్ బాగుపడ్డాయి. కొన్ని కంపెనీలు బాగుపడ్డాయి. సామాన్యుడి నెత్తిన చెంగు చక్కగా వేశారు. అక్కరలేని ఆపరేషన్లు చేశారు. చేయని ఆపరేషన్లకి సొమ్ములు గుంజారు. చాలా చిత్రాలు కళ్ళతో చూశాం, డబ్బా కొట్టకండి బాగోదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - "ఇక్కడ గమనించాల్సింది ఈ పధకం ఎవర్నో బాగుచేయడానికని, ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టడానికని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నిజమే ప్రభుత్వ ఆసుపత్రులను బాగుచేస్తే, అవి బాగా పనిచేస్తే ఈ పధకం అవసరమే వచ్చేది కాదు. ‘అమ్మా పెట్టదు...తిననివ్వదు’ అనే సామెత చందంగా కాకుండా సామాన్యులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల గడప తొక్కగలిగే విధంగా కొందరి ప్రాణాలు ఆరోగ్యశ్రీ వల్ల , 108 అంబులెన్సు సర్వీసుల వల్ల నిలబడ్డ మాట వాస్తవ దూరం కాదు. ప్రజలకు మంచి చేసే కొన్ని విషయాలను రాజకీయ కోణం నుంచి వేరు చేసి చూడాలి. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు మార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంతో ‘మచ్చ’ పడిన నాయకులు కూడా ఎంతో కొంత మంచి చేస్తారు. ఆ మంచి చెడులను హంస మాదిరిగా వేరు చేసి చూసినప్పుడు అసలు వాస్తవాలు బోధపడతాయి."

Unknown చెప్పారు...

http://blog.marxistleninist.in/2015/04/blog-post_23.html