8, ఆగస్టు 2015, శనివారం

వివాదాల సుడిగుండాల్లో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-08-2015,SUNDAY)

దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. కొత్తగా పురుడుపోసుకున్న రెండు రాష్ట్రాల నడుమ ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే  కనిపించే ఈ ప్రాజెక్ట్  వాస్తవరూపం దాల్చడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.  
దేశంలోని నదులన్నింటినీ  అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941  జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్  ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా  మూడు లక్షల యాభై  వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్  మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం  కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న  భద్రాచలం  సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు,  పోలవరం కుడి గట్టు కాల్వని,   కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం  2004  కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 

1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న  పోలవరానికి,  వై. ఎస్.  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం.  పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం. ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణించే వారు  విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి  గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది. ఇవీ ఈ ప్రాజెక్ట్ వల్ల అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కానీ, విభజన అనంతరం ఏర్పడ్డ కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వొనగూడే ప్రయోజనాలు. కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది.          
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే,  గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. అసలు ఏ సేద్యపు నీటి  ప్రాజెక్ట్ అయినా కొత్త ఆయకట్టుకు నీళ్ళు అందించడం లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది. కానీ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి,  కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే  ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి  ఇదే.
రాష్ట్రంలో పలు జిల్లాలకు ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని సహజ సిద్ధమైన బాలారిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్  నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి  పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో  సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్  తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో కూడా పోలవరం అంశం ప్రధాన అవరోధంగా  నిలిచింది. ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో,  ముంపుకు గురయ్యే ప్రాంతాలు మరో రాష్ట్రంలో వుండే విచిత్ర పరిస్తితి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విభజన  నిర్ణయం తీసుకున్న నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం,  తెలంగాణాలోని అనేక గ్రామాలను  ఆంధ్ర ప్రదేశ్ కు బదలాయించే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఆఖరి క్షణంలో ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తరువాత వచ్చిన మోడీ నాయకత్వంలోని  ఎండీయే సర్కారు ఆ ఆర్డినెన్సు తీసుకురావడమే  కాకుండా దాన్ని లోకసభలో ఆమోదింపచేసుకోవడంతో  తెలంగాణా ప్రాంతంలో అగ్గి రాజుకుంది.  పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి  మింగుడు పడలేదు. అయినా కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఓ మెట్టు దిగి ఈ విషయంలో మరింత పట్టు పట్టకుండా పట్టువిడుపు ధోరణి ప్రదర్శించిన ఫలితంగా రాజుకున్న అగ్గి మరింత ప్రజ్వరిల్లకుండా ఆదిలోనే సమసిపోయింది.
పొరుగునవున్న ఒడిశా,  ఛత్తీస్ ఘడ్   ప్రభుత్వాలు కూడా ఈ పోలవరం  ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి.    
పోలవరం ప్రాజెక్ట్ పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో వున్నట్టు కానవస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజక్ట్ గా చేపట్టి పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు.  అధికార పీఠం ఎక్కిన బీజేపీ ఇప్పుడు ఈ విషయంలో నిరాసక్తతతో కూడిన ఆసక్తి చూపుతోందన్న అపప్రధ మోస్తోంది. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.
నిధుల లేమితో కునారిల్లుతున్న పోలవరం  ప్రాజెక్ట్ అనుకున్న విధంగా,  అనుకున్న  వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే. ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం  అంచనాలకు మించి పెరిగిపోవడం మాత్రం  ఖాయం.

అయితే, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తిచేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికీ, ప్రత్యేకించి అక్కడ పాలనసాగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికీ ఎంతో ప్రయోజనం లభిస్తుంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరతామని ఆ పార్టీ అధినాయకులు పదేపదే ప్రకటనలు చేయిస్తున్నారు. కానీ పార్టీ అధినేతకు అది అంత సులభంగా అయ్యేపని కాదని తెలుసు. కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వరకు చేసింది. కానీ నిధుల విడుదల అరకొరగా జరుగుతోంది. అంచేతే టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు అనే కొత్తపల్లవి ఎత్తుకుంది. పోలవరం అన్ని గండాలు గడిచి పూర్తయ్యేలోగా పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. కాబట్టే పట్టిసీమ ప్రాజెక్టును ఆఘమేఘాల మీద పూర్తిచేయాలని అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆగస్టు పదిహేనుకల్లా పూర్తిచేసి నీరు విడుదల చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఒక్క చిత్తశుద్ధి మాత్రమే సరిపోదు. అందుకు  అవసరమైన విత్తం కూడా కావాలి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దగ్గర బాగా కొరతగా వున్నది అదొక్కటే.
దీనికి తోడు పట్టిసీమ ప్రాజెక్టుపై ముసురుకుంటున్న వివాదాల ముసురు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన వై.ఎస్.ఆర్.సీ.పీ. దీనికి ఏకంగా 'మాయలేడి' అనే పేరు పెట్టింది. కేవలం కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే తెలుగుదేశం ప్రభుత్వం, పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టును తెర మీదకు తీసుకు వచ్చిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సహజంగా పాలక పక్షాలు భావిస్తుంటాయి. అయితే అదే ప్రశ్న ప్రజలనుంచి రాకుండా చూసుకోవాలి. తాడును పామనుకుని జాగ్రత్త పడడానికి, పామును తాడనుకుని నిర్లక్ష్యంగా వుండడానికీ ఎంతో వ్యత్యాసం వుంది.  
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 9849130595


(08-08-2015)

NOTE: Courtesy Image Owner 

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు"

ప్రాజెక్టు లాభసాటి కాదని 1951 లోనే కేంద్ర జలసంఘం (CWC) తేల్చేసింది

"తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు"

ఆ తరువాత అదే డా. కెఎల్ రావు గారు తన అభిప్రాయాన్ని మార్చుకొని పోలవరం ప్రాజెక్టును సాంకేతిక/ఆర్ధిక/పర్యావరణ/బద్రతా కారణాలపై వ్యతిరేకించారు

"ఇందువల్ల హైదరాబాదు నుండి తొమ్మిదో నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణించే వారు విజయవాడ వరకు పోకుండానే ఆ బరాజ్ పైనుంచి గుంటూరు జిల్లాకు చేరడానికి వీలుపడుతుంది"

మీరు బారేజీ బ్రిడ్జీల మధ్య కన్ఫ్యూస్ అయినట్టుంది

"కొద్దో గొప్పో తెలంగాణాలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు కూడా ప్రయోజనం వుంటుంది"

తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రాదు. ప్రతిపాదిత ఆయకట్టు మొత్తం ఆంధ్రలోనే ఉంది. విశాఖ: 1.5 లక్షలు, తూగో:2.5 లక్షలు, పగో: 2.6 లక్షలు, కృష్ణా (తరలింపు 80 టీఎంసీలు కాక): 60 వేలు

"ప్రధానమైన అడ్డంకి ఇదే"

ఇదొక్కటే కాదు, ప్రాజెక్టు మీద అనేక వర్గాలకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ప్రాజెక్టు వల్ల వచ్చే కొత్త ఆయకట్టు లోంచి ముంపు & ఇతర ప్రాజెక్టుల ఆయకట్టు తీసేస్తే పెద్దగా ఒరిగేది లేదని కొందరు ఆంధ్రుల వాదన. భూకంపం వస్తే డాం కుప్పకూలి భయంకర ప్రాణ/ఆస్తి నష్టం జరిగే ప్రమాదం లాంటి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి.

"దీనికి ఏకంగా 'మాయలేడి' అనే పేరు పెట్టింది. కేవలం కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే తెలుగుదేశం ప్రభుత్వం, పోలవరాన్ని పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టును తెర మీదకు తీసుకు వచ్చిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది"

ఎస్టిమేట్లకు 30% అదనపు టెండర్లను ఖరారు చేయడంపై ఆంధ్రులలో ఆందోళనలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్ణయం శరవేగంతో జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్ పార్టీ అభ్యంతరం షరా మామూలుగా అనుకున్నా, లోక్సత్తా & వామ పక్షాల అభ్యంతరాలను అంతే సునాయాసంగా కొట్టేయడం కుదరదు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottumukkala -పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి ఇదే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottumukkala -పోలవరం ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే జలాలు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో వున్న ఆయకట్టు స్థిరీకరణకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మునకకు గురయ్యే ప్రాంతాలు మాత్రం తెలంగాణలో వున్నాయి. వాటిల్లో చాలావరకు ఆదివాసీలు నివసించే ప్రదేశాలు. ప్రధానమైన అడ్డంకి ఇదే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@jai gottumukkala - ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం. దీనికితోడు ఈ ప్రాజక్ట్ తలపెట్టినప్పుడు రాష్ట్రం ఒకటిగా వుంది. తరువాత రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@jai gottumukkala - పోలవరం డిజైన్ మార్చాలని, తద్వారా ముంపుకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణం తగ్గేలా చూడాలని మొదటి నుంచి పట్టుబడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులకు కేంద్రం వైఖరి మింగుడు పడలేదు. అయినా కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఓ మెట్టు దిగి ఈ విషయంలో మరింత పట్టు పట్టకుండా పట్టువిడుపు ధోరణి ప్రదర్శించిన ఫలితంగా రాజుకున్న అగ్గి మరింత ప్రజ్వరిల్లకుండా ఆదిలోనే సమసిపోయింది.
పొరుగునవున్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు కూడా ఈ పోలవరం ప్రాజక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల తమ రాష్ట్రాల్లో భూములు విస్తారంగా మునకకు గురవుతాయని, మునుపటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణంతో ముందుకు పోతోందని ఆరొపిస్తూ ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు గతంలోనే సుప్రీం కోర్టులో కేసు వేశాయి.