24, ఆగస్టు 2015, సోమవారం

కరెంటు కష్టాలు


డిగ్రీ మొదటి సంవత్సరం చదివే నాటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరోసిన్ దీపాలతోనే  కాలక్షేపం. పిల్లలకు అన్నాలూ అవీ పెట్టడం సాయంత్రం కనుచూపు వెలుతురు ఉండగానే పూర్తిచేసేవాళ్ళు. వూరికి కరెంటు వచ్చిందన్న సంతోషం మొదట్లో వుండేది. వసారాలో స్విచ్చి వేయగానే దొడ్లో  బల్బు వెలగడం అంతా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు.  అయితే కరెంటు లేని ఆ రోజులే బాగుండేవని ఇప్పుడు అనిపిస్తోంది. కరెంటు పోయిందనీ, మళ్ళీ వచ్చిందనీ గోల వుండేది కాదు. కరెంటు కాలం వచ్చాక ఈ ఇబ్బందులులన్నీ మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు సర్కారు వాళ్ళు  వచ్చే ఏడాది కల్లా కరెంటు మిగులు అంటూ చేసే ప్రకటనలు చదవడం, సంతోషించడం ఇలా జరిగిపోతూవచ్చింది కానీ కరెంటులో మిగులన్నది ఎప్పటికీ తీరని కల లాగానే  మిగిలిపోతూ వచ్చింది. గత నలభయ్యేళ్ళకు పైగా హైదరాబాదులో ఉంటున్న మాకు కరెంటు కష్టాలు సేతమ్మ కష్టాలు మాదిరిగా అలవాటయి పోయాయి. ఇప్పుడు పరిస్తితి ఏమైనా మారిందా అనవచ్చు. మారిందని పూర్తిగా చెప్పలేను కానీ కరెంటు అధికారుల ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తోందని మాత్రం అనుభవపూర్వకంగా చెప్పగలను. ఒక విలేకరిగా నాపట్ల వాళ్ళు ఇలా అభిమానం చూపుతున్నారని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు అనడానికి ఇవ్వాల్టి నా అనుభవమే సాక్ష్యం.

మూడు వారాల సెలవుపై హైదరాబాదు వచ్చిన మా పెద్ద కుమారుడు, కోడలు, మనుమరాళ్ళు ఈ రాత్రి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నారు. ఎనిమిది పెద్ద పెద్ద సూటుకేసుల్లో సామాను సర్దుతుంటే కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. ఏమి చెయ్యాలో తెలవదు. మేముండేది మా ఫ్లాటులో ఆఖరి అంతస్తులో. లిఫ్ట్ లేకుండా అన్ని సూటుకేసులు కిందకి తీసుకురావడం ఒక సమస్య. టెలిఫోను డైరెక్టరీ తీసి మా ఏరియా కరెంటు ఆఫీసరు  నెంబరు సంపాదించి ‘మా ఇంట్లో కరెంటు పోయింది, ఏమైనా సాయం చేయగలరా’ అని అభ్యర్ధిస్తూ ఇంగ్లీష్ లో ఒక ఎస్ ఎం ఎస్ పంపాను. అందులో నా నెంబరు తప్ప పేరు అదీ రాయలేదు.  అయిదు నిమిషాల్లో మౌలాలీ అనే అతను ఫోను చేసి ఇంటి వివరాలు వాకబు చేశాడు. మరో అయిదు నిమిషాల్లో అతను మా ఇంటి ముందు వున్నాడు. ఏం మంత్రం వేశాడో తెలియదు వాడ మొత్తానికీ కరెంటు వచ్చింది. బరువయిన సూటుకేసులు మెట్ల మీదుగా కిందకు దింపే భారం మాకు  తప్పింది.

అందరికీ ఇలాటి సేవలు అందుతున్నాయా అంటే ఆ విషయం తెలవదు. కాకతాళీయంగా జరిగినా నాకు మాత్రం ఎంతో తృప్తి అనిపించింది. నేనెవరో తెలియకుండానే రాత్రి వేళ వచ్చి సాయపడ్డ కరెంటు సిబ్బందికి వేల వేల కృతజ్ఞతలు చెప్పాలని అనిపించింది.  అమెరికా నుంచి వచ్చిన మా వాడు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకున్నాడు. అది వాళ్ళ డ్యూటీ అన్నట్టు మాట్లాడాడు. మనకిలా అలవాటయిపోయింది. డ్యూటీ చేసినా సాయం చేసారని అనుకోవడం’ అంటూ.  నిజమే అది వాళ్ళ డ్యూటీ. కానీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటే ఇలా రాసుకోవాల్సిన పనేముంటుంది. మావాడు చెప్పింది కరెక్టే కావచ్చు. కానీ మన దగ్గర ఇలా జరగడం మనకు కొత్తే. ఆ సమయంలో సాయం చేసినట్టే అనిపించింది. ఎందుకంటె ఈ దేశంలో పుట్టి పెరుగుతున్నాము కాబట్టి. (24-08-2015)                

2 కామెంట్‌లు:

sarma చెప్పారు...

మరీ అంత సంతోషించెయ్యకండి! వీళ్ళలో మార్పు ఇప్పటిలో రాదు. మీ ఏరియా మొత్తానికి పోయిందంటే కామన్ గా వచ్చిన ఇబ్బంది, మీకే పోయుంటే ఇంతే సంగతులు...ఆశా జీవులం అనుకోండి..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@sarma - Cultural Gap
If electricity goes in America they call the power house.
In Japan, they test the fuse,
But In India, they check neighbour's house, "power gone there too....then ok!" ������Fuel pumpFuel pump