14, ఆగస్టు 2015, శుక్రవారం

వాదాలతో, వాయిదాలతో ముగిసిపోయిన పార్లమెంటు సమావేశాలు


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసాయి. ఈ సమావేశాలు జరిగిన వ్యవధానం కంటే వాయిదాల సమయమే ఎక్కువనే రీతిలో పదేపదే వాయిదాలు పడుతూ చివరికి  గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి.


కొత్త కోడలు కాపురం చేసే కళ కాలి మెట్టెలు చూసే చెప్పొచ్చన్నట్టు ఈ సమావేశాలు ఇలానే జరుగుతాయని మొదటి రోజునే బోధపడింది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులను, ఒక కేంద్ర మంత్రిని తొలగించాలని ప్రతిపక్ష హోదా సయితం లేని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ డిమాండుతో సమావేశాలకు అంకురార్పణ జరిగింది. అంతవరకు సభను సాగనిచ్చేది లేదన్న వాదనతో వాదోపవాదాలను మరింత సాగతీసింది. ‘అల్లా ఎల్లా కుదురుతుంది కుదరదు కాక  కుదరదు’ అంటూ గతంలో ప్రతిపక్షంలో వుండగా ఇలానే సభను అడ్డుకున్న బీజేపీ, గతాన్ని హాయిగా  మరచిపోయి  మొండికేసింది. ‘ముందు రాజీనామాలు, తరువాతే చర్చ’ అని కాంగ్రెస్ ఓ పక్కా, ‘ముందు చర్చ ఆ తరువాతే సమాధానాలయినా ఇంకేదయినా’ అంటూ పాలకపక్షం, తమదయిన పాత్రలను తమదయిన బాణీల్లో పాత్రోచితంగా అవధులు మీరి మరీ పోషించాయి. ‘కోడి ముందా గుడ్డు ముందా’ అనే రీతిలో సాగిన ఈ వివాదానికి తెర పడే అవకాశాలు ఎటూ లేవు కాబట్టి పార్లమెంటు విలువయిన సమావేశాల సమయమంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. పరిస్తితి ఈ విధంగా గాడి తప్పడానికి ‘మీరు కారణం అంటే మీరు కారణం’ అని ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నారు తప్పిస్తే,  ఏఒక్కరూ, ‘ఉమ్మడిగా మనం కారణం’ అనుకోలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ దిశగా సాగుతున్నదో అర్ధం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు.
చట్టసభలు సజావుగా నడవాలంటే  పాలక పక్షం ముందు బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో పాలక ప్రతిపక్షాల వైఫల్యమే, బాధ్యతారాహిత్యమే  పార్లమెంటు సమావేశాలు ఇలా నిరర్ధకంగా ముగియడానికి ప్రధాన కారణం. ఈ విషయం నిర్ధారించడానికి పార్లమెంటరీ నియమ నిబంధలని అపోసన పట్టక్కరలేదు. బజారున పోయే ఏ సామాన్యుడిని అడిగినా ఇదే చెబుతాడు.
నిజానికి సభ సజావుగా నడవకపోతే ప్రతిపక్షానికే  నష్టం. పాలకపక్షానికి ఒకరకంగా వెసులుబాటు. సభ జరిగేలా చూసుకుంటే పాలక పక్షం తప్పొప్పులను ఎత్తి చూపి నిలదీయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తుంది. సభ జరక్కపోతే ఏదో అప్పటికి ‘మమ’ అనిపించి పాలక పక్షం బయటపడొచ్చు. అయితే సభను అడ్డుకోవడం ద్వారా లభించే ప్రచార లాభం రాజకీయ పార్టీలను మరోరకంగా ఆలోచింపచేస్తున్నాయి. అందుకే ఇన్ని గడబిడలు. ఇన్ని శషభిషలు.      
ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక పార్టీని ఓడించి మరో పార్టీకి పట్టం కడుతున్నారు అంటే ఏమిటి అర్ధం. పాత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి, కొత్తగా వచ్చే ప్రభుత్వం అయినా కొత్త బాటలో నడవక పోతుందా అనే ఆశతో.
నిరుడు జరిగిన లోక సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుని అంతటి స్థాయిలో ఆదరించడానికి దోహదం చేసిన అంశాల్లో ఇదొకటి. ‘మార్పు’ కోరి వారు మోడీకి  ఓటు వేసారు. ఎన్నికలకు ముందు మోడీ కానీ, ఆయన నేతృత్వం వహించిన ఎన్డీయే కూటమి కానీ ప్రజలకు కొత్తగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలు కూడా ఏమీ లేవు. యేవో కొన్ని నామకర్ధం చేసినా వాటిపై సామాన్యులు పెట్టుకున్న ఆశలు పెద్దగా లేవనే చెప్పాలి.  ప్రజలు మోడీకి పట్టం కట్టింది ఆయన ఏదో మార్పు తీసుకువస్తాడనే ఆశతోనే. ప్రధాని పీఠం ఎక్కిన కొత్తల్లో ఆయన ప్రదర్శించిన వ్యవహార శైలి, చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలు ఈ ఆశలకు కొత్త ఊపిరిలూదాయి.
అయితే మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షం అటు సభలో, వెలుపలా గతాన్ని మరచి వ్యవహరించిన తీరు, సమర్ధించుకున్న విధానం ప్రజలు మోడీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లాయి. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు, ‘గతంలో మీరు అధికారంలో వున్నప్పుడు మీ నిర్వాకం ఏమిటి’ అని ఎదురు ప్రశ్నించడం,  ‘మార్పు’ తెస్తామన్న సర్కారుకు శోభస్కరం కాదు. తప్పులు చేసారు కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించి బీజేపీని గద్దె ఎక్కించారు. ‘తప్పులు చేస్తూ ఆ తప్పులు  మీరూ చేసినవే కదా’ అని సమర్ధించుకుంటే ఇక వారికీ వీరికీ తేడా ఎక్కడ?
ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే – నిరుటి ఎన్నికల తరువాత ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీకి లోకసభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు సరిపడనంతగా అతి తక్కువ స్థానాలు కట్టబెట్టి ఓటర్లు ఆ పార్టీపై తమ కసి ప్రదర్శించారు. ఆ స్థాయిలో పరాజయం మూటగట్టుకున్న పార్టీ నేతల నోళ్ళు చాలా రోజులు మూగనోము పట్టాయి. కానీ ఆ నోళ్ళు మళ్ళీ పెగలడానికి కారణం కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రతిభ ఎంతమాత్రం కాదు. ఈ పుణ్యమో, పాపమో ఆ చలవ పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే. ఇందుకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి రుణపడివుండాలి.
మోడీ ప్రభుత్వం నిరుడు కేంద్రంలో కొలువు తీరినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఇంత  త్వరగా అవినీతి  ఆరోపణలు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు ఆ అవినీతి లెక్కకట్టలేనంత స్థాయిలో మోడీ హయాములో జరిగిందని ఎవ్వరూ అనుకోవడం లేదు. గతంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోది కాకపోవచ్చు. కానీ ఇక్కడ అధికార కేంద్రంలో వున్నది మోడీ. ‘మార్పు తెచ్చి తమ తలరాతల్ని మారుస్తాడ’ని ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్న నరేంద్ర మోడీ హయాములో, చాయ్ వాలా నుంచి ప్రధాని హోదాకు ఎదిగిన అతి సామాన్య నాయకుడి పరిపాలనలో ఏ తప్పు జరిగినా దానికి  చిన్నా పెద్దా తేడా ఉండరాదనే నలుగురూ కోరుకుంటారు.  త్రేతాయుగంలో  శ్రీరాముడి పాలనతో పోల్చిచూసుకుని అంచనాలకు వస్తారు. మంచి పేరు తెచ్చుకోవడం ఎల్లవేళలా మంచిదే. కానీ ఏమాత్రం తభావతు వచ్చినా ఆ మంచి పేరు మంచులా కరిగిపోయే ప్రమాదం పొంచుకునే వుంటుంది. ప్రస్తుతం మోడీని చూసేవారు ఇటువంటి కళ్ళతోనే గమనిస్తున్నారు. జరిగింది చిన్నదో పెద్దదో తప్పు తప్పే అని ఒప్పుకుని, గతంలో తాము ప్రవర్తించిన తీరు కూడా సరయినది కాదని  లోకసభ సాక్షిగా హుందాగా ఒప్పుకుని వుంటే, ‘దాసుడి తప్పులు దండంతో సరి’ అన్న చందంగా కధ సుఖాంతం అయ్యేది. పాలకపక్షానికి అనవసర సమర్ధింపుల హైరానా తప్పేది. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మనకు అలాటి రాజనీతిజ్ఞులు యేరీ! అందరూ రాజకీయ నాయకులే.  
పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత రాజకీయ ప్రయోజనమో, లేదా మీడియా ప్రచారమో సంపాదించుకుని ఉండవచ్చు. కానీ అంశం ఎలాటిదయినా, అందులోని తీవ్రత ఎంతటిదయినా సాక్షాత్తు ఆ పార్టీ అధినేత్రే లోకసభ వెల్ లోకి ప్రవేశించి నిరసన తెలపడం ఆవిడ స్థాయికి తగింది కాదు. గతంలో ఇదేమాదిరిగా సభను అడ్డుకుకున్న బీజేపీ తీరును గుర్తుచేసి, ఆ పార్టీ గతాన్ని ఎండగట్టడంవరకు పరిమితమై, సభను నడపడంలో సహకరించి వుంటే కాంగ్రెస్ లోని ‘మార్పును’ ప్రజలు గమనించేవారు. ఈ విధంగా హుందాగా ప్రవర్తించకపోవడం ద్వారా,  మీడియా ప్రచారాన్ని మించిన ప్రజాదరాన్ని బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా కోల్పోయాయి.
పార్లమెంటు సమావేశాలకు అయ్యే ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు, రోజుకు ఆరుకోట్లు, నూరు రోజులకు వెరసి అక్షరాలా ఆరువందల కోట్లు అంటూ గణాంకాలు చెబుతున్నారు. మరి సభ జరక్కుండా చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతున్న ఈ రాజకీయ పార్టీలు ఇంతటి ఖర్చుకు యేమని సమాధానం చెబుతాయి. ఆయా పార్టీలనుంచి ఈ ప్రజాధనాన్ని తిరిగి వసూలు చేసే రాజ్యాంగ సవరణ చేయాలని ఎవరయినా కోరుకుంటే తప్పేమిటి?           

సమావేశాలు ముగిసిన తరువాత, బీజేపీ, కాంగ్రెస్ తరహా చూస్తుంటే ఈ అంశాలపై రెండు పార్టీల నడుమ ఈ పోరు ముందు ముందు కూడా కొనసాగేటట్టు వుంది. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో బీజేపీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు నెల రోజుల పాటు విస్తృతంగా తిరిగి కాంగ్రెస్ తీరును ఎండగట్టాలనీ, ప్రజలకు వాస్తవాలు వివరించాలనీ ప్రధాని మోడీ తమ పార్టీ వారితో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గకపోవచ్చు. అయితే ఒకటే ఊరట. పార్లమెంటును స్తంభింపచేస్తే  ప్రభుత్వ ఖజానాకు, ప్రజాధనానికి చేటు. ఇక ఆ పార్టీలు బయట మాట్లాడుకున్నా,  పోట్లాడుకున్నా అది వాటి తలనొప్పే. ప్రజలమీద భారం పడదు.
పొతే, పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులపై సామాన్యుడి మనసులోని మాటను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతి నుద్దేశించి ఆకాశవాణి, దూరదర్సన్ ల ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశంలో బయట పెట్టారు. భారత ప్రజాస్వామ్య వృక్షపు వేర్లు బలంగా ఉన్నప్పటికీ ఆకులు వాడిపోతున్నాయనీ, కొత్త చిగుళ్ళు వేయాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రజాస్వామ్య వేదికలు ఒత్తిళ్లకు గురవుతున్నాయని చర్చావేదికగా ఉండాల్సిన పార్లమెంటు యుద్ధ క్షేత్రంగా మారిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో  రాజకీయ పార్టీలు పునః పరిశీలన  చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి హెచ్చరించారు. సామాన్యుడి మాటను రాజకీయ నాయకులు ఎటూ చెవిన పెట్టరు. దేశ రాజకీయాల్లో తలపండిన పెద్దమనిషి, అనేక (రాజకీయ) యుద్దముల ఆరితేరినవాడు అయిన ప్రణబ్ కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో ఇచ్చిన సలహా అయినా కనీసం చెవికెక్కించుకుంటారేమో చూడాలి.     
(14-08-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్:  9849130595

NOTE: Courtesy Image Owner       

కామెంట్‌లు లేవు: