12, ఆగస్టు 2015, బుధవారం

ఎంచుకున్నవారికి ఎంచుకున్నంత


అనగనగా ఓ రాజకీయ నాయకుడు. చేసిన పాపాలు పండి ఓ రోజు చెప్పాపెట్టకుండా బాల్చీ తన్నేసాడు. యమభటులు వచ్చి ఆయన్ని పట్టుకుపోయారు. వాస్తు  నమ్మకం పైలోకాల వాళ్ళకీ  పట్టుకున్నదేమో తెలవదు కానీ, పైన నరకలోకానికీ , స్వర్గానికీ కలిపి ఒకే ప్రవేశద్వారం వుంది. మన రాజకీయ నాయకుడు (మ.రా.నా) అలవాటు చొప్పున తలుపు తోసుకుని లోపలకు వెళ్ళబోతే ద్వారపాలకుడు ఆపాడు. ఆపి చెప్పాడు. ‘ఇక్కడ  కొన్ని విధివిధానాలు మీలాగే మాకూ వున్నాయి. మీరు పాటించరు. మేము పాటిస్తాము తు.చ.తప్పకుండా. అంతే తేడా. ఇక్కడికి వచ్చిన ప్రతివారూ ఒక రోజు నరకంలో, మరురోజు స్వర్గంలో గడపాలి. ఏది మీకు బాగా నచ్చితే అక్కడే మీరు శాస్వితంగా వుండిపోవచ్చు.  అక్కడే మీకు  ఆదార్ కార్డు, ఓటరు కార్డు, ఫోటో గుర్తింపు కార్డు గట్రా ఏ ఇబ్బందీ పెట్టకుండా  ఇచ్చేస్తారు’.
ఇదేదో బాగానే వుందే అనుకున్నాడు మ.రా.నా.


సరే! అక్కడి నియమాల ప్రకారం మ.రా.నా.ను ముందు నరకానికి తీసుకు వెళ్ళారు. బతికున్నప్పుడు జనాలకు నరకం చూపించిన మ.రా.నా. అసలు నరకాన్ని చూసి మూర్చపోయాడు. అది సినిమాల్లో చూపే నరకంలా లేదు. స్వర్గానికి తాతలా వుంది. ఎక్కడ చూసినా తివాచీలు పరిచినట్టు పచ్చటి  మైదానాలు, స్వచ్చమైన నీళ్ళు పారుతున్న సెలయేళ్ళు. సినిమా తారల చెక్కిళ్ళ వంటి నునుపైన తారు రోడ్లు. రంభా ఊర్వశులను తలదన్నే అందాల భామలు తమ నృత్యాలతో అక్కడివారిని ఆహ్లాదపరుస్తున్నారు. తాగేవారికి తాగినంత తాగిస్తున్నారు. తినే వారికి తిన్నంత పెడుతున్నారు. ఇది నిజంగా నరకమా లేక తాను వీ.వీ.ఐ.పీ.అని గుర్తించి ఇలా మర్యాదలు చేస్తున్నారా అనేది తెలియక మ.రా.నా. అయోమయంలో పడిపోయాడు. అయితే ఈలోపల ఆయనకు రాజకీయాల్లో పాత సహచరులు కొందరు అక్కడ తారసపడ్డారు. వారు చేసిన ఘోరాలకు తానే  ప్రత్యక్ష సాక్షి కాబట్టి, వాళ్ళూ అక్కడే వున్నారు కాబట్టి  ఖచ్చితంగా అది నరకమే అయి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చాడు మ.రా.నా. తాను నక్కతోక తొక్కి నరకానికి వచ్చాడు. జనాలకు ఇన్నాళ్ళు అరచేతిలో స్వర్గం చూపించిన అనుభవం వుంది కాబట్టి తనకు నరకంలో స్వర్గ మర్యాదలు చేస్తున్నారని అనుకున్నాడు. ఏదయితేనేం, ‘ఈ ఒక్కరోజు ఇలా హాయిగా నరకంలో గడిపేసి అసలు స్వర్గానికి వెళ్ళిపోతే పోలా’ అని కూడా అనుకున్నాడు.
మొత్తం మీద నరకంలో స్వర్గసుఖాలు అనుభవించిన మ.రా.నా.ను మరునాడు స్వర్గానికి తీసుకుపోయారు. నరకమే స్వర్గం మాదిరిగా వుంటే ఇక స్వర్గం మాట చెప్పాలా! ఎక్కడ చూసినా దేవకన్యలసేవల్లో మునిగితేలే స్వర్లోకవాసులే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఒక్కడూ తెలిసిన వాడు లేడు. ఎలా వుంటారు, వాళ్ళంతా కొద్దో గొప్పో పుణ్యం చేసి చచ్చి వచ్చినవాళ్ళా యే! దాంతో, తెలిసిన మొఖం ఒక్కటీ కనిపించక  మ.రా.నా. అక్కడ ఒంటరివాడయిపోయాడు.
స్వర్గమా నరకమా తేల్చుకోవాల్సిన సమయం మర్నాడు ఆసన్నమయింది. సుఖాలు, భోగాల విషయంలో స్వర్గానికి నరకానికీ ఏ తేడా లేనప్పుడు ఒంటరిగా స్వర్గంలో ఎందుకు ? నరకంలోనే తెలిసిన నలుగురితో గడుపుదామని నిర్ణయించుకుని అదే విషయం చెప్పాడు. ‘ఇష్టం వచ్చినప్పుడు ఇష్టారాజ్యంగా పార్టీలు మారడం కాదిది. ఒక్కసారి నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అన్నారు అక్కడి వాళ్ళు. ‘ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు’ అంటూ ధీమాగా మాట్లాడిన మ.రా.నా. ను మళ్ళీ నరకంలోకే తీసుకువెళ్ళారు. దాన్ని చూస్తూనే మ.రా.నా.కు మూర్చవచ్చినంత పనయింది. ఒక్కరాత్రిలో  నరకం తీరుతెన్నులు  పూర్తిగా మారిపోయాయి. నిన్న కనిపించిన నున్నటి రోడ్లు, పచ్చటి పచ్చిక మైదానాలు అన్నీ మంత్రం వేసినట్టు మాయమైపోయాయి. ఇప్పుడన్నీ గతుకుల రోడ్లు, నెర్రెలు వేసిన పంట పొలాలు. అర్ధాకలితో అడుక్కుంటున్న నరక వాసులు. పూరిళ్ళు. ఎండిపోయిన సెలయేళ్ళు, గుక్కెడు నీటి కోసం కడవలతో వెడుతున్న ఆడవాళ్ళు. ఇదేమిటి?
ఏవి తల్లీ ‘నిన్న’ కురిసిన హిమసమూహాలు!
అదే అడిగాడు తనని తెచ్చిన వాళ్ళని. వారు చెప్పిన సమాధానం విని మరోసారి మూర్చపోయాడు మ.రా.నా.
‘నిన్న నువ్వు  చూసింది మా దగ్గర జరుగుతున్నఎన్నికల ప్రచారాన్ని. మాకు ఓటు కూడా వేసి నరకాన్నే ఎంచుకున్నావు. ఆ విషయం మరచిపోవద్దు. కోరి కోరి ఎంచుకున్నందుకు ఫలితం అనుభవించక తప్పదు. రాజకీయాల్లో తలపండిన వాడివి. ఈ విషయం వేరే చెప్పాలా!’
NOTE: Courtesy Image Owner

              

కామెంట్‌లు లేవు: