6, ఆగస్టు 2015, గురువారం

పాత కధ - కొత్త మలుపు

అనగనగా ఓ రాజుగారు. ఓ రోజు వేటకు వెడదామని అనుకుని ఆస్థానంలోని అధికారులని ఏర్పాట్లు చేయమని కోరాడు. అడవిలో వేటాడే సమయంలో వాన పడే అవకాశం వుందా అని ఆరా తీసాడు. సంబంధిత అధికారులు అన్ని లెక్కలు వేసి అలా జరగదని, వర్షం పడే వీలు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. సరే అని రాజుగారు మందీ మార్బలం వెంట తీసుకుని వేటకు బయలు దేరారు. బట్టల మూటలు గాడిదపై పెట్టుకుని వెడుతున్న ఓ  చాకలి దారిలో తారసపడ్డాడు. రాజు గారిని, ఆయన పరివారాన్నీ చూసి, వారి హడావిడి గమనించి రాజుతో మనవి చేసుకున్నాడు. 'అయ్యా! మీరు బయలుదేరిన ముహూర్తం బాగా లేదు. వర్షం పడేట్టు వుంది కనుక మీరు వేటకు మరో రోజు వెళ్ళండి' అని సలహా చెప్పాడు. కానీ రాజు అతడి మాట చెవిన పెట్టకుండా ముందుకు సాగాడు. కొద్ది దూరం పోగానే హఠాత్తుగా మబ్బులు కమ్మి భోరున వర్షం కురిసి అందరూ తడిసి ముద్దయ్యారు. వర్షం రాదని  చెప్పిన అధికారిపై రాజుగారికి వొళ్ళు మండింది. వర్షం పడుతుందని హెచ్చరించిన చాకలికి ఆ ఉద్యోగం ఇస్తున్నట్టు ఆ మంటలో ఓ  ప్రకటన చేసాడు. అయితే, వర్షం జోస్యం తన ప్రతిభకాదనీ, వర్షం పడే ముందు తన గాడిద చెవులు టపటపా కొట్టుకుంటూ సంకేతం ఇస్తుందని, అది చూసిన తరువాతే తాను వర్షం పడుతుందని ముందుగా చెప్పగలిగాననీ  వివరణ ఇచ్చుకున్నాడు. దానితో రాజుగారు ఇంకెంతమాత్రం ఆలోచించకుండా వర్షం పడదని చెప్పిన అధికారి  కుర్చీలో ఆ గాడిదనే కూర్చోబెట్టాలని మరో ఆర్డరు వేసాడు.
నిజమే!  ఇదంతా పరమ పాతకదే. కొత్త మలుపు  ఏమిటంటే:


అప్పటినుంచి గాడిదలు అధికారులుగా పనిచేసే కొత్త సంప్రదాయం మొదలయింది.



NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: