1, సెప్టెంబర్ 2015, మంగళవారం

చంద్రబాబు నాయుడు అభిమానులకోసం – ఒక వివరణ మాత్రమే, సంజాయిషీ కాదు

  
ఆరోగ్యశ్రీ గురించి రాస్తూ నేను రాజశేఖర రెడ్డిని అమాంతం ఆకాశానికి ఎత్తేసానని నా మిత్రులే కొందరు అభిప్రాయ పడ్డారు. ఆ పధకం ఎలా పురుడు పోసుకున్నదీ, ఆ నేపధ్యం ఏమిటన్నది చెప్పడం ఉద్దేశ్యం అయితే అది చివరికి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభిమానుల నడుమ ఘర్షణ వ్యాఖ్యలకు దారితీయడం విషాదం. అసలు ఈ కాలపు చాలా మందికి, ఆ మాటకు వస్తే ఈనాడు బాబు గారి పక్కన వున్నవాళ్ళకు, లేదా జగన్ బాబు చుట్టూరా ఉండేవాళ్లకు తెలియని విషయం ఏమిటంటే,  ఒకానొక కాలంలో రేడియో విలేకరిగా, నేను ఈ ఇద్దరితొను చాలా చనువుగా మసలుతూ వుండేవాడినన్న సంగతి.  మొదట్లో, అంటే డెబ్బయ్యవ దశకం చివర్లో కాస్త అటూ ఇటూగా వారిద్దరూ రాజకీయరంగ ప్రవేశం చేసి ప్యాంటూ చొక్కాలతో అసెంబ్లీలో కుడి కాలు పెట్టినప్పుడు, వాళ్ళ మాదిరిగానే ప్యాంటూ చొక్కాలు వేసుకుని తిరిగే నా బోటి విలేకరుల సంఖ్య  నాడు హైదరాబాదులో చాలా తక్కువగా వుండేది. అటు రాజకీయ నాయకులు, ఇటు సీనియర్ పాత్రికేయులు పంచ లాల్చీల తరహా కావడం, అంతటి సీనియర్లతో ఎందుకనుకునేవాళ్ళేమో కాని, వైఎస్సార్, బాబు వంటి ఎమ్మెల్యేలు   మా బోటి జూనియర్ రిపోర్టర్లతోనే  చనువుగా వుండేవాళ్ళు, అన్ని విషయాలు పంచుకునేవారు.  ఈక్రమంలోనే కాకుండా ఆ రోజుల్లో ఆకాశవాణి వార్తలకు ఇప్పటి ప్రీమియం న్యూస్ ఛానళ్ళ స్థాయిలో ‘గిరాకీ’  వుండడం నాకు రేడియో విలేకరిగా కొంత కలిసి వచ్చింది. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ రంగప్రవేశంతో వారిద్దరి దారులూ వేరయిపోయాయి. దాంతో ఇద్దరితో చనువు పెంచుకున్న మా  బోంట్లకు కొంత  ఇబ్బందిగా వుండేది. దానికి తోడు చంద్రబాబు నాయుడు అధికార పదవి ఏమీ లేకపోయినా అధికార కేంద్రానికి దగ్గరగా వుండడం, వైఎస్సార్ ప్రతిపక్ష కాంగ్రెస్ లో ‘తస్మదీయుడిగా’ ఎక్కువ కాలం వుండడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అసమ్మతి నేతగా ఆయనకు  ముద్ర పడడం, ఇవన్నీ సదా అధికార పక్షానికి ‘భజన’ చేస్తామనే ముద్ర వున్న రెడియో విలేకరిగా నన్ను చంద్రబాబుకు లేదా ఆయన ప్రభుత్వ కేంద్రానికి దగ్గరగా మసలేలా చేశాయి. పైగా ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేను అడగాలే కానీ ఏదయినా చేయడానికి సిద్ధంగా వుండేవారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. మా పెద్ద పిల్లవాడికి ఉద్యోగం కోసం  అడగడానికి ధైర్యం చాలకపోతే ఆయనే అర్ధం చేసుకుని సత్యం రామలింగ రాజుగారితో  ఫోనులో నా ముందే మాట్లాడి ‘నాకు బాగా కావాల్సిన శ్రీనివాసరావు కుమారుడు, మీరు  సాయం చేస్తే అది నాకే అని భావిస్తాను’ అన్నారు. సరే! ఆ ఉద్యోగం రాలేదు కాని ఆయన నా పట్ల ఆ క్షణంలో చూపించిన అభిమానాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఇప్పటికీ బాబుగారు  ‘మా వాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు’ అని అనుకుంటూ ఉండవచ్చు కూడా.  ఎందుకంటె ఉద్యోగం రాని  సంగతి నేను మళ్ళీ ఆయనకు చెప్పలేదు.


(చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాతో ఓ ఆసుపత్రిలో) 

నేను ఒక ప్రమాదంలో కాలు విరిగి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా వుండి  కూడా చంద్రబాబు నేనున్న  ఆసుపత్రికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళారు. అల్లాగే నాకు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపు విషయంలో కూడా చంద్రబాబు ఎంతో పెద్ద సాయం  చేసారు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కావడం, అప్పటికే అనేకమంది ఐ ఏ ఎస్ అధికారులు ఇంటి కేటాయింపు కోసం వేచి వుండడం వల్ల ఆయన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమలు కాలేదు. కానీ ఆయన, ముఖ్యమంత్రిగా తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి  ఫైలు తెప్పించుకుని,   నాకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులకు ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తూ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసారు.  2005 లో  ఉద్యోగ విరమణ చేసేవరకు నేను ఎర్రమంజిల్ లోని ఆ క్వార్టర్ లోనే వున్నాను. రిటైర్ అయిన తరువాత ఒక అద్దె ఇంటికి మారాను. ఇప్పటికీ అనేక ఇళ్ళు మారుతూనే వున్నాను. ఇలా చెప్పుకుంటూ  పొతే చంద్రబాబు నాయుడుతో నాకెన్నోఅనేక మరపురాని, మరచిపోలేని జ్ఞాపకాలు,   అనుభవాలు వున్నాయి. కాకినాడలో రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కావాల్సివచ్చి ఆయన్ని అడిగితె గంటల వ్యవధిలో జీవో ఇప్పించారు. చంద్రబాబు దాదాపు పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా వుండడం వల్ల రేడియో విలేకరిగా ఎక్కువ కాలం ఆయన వార్తలు కవర్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా రాతలు చూసి చంద్రబాబు అభిమానులు చీకాకు పడుతున్నట్టే ఆ రోజుల్లో వైఎస్సార్ అభిమానులు లేదా ఆయన అనుయాయుల దృష్టిలో నేను చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాను. కానీ వారిద్దరికీ నాపట్ల ఇటువంటి అభిప్రాయం వున్న  దాఖలా నాకెన్నడూ కానరాలేదు. నా పెద్ద పిల్ల వాడి వివాహం అప్పుడు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకులూ, రెండో పిల్లవాడి పెళ్లికల్లా పాత్రలు మారిపోయాయి. అయినా రెండు పెళ్లిళ్లకు ఇద్దరూ వచ్చి నా మీద వారికున్న అభిమానం వ్యక్తం చేసారు.  తదనంతర కాలంలో వై ఎస్ ముఖ్యమంత్రి కావడంతో రేడియో విలేకరిగా నా రాకపోకలు అటు పెరిగాయి. నా ఉద్యోగ ధర్మంగా నేను దగ్గర కావడం, దూరం కావడం వారిద్దరూ సరిగా అర్ధం చేసుకున్నారు కానీ భజన బృందాలతోనే చిక్కంతా. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి నాకు ఆ విలేకరి ఉద్యోగం కూడలేదు. వై ఎస్సార్ ఎలాగూ లేరు. విలేకరి ఉద్యోగమూ లేదు.  అందుకే నేను ఇప్పుడు అంశాన్ని బట్టి టీవీల్లో నా అభిప్రాయం చెబుతూ వస్తున్నాను. బ్లాగులో రాస్తూవున్నాను. కొందరికి అవి రుచించకపోవచ్చు. కానీ  నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక దణ్ణం పెట్టి ఊరుకోవడం తప్ప.
సుదీర్ఘ కాలం రాజకీయ నాయకులతో కలసి మెలసి వుండే అవకాశం కలిగిన కొందరు జర్నలిష్టులకు కొందరు నాయకులతో సన్నిహిత అనుబంధం ఏర్పడే వీలుంటుంది. ఇది రాజకీయాలకు అతీతం. గతంలో ఎందరో సీనియర్ జర్నలిష్టులు కొందరు ముఖ్యమంత్రులకు సన్నిహితంగా వుండేవారు. కాకపోతే ఆ సాన్నిహిత్యం నీడలు  వృత్తి ధర్మంపై పడకుండా జాగ్రత్త పడేవారు. నేనూ కొన్ని సందర్భాలలో సగటు మనిషి మాదిరి గానే ఆలోచిస్తూ, పదవులు కలిగిన వారితో నాకున్న పరిచయాలను నా సన్నిహితులకోసం, స్నేహితుల కోసం, చుట్ట పక్కాలకోసం, నిజం చెప్పాలంటే నా కుటుంబ అవసరాలకోసం సద్వినియోగమో, దుర్వినియోగమో చేసి ఉండవచ్చు. కానీ అందుకోసం ఒక విలేకరిగా నా విలువలను తాకట్టు పెట్టలేదు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నా బోంట్లకు చేసిన సాయాలు చంద్రబాబు గుర్తు పెట్టుకోకపోవచ్చు. కానీ సాయం పొందినవారు మరచిపోతారని అనుకోను. చంద్రబాబుకు నేను గుర్తున్నానా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయన మాత్రం నాకు సదా గుర్తుంటారు. టీడీపీ అధ్యక్షుడిగా కాదు, చంద్రబాబు నాయుడిగా.

ఆయన మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత నేనెన్నడూ ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన రోజున మా కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు చాలామంది ఆయన్ని చూడాలంటే నేను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్లాను. అంతమంది వెళ్ళడంతో ఆయన చాలా సంతోష పడ్డట్టు  కనిపించారు. అందర్నీ ఆదరంగా పలకరించారు. అలాగే కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయిన రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి, ఎన్నో ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన నా మాట మన్నించి ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.


(1980 లో వైఎస్ మంత్రిగా వున్నప్పుడు, నాతో ఓ పార్టీలో) 

ఆ ఇద్దరితో నాకున్న సంబంధం లేదా అనుబంధం రాజకీయాలకు అతీతం. నన్ను అంచనా వేసేవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు  (01-09-2015)          

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నేనిప్పటికి పవర్ఫుల్లే! జాగ్రత్త నాతో పెట్టుకుంటే, అని వార్నింగ్ ఇచ్చారా అందరికి :)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత- కదా!