26, సెప్టెంబర్ 2015, శనివారం

ఉద్యమ దీక్షలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-09-2015, SUNDAY)

ఆమరణమా, నిరవధికమా అన్న విషయం పక్కన పెడితే ఆంద్ర ప్రదేశ్ నూతన రాష్ట్రానికి ప్రత్యెక హోదా సాధనకోసం వై.ఎస్.ఆర్.సి.పీ . అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్ష ప్రస్తుతం మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, కోర్టు నుంచి సానుకూల ఆదేశాలు తెచ్చుకోవడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం, ఇక చేసేది లేక దీక్ష తేదీలను మార్చుకోవాల్సిరావడం ఇవన్నీ రాజకీయంగా ఆ పార్టీకి కొన్ని తలనొప్పులు తెచ్చే మాట వాస్తవమే. ‘వై.సీ.పీ. కి ఇదొక పరాజయం’ అంటూ  టీడీపీ శ్రేణులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. టీవీ ఛానళ్లలో కూడా విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక దురదృష్టకర పరిణామం ఏమిటంటే, ఏ అంశం తీసుకున్నా అది చివరకు టీడీపీ, వై.ఎస్.ఆర్.సీ.పీ. అనే ఓ రెండు పార్టీల నడుమ వ్యవహారంగానే మలుపులు తీసుకోవడం, రంగులు  మారడం జరుగుతోంది.  నిజానికి ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమం చేయడాన్ని టీడీపీ రాజకీయ ఎత్తుగడగానే భావిస్తోంది. చేస్తున్న ఆందోళన ఫలితం టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగించే విధంగా వుండాలని వైఎస్ ఆర్ సీపీ భావిస్తున్నట్టు వుంది. ప్రత్యెక హోదా అనేది యావత్ ఆంద్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేది అన్న భావం కనుమరుగయి, ఈ రెండు  పార్టీల మధ్య వాతావరణం యుద్ధాన్ని  తలపించేదిగా తయారవుతోంది. ‘అనుమతి లేకపోయినా దీక్ష జరిపి తీరుతాం’ అంటూ వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకులు మొదట చేసిన ఆర్భాటపు  ప్రకటనలు, ‘చావడానికి ఎవరయినా అనుమతి ఇస్తారా?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ పరిస్తితికి అద్దం పడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తలపెట్టింది ఆమరణ దీక్ష అనీ, అందుకే పోలీసులు అనుమతి ఇవ్వకపోయి వుండొచ్చని టీడీపీ వాదనగా వుంటే, అది నిరవధిక దీక్ష అని వైసీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు. దీక్ష ఉద్దేశ్యం రాష్ట్ర ప్రయోజనాలకోసం అయినప్పుడు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడడం ఎందుకని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు  చంద్రబాబు నాయుడు చేసిన నిరవధిక దీక్షలను ఎత్తి చూపుతోంది. ముందే చెప్పినట్టు ఆ తెలుగు రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏమిటో కానీ పాలక పక్షం టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం, ఏకైక ప్రతిపక్షం అయిన వైసీపీ రెండూ ఉప్పూ నిప్పూ తరహా పోరులో నిత్యం మునిగి తేలుతున్నాయి. ‘నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ప్రత్యెక హోదా వచ్చే అవకాశం లేద’ని టీడీపీ అంటుంటే, ‘ఎలా వచ్చినా, ఎవరివల్ల వచ్చినా అది రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీకి మాత్రమే  కలిసివచ్చే అంశం అయినప్పుడు, ప్రతిపక్షంగా తాము చేస్తున్న ఉద్యమానికి అధికార  పార్టీ అడ్డుతగలడం ఎంతవరకు సబబ’న్నది జగన్ మద్దతుదారులు లేవదీస్తున్న పాయింటు. ఇటువంటి వ్యవహారంలో ఏ పార్టీది బాధ్యతారాహిత్యం అయినా కూడా చివరికి నష్టపోయేది రాష్ట్ర ప్రయోజనాలే అన్న ఎరుక ఆ రెండు పార్టీల్లో కానరావడం లేదు. ‘ఈ ఇరుపక్షాల  పోరు ఏ మలుపు తీసుకుంటుంది, ఎప్పుడు తీసుకుంటుంది?’ అన్నది ఇక కాలమే తేల్చాలి.
పొతే ఈ నిరాహార దీక్షల కధాకమామిషూ ఓసారి పరిశీలిద్దాం.
ఒక రకంగా రామాయణ కాలంలోనే ఈ నిరాహార దీక్షలకు తొలి బీజం పడింది. పితృవాక్యపరిపాలన కోసం రాముడు రాజ్యాన్ని విడిచి అడవి బాట పట్టినప్పుడు, రాముని తమ్ముడు భరతుడు, అన్నగారు వున్న అరణ్యానికి వెళ్లి ఆయన్ని కలుసుకుని  తిరిగి రాజ్యాధికారం స్వీకరించమని పరిపరి విధాల వేడుకుంటాడు. అతడి అభ్యర్ధనని  రాముడు నిరాకరించడంతో నిరాశకు గురయిన భరతుడు,  అక్కడికక్కడే దర్భలు పేర్చుకుని ఆమరణ నిరాహార దీక్షకు సంసిద్ధుడౌతాడు. చివరకు రాముడే నచ్చచెప్పడంతో భరతుడు దీక్ష విరమించి రాముని పాదుకలు తీసుకుని మరలిపోతాడు. ఇదొక ఐతిహ్యం.
పొతే, నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చరిత్రలో రెండే రెండు నమోదయ్యాయి.  ఆంద్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు, 1952 లో మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి నివాసంలో   ప్రా యోపవేశానికి పూనుకుని యాభయ్ ఎనిమిది రోజుల తరువాత కన్ను మూసి అమరజీవి అయిన  ఉదంతం వీటిల్లో ఒకటి కాగా, స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలకులతో పోరాడిన విప్లవ వీరుడు జతిన్ దాస్, నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు ఒదిలిన సంఘటన మొట్ట మొదటిది. 1929 లో   లాహోర్ జైల్లో నిర్బంధించబడిన రోజుల్లో,  భారత స్వతంత్ర యోధులకు కూడా యూరోపు రాజకీయ ఖయిదీలకు ఇచ్చే సదుపాయాలు కలుగచేయాలని కోరుతూ ఆమరణ దీక్ష మొదలు పెట్టి, 63 రోజుల తరువాత జతిన్ దాస్  కన్నుమూసిన సంగతి చరిత్ర పుటల్లో వుంది. ఇక నిరాహార దీక్షల విషయంలో  మహాత్మా గాంధీ రికార్డు ఎన్నతగింది. మరో గొప్ప రికార్డు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు  మాస్టర్ తారాసింగ్ ఖాతాలో వుంది. పంజాబీ సుబా సాధన కోసం  1961 లో ఆయన 48 రోజులు నిరాహార దీక్ష జరిపారు. ఆయన అడుగు జాడల్లోనే సంత్ ఫతే సింగ్, పంజాబీ మాట్లాడేవారికి ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక పర్యాయాలు నిరాహారదీక్షలు జరిపారు. 1965 ఆగస్టు 16 న దీక్ష మొదలు పెడతాననీ, సెప్టెంబర్ ఇరవై అయిదు ఉదయం తొమ్మిది గంటలలోగా ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు  గురించిన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని గడువు విధించి మరీ  దీక్ష ప్రారంభించాడు. అయితే, భారత పాక్  సరిహద్దుల్లో చెలరేగిన సైనిక సంఘర్షణల నేపధ్యంలో సంత్ ఫతేసింగ్ తన దీక్షా యోచన విరమించుకున్నారు. భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కురు వృద్ధుడు మొరార్జీ దేశాయ్ కూడా డెబ్బయ్యవ దశకంలో రెండు పర్యాయాలు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. గతంలో టీడీపీ అధినాయకుడు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు కూడా టాంక్ బండ్ పై దీక్షకు కూర్చున్నారు. తెలంగాణా సాధన కోసం టీ.ఆర్.ఎస్. అధినేత కే.చంద్రశేఖర రావు జరిపిన నిరాహార దీక్ష కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. 1969 తెలంగాణా ఉద్యమానికి తొలి బీజం, ఖమ్మం పట్టణంలోని  గాంధీ చౌక్ లో రవీంద్రనాథ్ అనే విద్యార్ధి  చేసిన నిరాహారదీక్షలో పడింది.    
పొతే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అమృతరావు అనే పెద్ద మనిషి అనేక పర్యాయాలు మొదలు పెట్టి విరమించిన నిరాహార దీక్షలు, ప్రజలకు వాటిపట్ల చులకన భావం కలిగేలా చేసాయి.
ఇలా చరిత్రలో ఎన్నో సంఘటనలు. కొన్ని నిరాహార దీక్షలు ఫలితాలు ఇచ్చాయి. మరికొన్ని ప్రచారార్భాటాలుగా మిగిలిపోయాయి. (26-09-2015)

రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595                            

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

తెలంగాణా ఆవిర్భావానికి వ్యతిరేకంగా జగన్ రెండు సార్లు చంద్రబాబు ఒకసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇప్పుడు బాబు "చావడానికి అనుమతి" లేవనెత్తడం హాస్యాస్పదం.

మదరాసు నగరం కోసం పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష విఫలం అయినట్టే, చండీగడ్ కోసం షహీద్ దర్శన సింగ్ చేపాటిన దీక్ష కూడా దుఃఖాంతం అయింది. 74 దీక్ష తరువాత ఆయన ఆగస్ట్ 27, 1969 నాడు చనిపోయారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Jai Gottimukkala - ధన్యవాదాలు మరింత సమాచారం అందించినందుకు.