18, డిసెంబర్ 2014, గురువారం

ఉగ్రవాదుల చేతుల్లో మోగుతున్న మరణ మృదంగాలు

(Published by 'SURYA' telugu Daily in its Edit Page on 21-12-2014, SUNDAY)

డిసెంబర్ పదహారు. పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో ఉగ్రవాదుల తూటాలకు అభం శుభం తెలియని 132మంది స్కూలు పిల్లలు బలయిన చీకటి రోజు. కనికరం ఇసుమంతయినా చూపని సాయుధ ఉగ్రవాదులు మొత్తం 148 మంది నిరాయుధులయిన అమాయకుల ప్రాణాలు హరించారు. పుస్తకాల సంచీతో ఆ రోజే మొదటిసారి  బడిలో అడుగుపెట్టిన అయిదేళ్ళ చిన్నారి నుంచి పద్దెనిమిదేళ్ళ వయసున్న, ఎంతో చక్కని భవిష్యత్తువున్న పిల్లలు అనేకమందికి తాము చదువుతున్న పాఠశాలే స్మశాన వాటిక అయింది.    
రాక్షసం, కిరాతకం, పాశవికం, దారుణం, అమానుషం, అతి హేయం ఈ పదాలన్నీ కలిపినా కూడా పెషావర్ మారణహోమాన్ని వర్ణించడానికీ, ఖండించడానికి  సరి తూగవు, సరిపోలవు. పెషావర్ ఊచకోత మొత్తం మానవేతిహాసానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. వందలాది తలితండ్రుల కడుపుకోతకు కారణమయింది. యావత్ ప్రపంచ ప్రజల్ని దిగ్భ్రమ పరచింది. మనం నివసిస్తున్నది నాగరికలోకంలోనా లేక జంతు ప్రపంచంలోనా అన్న సందేహాలకు తావిస్తోంది.   
సరిగ్గా పదేళ్ళ క్రితం రష్యన్ సమాఖ్యలోని బెస్లాన్ నగరంలో ఇదేవిధమైన ఉగ్రవాదుల దుశ్చర్యకు 385 మంది చనిపోయారు. సాయుధులయిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కొందరు బెస్లాన్ లోని ఒక పాఠశాలలో ప్రవేశించి దాన్ని మూడు రోజులపాటు తమ అధీనంలో పెట్టుకున్నారు. 777 మంది విద్యార్ధులతో సహా మొత్తం 1,100 మందిని తమ బందీలుగా పట్టుకున్నారు. రష్యన్ సమాఖ్య నుంచి చెచన్యాకు స్వాతంత్ర్యం కోరుతూ జరుగుతున్న సాయుధ పోరాటంలో భాగంగా ఈ ముట్టడి మూడు రోజులపాటు సాగింది. మూడో రోజున రష్యన్ సైనిక దళాలు యుద్ధ ట్యాంకులతో స్కూలు భవనంలోకి  చొచ్చుకుపోయాయి. 186 మంది విద్యార్ధులతో సహా 385 బందీలు ఈ ఘటనలో అసువులుబాసారు. అనేకమంది గాయపడ్డారు. ఎంతమంది ఉగ్రవాదులు ఇందులో పాల్గొన్నారు, వారేమయ్యారు అన్న ప్రశ్నలకు ఇంతవరకు సంతృ ప్తికరమయిన  జవాబు లేదు.
దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు  ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది.
బెస్లాన్ పాశవిక ఉదంతాన్ని తలదన్నే రీతిలో పెషావర్ మారణ కాండ సాగింది. 'జరిగిన దారుణాన్ని జీర్ణించుకోవడానికి మనసు మొరాయిస్తోంది' అని పాకేస్తాన్ లో బహుళ పాఠకాదరణ కలిగిన 'డాన్' పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది.
'ఈ పాశవిక దాడిలో అనేక పసి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మొత్తం దేశాన్ని మానసికంగా కుదిపివేసింది. దీన్ని నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆ పత్రిక రాసింది.
ఒకే ఒక లక్ష్యాన్ని ఉగ్రవాదులు ఎన్నుకున్నారు. నిస్సహాయులు, నిరాయుధులు, తేలికగా దొరికిపోయే స్కూలు పిల్లలను తమ పగ, ప్రతీకారాలకు బలి పశువులుగా ఎంచుకున్నారు.  వారి సిద్దాంతాలు నమ్మకాలు ఎలా వున్నా, వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎన్నుకున్న మార్గం మాత్రం దారుణం. తమపై సైనిక దాడులు జరపరాదంటూ, రాజ్యాంగేతర విధానాలతో తమను ప్రభుత్వాలు మట్టుబెట్టాలని చూస్తున్నాయని, వాటికి నిరసనగా ఈ మరణ కాండకు పూనుకున్నామని ఉగ్రవాదులు ప్రకటించడం మరీ ఆక్షేపనీయం. ప్రభుత్వాలపై పెంచుకున్న ప్రతీకారాన్ని పసిపిల్లల ప్రాణాలు హరించడం ద్వారా తీర్చుకోవాలని అనుకోవడం నీతి బాహ్యం.
ఇటువంటి సంఘటనలు జరగగానే 'ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాలతో అణచివేస్తాం' అనే ప్రకటనలు కోకొల్లలుగా వెలువడతాయి. వీటివల్ల జరిగేది ఏమీ వుండదు, వొరిగేది ఏమీ వుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. వీటిని నమ్మడం జనం ఎప్పుడో మానేశారు.
ఉగ్రవాదుల ఈ చర్యలను ఏదో ఒక మతానికి ముడిపెట్టడం కూడా సబబు కాదు. ఎందుకంటె ఏ మతమూ  ఏ రూపంలోనూ  హింసను  ప్రోత్సహించదు. కానీ ఒక మతం పేరుతొ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు మాత్రం ఈ  వాస్తవాన్ని మరచిపోతున్నారు.
పెషావర్ సంఘటనకు సంబంధించి అందుతున్న ఓ సమాచారం దీన్ని రుజువు చేస్తోంది. మారణాయుధాలు ధరించి మిలిటరీ పాఠశాలలో ప్రవేశించిన ఉగ్రవాదులు, తుపాకులతో విద్యార్ధులను బెదరిస్తూ వారిని 'కలిమా' (ఇస్లాం ప్రార్ధన) చదవాల్సిందని ఆదేశించారుట. ఆ తరువాత విచక్షణారహితంగా వారిపై కాల్పులు జరిపారట. అంటే ముస్లిముల పవిత్ర గ్రంధం ఖుర్ ఆన్ లో ప్రవచించిన దానికి  విరుద్ధంగా ఉగ్రవాదులు ప్రవర్తించారన్న మాట. 'అల్లాను విశ్వసించిన వారిని ఎవరయినా కావాలని చంపినట్టయితే, అటువంటి వారికి నరకమే శిక్ష' అని ఖుర్ ఆన్ స్పష్టంగా చెబుతోంది. దీని ప్రకారం చూస్తె ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు కాని వారికి  ఇస్లాంతో కానీ, ఆ మత బోధనలతో కానీ  ఎలాటి సంబంధం లేదని పెషావర్ సంఘటన తెలుపుతోంది.
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.
కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడుఅన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుందిఅనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.

(18-12-2014)

NOTE: Courtesy Image Owner 

4 కామెంట్‌లు:

sarma చెప్పారు...

జరిగినది ఊహించరాని కిరాతకం. ఇప్పటికి ఆ నాయకుల్లో మార్పు రాలేదనడానికి ఒక ఉదాహరణ ముషర్రఫ్ "దీనివెనక భారత్ హస్తం ఉందనడం."

dokka srinivasu చెప్పారు...

Sir jariginadi chaalaa dharunamayina sanghatana. Paapam entho mandi letha vayasu chinna pillalu ugravaadula chethulalo bali ayipoyaru.

Mee blog chaalaa chaalaa bagundi sir. Mee blog choosi anandam vesindi.

Sir recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Sir please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your comment in english language.

hari.S.babu చెప్పారు...

"అక్కడికెళ్ళి అంతమంది పిల్లల్ని చంపండి" అంటే "యెస్ బాస్" అంటూ వెళ్ళి చంపెయ్యటం,"తర్వాతేం చెయ్యాలి బాస్" అనడిగితే "మీరు కూడా చచ్చిపొండి" అనగానే "అలాగే బాస్" అని పేల్చుకుని చచ్చిపోవటం సినిమాల్ల్లో చూపిసతే క్యామిడీగా వుంటుంది?కానీ వాళ్ళ సంభాషణల టేపుల్లోని డైయలాగులు చదువుతుంటే నవాలో యేడవాలో అర్ధం కాలేదు!

అజ్ఞాత చెప్పారు...

@Hari:
You are 100% correct.
అంత క్రమశిక్షణ , లాయల్టి , డెడికేషన్ వేరే ఏ మతం లోను చూడలేదు .
నిజంగా హ్యాట్సాఫ్ చెప్పొచ్చు , కాని దురదృష్టం ఏంటంటే మతం మీద ఉండే dedicationలో కొంచెం అయినా డెవలప్మెంట్ మీద పెట్టి ఉంటె ఈ పాటికి అమెరికా ని మించిపోయేది . ఒక్కోసారి అనిపిస్తుంది అంత organized గా హిందూ మతం లేకపోవడం మంచిదే అయింది . ( కొంత మంది extremists ఉన్నారు కాని , వాళ్లకి సపోర్ట్ లేదు ) .