18, జులై 2013, గురువారం

ఈవిడ ఎవరో కాదు ఆడది


చతుర్ముఖ బ్రహ్మ తన విధి నిర్వహణలో భాగంగా జీవరాశులను సృష్టించే క్రమంలో ఒక వినూత్న జీవానికి రూపకల్పన చేసేపనిలో పడ్డాడు. పక్కనే కూర్చుని వీణ వాయిస్తూ భర్త చేతిలో రూపం దిద్దుకుంటున్న స్త్రీ మూర్తిని చూసి అచ్చెరువు చెంది అడిగింది చదువుల తల్లి తన పతి దేవుడిని, ఆవిడ ఎవరని.
బ్రహ్మ తన నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తూ చెప్పాడు.


“ఈవిడ ఆడది. నేను సృష్టికర్తను అన్న పేరే కాని నిజానికి ఈవిడే ఈ సమస్త సృష్టికి కర్త కర్మా క్రియ.   
“అందరు మానవుల్లాగే ఈవిడకూ  రెండు చేతులే. కానీ ఆ రెండింటి తోనే తన సంసారాన్ని యావత్తు సంభాలిస్తుంది. ఆ రెండు చేతులతోనే ఇంటిల్లిపాదికీ వొండివారుస్తుంది. తను తిన్నా తినకపోయినా అందరూ తిన్నారా లేదా అన్న యావలోనే గడుపుతుంది. ఆ రెండు చేతులతోనే పిల్లల్ని లాలిస్తుంది. అత్తమామల్ని ఆదరిస్తుంది. భర్త ఆలనా పాలనా చూస్తుంది. ఇంటికివచ్చేవారిని కనుక్కుంటుంది.
“ఆమె వైద్యురాలు కాదు. కానయియితేనేం అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. అంతే! దానితో  శారీరక రుగ్మతలే కాదు  మానసిక రోగాలు కూడా మటుమాయం.
“ఆమె ఆర్ధిక శాస్త్రనిపుణురాలు కాదు, కానీ జీతానికీ జీవితానికీ పొంతనలేని సంసారాలు  కూడా సర్దుబాటు చేస్తుంది.
“ఆవులు గడ్డి తిని పాలిస్తే, ఈవిడ క్లేశాలను కడుపులో దాచుకుని ప్రేమను పంచి పెడుతుంది.
“మనసు వెన్న. మాట సున్నితం. అందం అమోఘం. ఆకర్షణ అనంతం.
“కానీ నా ఈ సృష్టిలో లోపం లేని జీవి అంటూ వుండదు. ఈవిడకీ ఓ లోపం వుంది. తన సమర్ధత ఏవిటో, తన శక్తి సామర్ధ్యాలు ఏపాటివో ఆవిడకు తెలియవు. అందుకే ‘ఆడదిగానే’ మిగిలిపోతుంది.” (18-07-2013)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Chinni chinni padalatone stree sakthini enta baga chitreekarincharu!

Mamtha చెప్పారు...

చాలా బావుంది.