5, జులై 2013, శుక్రవారం

హెల్మెట్ ఆందోళన – పూర్వాపరాలు -1


పాత విషయాలను ముచ్చటించుకునేటప్పుడు కాల ధర్మాన్ని గమనంలో పెట్టుకోవాలి. నాటి పరిస్తితులను దృష్టిలో వుంచుకోవాలి.  పౌర సమాజంలో పాలకులు విధించే నియమ నిబంధనలు, వాళ్ళు  ప్రవచించే నీతి సూత్రాలు ఎన్నో  వుంటాయి. వాటిని గౌరవించి తీరాలి కూడా. కాకపొతే, ఒక్కోసారి నిబంధనలను అమలు చేసే తీరుతెన్నులే విమర్శలకు గురవుతుంటాయి. ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం. అలాగని ప్రత్యెక పోలీసు బృందాలను నియమించి రోడ్లపై సిగరెట్ తాగేవాళ్ళని వేటాడి పట్టుకుని జరిమానాలు విధించారనుకోండి. అదిగో అప్పుడే వస్తుంది  చిక్కు.  ఇదిగో ఇలాటిదే హెల్మెట్ నిబంధన. అది అమలు చేయడంలో విచక్షణారహితంగా పోలీసులు నాడు అంటే 1986-87 లో వ్యవహరించిన తీరు. ఓ మోస్తరు వేగంతో కూడా స్కూటర్లు నడపడానికి అనువుగా లేని రోడ్లు.  ఆ రోజుల్లో హైదరాబాదులో వాటి పరిస్తితి  ఎలా వుండేదో నేటి నెటిజన్లకు  తెలిసే అవకాశం లేదు.     
ఏ రోడ్డు చరిత్ర చూసినా ......

రోడ్లపైన వరదలా చేరు వాన నీరు
కాలు జారు ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు
రోడ్డేదో గుంటేదో దేవుడికే తెలుసు
స్కూటరిస్టులంటేనే ఖాకీలకు  అలుసు
అలాటి రోడ్లమీద అతివేగం మాట అటుంచి అసలు డ్రైవ్ చేయడమే నానా యాతనగా వర్ణిస్తూ రాసిన  ఈ మాదిరి వ్యంగ్య రచనలు అధికార యంత్రాంగం కళ్ళు తెరిపించకపోగా  సరిగ్గా ఈ నేపధ్యంలోనే  వచ్చి పడింది ఈ నిర్బంధ హెల్మెట్ ధారణ నిబంధన.
హెల్మెట్లను వ్యతిరేకించడం అంటే పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే చూస్తూ ఊరుకోవడం అన్న వాదనను కొందరు లేవదీసారు.
ఆరోజుల్లో పోలీసు కమీషనర్ ను కలిసి ఒక లేఖ ఇచ్చాను.
“అయ్యా కమీషనర్ గారు –
“హెల్మెట్ల విషయంలో పోలీసుల్ని విమర్శించే వాళ్ళందరూ హెల్మెట్ నిబంధనకు వ్యతిరేకం కాదు. దాన్ని అమలు చేసే విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.
“ఉప్పు అమ్మాలన్నా, పప్పు అమ్మాలన్నా పత్రికల్లో ఎంతో ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తుంటారు. కానీ, పలానా హెల్మెట్ కొనండి అని ఒక్క ప్రకటన  ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక్కసారయినా చూసారా. ఎందుకట?
“హెల్మెట్ తయారీదారులకు ప్రకటనల మీద పైసా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ఒక కోర్టు తీర్పును సాకుగా చూపుతారు. అతి ఉత్సాహం వున్న అధికారిని పట్టుకుంటారు. అంతే!  వారి స్టాకంతా – పుచ్చు వంకాయలలాంటి సరుకయినా సరే క్షణాల్లో అమ్ముడు పోతుంది. పైపెచ్చు సర్కారు ఖర్చుతో హెల్మెట్ ధారణ ఆవశ్యకత గురించి ఎలాగూ ప్రచారం ఉండనే ఉంటుంది. అధికారులు చూపిస్తున్న ఈ అత్యుత్సాహం వెనుక ఏదయినా మతలబు ఉందేమో అని అనుమానిస్తే తప్పేమిటి?
“ప్రజలకు అనునిత్యం  తారసపడే ఏకైక ప్రభుత్వ ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్. ప్రజల పరువు మర్యాదల్ని అతడి ఇష్టాఇష్టాలకు నడిబజార్లో వొదిలేయడం ఏం మర్యాద చెప్పండి.
కార్లలో తిరిగే ట్రాఫిక్ అధికారులను వెళ్లి ఏదయినా కూడలిలో నిలబడి రోడ్డు దాటలేని అభాగ్యులకు సాయం చేయమనండి. అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ దుస్తితిని సరిచేయమనండి. ఒక్క పది రోజులపాటు ట్రాఫిక్ పోలీసుల్ని – చలానాల వసూలు కట్టిపెట్టి తమ పని తాము చేసేలా చూడండి. యెంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. మంచి మార్పును గమనిస్తే ప్రజలే ట్రాఫిక్ పోలీసుల ప్రాధాన్యతను  గుర్తిస్తారు. ఎలాటి నిరసనలు లేకుండా హెల్మెట్లతో సహా అన్ని రకాల  ట్రాఫిక్ నిబంధలను వారే స్వచ్చందంగా తుచ తప్పకుండా పాటిస్తారు. ఇది నిజం. నిజానికి ఇదే సరైన  పరిష్కారం.”
కమీషనర్ నా లేఖను నా ముందే పూర్తిగా చదివారు. అభినందన పూర్వకంగా మందహాసం చేసారు. కానీ ఆ చిరునవ్వులోనే నాకు ఆయన నిస్సహాయత కూడా కనబడింది. కొన్ని రోజులకు పూర్వం నగరంలో ఓ రోడ్డు దుస్తితిని గురించి ఆయనకు నేనే ప్రత్యక్షంగా చూపించాను. (ఆ వివరాలతో పాటు హెల్మెట్ నిబంధన – జర్నలిస్టుల నిరసన పూర్వాపరాలు గురించి మరికొన్ని సంగతులు  మరోసారి) 

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

"ఉదాహరణకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం"

Not correct. Smoking is banned *only* in enclosed public places (e.g. restaurants). There is no ban in open public spaces.