11, ఆగస్టు 2024, ఆదివారం
లోకం అంటే స్వచ్చత, పచ్చదనం
ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 78 ఏళ్ల టైమ్ పట్టింది. ఈ వృక్షం ఇంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. సియాటిల్ లో ఎటు పోయినా కనిపించే వాషింగ్టన్ లేక్ లో నీటి స్వచ్ఛతని చూస్తుంటే అక్కడే వుండిపోవాలని అనిపించింది.
లేబుళ్లు:
పచ్చదనం,
లోకం అంటే స్వచ్ఛత
10, ఆగస్టు 2024, శనివారం
ఆగష్టు అంటే అయిష్టత
102 డిగ్రీలు ఒక జ్వరమా?
రాసిన నోట్స్ అన్నీ దాచుకోవడం అవసరమా!
కాకపోవచ్చు.
కానీ ఏదో ఒక రాత్రి, నిద్ర పట్టని రాత్రి ఆ రాతలే అవసరం అవుతాయేమో ఏం చెప్పగలం.
2019 ఆగస్టు 15 రాత్రి ఎనిమిది గంటల 15 నిమిషాలకు 102.3 డిగ్రీలు
ఆగస్టు 16 ఉదయం ఆరున్నరకు 99.2 డిగ్రీలు
ఆగస్టు 16 మధ్యాన్నం ఒకటిన్నరకు 100 డిగ్రీలు
పిన్నికి ఒంట్లో బాగా లేదని జూబ్లీ హిల్స్ అపోలో లో పనిచేస్తున్న మా కజిన్ డాక్టరు బాబీ (సుసర్ల కామేశ్వర రావు) కి ఫోన్ చేస్తే, ఏదో టాబ్ లెట్ చెప్పి, టెంపరేచర్ నోట్ చేయమని చెప్పాడు.
ఆగస్టు 17 కల్లా నెమ్మదించింది. ఓకే అనుకున్నాను. బాబీ ఇంటికి వచ్చి చూసి పరవాలేదు అన్నాడు.
ఆ మర్నాడు అంటే 18 రాత్రి చెప్పాపెట్టకుండా దాటిపోయింది.
ఆమెది అదృష్టం. నాది దురదృష్టం.
అందుకే ఆగస్టు అంటే, నేను పుట్టిన రోజు ఆ నెలలోనే అయినా, ఒక రకమైన అయిష్టత. అకారణ ద్వేషం.
లేబుళ్లు:
ఆగష్టు అంటే అయిష్టత
9, ఆగస్టు 2024, శుక్రవారం
శనగల మంగళ వారం - భండారు శ్రీనివాసరావు
టైం మేనేజ్ మెంట్ (సమయ పాలన), మెన్ మేనేజ్ మెంట్ (ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళని కాదు, నిజానికి ఉమెన్ మేనేజ్ మెంట్) కు ఏదయినా ప్రపంచస్థాయి పెద్ద పురస్కారానికి గ్రహీతలను నిర్ణయించే బాధ్యత నాకిస్తే, నేను ఖచ్చితంగా ఆ బహుమతిని గంపగుత్తగా వరలక్ష్మీ వ్రతం నోముకునే ఆడవాళ్ళందరికి కలిపి ఇచ్చేస్తాను.
ఏటేటా ఈ వ్రతం నిర్వహించడంలో ఆడవాళ్ళు పడే శ్రమదమాదుల మాట అటుంచి, పేరంటాళ్ళను మేనేజ్ చేసే విధానం గమనించినప్పుడు నాకీ ఆలోచన కలిగింది. దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో ఒకరింటికి తాము పేరంటానికి వెళ్ళాలి. మళ్ళీ తమ ఇంటికి వచ్చే పేరంటాళ్ళను కనుక్కుని వాయినాలు ఇవ్వాలి. సమయం ఎలా సర్దుబాటు చేసుకుంటారో ఎన్నిసార్లు బద్దలు కొట్టుకుంటున్నా, నా చిన్న బుర్రకు ఎంతమాత్రం అర్ధం కాదు. కార్లూ డ్రైవర్లు వుండే మగ మహారాజులు కూడా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు వెళ్ళలేక సతమతమవుతారు.
అలాటిది, వానయినా వంగిడి అయినా, కార్లూ డ్రయివర్లూ లేకున్నా, ఆటోల్లో తిరుగుతూ అందరి ఇళ్ళను అనుకున్న సమయానికి అనుకున్న వ్యవధిలో చుట్టబెడుతూ, మళ్ళీ తమ ఇంట్లో కూడా ఏమాత్రం తభావతు రాకుండా చూసుకుంటున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే నాతో మీరూ ఏకీభవిస్తారు.
ఇక పూజలూ వ్రతాలు అంటారా, అది వాళ్ళ ఇష్టం. ప్రసాదాలు అంటారా, అది మన ప్రాప్తం.
ఉపశృతి:
శనగల మంగళ వారం
'ప్రతి శ్రావణ బుధవారం ఉదయం
వేయించిన శనగలతో
తప్పనిసరి పలహారం'
లేబుళ్లు:
శనగల మంగళ వారం - భండారు శ్రీనివాసరావు
8, ఆగస్టు 2024, గురువారం
పుట్టిన రోజున దేవుడి కానుక
ఈరోజు తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే, నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.
‘నా పొరబాటో, నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద 78 దాటుతున్నావు. నువ్వు అడగకుండానే నీకో అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించి వచ్చాను. అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’
‘.............’
‘చెబుతా విను. ఇక నుంచయినా నువ్వు ఆనందంగా వుండు. ఇతరులని సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే నేనిచ్చే వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే, ఇక నాకిది కావాలి, అది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు. ఇలా తెల్లవారకుండానే వచ్చి నీకు వరాలు ఇచ్చే పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఎనిమిదేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ ఖర్మ. వస్తా!’
లేబుళ్లు:
పుట్టిన రోజున దేవుడి కానుక
5, ఆగస్టు 2024, సోమవారం
కొడుకే తండ్రిగా మారిన వేళ
'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '
1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి యాభయ్యవ పుట్టిన రోజునాడు నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు.
సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి.
' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '
ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.
ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.
ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.
లేబుళ్లు:
కొడుకే తండ్రిగా మారిన వేళ
3, ఆగస్టు 2024, శనివారం
అమెరికాలో కలిసిన మంతెన సత్యనారాయణ రాజు గారు
వీరు ప్రకృతి వైద్యం రాజు గారు కాదు.
ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్ లో గత రెండు పదిహేడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఐ టీ నిపుణులు. మరో బాదరాయణ సంబంధం నాకు ఫేస్ బుక్ లో ఫాలోయర్. రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చి ఈ ఉదయం నన్ను కలిశారు.
తన పేరు మంతెన సత్యనారాయణ రాజు అని పరిచయం చేసుకున్నారు.
ఫేస్ బుక్ లో పేరు Satya Mantena.
సహృదయులు.
managudi.org అనే బ్లాగ్ నడుపుతున్నారు. తెలుగునాట వున్న అన్ని చిన్నా పెద్ద దేవాలయాలు, వాటి ఆస్తిపాస్తులు మొదలయిన సమస్త వివరాలను కష్టపడి సేకరించి ఒకే చోట పదిలపరుస్తున్నారు
వారి కృషి అభినందనీయం.
కింద ఫోటో రాజు గారితో నేను. నేను అని ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మధ్య నన్ను ఫోటోల్లో చాలా మంది గుర్తుపట్టడం లేదు (ట)
Licking of Worry
నాకు ఇంగ్లీష్ గొప్పగా రాదు అని తెలుసు కానీ, అమెరికాలో నా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్ కలిసి చెప్పేవరకు నా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంత గొప్పగా వుంది అని నాకు తెలవదు.
' మామయ్యా! (నిజానికి తాత వరస, ఏదో మర్యాద కోసం మామయ్య అంటుంటారు) నేను నీ ఫేస్ బుక్ ఫాలోవర్ ను '
నేను గర్వంగా తల ఎగరేసే లోగా వాక్యం పూర్తి చేశాడు ఇలా.
' నువ్వు రాసిన Licking of worry పోస్టు చదివాను '
పైకి లేస్తున్న నా తల నేలకు వాలిపోయింది, నేను ఇంత దరిద్రపు అర్థం పర్థం లేని ఇంగ్లీష్ ఎలా రాయగలిగాను అనే ఆలోచనతో తల బద్దలు కొట్టుకున్నాక అసలు విషయం బోధపడి నవ్వుకున్నాము.
నేను ఆ పోస్టుకు పెట్టిన శీర్షిక 'నాకేల చింత? '
గూగులమ్మ ఎంచక్కా '' అనే పదాన్ని 'నాకడం' అనే కోణంలో అర్థం చేసుకుని, 'Licking of Worry ' అనే సరి కొత్త అనువాదాన్ని పరిచయం చేసింది.
మాయా బజార్ సినిమాలో పింగళి గారి డైలాగ్ గుర్తుకు వచ్చింది.
కొత్త పదాలు, కొత్త భాషలు ఇలాగే పుడతాయి కాబోలు.
అంచేత మీలో ఎవ్వరికైనా నా పోస్టులు ఇలా ఇంగ్లీషు లో కనబడితే, అంత ఆంగ్ల భాషా ప్రావీణ్యం నాకు లేదని అర్థం చేసుకోమని నా మనవి. అలాగే, See Original ద్వారా తెలుగులో నేను రాసిన అసలు పోస్టు చదువుకోవచ్చని ఇప్పుడే కలిగిన అవగాహనను మీతో పంచుకుంటున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)