10, అక్టోబర్ 2026, శనివారం

ఇలాంటివారు ఉంటారా? – భండారు శ్రీనివాసరావు

 

 


సూర్య దీప్తి అనగానే మన తెలుగువాడు కాదేమో అనుకుంటాం. వారి పూర్తి పేరు మంగళంపల్లి సూర్యదీప్తి. రేడియో వయొలిన్ కళాకారుడు.  

మహాలయ పక్షాలు (పితృ పక్షాలు)   గురించి కటక్ లో వున్న మా కోడలు నిషా గుర్తు చేసింది.

వెంటనే మా ఇంటిపక్కనే వున్న పూజారి గారికి కబురు చేశాను. వారు వచ్చి శ్రద్ధగా నా చేత మా కుటుంబంలో కీర్తిశేషులైన పూర్వీకులకు,  వారి గోత్రనామాలు చెప్పించి నా చేత తిలార్పణ  చేయించారు.

మహాలయ పక్షాలు అనగానే నాకు ఒక పాత విషయం గుర్తుకు వచ్చింది. ఎనిమిది పదుల వాడు ఏదైనా చెబుతున్నాడు అంటే అది ఖచ్చితంగా పాతిక ముప్పయ్యేళ్ల నాటి పాత సంగతులే అయి వుంటాయని నా పోస్టులు చదివేవారికి ఈపాటికి అర్ధం అయ్యే వుంటుంది.

రేడియోలోదూరదర్సన్ లో నేను కలిసి పనిచేసిన  ఆర్వీవీ కృష్ణారావు గారు ఓసారి  మాటల సందర్భంలో చెప్పిన విషయం ఇది.

మహాలయ పక్షాలను పురస్కరించుకుని పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ఆయన కొంతకాలం క్రితం సతీసమేతంగా కాశీ వెళ్ళారు. గంగానది ఉధృతంగా వొడ్డును వొరుసుకుని పారుతోంది. ఒక్క కేదారేశ్వర ఘాట్ లోనే వారికి వెసులుబాటు దొరికింది. అక్కడ విధులను సక్రమంగా పూర్తి చేసుకుని, ఘాట్ సమీపంలోని ఒక గుడి దగ్గరకు వెళ్ళారు. ఆ ప్రాభాతవేళలో వినవచ్చిన వయోలిన్ వాయిద్య సంగీతం ఆయన్ని ఆకర్షించింది. పరికించి చూస్తే ఒక అరుగు లాంటి గద్దెపై కూర్చుని ఎవరో వయోలిన్ వాయిస్తున్నారు. ఒక్క కట్టు పంచె తప్ప ఆయన శరీరంపై ఎలాంటి ఆచ్చాదనా లేదు. స్వతహాగా సంగీత ప్రియుడయిన కృష్ణారావు గారు త్యాగరాజ స్వామివారు ఓ కృతిలో  ఆలపించినట్టు ‘నాదలోలుడై బ్రహ్మానందాన్ని’ అనుభవించిన అనుభూతిని పొందారు. ‘నాద తనుమనిశం శంకరం నమామి’ అనే  త్యాగరాయ కృతిని చిత్తరంజన్ రాగంలో వయొలిన్ పై అద్భుతంగా పలికిస్తున్న ఆ కళాకారుడికి పాదాభివందనం చేద్దామని వెళ్ళారు. చిరు కానుకగా తన చేతికి వచ్చిన కొంత మొత్తాన్ని ఇవ్వబోగా ఆయన మృదువుగా తిరస్కరించి, ‘అవసరంలో ఉన్నవారికి ఎవరికైనా  ఇవ్వండి’ అని చెప్పారు. మాటల మధ్యలో ఆయన పేరు తెలియగానే ఆశ్చర్యపోవడం కృష్ణారావు గారి వంతయింది. ఎందుకంటే, గంగాతీరంలో ఒంటరిగా కూర్చుని వయొలిన్ వాయిస్తూ తన్మయత్వంలో ఓలలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో నిలయ కళాకారులు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి.  కృష్ణారావుగారు వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ గా  పనిచేసేరోజుల్లో వారితో పరిచయం కూడా వుండేది. అఖిల భారత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీ సూర్యదీప్తి, బెంగుళూరులో పదవీవిరమణ అనంతరం, తుచ్చమైన లౌకిక సుఖాలను పరిత్యజించి, కాశీ వెళ్లి అక్కడే ఒంటరిగా భాగీరధీ తీరంలో వయోలిన్ పై కృతులు పలికిస్తూ సంగీత పారవశ్యంలో తన శేష జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటువంటి కధలు, గాధలు విన్నప్పుడు రేడియోలో పనిచేసిన చాలామంది వృత్తి కోసం కాకుండా తమ ప్రవృత్తి కోసం, అంకిత భావంతో తమ విధులు నిర్వహించారు అనే భావన కలుగుతుంది. వీరు కదా నిజమైన కళాకారులు. ఇటువంటి వారితో అలరారిన రేడియో ప్రాంగణంలో చిరకాలం పనిచేసిన అదృష్టం దక్కిన అనేకమందిలో నేనూ  ఒకడిని కావడం నాకు గర్వకారణం.

మహాలయ పక్షాలలో పూర్వీకులను తలచుకుంటాం. సూర్య దీప్తి గారు నా రేడియో పూర్వీకుడు.

కింది ఫోటో:

పితృదేవతలకు తర్పణాలు విడుస్తూ నేను:





కామెంట్‌లు లేవు: