డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు
ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే, సర్పంచ్ సీటుతో ప్రారంభించి సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే, ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టి, సెట్లో వెనుక ‘హీరో’ అనో ‘హీరోయిన్’ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభల వరకూ ఈ సీట్ల గోల తప్పదు.
టీవీ కెమెరాల యాంగిల్ కోసం వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో, డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు. ‘అమ్మ’ (శ్రీమతి ఇందిరాగాంధి) కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు. ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చొనేవారు.
అంజయ్య గారు ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది. ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ. ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే ఆరోగ్యం అక్కడ వుంటుంది’ అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం. బాత్రూం, బెడ్ రూముల్లో కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ కారుకు యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే, దారిపొడుగునా ప్రజలకు అభివాదం చెయ్యడానికి ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం మరో కారణం.
తోకటపా:
మేము చదువు కునే రోజుల్లో, మా ఊరు పక్కన పెనుగంచిప్రోలుకు, పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. చుట్టుపక్కల గ్రామాల వారికి ఆ బస్సులే శరణ్యం. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు.
మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్ లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్ మోగించేవాళ్ళు. అది వింటూనే ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు.
డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని, వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు.
బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర టిక్కెట్టు కొట్టించకుండా పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి