23, అక్టోబర్ 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (368) : భండారు శ్రీనివాసరావు

 

అనుకోని దైవ దర్శనం
అక్టోబరు, 20, 2026.
మధ్యాన్నం ఫోను మోగింది. తెలియని నెంబరు.
“ఈరోజు సాయంత్రం ఆరుగంటల కల్లా అన్నమయ్య పురం వచ్చేయండి. నేరుగా టెంపుల్ కే రండి. స్వామి దర్శనం చేసుకుని కార్యక్రమానికి వద్దురు కానీ”
అప్పుడు గుర్తుకు వచ్చింది. ఈ పాడు మతి మరపుతో ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకునే వాడిని. ఫోన్ చేసింది ఎవరో కాదు, ప్రసిద్ధ ఆధ్యాత్మిక గాయని శోభారాజు గారి భర్త డాక్టర్ నందకుమార్.
కిందటి నెల 29వ తేదీన శోభారాజు గారు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన సంగతి గుర్తుకు వచ్చింది. ‘పంటి చికిత్స చేయించుకుంటున్నాను, మాట్లాడే పరిస్థితి లేదు, కానీ తప్పకుండా వస్తాను’ అని చెప్పాను. ఫోన్ లో నోట్ చేసుకున్నాను కూడా. కానీ ఆసుపత్రి తిరుగుళ్ళలో మరపున పడింది. సరిగ్గా సమయానికి నందగోపాల్ గారు ఫోన్ చేసి గుర్తు చేశారు.
కారులో వెడుతున్నప్పుడు నిరుడు దసరా రోజుల్లో అన్నమయ్య పురం వెళ్ళిన సంగతులు గుర్తుకు వచ్చాయి. మిత్రుడు, నా మేనకోడలు భర్త అయిన వనం జ్వాలా నరసింహారావు అక్కడ జరుగుతున్న సంకీర్తన కార్యక్రమానికి ముఖ్య అతిథి. నన్నూ వెంట తీసుకు వెళ్ళాడు. చాలా మంచి పని చేశాడు.
సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు నా అంతట నేను ఎప్పుడూ వెళ్ళలేదు. పోక పోయి వుంటే చాలా పొరపాటు చేసి వుండేవాడిని అని వెళ్ళిన తర్వాత తెలిసి వచ్చింది.
దేవుడు అంటేనే ప్రశాంతత. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో దేవుడు అక్కడ వుంటాడు. అలా అని మరోచోట వుండడు అని అర్ధం కాదు. ఎక్కడా దొరకని ప్రశాంతత దేవుడి సమక్షంలో దొరుకుతుందని నా కవి హృదయం.
నిన్న అక్టోబరు ఇరవయ్యవ తేదీ విజయ దశమి పర్వదినం నాడు నేను అలాంటి మానసిక ప్రశాంతతను ఒక గంటన్నర సేపు అనుభవించాను.
ప్రశాంత వాతావరణంలో చక్కటి దైవ దర్శనం జరిగింది. తర్వాత సభామందిరంలోకి వెళ్లాను. వేదిక పై భాగంలో రాసి వున్న ఒక వాక్యం నన్ను ఆకర్షించింది.
“భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ”
“భావ దారిద్య్రం కన్నా భాషా దారిద్య్రం మేలు” అన్న ఒక కవి వాక్యం గుర్తుకు వచ్చింది.
నీళ్ళ కాలుష్యం, వాయు కాలుష్యం జనాలని పీడిస్తున్నాయి. వీటిని మించిన భావ కాలుష్యాన్ని తొలగించే శక్తి, భక్తి సంగీతానికి వుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? నిజానికి జనాల్లో భావ కాలుష్యం తొలగిపోతే సర్వేజనా స్సుఖినో భవంతు అని నిశ్చింతగా ఉండవచ్చు.
శోభారాజు గారితో నా పరోక్ష పరిచయం నలభయ్ ఏళ్ళ కిందట. భక్తి, దేముడు అనే పదాలు వినపడని అలనాటి సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో నేను కుటుంబ సమేతంగా వుంటున్న రోజుల్లో శోభారాజు గారు ఆలపించిన అన్నమయ్య కీర్తనల కేసెట్లను (అప్పటికి మొబైల్ సంగీతాలు సరే, కనీసం సీడీలు కూడా లేవు) ఇంట్లో టేప్ రికార్డులో వినేవాళ్ళం. త్వరలో వాటికి ఎంత ప్రాచుర్యం లభించిందంటే, అవి భారతీయుల ఇళ్ళల్లోనే కాదు, మాస్కో రేడియోలో నా రష్యన్ సహచరుల ఇళ్ళల్లో కూడా అవి మార్మోగడం మొదలయింది. శోభారాజు గారి గాత్రంలోని సమ్మోహన శక్తికి, ఆ దేవదేవుడి ఆశీస్సులు తోడవడం ఇందుకు కారణమేమో!
మళ్ళీ నిన్న కూడా జ్వాలా నరసింహారావు ముఖ్య అతిథి. ఆయన గత పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరవుతున్నాడు. రేడియోలో స్టేషన్ డైరెక్టర్ హోదాలో పనిచేసి రిటైర్ అయిన రచయిత, నాకు మంచి మితృలు అయిన నాగసూరి వేణుగోపాల్ మరో ముఖ్య అతిథి.
శోభారాజు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని కావడం వల్ల తిరుమలలో జరిగే ఉత్సవాలలో పాల్గొనడానికి మధ్యాన్నమే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వారు లేని లోపాన్ని గాయత్రి నారాయణన్ గారు పూరించారు.
శోభారాజు గారు తనని ఆవహించారేమో అనే భ్రాంతి కలిగింది ఉచ్చై స్వరంతో ఆవిడ అన్నమయ్య కీర్తన ‘అదివో అల్లదివో...’ అనే పాటను గానం చేస్తున్నప్పుడు. అలాగే వరసగా అనేక అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ పోయారు. 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే' పాట పాడుతున్నప్పుడు శోభారాజు గారి శిష్యురాండ్రు చిన్నా పెద్దా అనేకమంది స్టేజి ముందు నృత్యం చేయడం మొత్తం కార్యక్రమంలో హైలైట్. గోదావరి చలన చిత్రంలో గాయత్రి గారు తాను పాడిన ‘రామచక్కని సీతకి’ అనే పాటను పాడి శ్రోతలను అలరించారు.
చిన్న వయసునుండే అనేకమంది శోభారాజు గారి వద్ద శిష్యరికం చేస్తూ కళాభినివేశాన్ని పెంపొందించుకుంటున్నారు. మాకు ముందు వరసలో కొందరు ఆడపిల్లలు కింద కూర్చుని కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. నేను కుర్చీలో స్థిరంగా కూర్చోలేక అటు ఇటు మసలుతున్నాను. వారిలో ఒకమ్మాయి సైగలతో చెబుతున్న మాటలు నాకు అర్ధం అయి సిగ్గుపడి సర్దుకుని కూర్చొన్నాను. సరిగ్గా పది పన్నెండేళ్లు కూడా లేని ఆ అమ్మాయి, తాను నిటారుగా కూర్చోవడమే కాకుండా తన పక్కన మరో అమ్మాయికి చెబుతోంది, ‘అలా వంగి కూర్చోకూడదు, ఇలా కూర్చో’ అని ఎలా కుదురుగా కూర్చోవాలో నేర్పించింది. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే కార్యక్రమాలకు హాజరయ్యేవారి నడవడిక, ప్రవర్తన ఎలా వుండాలి అనే పాఠం ఆ చిన్నారి నుంచి నేను నేర్చుకున్నాను.
మొత్తం మీద పండగ పూట నేను కోరుకునే మానసిక ప్రశాంతత లభించింది.



కామెంట్‌లు లేవు: