29, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (203) : భండారు శ్రీనివాసరావు

 దేవుడు పూర్తిచేసిన పజిల్

మా ఆవిడతో కలిసి అమెరికా వెళ్ళిన ప్రతిసారీ ఆరు నెలలు కానీ, ఇప్పుడు ఒక్కడ్నీ వెడితే మాత్రం  నెలన్నర, మహా అయితే రెండు నెలలు. అంతే! నిరుడు అమెరికా వెళ్ళినప్పుడు పేపరు బాయ్ కి, కేబుల్ వాడికి చెప్పడం మరచిపోయాను.  వారం పది రోజులు వేసిన పేపర్లన్నీ  మా గుమ్మం దగ్గర అలాగే పడివుండడం చూసిన తర్వాత అతడే వేయడం మానేశాడు. నెల తిరగగానే ఫోన్ పే ద్వారా పనిమనిషికి, వంటమనిషికి, పేపరు, కేబుల్ వాళ్లకు, ఎవరికీ ఎంత ఇవ్వాలో తెలుసు కాబట్టి పంపించేశాను. అలాగే కరెంటు బిల్లు, అపార్ట్మెంటుమెంటు మెయింటెనెన్సు, కారు తుడిచినందుకు వాచ్ మన్ కు ఇచ్చే డబ్బులు అన్నీ ఇలాగే అక్కడినుంచే  చెల్లింపులు చేశాను.

ఈ సారి అమెరికా నుంచి వచ్చి వారం దాటింది. అయినా పేపరు బాయ్ పేపర్లు వేయడం లేదు. ఫోన్ చేసి కనుక్కుందాం అనుకుంటూ వుండగానే మధ్యలో ఆదివారం వచ్చింది. ఆదివారం స్పెషల్ ఏమిటంటే ఆ రోజు తల్లి పత్రికతో పాటు పిల్ల పత్రికలు కూడా వస్తాయి. వాటిల్లో వచ్చే గళ్ళనుడి కట్టు శీర్షిక నాకు బాగా ఇష్టం.

గతంలో ఎప్పుడో జ్యోతి పత్రికలో శ్రీ శ్రీ పదబంధ ప్రహేళిక మెదడుకు పదును పెట్టే రీతిలో వుండేది. అది  పుస్తక రూపంలో కూడా వచ్చింది. మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెన్నై లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎంగా వున్నప్పుడు ఆయనకు కేటాయించిన బ్యాంక్ భవనం లైబ్రరీలో ఆ పుస్తకాన్ని చూశాను. ఇప్పుడంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చాయి కానీ, లెటర్ ప్రెస్ రోజుల్లో అలాంటి పుస్తకాలను బ్లాక్ అండ్ వైట్ గళ్ళతో ముద్రించాలి అంటే ప్రతి పేజీని  బ్లాక్ మేకింగ్  చేయించాల్సి వచ్చేది.  వ్యయప్రయాసలతో కూడిన పని.

శ్రీశ్రీ ప్రహేళిక పూరించడం మామూలు వ్యవహారం కాదు. బుర్రకు ఎంత పని చెప్పినా, కొన్ని గడులు ఖాళీగా వుండిపోయేవి. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కరీంనగర్ జిల్లాకు చెందిన ‘ఎలనాగ’ (అసలు పేరు  డాక్టర్ నాగరాజు సురేంద్ర) గారు వాకిలి సాహిత్య పత్రికలో శ్రీశ్రీ పదబంధ ప్రహేళికలో సొగసులను గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాసారు.

కొన్ని ఉదాహరణలు, ఎలనాగ గారి సౌజన్యంతో:

ఆడదాని ఆద్యంతాలు కెరటం (2)
దీనికి సమాధానం అల. ఎలా అంటే, ఆడది = అబల. ఆద్యంతాలు అంటే అబలలోని మొదటి అక్షరమైన ‘అ’ను, చివరి అక్షరమైన ‘ల’ను తీసుకోవాలి. రెండింటిని కలిపితే అల వస్తుంది.

కవిత్వం మధ్య నునుపులు మొదలెట్టి ఆకర్ణించు (2)
కవిత్వం మధ్య అంటే కవిత్వం అనే పదంలోని మధ్య అక్షరమైన వి. నునుపులు మొదలు అంటే నునుపులు లోని మొదటి అక్షరమైన ను. వి + ను = విను = ఆకర్ణించు. కనుక, విను సమాధానం.


కనుదెరచి చూడరా శిష్యా! కనబడుతుంది చక్రం (2)
ఇక్కడ చక్రం అంటే రాశిచక్రంలోని రాశి అన్న మాట. కనుక, అదే జవాబు. చూడరా శిష్యా మధ్య రాశి ఉన్నది కదా.

ఇంటికి వింటికి కావాలి (2)
వింటికి (విల్లుకు లేక ధనుస్సుకు) అల్లెతాడు ఉంటుంది కదా. దాన్ని నారి అంటారు. ఇక నారి అంటే ఇల్లాలు (స్త్రీ) అనే అర్థం కూడా వుంది. ఇల్లుకు కూడా నారి కావాలి కనుక, ఇక్కడ నారి జవాబు.

వంటింట్లోనూ వాటికన్ లోనూ (2)
పోప్ జాన్ పాల్ (Pope John Paul) గారు వాటికన్ లో ఉంటారు. వారిని తెలుగులో పోపు అనవచ్చు మనం. ఇక పోపు (తాలింపు) వంటింట్లో కూడా అవసరమే.

విశ్వనాథ సత్యనారాయణలో ఉన్న రెండింటిలో ఒకటి మదీయం (1)
విశ్వనాథ లోని మూడవ అక్షరం నా. సత్యనారాయణ లోని మూడవ అక్షరం కూడా నా. మదీయం అంటే నా(యొక్క) కనుక, నా అనేది జవాబు.

14.
లంక కొస నుండి లంక మొదటి దాకా; మధ్యని మధ్యకు ప్రారంభం. ఇదో పువ్వని వేరే చెప్పాలా? (3)
లంక కొస = క. లంక మొదలు = లం. మధ్యకు ప్రారంభం = మ. కలం మధ్యన మ చేరితే వచ్చే కమలం సమాధానం.

16.
కడుగడు; కడు విడు; మిగిలేది తల లేని అద్దె (2)
కడుగడు మైనస్ కడు = గడు. దాన్ని రివర్స్ చేస్తే డుగ వస్తుంది. అదే జవాబు. అద్దె = బాడుగ. తల (మొదటి అక్షరం) లేకుంటే డుగ వస్తుంది.

ఇట్లా, వుండేవి శ్రీశ్రీ గారి పజిల్స్.
(ఎలనాగ, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో) 

 

ఎలనాగ గారు రచన శాయి పత్రిక  రచన కోసం చాలాకాలం పజిలింగ్ పజిల్ శీర్షికను నిర్వహించారు.   

రచన మాస పత్రికలో వచ్చే ఈ  పజిలింగ్ పజిల్ పూర్తి చేయడం అంటే నాకు తగని ఆసక్తి.

ఆ పత్రికతో సమస్య ఏమిటంటే అది విడిగా పేపరు స్టాల్స్ లో దొరకదు. దానికోసం ప్రతి నెలా సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు  వెళ్లి, ఒకటో నెంబరు ప్లాటుఫారంలో వుండే  హిగ్గిం బాదమ్స్  బుక్ స్టాల్ లో కొనేవాడిని. ఆ పత్రిక మీద నా ఆసక్తిని, బహుశా కామన్ ఫ్రెండ్ రేడియో న్యూస్ రీడర్  డి. వెంకట్రామయ్య గారి ద్వారా తెలుసుకున్నారో ఏమిటో కానీ, రచన శాయి గారు ఆ పత్రికను  ప్రతినెలా పోస్టులో మా ఇంటికే పంపడం మొదలు పెట్టారు. దురదృష్టం కోవిడ్ రావడంతో అనేక పత్రికల మాదిరిగానే రచన ప్రచురణ కూడా ఆగిపోయింది. హిగ్గిం బాదమ్స్ ఇంకా  వుందో లేదో తెలియదు. శాయి గారి రచనలో రచనలు కూడా గొప్ప స్థాయిలో ఉండేవి. కాశీనాధుని నాగేశ్వరరావు గారి భారతి మాసపత్రికతో పోల్చిన పెద్దలు వున్నారు.

ఇక విషయానికి వస్తే,

ఆదివారం వచ్చింది. పేపర్లు లేవు. తల్లి పత్రికలు లేవు, పిల్ల పత్రికలు లేవు. మరి కాలక్షేపం ఎలా? కాలం గడవడం ఎలా!

చేసేది లేక కాళ్ళకు పనిచెప్పాను. మా ఇంటికి దగ్గరలో పేపర్లు అమ్మే దుకాణం ఎక్కడ అని వెతుక్కుంటూ. పెద్ద దూరం వెళ్ళకముందే ఒకచోట ఇద్దరు నిలబడి పేపర్లు చదువుతున్నారు. వెళ్లి చూస్తే అదో చిన్న దుకాణం. అప్పుడే మోటారు సైకిల్ మీద తెచ్చిన వివిధ దినపత్రికలను ఒకతను,  పది, పదిహేను, పాతిక, ముప్పయి చొప్పున లెక్కించి దుకాణదారుకు ఇస్తున్నాడు. ఆ పని పూర్తయ్యేదాకా నేను ఓపికగా నిలబడ్డాను. ఎందుకంటే పిల్ల పత్రికలు వున్న తెలుగు పత్రికలను అన్నింటినీ కొనుక్కుని పోవాలనే ఆలోచనతో వచ్చాను కాబట్టి. ఈలోగా కొందరు వచ్చి పలానా పత్రిక కావాలంటూ అడిగి కొనుక్కుని వెడుతున్నారు. ఎవరు ఏ పత్రిక అడిగి మరీ కొంటున్నారు అనేది అక్కడే నిలబడి చూస్తున్న నాకు బోధపడుతూనే వుంది. పత్రికల సర్క్యులేషన్ తెలుసుకోవాలంటే ఇలాంటి దుకాణాల దగ్గర కాసేపు నిలబడితే చాలు.

రద్దీ తగ్గిన తర్వాత అడిగాను, ఇలా ముప్పయి నలభయ్ వేయించుకుంటున్నారు, అమ్ముడు పోతాయా అని.

‘అబ్బే వీటిల్లో సగం పోయినా గొప్పే. ఈ రోజు ఆదివారం కాబట్టి పత్రికతో పాటు ఇచ్చే ఆ చిన్న పుస్తకం కోసం ఈ మాత్రం అయినా అమ్ముడుపోతున్నాయి.  కాకపోతే, అమ్ముడు పోని వాటిని మళ్ళీ ఆ పత్రిక ఏజెంటే వచ్చి పట్టుకుపోతాడు’ అని దేవరహస్యం చెప్పాడు. ‘ఒక విషయం చెప్పమన్నారా, ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తరవాత పత్రికలు చదివే వాళ్ళు తగ్గిపోయారు, ఇది నా అనుభవం’ అన్నాడు.   

 

ఉపశ్రుతి:

గళ్ళనుడికట్టు పూర్తిచేయడం అంటే నాకంటే కూడా మా ఆవిడకు పెద్ద ఆసక్తి.

ఆదివారం వచ్చిందంటే తనకి నాలుగాటలు సినిమా చూసిన సంబరం. పదబంధాలు, గళ్ళనుడికట్లు వాటితోనే పొద్దంతా గడిచిపోయేది,  ఆ రోజు  డైలీ సీరియళ్ళు టీవీల్లో రావనే బెంగ లేకుండా.

సరిగ్గా ఆరేళ్ల క్రితం, 2019 జులై ఇరవై తొమ్మిదో తేదీన తీసిన ఫోటో ఇది. పక్కన మరో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ పై పనిచేసుకుంటున్న నేను,  ఎందుకో లేచివచ్చి ఈ ఫోటో తీశాను.

అదే ఆమె ఆఖరి ఫోటో అవుతుందని ఆ ఉదయం ఆమెకూ తెలియదు, నాకూ తెలియదు.

ఆ కుర్చీ ఆ టేబుల్ అలాగే వున్నాయి, ఆమె లేదు.

మూడు వారాల్లో మనుషులు ఇలా మాయం అయిపోతారా!

కింది ఫోటో:

పిల్లపత్రికల్లో గళ్ళనుడికట్లు పూర్తి చేస్తూ మా ఆవిడ నిర్మల



 

(ఇంకా వుంది)

26, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (202) : భండారు శ్రీనివాసరావు

 మధ్యతరగతి మందహాసాలు

కధ సుఖాంతం అయింది. అనుకున్నా, కానీ కాలేదు.
‘’రెండు రోజులు అయింది, అమెరికా నుంచి వచ్చి. ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ఓ మిత్రుడు ఫోన్ చేసి.
నా జవాబు విని ఆశ్చర్యంగా అడిగాడు, 'నీళ్ళతో యుద్ధం చేస్తున్నారా' అని.
కష్టాలు కట్టగట్టుకుని వస్తాయి అనడానికి తెనాలి రామకృష్ణుడు, కృష్ణ దేవరాయల వారితో చెప్పిన పద్యం జ్ఞాపకం వచ్చింది.
“గురువుల రాక దాసి మృతి గుఱ్ఱపుదాడియు నల్లు నల్కయున్ పొరుగున నప్పుబాధ చెవిపోటును దొమ్మరులాట యింటిలో వరసతిగర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తెయున్ కరవు దరిద్రమాబ్దికము కల్గెనొకప్పుడు కృష్ణభూవరా!”

(తాత్పర్యం: "ఇంటికిగురువులు వచ్చారు, ఆయన కోసంఏర్పాట్లు చెయ్యాలి. అప్పుడే యింట్లో పనిచేసే దాసీ చచ్చిపోయింది. ఊరు మీద దోచుకోవడానికి గుఱ్ఱపు దండు వచ్చిపడింది. ఇంటికి వచ్చిన అల్లుడు అలిగి కూర్చున్నాడు. ఒకప్రక్క భార్య ప్రసవవేదన పడుతోంది. కూతురి పెళ్లి ముహూర్తం ఆనాడే. విత్తనాలు చల్లే కార్తి కూడా వచ్చిపడింది. పొరుగువాళ్ళు అప్పు తీర్చమని సతాయిస్తున్నారు. చెవిపోటు మొదలైంది. వీధిలో దొమ్మరి వాళ్ళు అట మొదలుపెట్టి చెవులు పగిలేటట్లు డోలు వాయిస్తున్నారు, దేశంలో కరువు, యింటిలో దరిద్రం, పైగా తద్దినమొకటి. ఏం చెప్పను నాస్థితి కృష్ణ భూవరా")
ఈనాడు మధ్యతరగతి వాళ్ళ స్థితి యిలాగే వుంది.

ఉదయం ఆరుగంటలకు నీళ్ళు వదిలారు. ఒక్కడిని. ఎన్ని కావాలి? అరగంటలో కాలకృత్యాలు, స్నానపానాలు పూర్తయ్యాయి. ఇంకా అరగంట సేపు వస్తాయి. ఏమి చేసుకుంటాను.
పైన తథాస్తు దేవతలు విన్నట్టున్నారు. వెనుకటి రోజుల్లో అంటే ఈ ఇల్లుకట్టి పాతికేళ్ళు దాటింది, ఆ రోజుల్లో అన్నమాట, నీళ్ళ కరువు వుందేమో, ముందు జాగ్రత్తగా రెండు బాత్ రూముల్లో పెద్దపెద్ద ప్లాస్టిక్ నీళ్ళ ట్యాంకులు పెట్టించారు. అంచేత మాకు ఎప్పుడూ నీళ్ళ కొరత వుండేది కాదు.
ఏమి జరిగిందో ఏమో తెలియదు, అరగంట సమయంలోనే ఆ ట్యాంకులు నిండిపోయి, బొగత వాటర్ ఫాల్స్ మాదిరిగా నీళ్ళు పొంగి కిందికిధారలు ధారలుగా కారడం మొదలు పెట్టాయి. వాచ్ మన్ సమ్మయ్యని పిలిస్తే అతడు కళ్ళు తేలేశాడు. అసలే నీళ్ళ కొరత. ఇంటి పైన ట్యాంకులోకి ఎక్కించిన నీళ్లన్నీ ఇలా వృధా అయిపోతే మిగిలిన ఫ్లాట్ల వాళ్ళు ఏమనుకుంటారు అని నా బాధ. ఇద్దరం కలిసి కారుతున్న నీళ్ళలో మరోసారి సరిగంగ స్నానాలు చేస్తూ, ఆ ప్రవాహాలని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేశాము. కానీ కాలేదు.
ఈ లోగా సమ్మయ్య ఎవరో ప్లంబర్ కి ఫోను చేశాడు. అతడు ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి పైన నీళ్ళ ట్యాంకు కట్టే సమయం అయింది. దాంతో అప్పటికి నీటి ధారలు నిలిచిపోయాయి.
ఈలోగా ప్లంబరు మహాశయులు విచ్చేశారు. చెప్పినదంతా విని, ‘కొన్ని సామాన్లు కొనాలి, ఇప్పుడు షాపులు తెరవరు. అంచేత డబ్బులు ఇస్తే కొనుక్కుని మధ్యాన్నం మళ్ళీ వస్తా’ అని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.
మాట ప్రకారం వచ్చి పని మొదలు పెట్టాడు. బాత్ రూమ్ ట్యాంకులో బంతి పనిచేయడం లేదన్నాడు. కొత్త బంతి కొనుక్కొచ్చాడు. వేసాడు. బాపు గారి కార్టూన్ ఒకదానిలో, డాక్టరు గారు రోగికి రెండు మాత్రలు ఇచ్చి, ‘ఒకటి రాత్రి నిద్రపోయే ముందు వేసుకోండి, పొద్దున్న ‘లేస్తే’ రెండోది వేసుకోండి’ అన్నట్టు, నీళ్ళు మళ్ళీ సాయంత్రం వదిలినప్పుడు చూసి చెప్పండి’ అని తన డబ్బులు ఫోన్ పే చేయించుకుని వెళ్ళిపోయాడు.
సాయంత్రం అయిందాకా ఎదురు చూస్తూ కూర్చోవడమే సరిపోయింది. మొత్తానికి నీళ్ళు వదిలారు. గుండెలు దడదడలాడుతున్నాయి. కొంతసేపు కాగానే మళ్ళీ దడదడమంటూ జలపాతాలు మొదలయ్యాయి. పంబ్లర్ కు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేయమన్నాడు. కారుతున్న నీళ్ళల్లో తడుసుకుంటూ, ఫోన్ తడవకుండా చూసుకుంటూ అతడు చెబుతున్న విధంగా తిప్పమన్న నాబ్స్ తిప్పుతూ, ఆపమన్న నాబ్స్ ఆపుతూ కొంతసేపు పంబ్లర్ అసిస్టెంట్ లా పనిచేశాను. మొత్తం మీద ధారాపాతం ఆగిపోయింది. తల తుడుచుకుంటూ అతడు చెప్పేది విన్నాను. రేపు ఉదయం నీళ్ళు వదిలే టైం కు వచ్చి చూస్తాను. అప్పటిదాకా ఏ పంపు తిప్పకండి’ అని హుకుం జారీ చేశాడు.
ఈ రోజు ఉదయం వచ్చి, 'పైన ట్యాంకు నుంచి నీళ్ళు వదిలే సమయంలో నాబ్స్ ఇలా వుంచండి. నీళ్ళు కట్టేయగానే ఇలా తిప్పండి' అని, నేను మరిచిపోతానేమో అని వాటి ఫోటోలు తీసి నాకు ఫార్వార్డ్ చేశాడు.
ఇలానే వర్షాలు పడి, బోర్లు బాగుపడి, మళ్ళీ నీళ్ళ సరఫరాకు పూర్వ వైభవం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అడుగుదామనుకున్నా. ఇప్పుడు చెప్పినా ఎలాగు గుర్తువుండి చావదు, అప్పటి సంగతి అప్పుడే చూసుకుందాం అని మనసు రాయి చేసుకున్నాను.
నిజానికి మధ్యతరగతి జీవులు అందరికీ ఇలాంటి ఇబ్బందులు కొత్త కాదు. కానీ నేనే కొత్త బిచ్చగాడిని. మా భావన చెప్పినట్టు ఇవన్నీ ఇబ్బందులే, కష్టాలు కావు అనుకుని నవ్వుకున్నాను.
తోకటపా:
తాళం చెవి ఇంట్లో పెట్టి ఆటోమేటిక్ లాక్ వేసిన అనుభవం లోగడ కూడా వుంది. కాకపోతే అప్పుడు నాకు దన్నుగా మా అబ్బాయి సంతోష్, కోడలు నిషా వున్నారు. అంచేత నాకు భరోసా.
2022 అక్టోబరు 23, దీపావళి పండుగ రోజులు.
ఏడున్నర ప్రాంతంలో మనుమరాలితో ఆడుకుంటూ వుంటే కోడలు వచ్చి, పాపా జీవికను కిందికి తీసుకువెళ్లి ఒకటి రెండు మతాబాలు కాల్చి తీసుకువస్తాము అంది. 'నేనిక్కడ వుండి చేసేదేమిటి నేనూ వస్తాను పదండి' అంటూ లేచాను. 'నేను ఇంటి కీ పట్టుకు వస్తాను మీరు వెళ్ళండి' అని డ్రాయరులో వున్న ఇంటి తాళం తీసుకుని నేనూ వారి వెంటనే కిందికి వెళ్ళాను. అప్పటికే ఒకటి రెండు చిచ్చుబుడ్ల వంటివి వాళ్ళు కాలుస్తున్నారు. ఒక కాకర పువ్వొత్తి నాచేత కాల్పించారు. అందరం కలిసి పైకి వచ్చాము. తలుపు తెరవడానికి చూస్తే జేబులో తాళం చెవి లేదు. జేబులో వేస్తున్నప్పుడు కిందపడి వుంటుంది, నేను గమనించలేదు. నా దగ్గర వుందని చెప్పాను కనుక వాళ్ళూ తీసుకురాలేదు. అదేమో సెవెన్ లీవర్స్ గోద్రెజ్ లాక్. ఆ ఆటోమేటిక్ లాక్ పడితే ఇంతే సంగతులు. కొడుకూ కోడలు కారేసుకుని అమీర్ పేటలో చాబీవాలాలను వెతుకుతూ వెళ్ళారు.
నేను పసిదానిని పెట్టుకుని ఇంట్లోనే, ఇంటి బయట వుండిపోయాను.
తాళాలు తీసే వాడు ఈ రాత్రి దొరక్కపోతే అనే ఆలోచన చిన్నగా మొదలై కొద్దిసేపటిలో పెనుభూతంగా మారింది.
పసిదానికి ఫీడింగ్ టైం అయితే ఏం చేయాలి? పెద్ద వాళ్ళ తిండీ తిప్పలు అంటే జొమాటో కాకపోతే మరోటో వున్నాయి. ఉన్నపాటున బయటకు వచ్చాము కాబట్టి పర్సులు, బ్యాంక్ కార్డులు లేవు. ఒక వేళ వున్నా, ఈ ఆకారాల్లో వెడితే ఏ హోటల్ వాడు రూము కూడా ఇవ్వడు. తెల్లవారితే మాకు దీపావళి హారతులు ఇవ్వడానికి మా అన్నయ్య పిల్లలు వస్తారు.
బాణాసంచా కాల్చడానికి కిందికి వెళ్ళాము కనుక ఫోటోలు తీయడానికి సెల్ ఫోన్లు మాత్రం చేతిలో వున్నాయి.
ఈ లోపల కోడలు ఫోన్ చేసింది. అమీర్ పేటలో వెతగ్గా వెతగ్గా ఓ షాపు దొరికింది. కానీ బాగుచేసేవాడు ఇంటికి వెళ్లి పోయాడు. అతడికి ఇలాంటి లాక్స్ తీయడంలో మంచి ప్రవేశం వుందని చెబుతూ అతడి నెంబరు ఇచ్చాడు షాపులోని వాడు. ఫోన్ చేస్తే అతడు అత్తాపూర్ లో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను మళ్ళీ అంత దూరం రాలేను అన్నాడు అతడు. అప్పుడు మా కోడలు ఫోన్ తీసుకుని చెప్పింది. చూడు భయ్యా. మాకు ఎనిమిది నెలల పాప, దాదాపు ఎనభయ్ ఏళ్ళ మామయ్య వున్నారు. ఈ రాత్రి చాలా కష్టం అవుతుంది. నీ కష్టం మేము వుంచుకోము, దయచేసి రమ్మని అడిగితే అతడు మెత్తబడి నేను వచ్చేసరికి గంట, గంటన్నర అవుతుంది, వెయిట్ చేయండి అన్నాడు. ఈ లోపల మా అపార్ట్ మెంటు ఇరుగూ పొరుగూ వచ్చి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఏమీ పర్వాలేదు ఒకవేళ అవసరం అయితే మా ఇళ్ళల్లో వుండండి, సర్డుకుందాం అని భరోసా ఇచ్చారు. ఒకావిడ వెళ్లి మా మనుమరాలికి అరటి పండు మెత్తగా గుజ్జు చేసి ఇచ్చింది. ఒకళ్ళు చపాతీలు తెచ్చారు. మరొక ఇంటివారు పులిహోర తెచ్చారు.
ఈలోగా చాబీవాలా వచ్చాడు దేవుడిలా.
ఏం మంత్రం వేశాడో తెలియదు, చిన్న చేతి రంపం తీసుకుని తన దగ్గర వున్న తాళం చేతుల్లో ఒక దాన్ని చిత్రిక పట్టాడు. పదే పది నిమిషాల్లో కొత్త తాళం చెవి తయారుచేసి తలుపు తెరిచాడు.
పది గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా మళ్ళీ కొడుకు, కోడలు, మనుమరాలితో కలిసి పునః గృహ ప్రవేశం చేశాను.
అంత దూరం నుంచి వచ్చిన ఆ చాబీవాలా మేము ఇస్తామన్న డబ్బు తీసుకోకుండా, తను తయారు చేసిన తాళం చెవిని మాకే ఇచ్చేసి తన కూలీ మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు.
లోకంలో మంచి మనుషులు ఇంకా మిగిలే వున్నారు.
కింది ఫోటో: అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా వచ్చి, తాళం తీసి మమ్మల్ని రోడ్డున పడకుండా ఇంట్లోకి పంపిన మెకానిక్ మహానుభావుడు




(ఇంకావుంది)

24, జులై 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (201) : భండారు శ్రీనివాసరావు

 మారిన మనిషి

ఆ తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో, ఇంటి  లిఫ్ట్ ముందు వున్న కాసింత జాగాలో చోటుచేసుకున్న సీను ఎలా వుందంటే,  కస్టమ్స్ వాళ్ళు పట్టుకుని సోదాచేసిన తీరుగా రెండు చిన్నపాటి సూటుకేసులు తెరిచిపెట్టి  వున్నాయి. వాటిల్లో వున్న దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి వున్నాయి.  ఇంటి తాళం చేతుల అన్వేషణలో సాగిన క్రతు ఫలితం అన్నమాట.

వాచ్ మన్ సమ్మయ్యకు ఏమి జరిగింది, ఏమి  జరుగుతోంది  అన్నది ఒక పట్టాన అర్ధం కాలేదు. కాసేపటికి అడిగాడు, ఈ వెతుకులాట దేనికోసం అని. జవాబు విని, వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ, ‘మీరే కదా అమెరికా నుంచి ఫోన్ చేసి సుభాష్  బాబు గారికి (మా అన్నయ్య కుమారుడు) చెప్పారు, ఆయన దగ్గర వున్న స్పేర్ కీ నాకు ఇచ్చి ఇల్లు శుభ్రం చేయమని. ఇక పదండి పైకి పోదాం’ అన్నాడు, సామాన్లు సూటు కేసుల్లో సదురుతూ. నిజమే, అమెరికా వెళ్ళేటప్పుడు రెండు స్పేర్ కీస్ ఒకటి సుభాష్ దగ్గరా, రెండోది  మా కోడలు నిషా బంధువు ఆశీష్ దగ్గరా పెట్టి వెళ్లాము. మరో విషయం ఏమిటంటే మా కోడలు నిషా, జీవికను వాళ్ళ అమ్మగారి ఇంట్లో కటక్ లో వుంచి, నేను వెళ్ళిన కొద్ది రోజులకే ఆఫీసు పని మీద అమెరికా వచ్చింది,  అయిదు వర్కింగ్ డేస్ మీటింగుల కోసం. నేను వుండే సియాటిల్ కు ఆమె వెళ్ళిన డెలావర్ చాలా దూరం. కాబట్టి మేము అమెరికాలో కలిసే వీలు లేదు, ఆమెకు అందుకు తగిన వ్యవధానం లేదు.  నాకంటే ముందే వచ్చినా, జీవిక కోసం కటక్ వెళ్ళిపోయింది. దాంతో  చాలా రోజులుగా ఇల్లు తాళం వేసి వుంది. కాబట్టి ఇల్లు బాగుచేయడానికి తాళం చెవి వాచ్ మన్ కు ఇమ్మని ముందుగానే ఫోన్ చేసి చెప్పాను. నేను చెప్పినట్టుగానే సుభాష్ తన దగ్గర వున్న తాళం చెవి సమ్మయ్యకు ఇచ్చి వెళ్ళాడు. తాళం చెవులు మరచిపోయినట్టుగానే ఈ సంగతి కూడా మరచిపోయాను. మొత్తం మీద శుభం కార్డు కొద్దిగా ఆలస్యంగా పడి, నేను పాత ఇంట్లోకి కుడికాలు కొత్తగా  పెట్టగలిగాను.

నా మానసిక ఆందోళన సమసిపోయేలా చేసిన సమ్మయ్యకు ఉచిత రీతిన కృతజ్ఞతలు చెప్పాను. అతడు కూడా మరో శుభ వార్త చెవిలో వేసి వెళ్ళాడు. నేను ఊర్లో లేని సమయంలో అపార్ట్ మెంట్ లో నీళ్ళ కరువు వచ్చి ఉదయం రెండు గంటలు, సాయంత్రం ఓ గంట మాత్రమే నీళ్ళు వదులుతారని, దూర ప్రయాణం చేసివచ్చారు కాబట్టి,  మరో రెండు గంటలు ఇలాగే  మేలుకుని ఆరింటికి స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని ఉచిత సలహా ఇచ్చి అతడు సెలవు తీసుకున్నాడు. ‘ఇలా ఎలా, ఒకపక్క ఫ్లై ఓవర్లు మునిగిపోయేలా వర్షాలు ముంచెత్తి వేస్తున్నాయని వార్తలు వస్తుంటే ఈ నీళ్ళ కరువు ఏమిట’ని చర్రున కోపం వచ్చింది. కానీ బలవంతాన అణచుకున్నాను.

కారణం పెద్ద కోడలు భావన చెప్పిన భగవద్గీత.

అమెరికా నుంచి తిరుగు ప్రయాణానికి ముందు రోజు రాత్రి నా కొడుకు, కోడలు నాకు చిన్నపాటి నీతి బోధ చేశారు. ముఖ్యంగా నా కోడలు భావన. కొంత నా సొంత  కపిత్వం కలిపితే ఆ బోధ ఇలా సాగింది.

‘భగవంతుడు మనని పుట్టించినప్పుడే కంటిపాపలకు భూతద్దాలు పెట్టాడు. అంచేత మనుషులకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి ప్రతి చిన్న సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. ఒకరోజు వంట మనిషి రాదు. మరో రోజు పనిమనిషి రాదు. ఒక రోజు నీళ్ళు రావు.  కొంపలు మునిగిపోవు. మీకు స్టవ్ అంటించడం కూడా  రాదు అని మీ జీరో సీరియల్ లో రాసినట్టు సందీప్ చెప్పాడు. కుక్ రాకపోతే అ పూట టిఫిన్ చేయకుండా వుండిపోతారని కూడా నాకు తెలిసింది.  ఈ వయసులో అది మంచిది కాదు. ఒకప్పుడు ఇలా బాధలు పడ్డమాట నిజమే. ఆ నేపధ్యంలోనే మీరు ఆలోచిస్తున్నారు. ఎదురయింది సమస్య కాదు, ఇబ్బంది, కాస్త అసౌకర్యం అనుకోండి. ఆ సమస్య మంచులా విడిపోతుంది. వంటమనిషి రాని రోజున  స్విగ్గీలు, జొమాటాలు ద్వారా  ఏదైనా మంచి హోటల్ నుంచి మంచి టిఫిన్ తెప్పించుకుని తినండి. అంతేగాని పస్తు పడుకోవద్దు. డబ్బు గురించి ఆలోచించవద్దు. ఇక్కడ మేమున్నాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్య ఆ సమయంలో చాలా పెద్దదిగా, అలవికానిదిగా అనిపిస్తుంది. అది సహజం. అయితే పరిష్కారం పక్కనే వుంటుంది. సమస్య వల్ల కలిగిన అసహనం కారణంగా అది కళ్ళకు కనబడదు. అసహనం వల్ల ఎదుటి మనిషిని  కడిగి గాలించాలనే లేనిపోని ఆగ్రహం. ఇవన్నీ దీర్ఘ కాలంలో ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. ప్రతిదీ తేలిగ్గా తీసుకోండి. ‘అరె  ఇంత చిన్న విషయం కోసమా అంత పెద్ద మాట అన్నాను’ అని మీకే తర్వాత  అనిపిస్తుంది. అంచేత మా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు కొద్దిగా మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే, అన్ని అవే పరిష్కారం అవుతాయి. మరి కొంతకాలం వుండమన్నా వుండకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అమెరికా వచ్చేసరికి మీలో మాకు ఆ మార్పు కనిపించాలి. అప్పుడే ఇక్కడ మేము సంతోషంగా వుండగలుగుతాము”

ఇదంతా సినిమా రీలులా వలయాలు వలయాలుగా కళ్ళముందు తిరగడంతో, తోసుకువచ్చిన కోపం కాస్తా,  సముద్రపు అల మాదిరిగా  మళ్ళీ లోపలకు వెళ్ళిపోయింది.

ఆరు గంటలకు నీళ్ళు వదిలారు. గీజర్ వేసుకుని స్నానం చేశాను. పాలవాడు పాల ప్యాకెట్లు వేసి వెళ్ళాడు. ధైర్యం చేసి వంటింట్లోకి వెళ్లి స్టవ్ వెలిగించాను. పాలగిన్నె స్టవ్ పై పెట్టి  అధరాపురపు వారి పాలపొంగు పోస్టులు గుర్తుకువచ్చి అక్కడే నిలబడ్డాను. ఎన్స్యూర్ పొడి కలుపుకుని తాగి బయట పడ్డాను. ఓస్ ఇంత తేలికా అనిపించింది.

యథావిధిగా వంట మనిషి, పనిమనిషి అందరు ఎవరి డ్యూటీలు వాళ్ళు మొదలుపెట్టారు. మర్నాడు మా రెండో అన్నయ్యను చూడడానికి కాల్ డ్రైవర్ ని పిలిపించుకుని ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న వాళ్ళ మూడో కుమారుడి లాల్ బహదూర్ ఇంటికి వెళ్లాను. హాయిగా పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే ఫోన్ మోగింది. అటు వైపు మా వలలి. రాత్రి వంట చేయడానికి వచ్చింది. అందుకని ఇంటి తాళం చెవి వాచ్ మన్ కి ఇచ్చి వచ్చాను. ‘అది ఇంటి తాళం కాదు, వేరే తాళం చెవి’ అంటూ ఒక భీకరమైన వార్త నా చెవిలో వేసింది. అసలు తాళం చెవి ఇంట్లో వుండిపోయింది. అది ఆటోమేటిక్ లాక్. రాత్రి ఎనిమిది గంటల సమయంలో మెకానిక్ దొరకడం అసాధ్యం. నా బుర్ర పని చేయలేదు. కానీ మా అన్నయ్య కోడలు, మా మేనకోడలు దీప బుర్ర చురుగ్గా పనిచేసింది. ఒక స్పేర్ కీ  నిషా మరొకరికి ఇచ్చి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చి, కటక్ ఫోన్ చేసి నిషాతో మాట్లాడి విషయం చెప్పింది. తొమ్మిదిన్నరకల్లా ఆ తాళం చెవి మళ్ళీ వాచ్ మన్ చేతికి అందేటట్టు ఏర్పాటు జరిగింది. ఈ కొత్త సమస్యకు పరిష్కారం ఎలా అనుకుంటున్న సమయంలో  సమస్య కాస్తా,  చిన్న పాటి ఇబ్బందిగా మారింది.

నిజానికి భావన చెప్పినట్టు ఇది సమస్య కాదు, ఇబ్బంది మాత్రమే!

కింది ఫోటో:

దీప, లాల్ ఇంట్లో నిలువెత్తు బాలాజీ విగ్రహం వద్ద  మా అన్నయ్య రామచంద్రరావు గారు, మేనల్లుడు రామచంద్రంతో నేను.




(ఇంకావుంది)

23, జులై 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో ( 200) : భండారు శ్రీనివాసరావు

 ప్రయాణంలో పదనిసలు

సుమారు ఏడు వారాల పాటు అమెరికాలో వుండిరావడం బాగానే వుంది కానీ సియాటిల్ నుంచి దోహా వరకు ఏకబిగిన పదిహేను గంటలు, కాళ్ళూ చేతులు కట్టిపడేసినట్టు కూర్చోవడం ఏదైతే వుందో అదొక్కటే నా బోటి వయసువాళ్ళకు, కొంచెం ఏమిటి బాగానే ఇబ్బంది. వై ఫై ఇవ్వడం వల్ల మొత్తం విమానంలోని వారందరూ గాఢనిద్రలో వున్నా నాకు కాలక్షేపానికి లోటులేకుండా పోయింది. 199 వ ఎపిసోడ్ ఫ్లయిట్ లోనే పూర్తి చేశాను. నిద్ర లేకుండా గడపడం అలవాటే కనుక ఆ ఇబ్బంది లేదు.
సియాటిల్ లో సెక్యూరిటీ లేడీ ఒకరు నన్ను ఆట పట్టించింది. నేను కూడా ఆమెలోని స్పాంటేనియస్ విట్టీని పూర్తిగా ఆస్వాదించాను.
సెక్యూరిటీ గేటులో పాద ముద్రలు వున్నచోట నిలబడమని చెప్పింది. నిలబడ్డాను. తల పైకి ఎత్తమంది. ఎత్తాను. మెడ అటూఇటూ వంచమంది. ఫేషియల్ రికగ్నిషన్ కోసం అనుకున్నాను. చేతులు రెండూ పైకి ఎత్తమని ఎలా చేయాలో తాను చేసి చూపించింది. అలాగే చేశాను. ఇక అప్పుడు మొదలైంది. కథాకళి, భరత నాట్యం, కూచిపూడి. తాను నడుం మీద చేతులు పెట్టుకుని ఒక పక్కకు, అలాగే మరో పక్కకు వంగింది. వెనక్కు, ముందుకు ఇలా ఎన్నో భంగిమలు. నవ్వుతూ తాను చేసి చూపించడం, ఏడవలేక నవ్వుతూ నేను చేస్తూ పోవడం ఇలా ఈ తంతు సాగింది. ఈలోగా మరో సెక్యూరిటీ మనిషి పెద్దగా నవ్వుకుంటూ, వచ్చి లోపలకు వచ్చేయమని నాకు సైగ చేశాడు. డ్యూటీలో స్ట్రెస్ తగ్గించుకోవడం అప్పుడప్పుడూ ఇలా చేయడం ఆమెకు అలవాటని అన్నాడు. ఆమె కూడా ‘సొ యు ఫినిషుడ్ యువర్ యోగా టుడే’ అంది నవ్వుతూ.
ఈ హడావిడిలో నా హాండ్ లగేజి వున్న ట్రే వచ్చింది. దాన్ని మరింత క్షుణ్ణంగా శోధించడం కోసం పక్కనబెట్టారు. తీరా చూస్తే అందులో మా కోడలు నాకోసం ప్యాక్ చేసిన పులిహోర, పెరుగు డబ్బాలు వాళ్ళ కంటపడ్డాయి. అదన్నమాట ఆపడానికి కారణం అని బోధపడింది. దానిమీద మా కోడలు ‘హోం మేడ్ ఫుడ్, ఆన్ డాక్టర్స్ అడ్వైస్’ అని రాసి పెట్టడంతో వాళ్ళు వాటర్ బాటిల్ ఒక్కటి డస్ట్ బిన్ లో పడేసి హ్యాపీ జర్నీ చెప్పి పొమ్మన్నారు.
అదో స్నానాల రేవులా వుంది.
ప్రతివాళ్లు తాము సెక్యూరిటీ ట్రేలల్లో వదిలేసిన లాప్ టాప్ లు, ప్యాంటు బెల్టులు, మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, పెన్నులు, ఉంగరాలు, పర్సులు, ఓవర్ కోట్లు వగైరా వగైరా కలెక్ట్ చేసుకునే హడావిడిలో వున్నారు. ఆడ ప్రయాణీకుల పరిస్థితితో పోలిస్తే కొంచెం నయమే అనిపించింది. ఈ క్రమంలో మా వాడు కొనిపెట్టిన బ్లాక్ డయల్ రిస్ట్ వాచీని ట్రేలో వదిలేశాను.
ఈ లోగా వీల్ చైర్ వాడు రావడంతో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని చైర్ లో కూర్చొన్నాను. ఒక మనిషి దర్జాగా కూచుంటే, మరో మనిషి నెట్టుకుంటూ వెళ్ళడం బాధ అనిపించింది. కానీ తప్పదు. వీల్ చైర్ సౌకర్యం వుంటే సెక్యూరిటీలో వెయిటింగ్ వుండదు. వెళ్ళాల్సిన గేటు దగ్గరకు సులభంగా చేరవచ్చు. ఇది కాక ఎయిర్ పోర్ట్ లో టెర్మినల్స్ నడుమ ప్రయాణీకులను చేర్చే షటిల్ ట్రైన్స్ లో ప్రయాణం, లిఫ్ట్ లు ఎక్కడం, దిగడం సులువు అవుతుంది. అందుకని పిల్లలు చేసిన ఈ ఏర్పాటు వల్ల సమయం బాగా కలిసి వచ్చింది. టైం వుండడం వల్ల భావన నాకోసం పడ్డ శ్రమకు న్యాయం చేస్తూ పులిహార తిని ఆ డబ్బాలు డస్ట్ బిన్ లో పడేసాను.
దోహాలో ఈ వీల్ చైర్ సౌకర్యం మరింత పకడ్బందీగా వుంది. సూట్లు, బూట్లు, టైలు కట్టుకుని ప్రత్యేక యూనిఫారాల్లో సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణీకులను చేరవేశారు. నిరుడు వచ్చినప్పుడు నాకు ఈ సదుపాయం వున్నా కూడా వాడుకోలేదు. నడక అలవాటు లేని బాపతు కనుక అంతంత దూరాలు నడవలేక చాలా ఇబ్బంది పడ్డాను.
ఈ ప్రయాణాల్లో పైకి కనపడని మరో ఇబ్బంది గడియారంలో సమయాలు ముందుకు వెనక్కీ మారిపోతుంటాయి. నా వాచీ కృష్ణార్పణం కనుక టైము గురించి తెలుసుకోవాలంటే మొబైల్ ఒక్కటే శరణ్యం. పగలో, రాత్రో ఏమీ అర్ధం కాదు. వాళ్ళు పెట్టేది లంచో డిన్నరో తెలియక భోజనానికి ముందు తర్వాత టాబ్ లెట్స్ వేసుకునేవాళ్ళు అయోమయంలో పడతారు. ఎదురుగా వున్న స్క్రీన్ మీద ఓహో ఇన్ని సముద్రాలు దాటుతున్నాము, ఇన్ని దేశాల మీదుగా ప్రయాణిస్తున్నాము అని సంతోషపడుతూ కాలం దొర్లించడమే.
విమానం ఎక్కి సీటు బెల్టు పెట్టుకోగానే చేసిన మొదటి పని సెల్ఫీ తీసుకోవడం. ఆ మధ్య ఏదో విమాన ప్రమాదం తర్వాత ఒకాయన, ఫేస్ బుక్ లోనే అనుకుంటా, ఉచిత సలహా ఇచ్చాడు, విమానం బయలుదేరే ముందే సెల్ఫీ తీసుకుంటే మీ జీవితంలో ఆఖరి ఫోటో మీ వారసులకు జ్ఞాపకంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందని. పది పన్నెండు తీసిన తర్వాత బోధ పడింది, అవి డి కంపోజుడ్ డెడ్ బాడీ లాగా వచ్చాయని. దాంతో వాటిని పోస్టు చేసే ప్రయత్నం మానుకున్నాను.
ఖతార్ ఎయిర్ లైన్స్ వాళ్ళు వైఫై ఇవ్వడం వల్ల, మిగతా వాళ్ళు సినిమాలు చూస్తుంటే, నేను రాసుకుంటూ కూర్చున్నాను. ఆరగా ఆరగా అడపాదడపా ఏదో తాగడానికి, తినడానికి ఇస్తూనే వున్నారు. కాసేపటి తర్వాత దాదాపు ప్రయాణీకులు అందరూ నిద్రలోకి జారుకున్నారు. లంకలో హనుమంతులవారు చూసిన రాక్షస స్త్రీల శయ్యామందిరం మాదిరిగా వుంది విమానం.
దోహా నుంచి హైదరాబాద్ కు అదే ఎయిర్ లైన్స్ విమానం. కానీ ఈసారి ప్రయాణంలో వైఫై లేదు. కారణం అడిగితే ఒక ఎయిర్ హోస్టెస్ నా సీటు పక్కన మోకాళ్ల మీద వంగి కూర్చుని చంటి పిల్లాడికి చెప్పినట్టు ఏదో చెప్పసాగింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి ఇట్స్ ఓకే అనేశాను. ఆమె చెప్పేదానికి, నేను అన్నదానికి పొంతన కుదరలేదేమో నావేపు విచిత్రంగా చూసి లేచి వెళ్ళిపోయింది. నేను తప్పనిసరై ఒకటి రెండు మలయాళం సినిమాలు, పేర్లు తెలియకపోయినా పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను.
తెల్లవారుఝాము అనాలో అర్ధరాత్రి అనాలో, ఉదయం రెండు గంటలకల్లా హైదరాబాదు వచ్చేసింది. విమానం రన్ వే మీద ఉండగానే నా మొబైల్ లో ఎయిర్ టెల్ నెట్ వర్క్ పలకరించింది. అమ్మయ్య అనుకుని, ఫార్మాలిటీస్ ముగించుకుని ఉబెర్ లో మూడు గంటలకల్లా ఎల్లారెడ్డి గూడాలోని మధుబన్ చేరుకున్నాను. ఎయిర్ పోర్ట్ లో కారు ఎక్కేముందే ఫోన్ చేశాను కనుక మా వాచ్ మన్ సమ్మయ్య గేటు తీశాడు. సామాను భద్రంగా లిఫ్ట్ దగ్గరపెట్టి ఉబెర్ డ్రైవర్ వెళ్ళిపోయాడు.
శుభం కార్డు పడింది అనుకునే లోగా భశుం అనే బాపుగారి కార్టూన్ కనిపించింది. అదీ ఎక్కడకు వెళ్ళలేని, తొలిపొద్దు కూడా పొడవని వేళలో.
ఇంటి తాళాలు సియాటిల్ లో మరచిపోయి ఇండియాకు వచ్చాను.
కింది ఫోటో:
బాపు గారి కార్టూన్ . వారికి వేనవేల కృతజ్ఞతలతో



(ఇంకావుంది)

22, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (199) : భండారు శ్రీనివాసరావు

 

(2025 జులై 19 వ తేదీన అమెరికా నుంచి దోహా మీదుగా ఖతార్ ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ కు ఆకాశంలో 32 వేల అడుగుల ఎత్తున, రాత్రో పగలో తెలియని అయోమయావస్థలో ప్రయాణిస్తూ...)

“ఎప్పుడు డిగ్రీ పూర్తి చేశారు”
ఆలిండియా సర్వీసు ఇంటర్వ్యూ లో నిజానికి ఇది ఎంత సింపుల్ ప్రశ్న!
మీ పేరేమిటి అని అడిగితే చప్పున జవాబు చెప్పగలంత సులభమైన ప్రశ్న.
కానీ చెప్పలేకపోయాను.
కారణం చెప్పాకదా! చదువుల్లో నా ట్రాక్ రికార్డు. క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. జూనియర్లు క్లాస్ మేట్స్ అయ్యారు. ఇక తేదీలు, సంవత్సరాలు ఎక్కడ గుర్తుంటాయి?
ఈ పరీక్షకు ఎం ఎస్ ఎం బండి లేదు. అదే ఫైనల్. ఆ ఫైనల్స్ లో సింపుల్ గా తప్పాను. నన్ను దాటుకుని నా వెనక వున్న నలుగురైదుగురు ముందుకు వెళ్ళారు. ఉద్యోగ విధులు ఒకటే అయినా, హోదాల్లో తేడా వచ్చింది. రిటైర్ మెంటు నాటికి పెన్షన్ లో ఇంకా పెద్ద తేడా వచ్చింది.
నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. ఉద్యోగంలో చేరినప్పుడు నా బేసిక్ 350. ఒక గుమాస్తా చేసిన చిన్న పొరబాటు వల్ల అది 325 అని పడింది. పాతిక రూపాయలకోసం మొదట్లోనే పేచీ ఎందుకు అని నేను పట్టించుకోలేదు. ప్రభుత్వ సర్వీసుకు కొత్త. బేసిక్ మీద ఆధార పడి ఇతర అలవెన్సులు పెరుగుతాయి అని తెలియదు. ఏడాది లోపలే పే కమిషన్ సిఫారసులు అమలుచేశారు. తేడా పాతిక నుంచి వందకు పెరిగింది. అలవెన్సుల్లో వ్యత్యాసం అదే దామాషాలో పెరిగి, జీత భత్యాల్లో తేడా వచ్చింది.
కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణారావు
నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”
వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ
పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.
తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఉద్యోగం మొదట్లో పాతిక రూపాయలు అనుకున్న తేడా చివరాఖరుకల్లా వేలల్లోకి పెరిగింది. దీనికి తోడు, ఉద్యోగపర్వంలో మరో కుదుపు. 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది. చాలా పెద్ద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.
కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు తీసుకుని గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారి మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.
తోక టపా: చివరాఖరుకు నేను దూరదర్సన్ లో న్యూస్ ఎడిటర్ గా రిటైర్ అయింది ఆ ఆలిండియా సర్వీసు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐ.ఐ.ఎస్.) అధికారిగానే.



(ఇంకావుంది)

19, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (198) : భండారు శ్రీనివాసరావు

 “మళ్ళీ తప్పాట్ట”

 

ఏటా పరీక్ష ఫలితాలు రాగానే మా చుట్టపక్కాలు అందరూ నా గురించి చెప్పుకునే మాట ఇదొక్కటే. పదో తరగతి నుంచి మొదలుపెట్టి డిగ్రీ వరకూ ఏ పరీక్ష కూడా ఎం ఎస్ ఎం (మార్చ్- సెప్టెంబర్-మార్చ్) బండి  ఎక్కకుండా, ఒకే తడవ  పాసయింది లేదు.

అదీ నా ట్రాక్ రికార్డ్.

బీ కాం ఫైనల్స్ లో మర్కంటైల్ లా అనే ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. అది గట్టెక్కడానికి రెండేళ్లు పట్టింది. ఒకసారి పరీక్షకు వెళ్ళే సమయంలోనే అలంకార్ ధియేటర్ లో ఏదో కొత్త పిక్చర్ ప్రీ వ్యూ. పరీక్ష పక్కనబెట్టి సినిమాకు వెళ్లాను. మరోసారి పరీక్ష రాయడానికి కాలేజీకి వెడితే అక్కడ ప్రిన్సిపాల్ గారికి, నేను జ్యోతి విలేకరిగా పరిచయం కనుక ఏమిటి ఇలా వచ్చారు అని తన రూముకు తీసుకు వెళ్ళారు. ఆయన తెప్పించిన కాఫీ తాగి ఏవో ముచ్చట్లు, చెప్పీ, వినీ పరీక్ష హాల్లోకి పోకుండానే ఇంటికి వెళ్లాను. నా నిర్వాకం తెలిసిన మనిషే కనుక మా ఆవిడ నిర్వేదంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.

మరోసారి పరీక్ష సమయానికి నా మేనల్లుళ్లు తుర్లపాటి సాంబశివరావు, కొలిపాక రాజేంద్ర ప్రసాద్ బెజవాడ వచ్చారు. వాళ్ళు  పట్టుబట్టి నన్ను వెంట బెట్టుకుని సిటీ బస్సులో కాలేజీకి తీసుకు వెళ్ళారు. అందులోనే భగవద్గీత చెప్పారు. 35 మార్కులు తెచ్చుకుంటే  చాలు.  రెండు మూడు ప్రశ్నలకు సరిగా జవాబు రాస్తే పాసవుతావు, అంటూ  కొన్ని గెస్  ప్రశ్నలకు నాచేత జవాబులు చెప్పించారు. ఇవే ప్రశ్నలు వస్తే రాయి, లేకపోతే మరో మారు చూద్దాం అన్నారు. అదృష్టం! అవే వచ్చాయి. ఇంట్లో కాకుండా బస్సులో చెప్పబట్టి జవాబులు మెదడులో పచ్చిగానే వున్నాయి కనుక చకచకా రాసేశాను. నేను బయటకు వచ్చేదాకా వాళ్ళు బయటే వున్నారు. పేరయ్య హోటల్లో గడ్డ పెరుగుతో భోజనం చేసి, విజయా టాకీసులో సినిమా చూశాము.

చిత్రం! 35 అంటే 35 మార్కులతో పాసయి, డిగ్రీ అర్హత సాధించాను.

ఈ నేపధ్యంలో మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు  పత్రికలో పడిన చిన్న ప్రకటన కాపీ నా చేతికి ఇచ్చారు. ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రంలో   అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగం. డిగ్రీతోపాటు  ఏదైనా పత్రికలో అనుభవం. తెలుగు భాషపై పట్టు. తెల్ల కాగితం మీద ధరకాస్తు నెలాఖరులోగా  పంపాలి. అంటే ఇంకా వారం రోజులే వ్యవధి.

మళ్ళీ అంతర్మధనం. బెజవాడతో పోలిస్తే హైదరాబాదులో జీవన వ్యయం ఎక్కువ. పెరిగే జీతానికి దానికి సరిపోతుంది. ధరకాస్తు రాశాకాని పోస్టులో వేయలేదు. ఇంకా రెండు రోజులే గడువు.

మా అన్నయ్య అడిగాడు. పంపాను అని బొంకాను. దాన్ని నిజం చేయడానికి గవర్నర్ పేట పోస్ట్ ఆఫీసుకు వెళ్లి జేబులోనే వున్నఅప్లికేషన్ ను ఓ కవరు కొని పోస్ట్ చేశాను. ఒక రోజులో అది చేరుతుంది అనే నమ్మకం నాకు లేదు.

కొన్ని నెలల తర్వాత ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది.

వెళ్లాను.

విశ్వనాధ రామాయణ కల్పవృక్షం గురించి, రంగనాయకమ్మ విషవృక్షం గురించీ అడిగారు. తెలుగులో జవాబు చెప్పమన్నారు. నేను రెచ్చిపోయి ఇరవై నిమిషాలు నాకు నోటికి వచ్చింది, అప్పటికి తోచింది గడగడా చెప్పేశాను. సరి, ఇక వెళ్ళు అన్నారు మరో ప్రశ్న అడగకుండా. ఇదేమి ఇంటర్వ్యూ అనుకుంటూ బస్సెక్కి బెజవాడ వచ్చి మళ్ళీ ఆంధ్రజ్యోతిలో నా విధుల్లో పడిపోయాను. నెలలు గడుస్తున్నా రేడియో నుంచి ఏ కబురూ   లేదు. కనుక్కుని చెప్పే మనుషులు లేరు.

కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ‘నిన్ను సెలక్ట్ చేసుకున్నాం, వచ్చి చేరు’ అనే వర్తమానం వచ్చింది.

ఎప్పుడు వెళ్ళాలి అనేది అందులోనే వుంది. ఎలా వెళ్ళాలి అనే ప్రశ్నకే జవాబు లేదు. కానీ మా ఆవిడ వద్ద రెడీగా వుంది, బంగారు గాజుల రూపంలో. అవి బయటకు వెళ్ళిపోయాయి. మేము హైదరాబాదు చేరుకున్నాము.

కింది ఫోటో:




హైదరాబాదు వచ్చిన కొత్తలో ఇందిరాపార్కులో

(Photo Courtesy Shri G.S. Radhakrishna, Then Hyderabad Correspondent for WEEK Magazine)

(ఇంకా వుంది)