25, నవంబర్ 2018, ఆదివారం

సీట్ల కేటాయింపులో ‘వెనుకబడిన’ తరగతులు – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON 25-11-2018, SUNDAY)
నేను ఈ తరగతులకు చెందినవాడిని కాను. కానీ ఈ మాట చెప్పడానికి నేను వెనుకంజ వేయడం లేదు.
ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వెనుకబడిన తరగతులకు పూర్తి న్యాయంచేసిన దాఖలా కనబడడం లేదు. ఎన్నికలకు ముందు ప్రతిసారీ ప్రముఖంగా వినబడే ‘వెనుకబడిన తరగతులు’ అనే పదం ఎన్నికలు కాగానే మరపున పడడం కొత్త విషయం ఏమీ కాదు. రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ‘గెలుపు గుర్రాలు’ అనే ఓ కొత్త పదం ఈ పాత పదాన్ని మరింత వెనక్కి నెట్టింది.
ఈ రోజుల్లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నీటి వాలుకు, గాలి వాటానికి అనుగుణంగానే పడవ నడపడం ఒక విధానంగా మలచుకున్నారు. నాయకులు ఈ విషయం బయటకి చెప్పుకోవడానికి కూడా భేషజం ప్రదర్శించడం లేదు. పైపెచ్చు ‘మాది రాజకీయ పార్టీ, సత్రాలు, మఠాలు కావు’ అని బాహాటంగానే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
మారిన పరిస్తితులకు అనుగుణంగా పార్టీలు కూడా ఎంతోకొంత సర్దుబాట్లు చేసుకోవడం అనేది కొత్తేమీ కాదు. ఏం చేసినా, ఏం చెప్పినా చిట్టచివరకు  గెలుపు ఒక్కటే పరమావధి అయినప్పుడు, ఆ విజయానికి, తద్వారా లభించే అధికారానికి దూరమై భారంగా గడపడం కంటే ఏదో ఒకటి చేసి నెగ్గడం అనేది ముఖ్యమైపోయింది. సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలనే అన్ని పార్టీలకు వుంటుంది. అలా చేయాలంటే ముందు అధికార పీఠం అధిరోహించాలి కదా!
ఇదిగో! ఈ మిషతోనే అన్ని  పార్టీలవాళ్ళు ఎన్నికల్లో  టిక్కెట్లు ఇచ్చే విషయంలో ‘గెలవగలిగిన సత్తా’ ఒక్కటే ప్రధాన అర్హతగా ఎంచుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. అంచేతే, సంఖ్యాబలం కలిగివున్న ‘వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఇతర బలహీనవర్గాల వాళ్ళు’ ఎన్నికల పరుగు పందెంలో వెనుకబడిపోతున్నారు.  ఎస్సీ, ఎస్టీలకురాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల పుణ్యమా అని వారి వాటా వారికి ఇవ్వక తప్పని పరిస్తితి. హక్కుగా ఆ అర్హత లేని వెనుకబడిన తరగతుల వాళ్ళు నోరు విప్పలేని పరిస్తితి. అలా అని రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులకు అసలు సీట్లు ఇవ్వకుండా మొహం చాటేయడం లేదు. సరైన అభ్యర్ధులు దొరకని చోట్లా, కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకున్న బీసీ అభ్యర్ధులు లభించిన చోట్లా ఖాళీలను పూరించినట్టు భర్తీ చేస్తూనే వున్నారు. ఆ పని చేసి మేము ఇతరులకంటే బీసీలకు ఈ విషయంలో ఎక్కువ న్యాయం చేస్తున్నామని ప్రకటించుకుంటున్నారు.
వచ్చే నెలలో తెలంగాణా నూతన రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ తంతు పూర్తయింది. రాష్ట్రంలోని నూట పందొమ్మిది స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్ధులు ఎక్కడ పోటీ చేస్తున్నారనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది.
స్థూలంగా జాబితాలను పరికించినవారికి మళ్ళీ ఈఎన్నికల్లో కూడా అగ్రవర్ణాలకు అగ్రతాంబూలమే ఇచ్చినట్టు కనబడుతోంది. వారికి ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. బీసీలకి ఈసారయినా జరగాల్సిన న్యాయం జరిగిందా లేదా అనేదే ప్రశ్న. జరగలేదని చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు.
ముందు పాలక పక్షం టీఆర్ఎస్ ని తీసుకుంటే ఆ పార్టీ ఎవ్వరితో పొత్తు లేకుండా మొత్తం నూట పందొమ్మిది స్థానాల్లో పోటీపడుతోంది. అందులో 26 బీసీలకు కేటాయించింది. కేంద్రంలో పాలక పక్షం అయిన బీజేపీ, మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తూ వాటిల్లో 32 స్థానాలు బీసీలకు ఇచ్చింది.  మహాకూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన 99  సీట్లకుగాను, కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో బీసీ  అభ్యర్ధులను నిలబెట్టింది. 13 సీట్లు లభించిన తెలుగుదేశం పార్టీ మూడింటిని బీసీలకు వదిలింది. కాగా,  టీజేఎస్ తనకు దక్కిన  8 సీట్లలో రెండు సీట్లలో బీసీ అభ్యర్ధులను ప్రకటించింది.  మహాకూటమిలో మరో భాగస్వామి అయిన సీపీఐకి బీసీల విషయంలో గడ్డు పరీక్ష ఎదురయింది. తన భాగానికి వచ్చిన మూడు సీట్లలో రెండు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కిందకు పోయాయి. మిగిలింది ఒక్క జనరల్ సీటు. ఈ ఎన్నికల్లో తలపడుతున్న తమ పార్టీ రాష్ట్ర నాయకుడికి ఆ సీటు ఇవ్వక తప్పని పరిస్తితి. అదే చేసింది.
పొతే,  మరోకూటమి బీఎల్ఎఫ్ 109 స్థానాల్లో పోటీచేస్తూ ఏకంగా 58 సీట్లలో  బీసీ అభ్యర్ధులను నిలబెట్టింది. ఈ కూటమి బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించిన మాట వాస్తవమే.  వారు గెలిచి శాసన సభలో అడుగు పెట్టగలిగితే చట్ట సభలో వెనుకబడిన తరగతుల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది.
ఇక అగ్రవర్ణాలకు పెద్ద పీట వేసిన పార్టీల్లో టీఆర్ఎస్ 59 సీట్లతో అగ్రస్థానంలో వుండగా, 50 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 41 సీట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో వుంది. టీడీపీ తనకు దక్కిన 13 సీట్లలో ఏడింటిని అగ్రవర్ణాలకే కట్టబెట్టింది. బీఎల్ ఎఫ్ కూటమి తాను పోటీ చేసే 109 స్థానాల్లో  51 సీట్లని అగ్రవర్ణాలకి కేటాయించింది. మిగిలిన పార్టీలు పోటీ చేసే స్థానాలే రెండంకెల సంఖ్య దాటే పరిస్తితిలేదు కనుక వాటిని పరిగణనలోకి తీసుకోనవసరం లేదు.     
ఆర్ధిక, సామాజిక కోణంలోనే కాదు మొత్తం మానవ సమాజంలో మానసికంగా బలవంతులయినప్పటికీ, శారీరకంగా బలహీన వర్గం అయిన మహిళలకు ఈసారి కూడా  ఆయా పార్టీలు పెద్దగా ప్రాతినిధ్యం కల్పించిన దాఖలా కనబడడం లేదు. అన్ని పార్టీలు కలిసి ఆడవారికి ఇచ్చిన సీట్లు 43 అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 11, టీడీపీ 1, టీజేఎస్ 1, సీపీఐ 1, బీజేపీ 15, బీఎల్ఎఫ్ 10 స్థానాలు స్త్రీలకు కేటాయించాయి. ఆకాశంలో సగం అనే నినాదాన్ని  ప్రకటనలకే సరిపుచ్చినట్టయింది.
అన్ని పార్టీలకి సీట్ల లెక్కలు తేలాయి. తిరుగుబాటు అభ్యర్ధుల బెడదను లాలించో, బుజ్జగించో చాలావరకు తగ్గించుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 1825 మంది బరిలో మిగిలారు. వీరిలో అధికులు ఇండిపెండెంటు అభ్యర్ధులు.
చూస్తుండగానే పోలింగు ఘడియ దగ్గర పడుతోంది. ప్రచారానికి మిగిలిన వ్యవధి కూడా  కొద్ది రోజుల్లోకి వచ్చింది.
అందరికంటే ముందుగా అభ్యర్ధులను ప్రకటించిన అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. కేసీఆర్ బహిరంగ సభలతో, కేటీఆర్ రోడ్డు షోలతో బిజీగావున్నారు. టిక్కెట్టు విషయంలో భరోసా కలిగిన మహాకూటమి నాయకులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర లేపారు.
యూపీయే చైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి గత శుక్రవారం నాడు  మేడ్చల్ లో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో ప్రసంగించి తమ ఉపన్యాసాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహాకూటమిలో తొలుత  సీట్ల సర్దుబాట్ల విషయంలో బయల్పడిన అనేక కీచులాటల కారణంగా ఒకింత మసకబారిన కూటమి నిబద్ధత నేపధ్యంలో, మేడ్చల్ సభ ఒక ఎనర్జీ టానిక్ లా కూటమి నేతలకు ఊరట కలిగించివుంటుంది. దుమ్ము రేగినప్పుడు దానిని అణచడానికి నీళ్ళతో కళ్ళాపి చల్లినట్టు ఈ మహాసభ, మహా  కూటమిలో ఏర్పడ్డ లుకలుకలను ఒక మేరకు కమ్మేసింది. సోనియా గాంధి చేసిన క్లుప్త ప్రసంగం హుందాగా సాగింది. తెలంగాణా తానే ఇచ్చినట్టు గొప్పలకు పోకుండా ఆ ఖ్యాతిని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఖాతాలోకి జమచేస్తూ అటు హుందాతనాన్ని, ఇటు రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించడం ఆమె ప్రసంగంలో ప్రత్యేక ఆకర్షణ. నిజానికి తెలంగాణ రాష్ట్రము ఇచ్చే విషయంలో నాడు జరిగిన అనేక మంతనాల్లో రాహుల్ గాంధి కీలక పాత్ర ఏమీ లేదన్న విషయం తెలిసి కూడా పార్టీ పగ్గాలు మోస్తున్నది రాహుల్ కాబట్టి సోనియా ఆయన పేరును  ఈ సందర్భంలో ప్రస్తావించడానికి కారణం అయివుంటుంది. తన అత్తగారయిన ఇందిరా గాంధి మాదిరిగానే, ‘తల్లి’ సెంటుమెంటు అస్త్రాన్ని సోనియా ఈ సభలో ప్రయోగించారు.’ తెలంగాణా నా బిడ్డ, కొత్త రాష్ట్రంలో తమ బంగారు భవిష్యత్తు పట్ల ప్రజలు పెంచుకున్నఆకాంక్షలను నెరవేరుస్తామని చెబుతూనే, ఇక్కడి పరిస్తితులను చూసి తల్లిగా తాను తల్లడిల్లి పోతున్నానని చెప్పడం సెంటిమెంటు వ్యూహంలో భాగమే అని పరిశీలకులు భావిస్తున్నారు.  తెలంగాణా గడ్డపై జరిగిన సభలో ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని ప్రకటించడం వెనుక  రాజకీయ వ్యూహం దాగుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యేకించి మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా రానున్న లోక సభ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటు ప్రయత్నాలను మెరుగుపరచడానికి బహుశా ఈ ప్రస్తావన చేసి ఉండవచ్చు. తెలంగాణా ఎన్నికల ఫలితాల ప్రభావం అటు సార్వత్రిక ఎన్నికల మీదా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీదా పడే అవకాశం ఉన్న రీత్యా ఈ ముందు  జాగ్రత్త ప్రకటన  చేయడానికి కారణం కావచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఇచ్చిన హామీకి మరింత ఊతం కల్పిస్తూ యూపీఏ అధినేత్రి సోనియా ఈ మాటలు చెప్పడం వల్ల రానున్న  ఏపీ ఎన్నికల్లో తమ పార్టీకి లాభించే వీలుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావించి ఉండవచ్చు. అయితే తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఈ ప్రస్తావన తేవడం టీకాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడడం కష్టమే. సోనియా ప్రకటనపై ఇప్పటికే సోషల్ మీడియాలో తెలంగాణా వాదులు నిరసన వ్యక్తం చేయడం మొదలయింది కూడా.
ఇక అసలు విషయానికి వస్తే,  కాంగ్రెస్ అధినాయకులు చాలామంది హస్తిన నుంచి తరలి వచ్చి హైదరాబాదులోనే మకాం పెట్టారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబునాయుడు ఈనెల 28, 29 తేదీల్లో ఖమ్మం, మహబూబ్ నగర్ లలో నిర్వహించే రోడ్డు షోలలో పాల్గొంటారని మీడియా వార్తలు తెలుపుతున్నాయి.
పొతే, తెలంగాణాలో ఎన్నికల సమరానికి పార్టీలన్నీ సమాయత్తం అయ్యాయి. దేశంలో ఇరవైతొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణా గడ్డపై మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఓటర్లు స్వేచ్చగా  ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని పార్టీలు సహకరిస్తే రాజ్యాంగ బద్దమైన విద్యుక్త ధర్మాన్ని  పాటించిన గౌరవం వాటికి దక్కుతుంది.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మరొక రొటీన్ సుత్తి వ్యాసం. అసలు కుల ఆధారిత రిజర్వేషన్లే ఈ దేశానికి పట్టిన దరిద్రం.

అజ్ఞాత చెప్పారు...

జెడి పెట్టబోయే ఫాల్తూ పార్టీ అవసరమా. అతనికి జేపీకి అయ్యిన అనుభవం తప్పదు. ఆనక లబోదిబో లబ్జనకరి.

అజ్ఞాత చెప్పారు...

రాజకీయాల్లో ఉండాలన్నా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డబ్బులు కావాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి మరియు డబ్బులన్నీ 4 కులాల(కమ్మ, రెడ్డి, రాజు , కాపు) దగ్గర ఉన్నాయి. వేరే వాళ్ళని దగ్గరికి రానివ్వరు.
కాస్త ఎంగిలి మెతుకులు(పంచాయతీ బోర్డు మెంబెర్, వార్డ్ మెంబెర్ లాంటివి ) వేసి BC, SC, ST ల నోరు మూస్తారు. ఆ పైన పోస్టులు, కాంట్రాక్టులు, ఎప్పుడు పెద్ద కులాల దగ్గరే ఉంటాయి.

BC, SC, ST ల వాళ్ళు చేయగలిగేది ఒక్కటే. బాగా చదువు కోండి . అవసరమైతే రిజర్వేషన్స్ ఉపయోగించుకోండి . చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా , PG, PHD, Civil Services etc. టార్గెట్ చెయ్యండి. మీ తోటి వాళ్ళ పిల్లల్ని చదివించటం లో సాయం చేయండి. మిమ్మల్ని మీరే బాగు పరుచుకోగలరు. ఈ అగ్రకులాల్ని నమ్మటం మానేయండి.

Jai Gottimukkala చెప్పారు...

మీరు చూపించిన బీసీ టికెట్ల లెక్కలలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇది ఉద్దేశ్యపూర్వకం కాకపోవొచ్చు కానీ ఎవరో రాసిచ్చిన లెక్కను సొంతంగా ధృవీకరించాలి కదా.

మీ అప్రోచులో ఇంకో సీరియస్ సమస్య గమనించారో లేదో? "స్నేహపూరిత పోటీల" వలన యూపీఏ పోటీ చేసే సీట్ల సంఖ్య కలిపితే 119 మించుతుంది. ఉ. తెజసకు కేటాయించిన దుబ్బాకలో వారు ఒక సాధారణ బడుగు వర్గ కార్యకర్తుకు టికెటిస్తే కాంగ్రెస్ తన బీ-ఫారం అగ్రవర్ణ పారాషూట్ ఆసామీకి ఇచ్చింది. అదే రకంగా రెండు ట్రైబల్ సీట్లలో ఇరు పార్టీలు అభ్యర్తములను నిలబెట్టాయి. ఇవి కృత్రిమంగా "బడుగు పక్షపాతం" లెక్కలు పెంచే చర్యలు: కాదంటారా?

Jai Gottimukkala చెప్పారు...

ఇంకో ఉదాహరణ చూద్దాం:

"కేంద్రంలో పాలక పక్షం అయిన బీజేపీ, మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తూ వాటిల్లో 32 స్థానాలు బీసీలకు ఇచ్చింది"

"అగ్రవర్ణాలకు పెద్ద పీట వేసిన పార్టీల్లో టీఆర్ఎస్ 59 సీట్లతో అగ్రస్థానంలో వుండగా, 50 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 41 సీట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో వుంది"

ఇకపోతే రిజర్వుడు సీట్లు 31 కాగా బీజీపీ నుండి ఇద్దరు ముస్లిములు పోటీకి దిగారు.

వాదన కోసం మీరిచ్చిన లెక్క కరెక్టనుకున్నా కూడా బీజీపీ: 32 + 50 + 31 + 2= 115.

119 ("అన్ని స్థానాలకు")-115 (పైన తేలిన లెక్క) = 4

??