11, నవంబర్ 2018, ఆదివారం

Telangana Congress's strategy worrying TRS | Telangana Elections | Journ...మహా ప్రయోగం – భండారు శ్రీనివాసరావు
పోటాపోటీ కాటాకుస్తీ మీడియా యుగం
నడుస్తున్న ఈ కాలంలో ఏదైనా టీవీ ఛానల్ కొత్త ప్రయోగానికి పూనుకోవడం నిజంగా సాహసమే.
మహా టీవీ ఎండీ శ్రీ వంశీ,
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి ఈ ప్రయోగానికి పూనుకోవడానికి ముందే నేను
హితవచనం మాదిరిగా చెప్పాను, ఇదొక సాహసమే అవుతుందని.
వారాంతంలో ఆదివారం నాడు ఏకధాటిగా మూడు
గంటల పాటు గడచినా వారపు ప్రధాన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం లేకుండా
కేవలం ఏడెనిమిదిమంది జర్నలిస్టులను కూర్చోబెట్టుకుని చర్చా గోష్టిని నిర్వహించడం
మామూలు విషయం కాదు. జర్నలిస్టులు చెప్పే ప్రవచనాలు, హితవచనాలు ‘రేటింగులు’
రాల్చవు. అయినా సరే ఈ జంట మొండికేసి ముందుకే సాగారు. వారికి మహా టీవీ ప్రయోక్త
అజిత జత కలిశారు.
ఈ త్రయం జయప్రదంగా గత ఆదివారం
మహాటీవీలో ప్రారంభించిన ‘జర్నలిస్ట్ టైం’ తొలి కార్యక్రమంలో నేను కూడా
పాల్గొన్నాను. ద్వితీయ విఘ్నం కాకుండా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రసారం
చేశారు. నాతో పాటు సీనియర్ జర్నలిస్టులు ఎస్. వీరయ్య, కే. వేణుగోపాల్, పటకమూరు
ప్రసాద్, రహమాన్, శ్రీధర్ ధర్మాసనం, షేక్ హసీనా పాల్గొన్నారు.
ఈనాటి మీడియా నిజాయితీగా వార్తలు
ఇవ్వగలుగుతున్నదా అనేది యాదృచ్చికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.  
ఈ సందర్భంగా ఓ చిన్న జ్ఞాపకం.
ఓ పదేళ్ళ నాడు మీడియాలో పెడ ధోరణులపై
ఒక వ్యాసం రాసి ఒక పత్రికకు పంపాను. మీడియాపై విమర్శనాత్మక వ్యాసాన్ని సాటి మీడియా
సంస్థగా ప్రచురించడం సాధ్యం కాదని ఆ పత్రిక సంపాదకుడు చెప్పారు.
ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందీ అంటే
ఈరోజు మహా టీవీ చర్చాకార్యక్రమంలో ప్రధానంగా అందరం స్వేచ్చగా చర్చించిన విషయం ఇదే.
నిజంగా సాహసం చేస్తున్నారని అనిపించిన
మాట వాస్తవం.
సంపాదక వర్గం ఇదే విధానం కొనసాగిస్తే
రేటింగుల విషయం చెప్పలేను కాని  ఛానల్ పట్ల
వీక్షకుల్లో  విశ్వసనీయత పెరుగుతుందని
మాత్రం  ఘంటాపధంగా చెప్పగలను.             

కామెంట్‌లు లేవు: