22, ఆగస్టు 2015, శనివారం

ప్రైవేటు స్కూళ్ళు – సర్కారీ బళ్ళు

(Published in 'SURYA' telugu daily on 23-08-2015, SUNDAY)

పతాక శీర్షికలకు ఎక్కే సంచలన వార్తలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఏనాడూ కొదవ లేదు. కారణం తెలియదు కాని ప్రజానీకానికి సంబంధించి, అదీ సర్కారు స్కూళ్ళకు సంబంధించి అలహాబాదు హైకోర్టు గత మంగళ వారం వెలువరించిన ఒక తీర్పు తెలుగు పాఠకులకు చేరాల్సిన విధంగా చేరలేదేమో అనిపిస్తోంది. సర్కారు పాఠశాలల దుస్తితి గురించి తెలుగు పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కధనాలు వెలువడుతున్న సమయంలోనే ఈ తీర్పు రావడం కాకతాళీయం  కూడా కావచ్చు.
ప్రజల నుంచి పన్నుల  రూపంలో వసూలు చేసే ధనం నుంచి,  నెల నెలా జీతాలు తీసుకుంటున్న వాళ్ళెవ్వరయినా సరే  వాళ్ళు  తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేర్పించి తీరాలన్నది  అలహాబాదు హైకోర్టు తీర్పు సారాంశం. అంటే ఎన్నికయిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, చివరాఖరికి న్యాయ స్థానాల్లో పనిచేసే సిబ్బందితో సహా అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల ఆ విద్యా సంస్థల స్తితిగతులు మెరుగుపడవచ్చన్నది ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ఉద్దేశ్యం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో, మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఎక్కడో కొడితే మరెక్కడో తగిలినట్టు కోర్టు గడప తొక్కిన కారణం ఏదైనా, న్యాయమూర్తి  మాత్రం సర్కారు బళ్ళకు ప్రాణం పోసే సంజీవని మూలిక లాంటి తీర్పు ఇచ్చిన మాట వాస్తవం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వుందనీ,  మొత్తం మీద లెక్కలు తీస్తే దాదాపు మూడు లక్షల మంది టీచర్లు తక్కువగా వున్నారనీ ఈ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన వివరాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్తితి కొంత భిన్నం. టీచర్లకు ఎంతో కొంత కొరత వుండి వుండవచ్చు కానీ ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించే తలితండ్రుల సంఖ్య మాత్రం నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తగ్గిపోతూవస్తోంది.  ‘చదువొక్కటే పిల్లలకు తామిచ్చే ఆస్తి’ అన్న స్పృహ వారిలో పెరగడం వల్ల కావచ్చు, లేదా చదువుకోక పోవడం వల్లనే తామిలా కూలీ నాలీ చేసుకుంటూ బతకాల్సివస్తోందని, ఈ దుస్తితి తమ పిల్లలకు పట్టకూడదన్న ముందు చూపు కావచ్చు  బీదా బిక్కీ కూడా తమ పిల్లల్ని సర్కారు బళ్ళకు కాకుండా కాస్త డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా, కాన్వెంటు స్కూళ్ళకు పంపాలనే ధ్యాస పెంచుకుంటున్నారు. సరే! ఇక కలిగిన వాళ్ళు సరేసరి. వారు చూస్తూ చూస్తూ ఎటువంటి పరిస్తితిలో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించరు. ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు కూడా తమ పిల్లల్ని ఆ సూళ్ళల్లో చదివించడానికి ఇష్టపడరు. ప్రజల్లో వస్తున్న ఈ మార్పుతో, అసలే  చిన్నచూపుతో కునారిల్లుతున్న సర్కారు బళ్ళు,   చదివించే టీచర్లు వున్నా చదువుకునే విద్యార్ధులు లేక క్రమంగా తమ  అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. నెలకు రెండువందల నుంచి రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలు దేశంలో లెక్కకు మిక్కిలి వెలుస్తున్నాయంటే, విద్య అనేది ఏ స్థాయిలో అంగడి సరుకుగా మారిపోయిందన్న నగ్న సత్యం ఇట్టే బోధపడుతుంది.
అలా అని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పూజ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పటికీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి  ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు,  కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో వున్నాయి. అయినా ప్రభుత్వ బళ్ళు అనగానే ప్రజల్లో ఒకరకమైన చిన్నచూపు నానాటికీ పెద్దది అవుతోంది కాని తగ్గడం లేదు.
విద్యారంగం పూర్తిగా వాణిజ్య పోకడలు సంతరించుకుంటోంది కాబట్టి అలహాబాదు హైకోర్టు తీర్పు అమలు అవుతుందన్న ఆశలు పెట్టుకోనక్కర లేదు. ఎందుకంటె దాన్ని పై కోర్టులో సవాలు చేయడానికి విద్యా సంస్థల వాళ్ళు ఎలాగు సిద్ధంగానే వుంటారు. కాకపొతే ఆ తీర్పు సర్కారు బళ్ళకు పూర్వ వైభవం కోరుకునే వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే విద్యాసంస్థల దుస్తితికి కూడా  ఆ తీర్పు అద్దం పడుతోంది. ‘ఎందుకు సర్కారు బళ్ళు ఇలాటి దుస్తితిని ఎదుర్కుంటున్నాయి’ అన్న ప్రశ్నను మనముందు వుంచుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపితీరాలన్న నిబంధన విధించడం ద్వారా ఆ న్యాయమూర్తి, ఈ ప్రశ్నకు సరయిన జవాబు కూడా ఇచ్చినట్టయింది. ‘సర్కారు పాఠశాలలు సరిగా నడవడం లేదు. ఎందుకంటె వాటిని నడుపుతున్నది ఎవరి పిల్లలకోసమో కాని,  తమ పిల్లలకోసం అయితే కాదు’ అన్నదే ఆ సమాధానం.
పవిత్రమైన విద్యాబోధనను డబ్బు సంపాదనకు అతి  సులభ మార్గంగా ఎంచుకున్న మార్కెట్ శక్తులు ఈ తీర్పు అమలుకాకుండా తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ, అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి తీర్పులోని స్పూర్తిని అంత సులభంగా ప్రజల మనసుల్లో నుంచి తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులని మనందరం ఘనంగా చెప్పుకునే ఈనాటి బాలబాలికల చదువుసంధ్యల పట్ల పాలకులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న దుర్మార్గపు  విధానాలను ఈనాడు కాకున్నా ఏదోఒక రోజు ప్రజలు ఎండగట్టే రోజు రాకమానదు. (22-08-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 9849130595

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు పని మీద ఎగరాల్సివస్తే ఎయిర్ ఇండియాలోనే ప్రయాణం చెయ్యాలనే నిబంధన ఉన్నట్లే ఇది కూడానూ అనుకోవచ్చు. జరిగితే బాగానే ఉంటుంది, కాని మన బలవంతులయిన బడా విద్యావ్యాపారవేత్తలు ఎలాగూ దీన్ని అమలు చెయ్యనివ్వరు. కానీ కోర్ట్ వారి ఆదేశాల్లో ప్రభుత్వ స్కూళ్ళు బాగు పడాలనే తపన కనిపిస్తోంది. పళ్ళని రసాయనాలు వాడి ముగ్గించరాదని కోర్ట్ చెప్పినట్లే, దీని విషయంలో కూడా ఏమన్నా చైతన్యం వస్తుందని ఆశిద్దాం.