22, సెప్టెంబర్ 2014, సోమవారం

హే కృష్ణా.......!


(Published by 'SURYA' telugu daily dated 24 -09-2014, Wednesday)
ఒక సందర్భాన్ని మననం చేసుకుందాం. మరో సన్నివేశాన్ని వూహించుకుందాం.



కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం. దుశ్శాసనుడు పాంచాలి వలువలు లాగి అవమానించే సందర్భంలో సభ యావత్తు మౌనంగా మిన్నకుండి పోతుంది. దృపదరాజ పుత్రి వేడుకోలు వినిపించుకున్న శ్రీ కృష్ణ పరమాత్మ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆదుకుంటాడు.
ఇక సినిమాల్లో ఇలా హీరోలు వచ్చి ఆపదలో వున్న హీరోయిన్లను అలా ఆదుకునే సన్నివేశాలు కోకొల్లలు. వీటి ఆధారంగా ఊహించుకుంటే-
నగరంలో ఏదో ఒక కాలేజీలో ఆడపిల్లల్ని ఆకతాయి పిల్లలు వేధిస్తుంటారు. వారిలో ఒకమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు  మొబైల్ ఫోను ద్వారా  సమాచారం అందిస్తుంది.  నిమిషాల్లో పోలీసులు అక్కడ వాలిపోతారు. యువతుల్ని వేధిస్తున్న అల్లరి పిల్లలపై రబ్బరు లాఠీలు ఝలిపిస్తారు. వెడుతూ వెడుతూ 'పోలీసులున్నారు జాగ్రత్త!' అంటూ హెచ్చరిక జారీచేసి వెడతారు.
ఇలా చేస్తే  కాని నగరంలో ఆకతాయి మూకల్ని అరికట్టడం సాధ్యం కాదన్న వూహ మెదిలినట్టుంది  సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మస్తిష్కంలో. రాజు తలచుకుంటే కొదవేముంది. కమిటీ వేసారు. ఆ కమిటీ సభ్యులు కాలయాపన చేయకుండా  నానారకాలుగా సమాచారాన్ని సేకరించి  ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. ఈ కమిటీలో నలుగురు సీనియర్ ఐ.ఏ.యస్., ముగ్గురు ఐ.పీ.యస్.  అధికారులు వున్నారు. ఈ ఏడుగురిలో  ఆరుగురు మహిళా అధికారులే కావడం ఒక విశేషం.   ఈ  నెల పదో తేదీనుంచి కమిటీ తన పని మొదలుపెట్టింది.  ఇరవయ్యో తేదీకల్లా  ముఖ్యమంత్రికి నివేదిక అందచేసింది. ఈ మధ్యలో  కమిటీ హైదరాబాదు  ఐ టీ కారిడారులో వున్న వివిధ కంప్యూటర్ కంపెనీల్లో పనిచేస్తున్న  మహిళా ఉద్యోగులను కలుసుకుంది. స్వచ్చంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంది. స్వయం సహాయక బృందాల సభ్యులతో  సమావేశాలు జరిపింది. మహిళా కళాశాలలకు వెళ్లి విద్యార్ధినుల మనోభావాలు తెలుసుకుంది. ఉద్యోగాలు గట్రా చేయకుండా ఇంటిపట్టున వుండే గృహిణులను సయితం కలుసుకుంది. మీడియా ప్రతినిధులతో, మహిళా జర్నలిష్టులతో ముచ్చటించింది. ఇక ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశాలు సరేసరి. అంతే కాకుండా గుజరాత్, కేరళ రాష్ట్రాలకు బృందాలను పంపి  ఈ విషయంలో అక్కడ మంచి ఫలితాలను ఇస్తున్న విధానాలను  అధ్యయనం చేసింది.
ఈ సమావేశాల్లో, ఈ సమాలోచనల్లో, ఈ సంప్రదింపుల్లో, ఈ అభిప్రాయ  సేకరణ క్రమంలో  బాలికలు, మహిళల భద్రతకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూశాయి.  ఆవిషయాలను అన్నింటినీ  సాకల్యంగా పరిశీలించినమీదట,  సత్వర ఫలితాలు సాధించేందుకు  కొన్ని స్వల్పకాలిక చర్యలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈ  ఆర్ధిక సంవత్సరంలోనే కమిటీ సిఫార్సుల అమలుకు వీలైన నిధులను ఆయా ప్రభుత్వ శాఖలకు విడుదల చేయాలని కూడా  ఈ కమిటీ సూచించింది.
'హెల్ప్ లైన్' (ఆపన్న హస్తం) ఏర్పాటు చేయడం అనేది కమిటీ సిఫారసుల్లో మొట్టమొదటిది.
అలాగే, జిల్లా స్థాయిలోను, నగరపాలక  సంస్థ పరిధిలోను  ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా పనిచేసే  కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది.
కమిటీ చేసిన ఇతర సిఫారసులు ఇలా వున్నాయి.
"పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను ఇతోధికంగా పెంచాలి. అత్యాచార సంఘటనలు గురించిన పిర్యాదులపై  సత్వరంగా విచారణ పూర్తిచేసి నేరం రుజువైన పక్షంలో ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలాచూడడానికి జిల్లా స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. లైంగిక అత్యాచారాలకు గురైన బాధితులను బహిరంగంగా కాకుండా  వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించేందుకు వీలుగా విధానాలను నిర్బంధం చేయాలి.ఢిల్లీ పోలీసు తరహాలో మహిళా రక్షక్ లను పోలీసు కమీషనరేట్లలో, జిల్లా స్థాయి పోలీసు అధికారుల కార్యాలయాల్లో నియమించాలి. ఇంటర్ నెట్ లో అసభ్య చిత్రాలను చూపే సైట్లను పూర్తిగా నిరోధించాలి. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల విచారణలో ఖచ్చితమైన, ప్రామాణికమైన విధానాలను రూపొందించి అవి సరిగా అమలయ్యేలా చూడాలి. కార్యాలయాలలో,  విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగినులు, చదువుకునే విద్యార్ధినుల   భద్రతకు సంబంధించిన ఎలాటి సమాచారం వచ్చినా రాకున్నా  సకాలంలో స్పందించడానికి ఆయా  ప్రాంతాలలో  పోలీసు గస్తీ  వ్యవస్థను పటిష్టం చేయాలి. మహిళా ఉద్యోగులు ప్రయాణించే టాక్సీలలో  మహిళా డ్రైవర్లు మాత్రమె ఉండేలా చూడాలి.
"ఆటో రిక్షాలు, టాక్సీల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసి వాటి రాకపోకలపై నిరంతర నిఘా పెట్టాలి. ఆర్టీసీ బస్సులు, లోకల్ రైళ్ళ వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పటిష్టం చేయాలి. వివాహాలను నిర్బంధంగా నమోదు చేసేలా చట్టాలను సవరించాలి. మద్యం వాడకం పెరగడం వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోయే అవకాశాలు వుండే కోణం నుంచి కూడా ఆలోచించి  ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి. అసంఘటిత రంగాల్లో, ఇళ్ళల్లో పనిచేసే బాలికలు, మహిళల భద్రత పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి.  కడుపులో వున్న శిశువు ఆడపిల్ల అని తెలుసుకుని గర్భవిచ్చేధం  చేసే వికృత పోకడలను  గట్టిగా అరికట్టాలి. అవసరంలో వున్న మహిళలకు  న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించాలి. పడుపువృత్తిని అరికట్టే చర్యలకు మరింత పదును పెట్టాలి.
"గ్రామ స్థాయిలో స్త్రీ శక్తి సంఘాలను ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల స్థాయిలో మహిళా వనరుల కేంద్రాలను నెలకొల్పాలి. తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక మహిళా కమీషన్ ఏర్పాటుచేయాలి. విడిగా స్త్రీలకోసం తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పాలి."
ఈ నివేదిక చేతికి అందగానే ముఖ్యమంత్రి, కే.చంద్రశేఖర రావు సీనియర్ అధికారులతో  సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. లండన్ తరహా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి, హైదరాబాదు నగరాన్ని నేర రహిత నగరంగా చేయాలనే లక్ష్యం ప్రకటించిన ముఖ్యమంత్రి, తదనుగుణంగా చర్యలు కూడా తీసుకునే అవకాశాలు వున్నాయి. కమిటీలు ఏర్పాటుచేయడం, నివేదికలు తెప్పించుకోవడం, వాటికి తగిన ప్రచారం కల్పించడం దరిమిలా వాటి సంగతి సమయానుకూలంగా మరచిపోవడం ప్రభుత్వాల్లో పరిపాటే. కానీ ఈ విషయంలో తాను  'విభిన్నంగా వ్యవహరిస్తాను' అనే పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తె  తెలంగాణా ముఖ్యమంత్రికీ  మంచిదే. తెలంగాణా ఆడపడుచులకూ  మంచిదే.
చూడాలి ఏం చేస్తారో! ఏం జరుగుతుందో! 

NOTE: COURTESY IMAGE OWNER

కామెంట్‌లు లేవు: