8, సెప్టెంబర్ 2014, సోమవారం

యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదు - ఓ డాక్టరుగారి జ్ఞాపకాలు - 3


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఈ వ్యాస పరంపర ఉద్దేశ్యం) 

"మెడిసిన్ చదవడానికి ఖమ్మం నుంచి హైదరాబాదు వచ్చాను. గాంధీ మెడికల్ కాలేజీ.
అనంత్ లాల్  నన్నూ గోపాలరెడ్డిని తన ఇంట్లో వుండమన్నాడు. అనంత్ లాల్, గోపాల్ రెడ్డిది ఇద్దరిదీ ఒకేవూరు. మానుకోటలో చిన్నప్పటినుంచీ కలిసి చదువుకున్నారు. అనంత్ లాల్ చుట్టాలకి బేగంబజారులో ఓ ఇల్లువుంది. మూడో అంతస్తులో  ఆస్బెస్టాస్ రేకులగదిలో ముగ్గురం సర్దుకునేవాళ్ళం. ఒకే ఒక టేబుల్ ఫాన్ వుండేది. కాకపొతే ఆ గది వెలుపల అంతా ఆరుబయలు స్తలం.
ఆ ఏరియా మొత్తం దుకాణాలమయం. ఇరుకిరుకు గొందులు. నానా చెత్తతో రొచ్చురొచ్చుగా వుండేవి. అనంత్ లాల్ రెండో ఏడు పాసయి క్లినికల్ మొదలు పెట్టాడు. మేము వెళ్ళాల్సిన గాంధీ హాస్పిటల్ సికిందరాబాద్ లో వుండేది. బేగంబజారు నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్లు. పొద్దున్నే లేచి సికిందరాబాద్ వెళ్లి మళ్ళీ మధ్యాహ్నానికల్లా థియరీ క్లాసులకోసం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ చేరుకునేవాళ్ళం. మేము రిఫరల్ స్టూడెంట్స్  కావడం వల్ల గదిలోవుండే  చదువుకునేవాళ్ళం. అప్పుడప్పుడూ మాత్రం కాలేజీకి వెళ్లి ప్రాక్టికల్ క్లాసులకు, లెక్చర్స్ కు హాజరవుతూ వుండేవాళ్ళం. ఆబిడ్స్ లో వసంత విహార్ లో భోంచేసేవాళ్ళం. మా తిరుగుడంతా సైకిళ్ళ మీదే. అనంత్ లాల్ ఒక్కడికే ఓ మోటార్ సైకిల్ వుండేది. ఒకరోజు  కింద పెట్టిన నా సైకిల్ ను ఎవరో ఎత్తుకుపోయారు.
అనంత్ లాల్ చుట్టాలు ఎంతో మంచివాళ్ళు. పండగలు పబ్బాలప్పుడు మాకు స్వీట్లు పూరీలు పెడు తుండే వారు.
ఆ ఇంటికింద భాగంలో చాలా దుకాణాలు, లెట్రిన్లు, బాత్ రూములు వుండేవి. పాయిఖానాల లో బొగ్గుపొడి డబ్బాలు పెట్టేవాళ్ళు.  చేతులు కడుక్కోవడానికి ఆ పొడి వాడేవారు. పాత్రలు కడగడానికి కూడా ఆ బొగ్గుపొడే వుపయోగించేవారు. విచిత్రమయిన విషయం  ఏమిటంటే నీళ్ళు లేకుండా కేవలం బొగ్గుపొడే వాడేవాళ్ళు.
సాయంత్రాలప్పుడు, అనంత్ లాల్ మూడ్ కనిపెట్టి గోపాలరెడ్డి అతడి బైక్ అడిగి తీసుకునేవాడు. దానిపై హోటల్ కు వెళ్లి భోంచేసి వచ్చేవాళ్ళం. అనంత్ లాల్ కి సినిమాల పిచ్చి. పాటలంటే చెవికోసుకునేవాడు. అతడి దగ్గర ట్రాన్సిస్టర్ రేడియో వుండేది. అది పెట్టుకుని పాటలు వింటుండేవాళ్ళం. అనంత్ లాల్ కి చిన్నతనంలోనే పెళ్లయింది. అతడూ, సుభాష్ రెడ్డి కలసి కాంతారావు సినిమాలు ఎక్కువగా చూస్తుండే వాళ్ళు.
ఆ రోజుల్లోనే ఒకరోజు అంతా కలసి గండిపేటకు పిక్నిక్ వెళ్ళాం. సరదాగా ఆ రోజంతా గడిపాము. హైదరాబాదుకు గండిపేట నీళ్ళే మంచి నీళ్ళు.
సెకండ్ షో సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి టివోలీ టాకీసులో రెండో ఆట చూసి నడిచి బేగం బజారు వచ్చాము. బస్సులూ, రిక్షాలు కాకుండా ఎక్కువగా కాలినడకన తిరగడమే అలవాటు. ఆ రోజుల్లో ఆటోలు బహు తక్కువ" (ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: