6, సెప్టెంబర్ 2014, శనివారం

నాటక రంగస్థలంగా బెజవాడ


అప్పటికి ఇప్పటికి పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి ఆయన ఈ  రెండూ విడివిడిగా రాశారు,  పాండవోద్యోగం, పాండవ విజయం అని.  ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని  పద్యాలు జోడించి కురుక్షేత్రంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు.  ఎన్ని వేలసార్లో,  వేలేమిటి లక్షసార్లు  అని కూడా చెప్పొచ్చు  ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా  వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈనాటకం ఉపాధి కల్పించింది.  పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి హరిశ్చంద్ర’,  చిలకమర్తి వారి గయోపాఖ్యనంకూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి  కాళ్ళకూరి నారాయణ రావు గారి చింతామణి’,  తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి బాల నాగమ్మ’.  మిగతావన్నీ  చెదురుమదురగా ఆడేవి,  ‘పాదుక పట్టాభిషేకంవంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది.   
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ  అవీ వుండాలి.  కానీ,  పద్యం రాగం  ముఖ్యం కావడంతో హంగులను  ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి  చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ  గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను  బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. జైహింద్సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా  మంచి  మైకు సెట్టు.  మైకు  బాగా లేకపోతే  జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు.  వెనక వైపు  ఓ  తెరా, ముందు మరో  తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను  కప్పీ మీద  లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన  ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో  ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి  కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే  ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి  పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది.  ఆయన కూర్చోడానికి  ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా   ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానందఅనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో  ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది.  ఆ మధ్యన ఓ  అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు.  సమాధానం ఏమి వచ్చిందో  గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే  తెలిస్తే చెప్పండి.  రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత,  ‘శ్రీకృష్ణ పరమాత్మకీ  జై!అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు.  ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని,  మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ  పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి  వెళ్లి  జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు  కనపడుతూనే వుండేది.  బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో  రామకృష్ణ మైక్  సర్వీసుఅని వుండేది.  ఆయన దగ్గర మంచి మైకులు  ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు.  బాగా  లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా.  కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.


బెజవాడలో  ఇప్పటి నవరంగ్ థియేటర్ని   1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు.  యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు.  దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే  గాంధీ  నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు.  అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం  పైన వున్నచిన్న  హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక  మర్నాడు ఆదివారం పడుకోవచ్చని  కాబోలు. 

6 కామెంట్‌లు:

naveen చెప్పారు...

Dear Srinivasa Rao Garu,
Even though it is not related to the above,can u share any literature of Soviet available with you for the blog

http://sovietbooksintelugu.blogspot.in/2014/09/blog-post_16.html

fualoflife@gmail.com

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

Thanks. I do - Regards - Bhandaru Srinivas Rao

naveen చెప్పారు...

Srinivasa Rao Garu,
Thank you Andi

Pranayraj Vangari చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Pranayraj Vangari చెప్పారు...

"పరబ్రహ్మ పరమేశ్వర" అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన "భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు" అనే పాటను రాసిన చందాల కేశవదాసు (జూన్ 20, 1876 - జూన్ 14, 1956) తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, మరియు నాటకకర్త. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాద కు ఈయన పాటలు రాసారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Pranayraj Vangari - సమాచారానికి ధన్యవాదాలు