17, జులై 2024, బుధవారం

పంటి కింద రాయి లేని ఛానల్


రేడియోలో పాటలు వినే శ్రోతలకు చేపలు పట్టేవాడికి వుండేంత ఓపిక వుండాలని పూర్వం చెప్పుకునే వారు. వల వేసి చాలా సేపు నిరీక్షిస్తే ఓ మంచి చేప గాలానికి చిక్కినట్టు, వినగా వినగా ఓ మంచి పాట చెవిలో పడుతుంది.
అలాగే ఈ రాత్రి టీవీలో ఛానల్లు ఓపిగ్గా మారుస్తూ పోతుంటే,  ఈ HW తెలుగు గోల్డ్ ఛానల్ రిమోట్ చేతికి చిక్కింది. 
ఇందులో విశేషం ఏమిటంటే, ఓ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా పంటి కింది రాయిలా అడ్డం రాదు. 
చాలా సేపటి నుంచి బాలచందర్ 'మరో చరిత్ర ' హాయిగా చూస్తున్నాను. 
ఈ వైభోగం ఎన్నాళ్ళో తెలియదు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో హల్వా వుంటుందా!

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో హల్వా వుంటుందా! – భండారు శ్రీనివాసరావు 

ఢిల్లీ నార్త్ బ్లాక్ అంటే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొలువై వుండే కార్యాలయం. బడ్జెట్ తయారీ కార్యక్రమం అంతా అక్కడే జరుగుతుంది. దాదాపు ఓ వారం, పది రోజులపాటు సంబంధిత సిబ్బంది ఆల్ మకాం,  అంటే తిండీ తిప్పలు, పడకా, విశ్రాంతి పూర్తిగా అక్కడే. బడ్జెట్ పూర్తి అయ్యేదాకా ఇళ్లకు పోకుండా రాత్రింబవళ్ళు  ఆ కార్యాలయంలోనే వుండిపోతారు. చివరి రోజున పనిచేసిన  మొత్తం సిబ్బందికీ  కేంద్ర ఆర్థికమంత్రి  స్వయంగా అక్కడే హల్వా చేసి అందరికీ పంచుతారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న వేడుక ఇది. స్వయంగా అంటే మంత్రిగారే హల్వా చేస్తారని కాదు. కడాయిలో తయారైన హల్వాను పెద్ద గరిటతో అలా అలా  పైపైన ఒకసారి కలుపుతారని అర్ధం చేసుకోవాలి. కోవిడ్ కారణంగా రెండేళ్లు హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.

బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓ తోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. నాకు తెలిసి నార్త్ బ్లాకులోనే ఒక ముద్రణాయంత్రం వుండేది. ఇప్పుడు వుందో లేదో తెలియదు.  డిజిటల్ శకం మొదలయిన తర్వాత  లెదర్ బ్యాగు సైజు, స్వరూపం పూర్తిగా మారిపోయాయి. 
 చూడాలి ఈ ఏడాది బడ్జెట్ లో హల్వా (సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేవి) వడ్డిస్తారా! అంతకు మించింది ఏమైనా జనాలకు అందిస్తారా!

కింది ఫోటో:
ఈరోజు ఒక దినపత్రికలో వచ్చిన చిత్రం

దేవుళ్ళా మజాకా!



మధ్య తరగతి వాళ్ళు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక పగటి కల కంటూ వుంటారు. ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని.(చిన్నిల్లు, పెద్దిల్లు అనే పాడు అపార్థాలు చేసుకోవద్దు ప్లీజ్).
అలా నేనూ మా ఆవిడా, విడివిడిగా, కలివిడిగా కలలు కనే రోజుల్లో ఒకనాటి తన కలలో మేము కట్టుకోబోయే ఆ కొత్త ఇంటికి పూజ గది మాత్రం విడిగా వుండాలని కోరుకున్నది తను . 1975 నుంచి అనేక అద్దె ఇళ్ళు మారుస్తూ హైదరాబాదును ఏళ్ళ తరబడి చుట్టబెడుతున్న తరుణంలో పూజ గది వుండే అద్దె ఇల్లు దొరకడం అసాధ్యం. 
అంచేత చిక్కడపల్లి దాకా వెళ్లి ఇదిగో ఈ కింద ఫోటోలోని పూజ అల్మరా ఒకటి కొనుక్కొచ్చుకుంది.  అందులో దేవుళ్ల విగ్రహాలు, ఫోటోల సంచితాన్ని భద్రపరచుకుంది. నేనెప్పుడూ  లెక్కపెట్టలేదు కాని ముక్కోటి దేవతలు అందులో కొలువు తీరారు అనిపించేది. 
ఈరోజు జులై 17. అంచేతే కాబోలు ఓ జ్ఞాపకం మనసుని తట్టిలేపింది.
కొన్నేళ్ళ క్రితం అంటే 17-07-2019 నాడు పొద్దున్నే ఏదో ఓ ఛానల్ డిబేట్ కి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి మా ఆవిడ పూజ అల్మరాలోని దేవుళ్ళు అందరూ కట్టగట్టుకుని మాయం అయిపోయారు. ఏమిటీ విష్ణు మాయ అనుకుని ఆశ్చర్య పోతూ ఉండగానే,  శుభ్రంగా తోమిన దేవుడి విగ్రహాలను మరింత మెరిసేలా తుడుస్తూ మా ఆవిడ ప్రత్యక్షం అయింది.
“ అమ్మయ్య! దేవుళ్ళు అందరూ  తలంట్లు పోసుకుని గూటికి చేరుతున్నారు “ అని ఓ జోకు జోకాను.
ఈ జోకు మా ఆవిడ విన్నదో లేదో కాని ఆమె చేతిలో ఉన్న దేవుళ్ళు విన్నారు, విని కోపగించుకున్నారు  అన్న సంగతి నెల తర్వాత తెలిసి వచ్చింది.
సరిగ్గా నెలలోపే ఆగస్టు 18న, ఇంట్లో  దేవుళ్ళు అందరూ అలాగే  వున్నారు. వాళ్లకు నిత్య పూజలు చేసే దేవతే లేకుండా వెళ్లి పోయింది.
దేవుళ్లా! మజాకా!

15, జులై 2024, సోమవారం

డాక్టర్ కె ఎల్ రావు రోడ్డు


(జులై,15,  డాక్టర్ కె.ఎల్.రావు జయంతి)

హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ కీర్తిశేషులు శ్రీ ఆర్. జే. రాజేంద్రప్రసాద్ గారు హైదరాబాదు రాకముందు నుంచి కూడా నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు. 
ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.
సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.
పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.
మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.
ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.
అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.
మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము. 
ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు. 
ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. 
కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.
అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.
దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.
తోకటపా: ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు.

14, జులై 2024, ఆదివారం

వచ్చిన దారి గుర్తుంది



" కిందటి ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్థిగా గెలిచి అధికార పార్టీలోకి అవలీలగా జంప్ చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్థిగా గెలిచి, అధికారంలోకి వచ్చిన మీపాత పార్టీలో వెంటనే చేరగలిగారు. ఎలా సాధ్యం? "

" ఎమ్మెల్యే. మహా అయితే మంత్రి. అంతకంటే సీ ఎం అయ్యేది లేదు, పీ ఏం అయ్యేది అంతకన్నా లేదు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పది వేలు. ఇక సాధ్యాసాధ్యాలు అంటావా!  వచ్చిన దారి గుర్తుంటే పోయే దారి అదే తెలుస్తుంది"

13, జులై 2024, శనివారం

అసెంబ్లీలో పనికొచ్చిన వినికిడి యంత్రం



చాలా కాలం నాటి ముచ్చట.
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పాలిస్తున్నప్పుడు మహేంద్ర నాథ్ అనే ఓ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా వుండేవారు. నిజానికి ఆయన అప్పటికే రాజకీయాల్లో సీనియర్. జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వారికి వినికిడి సమస్య. చెవిలో చిన్న యంత్రం అమర్చుకుని బడ్జెట్ ప్రసంగ పాఠం నెమ్మదిగా చిన్న గొంతుకతో చదువుకుంటూ పోయేవారు. బడ్జెట్ పై చర్చలో ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తుంటే ఆయనగారు నెమ్మదిగా చెవిలోని వినికిడి యంత్రం తీసేసి, ఇక చెప్పేది ఏదో చెప్పుకోండి  అన్నట్టు  నిరాసక్తంగా తన సీటులో కూర్చుండిపోయేవారు.

8, జులై 2024, సోమవారం

రేపు మళ్ళీ పుడితే ఎంత బాగుణ్ణు

గత ఫిబ్రవరి నాలుగో తేదీ పోయిన రోజు.
జులై తొమ్మిది పుట్టిన రోజు.
మళ్ళీ రేపు పుడితే ఎంత బాగుంటుంది.
జరిగే పనేనా! 

కింది ఫోటో: 
పెళ్లి కుమారుడి దుస్తుల్లో మా రెండో వాడు సంతోష్.  ఇద్దర్నీ పోగొట్టుకుని నేను.