3, జూన్ 2016, శుక్రవారం

అనువాద సంవాదాలు

సరదాగా.....
  
అనువాదం ముఖ్యోద్దేశం అర్ధం కావడం అనేవారు కీర్తిశేషులు, పదప్రయోగ దురంధరులు, ఆర్వీయార్ గా సుప్రసిద్దులయిన  రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు.
నేను పాతికేళ్ళకు పూర్వం మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు అనువాద సమస్యలు నాకూ ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా  ప్రపంచ భాషలకు ప్రాతినిధ్యం  వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం  అనువాదం చేసుకుని ప్రసారం చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఏర్పాటు.  అందువల్ల కొన్ని కొరుకుడు పడని వాక్య నిర్మాణాలుపదజాలాలు అక్కడ  పనిచేసే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. నేపధ్యంలోమాస్కోలో నేనున్న రోజుల్లోనే  మాస్కో రాదుగ  ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఇప్పుడు కీర్తిశేషులు)  నాకు అనువాద సమస్యలు అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

రారా గా ప్రసిద్ధులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. (రెడ్డి గారు  కూడా అనేక సంవత్సరాలపాటు  మాస్కోలో  అనువాదకుడిగా  పనిచేశారు) అనువాద సమస్యలు అన్నింటికీ పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. అనువాదం ఎలా చేయాలో, ఎలా చేస్తే మూలానికి దూరం జరగకుండా చదువరికి అర్ధం అయ్యేలా సుబోధకంగా అనువాదం ఎలా చేయొచ్చో తెలుసుకోవాలంటే    పుస్తకం చదివి తీరాలి. విశాలాంద్ర ప్రచురణ సంస్థలో పుస్తకం దొరికే అవకాశం వుంది.
 మాస్కోలో వారాంతపు రోజుల్లో సాయంకాలక్షేపాలు చేసేటప్పుడు, నాకూ ఆర్వీయార్  కు నడుమ   తెలుగు భాష, అనువాదాలకు చెందిన అనేక విషయాలు  దొర్లేవి.
ఆయన అనేక కబుర్లు ఆసక్తికరంగా చెప్పేవారు.
పరమహంస  విద్యానాధ స్వామివారు, షేక్స్పియర్ పేరుని శూలపాణి అని అనువదించారుట. కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రలో, డిస్ట్రిక్ట్  జడ్జ్ కి ప్రాడ్వివాకుడు అని, మెయిన్ రోడ్  కి ప్రధాన రధ్య అనీ, రైల్వే లైన్  కి ఇనుపదారి, అయోమార్గం అనీ ఇలా అనువాదాలు కనిపిస్తాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా హోం వర్క్ కి గైహికము అనీ, డిక్టేషన్  కి ఉక్త లేఖనం అనీ తెలుగు పదాలు ఇచ్చారట.
అయితే, తెలుగుప్రయోగాలకంటే, ఇంగ్లీష్ పదాలే వాడుకలో  ప్రాచుర్యం పొందాయి.
వాటి అర్ధం అందరికీ తెలిసేటప్పుడు ఇక అయోమయ పద కల్పన ఎందుకన్నది ఆర్వీయార్ అభిప్రాయం.
విద్యార్ధి కల్పతరువు అనే పుస్తకం వుంది. ఇప్పుడు దొరుకుతున్నదో లేదో తెలవదు. అందులో ధర్మామీటర్ (తాపమానిని), కెమెరా (ఛాయాగ్రాహక యంత్రం), టెలిగ్రాఫ్ ( తాజావార్తా యంత్రం), ఇలా అర్ధ వివరణ ఇచ్చారు. అయితే అర్ధం అవడం ముఖ్యమా అనువాదం ముఖ్యమా  అనే ప్రశ్నకు జవాబు దొరకాలి.
సర్వీస్ కమీషన్ కి తెలుగేమిటి? దాన్ని మక్కికి మక్కి అనువాదం చేసి అదే ప్రశ్న అడిగితే ఎవ్వరికీ ఉద్యోగాలు రావు.
పోతేఅనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు కలం కూలీ జీ.కృష్ణ గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా భాషల్లోకి  చొరబడతాయి. మరో భాషలోకి అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్ తెలియని పల్లెపట్టుల్లో ప్రజలు ఇలాటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు తీరిక వుండదు. వారికి అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద  ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే మార్జాలం అంటూ  సరిపెట్టుకోమంటున్నారు.            
ఉపోద్ఘాతానికి  నేపధ్యం వుంది.
 తెలంగాణా  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ గురించిన వార్త ఒక తెలుగు  పత్రికలో వచ్చింది. మిషన్ అనే ఇంగ్లీష్ పదానికి మర, యంత్రం అని భాష్యం చెప్పుకున్న విలేకరి మిషన్ కాకతీయను అనువాదం చేయబోయి యంత్ర కాకతీయ అని రాశాడు. అతడి మాతృభాషాభిమానం మెచ్చదగినదే. అయితే మిషన్మెషిన్ నడుమ గందరగోళంలో ఆయన రెండో దాన్నే ఎంచుకుని యంత్ర కాకతీయ అనే కొత్త పద ప్రయోగాన్ని తన  పాఠకులపై రుద్దాడు. అతగాడి పొరబాటో, గ్రహపాటో కానిసోషల్  మీడియా  దాన్ని అందిపుచ్చుకుని చర్చోపచర్చలతో చీల్చి చెండాడింది. 
మరి పొరబాటు వార్త  పంపిన  విలేకరిదా, చూసి  ప్రచురించిన సంపాదక బృందానిదా, లేదా  తన పత్రికలో  ఏమి వస్తున్నదో చదివే తీరికలేని పత్రికా సంపాదకుడిదా అంటూ అనేకానేక జవాబులేని ప్రశ్నలతో చర్చ అనంతంగా  సాగుతోంది.
సందర్భంలో వివిధ పత్రికల్లో తెలుగు భాషను హింసిస్తూ  వెలువడుతున్న అనేక అనువాద ప్రయోగాలు  ఒకింత బాధతో కూడిన  ఉచిత వినోదాన్ని  కూడా  అందిస్తున్నాయి.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు  విద్యుత్  వినియోగ భారం తగ్గించే సదుద్దేశంతో ప్రతి ఇంటికీ ఎల్..డి.  విద్యుత్ బల్బులు సరఫరా చేసారట. అవి సరఫరా చేసిన ప్యాకెట్లపై ఒకవైపు ఇంగ్లీష్ లో LED BULB అనీ, మరో వైపు తెలుగులో, ‘దారి తీసింది బల్బు అనీ ముద్రించారుట. అనుదిన సమస్యలతో సతమవుతున్న ప్రజలకు మాత్రం  ఆనందం పంచడం తమ బాధ్యత అనుకున్నారేమో తెలవదు.




సరే! ఇదొక కధ.
అర్ధం కానిదాన్ని గ్రీక్ అండ్  లాటిన్  అనే ఒక్క మాటతో కొట్టేయడం మనకు తెలిసిందే.
లాటిన్  భాషలో ఇగ్నోటం పెర్ ఇగ్నోటియస్ అని ఒక పద ప్రయోగం వుంది.  ఒక పట్టాన కొరుకుడు పడని లాటిన్ పదప్రయోగానికీ   అర్ధం వుంది. వివరించబోయిన విషయం కంటే వివరణ క్లిష్టంగా వుండడం అనేది దీని  మూలార్ధం.

నెట్ ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. నేపధ్యంలో అనువాద సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితేపుట్టతేనె వంటి  తియ్యటి తెనుగు  తన స్వరూపాన్నే కోల్పోయే ప్రమాదం వుంటుంది.
కాబట్టిరాసేది  అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి తెలుగులో రాయాలి. 
అనువాద సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి సమస్యగా మారకూడదు.


ఉపశృతి:
పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్  నండూరి  రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా  ఆ తప్పును ఎత్తి చూపించారు. నలభయ్ ఏళ్ళ తరువాత కూడా  నాకిప్పటికీ ఇది  జ్ఞాపకం వుంది.
అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.
ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని. భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ. 
(04-06-2016)


రచయిత మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

Namaste Bhaarat || Senior Journalist Bandaru Srinivas Rao || 02-06-2016 ...



Participating in Bharath Today TV channel's NRI program "Namaste Bharath" on 2nd June midnight. Issue: Telangana Formation Day, Anchor: Shri Sai

2, జూన్ 2016, గురువారం

ఓ జ్ఞాపకం



హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు  ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగిన రోజుల్లో ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగానో, పీసీసీ అధ్యక్షుడిగానో వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వచ్చి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని  పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో  వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు ప్రెస్ క్లబ్ దగ్గర ఆగకుండా  గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే ముందుకు వెళ్ళిపోయింది. నేను వెంటనే కేవీపీ కి ఫోన్ చేశాను. ఆయన ‘అర్రెర్రే బషీర్ బాగ్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ  వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.         

జవాబు లేని ప్రశ్న


ఏ రాజకీయ నాయకుడికీ మినహాయింపు లేని వాస్తవం ఇది.
నాయకులను అధికార పీఠం మీద కూర్చోబెట్టేది ప్రజలు. అధికారానికి దగ్గర చేసేది ప్రజలు.
ఆ అధికారమే వారిని మళ్ళీ  ప్రజలకు దూరం చేయడం ఓ చిత్రం!
వారువీరని కాదు ఏ రాజకీయ నాయకుడయినా అధికారంలో లేనప్పుడు ప్రజలకు దగ్గరగా తిరిగిన రోజులు  గుర్తు చేసుకోండి.
అదే వ్యక్తులు అధికారంలోకి రాగానే వారికీ, ప్రజలకు నడుమ సెక్యూరిటీ పేరుతొ అడ్డం నిలిచిన బారికేడ్లను గమనించండి.
ఈ నిజం అర్ధం అవుతుంది.

అధికారానికి కారకులయిన వారే, వారి ప్రాణాలకు ముప్పుగా మారుతారా!
ఏమో!    

1, జూన్ 2016, బుధవారం

చంద్రబాబు రెండేళ్ళ పాలన చూసి గర్వపడాలా! జాలిపడాలా!


సూటిగా.....సుతిమెత్తగా..... భండారు శ్రీనివాసరావు
(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 02-06-2016, THURSDAY)

“కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టుగా వుంది”
నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో సాంఘిక మాధ్యమాల్లో వెలువడిన ఈ వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుందనిపిస్తోంది.
ఒకప్పుడు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు పదమూడు జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రాన్ని పాలించడం నిజానికి ఒక లెక్కలోనిది కాదు. కానీ అప్పటికీ, ఇప్పటికీ పరిస్తితుల్లో గణనీయమయిన మార్పులు చోటుచేసుకున్నాయి. 
ఒకప్పుడు ఆయన నోటి మాట ఢిల్లీ పెద్దలకు శిరోధార్యం. కంటి చూపుతో శాసించడం అంటే ఏమిటో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలిని దగ్గరనుంచి చూసిన నా బోటి విలేకరులకు చాలామందికి తెలుసు. ఒక సందర్భంలో నేనే ప్రత్యక్ష సాక్షిని.
ఆ రోజుల్లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో పనిచేస్తున్న న్యూస్ ఎడిటర్ బదిలీ అయ్యారు. దాన్ని రద్దు చేయించడం అంత  ఆషామాషీ  వ్యవహారం కాదు.  ఆ  స్థాయి పోస్ట్ అప్పుడు హైదరాబాదులో లేదు. అంచేత ఆ అధికారిని పోస్ట్ తో సహా ఢిల్లీ బదిలీ చేశారు.
విషయం ముఖ్యమంత్రి చెవిలో వేశాము. ఆ రోజు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఇబ్రహీం హైదరాబాదులోనే వున్నారు. పౌర విమాన శాఖను కూడా ఆయనే  చూస్తున్నారు. అదే రోజు హైదరాబాదులోని బేగం పేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని తోడ్కొని పోవడానికి కేంద్ర మంత్రి సచివాలయానికి వచ్చారు. ఆ హడావిడిలో, రామాయణంలో పిడకల వేటలా  ఈ బదిలీ వ్యవహారం. ముఖ్యమంత్రీ, కేంద్ర మంత్రీ  ఇద్దరూ కలసి ఒకే కారులో ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ జరిగిన సభలో   కేంద్రమంత్రి  ప్రసంగిస్తూ మధ్యలో ఒక అప్రస్తుత ప్రస్తావన చేసారు. అదే ఇందులో కొసమెరుపు.
“ఇక్కడికి వస్తున్నప్పుడు దోవలో  మీ ముఖ్యమంత్రి నాయుడు గారు చెప్పారు,  హైదరాబాదు ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్ బదిలీ ఆపుచేయమని. ఇక్కడే  చెబుతున్నాను. నాయుడు గారు అడగడం, మేం కాదనడం అనేది వుండదు. ఆ బదిలీని  నిలిపివేస్తున్నాను. ఢిల్లీ వెళ్ళగానే ముందు ఆ ఆర్డర్లు పంపిస్తాను”
ఆయన అన్నట్టే బదిలీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ముందు ఫోనులో, తరువాత ఫాక్స్  లో వచ్చాయి.
ఆ రోజుల్లో చంద్రబాబు పవర్ కు ఇది ఓ చిన్ని ఉదాహరణ మాత్రమే.
ఢిల్లీ వెళ్ళకుండానే ఫోనులోనే రాష్ట్రానికి సంబంధించిన అనేక వ్యవహారాలు చంద్రబాబునాయుడు చక్కబెట్టేవారు. అత్యంత  సమర్ధుడు అన్న కితాబు లభించింది ఇదిగో ఇలాంటి సందర్బాలలోనే.
అలా  ఆ రోజుల్లో చంద్రబాబును చూస్తూ గర్వపడిన తెలుగు జనులు అదే చంద్రబాబును చూస్తూ ఇప్పుడు జాలిపడాల్సి వస్తోంది.
గారెలు వండాలంటే నూనె, మూకుడు, పిండి వంటి సంబారాలు అనేకం కావాలి. గారెకు చిల్లి పెట్టడానికి 'వేలు' తప్ప వేరే ఏమీ లేదన్న చందంగా,  'చంద్రబాబు సమర్ధత' తప్ప రాజధాని నిర్మాణానికి కానీ, రాష్ట్రాన్ని తాను  కోరుకున్న విధంగా అభివృద్ధి చేయడానికి కానీ,  అవసరమైనవి ఏవీ  ఆయనకు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఇది వాస్తవం. ముందు అందుకే చెప్పింది, కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ మైదానంలో దింపిన చందంగా ఆయన పరిస్తితి వుందని.
అన్ని అవరోధాలను అధిగమించి, 'నవ్యాంధ్ర ప్రదేశ్' (గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 'స్వర్ణాంధ్రప్రదేశ్' తన స్వప్నం అని చెప్పేవారు) కల సాకారం చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆయన వద్ద వున్న 'వనరుఒకే ఒక్కటి. అదే అనుభవం. ఆ వొక్కదానితో మిగిలిన యావత్తు వ్యవహారాలను సంభాలించుకోవడం అన్నది చంద్రబాబు వ్యవహార దక్షత పైనే ఆధారపడివుంటుంది. ఘటనాఘటన సమర్ధుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న చంద్రబాబుకు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి దొరికిన అపూర్వ సువర్ణావకాశం 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం'.
స్వతంత్ర భారత చరిత్రలో తాను  కోరుకున్న విధంగా రాజధాని నగర నిర్మాణం చేసుకోగల వెసులుబాటు లభించింది. చరిత్రాత్మకమైన ఈ క్రతువును జయప్రదంగా నిర్వర్తించగలిగితే చరిత్రలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.
అయితే, ఈ క్రమంలో అన్నీ అవరోధాలే. ఏదీ అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. కేంద్రం నుంచి ఆశించిన సాయం దొరకడం లేదని పాలకపక్షం వాళ్ళే ప్రతి రోజూ టీవీ చర్చల్లో చెబుతున్నారు. ‘అది నిజం  కాదు,  దోసిళ్ళ కొద్దీ మేము చేస్తున్న సాయం వారి కళ్ళకు కనబడడం లేదా’ అని మిత్ర పక్షం బీజేపీ వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. ఇంతవరకు ఇచ్చినదెంత, ఖర్చు పెట్టినదెంత అని లెక్కలు అడిగేవరకూ పోతోంది మిత్ర పక్షాల నడుమ స్నేహం.
రాజధానికి తోడు ప్రత్యేక హోదా అంశం. ఇది రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ చేజేతులా ఒదులుకోదు. ఆ పరిస్తితుల్లో టీడీపీ వున్నా అలానే ఆలోచిస్తుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు  సీమాంధ్రలో నడుస్తోంది.
రాజధాని, ప్రత్యేక హోదా ఈ రెండూ ఒకరకంగా టీడీపీకి ప్రజల్లో సానుభూతి కలిగించే అంశాలే. కానీ కొన్ని స్వయంకృతాపరాధాలు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. గతంలో ఆ పార్టీ నాయకులు చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే ఇందుకు కారణం అవుతున్నాయి.  
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర సాయం కోరడానికి పలు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ వర్గాలే పలు సందర్భాలలో పేర్కొంటూ వుంటాయి. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి పదవిని  చేపట్టినప్పటి నుండి ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలను అనేక పర్యాయాలు చుట్టబెడుతూ వస్తున్నారు. విదేశీ పర్యటనలు సరేసరి. అరవయ్యవ పడిలో పడిన తరువాత కూడా అలుపెరుగని మనిషిలా అలా  తిరుగుతూనే వుండడం చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ రోజు ఒక వూళ్ళో వుంటే రేపు మరోచోట. ఒక రాజధాని, ఒక సచివాలయం అంటూ లేకపోవడం వల్లనే ఈ తిరుగుళ్ళని దవడలు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు.  గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తీరు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా సంబంధిత అధికారులు చేరుకునేలోగానే ఆయన అక్కడ తయారు.
ఆరోజుల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్త పోగు ఆయన కంట పడింది.  వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి  లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.  
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి జనంలో ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా అనేది సిబ్బంది వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలాకాలం పనిచేసారు. ఆఫీసులో ఆయన్ని కలవడానికి ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా కాదనకుండా అందర్నీ కలిసి మాట్లాడే వారు. వారు చెప్పింది సావధానంగా  వినేవారు. కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఆయన  గదిలో ప్రవేశించగానే కుర్చీ దగ్గర నిలబడి మాట్లాడే వారు. వచ్చిన వారిని  కూర్చోమని తాను  నిలబడే  మర్యాద చేసేవారు. అంత పెద్ద అధికారి నిలబడి వున్నప్పుడు, తాము కూర్చోవడం బాగుండదేమో అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ముక్తసరిగా వచ్చిన పని క్లుప్తంగా చెప్పుకుని  బయటపడేవాళ్ళు.  దొరికిందే తడవుగా కుర్చీల్లో సెటిలయిపోయే బాతాఖానీరాయుళ్ళను ఆ అధికారి అలా కట్టడి చేసేవారన్న మాట.
చంద్రబాబు పర్యటనలలో కూడా ఈ ఉద్దేశ్యం వుందేమో అనిపిస్తుంది. అలా అలుపెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం. పట్టుకున్నా ఆయన సమయాన్ని వృధాచేయడం అంతకన్నా కష్టం. 
అలాంటి మనిషి ఈ నాడు చేస్తున్న పాలన చూస్తుంటే బాధతో కూడిన జాలి వేస్తోంది. చేతల మనిషి అనిపించుకున్న వ్యక్తి మాటల మనిషిగా మిగిలిపోతున్నారేమో అనికూడా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పనిలేదు.
రెండేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పనులకన్నా చేయాల్సినవే ఎక్కువ కనబడుతున్నాయి. చేసినవి కూడా అరకొరే అనే విమర్శలు వినబడుతున్నాయి. ఆయనలోని సమర్ధుడికి సవాలు విసురుతున్నాయి. ఆ సమర్ధతను చూసి పట్టం కట్టిన వారిలో అనుమానాలు కలుగుతున్నాయి.
ఆయన ఎప్పుడూ చెబుతుంటారు, సమస్యలను అవకాశాలుగా మార్చుకుని విజయపధంలో సాగిపోతుంటానని. 
అప్పటి చంద్రబాబును ఇప్పటి చంద్రబాబుతో పోల్చి చూసుకున్నప్పుడు ఆయనలో కొట్టవచ్చినట్టు ఓ మార్పు కనిపిస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు అయన ఫక్తు రాజకీయ నాయకుడు. తరువాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేతిలో తీసుకున్నతొలినాళ్లలో ఆయనలో ఒక అభద్రతా భావం వుండేది. మేరునగధీరుడయిన రామారావుని  ఎదుర్కోవడం ఎలా అని. దానికి అయన కనుగొన్న మార్గం పాలన విధానంలో కొత్తదనంతో కూడిన  మార్పులు. ఆకస్మిక  తనిఖీలు, విస్తృత పర్యటనలు, రేడియో, టీవీల్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమాలు  అవన్నీ అందులో భాగం అనుకోవచ్చు.  ఎన్టీఆర్  ఆకస్మిక మరణంతో రాజకీయంగా ఎదురులేకుండా పోయింది. దానితో పాలనపై దృష్టి పెట్టి  వినూత్న పధకాలతో ముందుకు సాగారు. పార్టీకి, ప్రభుత్వానికీ ఆయనే కర్తా, కర్మా,  క్రియా కావడం కూడా అనుకున్నవి అనుకున్నట్టు చేయగల సావకాశం కలగచేసాయి. దానికి తోడు అప్పుడే రంగప్రవేశం చేసిన ఆర్ధిక సంస్కరణలను, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆదర్శ  ముఖ్యమంత్రి అనే కితాబును జేబులో వేసుకున్నారు. అప్పుడప్పుడే  కళ్ళు తెరుస్తున్న  ప్రైవేటు మీడియా  ప్రభావం కూడా ఆయన ప్రాభవానికి మెరుగులు అద్దింది.
ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నా, ఏ లెక్కన చూసినా ఇప్పటి నేతల్లో  ఆయనే సీనియర్. ఇంత  అనుభవం వుండి కూడా, ప్రజానీకానికి  సంబంధించిన  కొన్ని అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపై, కేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా  ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు. అదే ఆయన్ని మళ్ళీ రాజకోవిదుడి పాత్ర నుంచి రాజకీయ వేత్తగా మార్చిందేమో కూడా తెలవదు.
2014 ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పారు, తాను మారానని, మారిన మనిషిని అని.
నిజంగానే మారారు. మారిన రాజకీయ పరిస్తితులు ఆయన్ని అలా మార్చి వుంటాయి. గత ఎన్నికల్లో చేజారినది అనుకున్న అధికారం చేతికి వచ్చింది. చేజార్చుకున్న జగన్ పార్టీకి, చేజిక్కించుకున్న టీడీపీకి నడుమ ఓట్ల శాతం అతి తక్కువ అని తెలియని మనిషేమీ కాదు చంద్రబాబు.
ఈ కారణమే బహుశా ఆయనలోని రాజకీయ నాయకుడ్ని మేలుకొలిపి వుంటుంది. రాజకీయాల్లో ఉచితానుచితాలు చూడరు. అదే జరుగుతోంది.
రాజకీయ అనివార్యతలు రాజకీయ నాయకులకు తప్పనిసరి తలనొప్పులు. నిజమే. కానీ, అవి తలకు చుట్టుకోకుండా  చూసుకోవాలి.
ఆయన అభిమానులకు ఆయన చేస్తున్నది సబబే అనిపిస్తుంది. అది సహజం కూడా.
కానీ గతంలో చంద్రబాబులో ఒక  పరిణతి  చెందిన రాజకీయవేత్తను చూసిన వారికి మాత్రం అలా అనిపించడం లేదు.        
‘చేస్తున్నాం, చేస్తాం అనే దగ్గరే ఆగిపోతున్నారు, రెండేళ్లుగా చేసి చూపించింది ఏమీ లేదు, రాజకీయం తప్ప’ అని నిజాయితీగా చెప్పేవాళ్ళలో కూడా  ప్రతిపక్షాల నీడలు కనబడితే ఇక చేసేదేమీ లేదు, చెప్పేదేమీ వుండదు.
రెండేళ్ళే గడిచాయి. ఇంకా మూడేళ్ళు వుంది. దిద్దుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ సరిపడిన వ్యవధానం మిగిలే వుంది.
ఉపశృతి:
ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలు వుంటారు. వారికి తమ నాయకుడు ఏం చెప్పినా వేదం. ఏం చేసినా మోదం. అలాగే జనంలో ఆ పార్టీకి వుండే అభిమానులు. వాళ్ళూ డిటో. అంచేత ఏం చేసినా, ఏం మాట్లాడినా ఈ రెండు వర్గాలవారితో ఎలాంటి పేచీ లేదు.
అలాగే ఇతర పార్టీలకి కార్యకర్తలు, అభిమానులు, అనుయాయులు వుంటారు. వారికీ, వీరికీ చుక్కెదురు. ఒకరిది మరొకరికి నచ్చదు. ఒకరి పొడ మరొకరికి గిట్టదు.
వీళ్ళే కాదు, ప్రజలనేవాళ్ళు కూడా వుంటారు.  వీరికి ఏ పార్టీతోను సంబంధంవుండదు. అంశాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీల పట్ల వీరి అభిప్రాయాలు, అభిమానాలు అప్పటికప్పుడు  చిత్రంగా మారిపోతుంటాయి. ఒకరకంగా ఎన్నికల సమయంలో వీరిది రుక్మిణి చేతిలోని తులసీదళం పాత్ర.  అది ఎటు మొగ్గితే, కాటా అటు మొగ్గే అవకాశాలు హెచ్చు. 
అయితే వీరితో ఓ సులువు లేకపోలేదు. ఎన్నికల ఘడియ వచ్చేవరకు  ఏ పార్టీకి వీళ్ళతో నిమిత్తం వుండదు.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595