9, మార్చి 2013, శనివారం

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు




మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా పునః ప్రచురణ


ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం 


భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్



‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

• ఓం – భగవంతుడు సర్వ రక్షకుడు.

• భూ: - ఉనికి కలిగినవాడు 

• భువః – జ్ఞాన రూపుడు 

• స్వః – ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు 

• తత్ – అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు 

• సవితు: - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త 

• వరేణ్యం – అందరితో ఆరాధింపబడేవాడు

• భర్గః – పరిశుద్ధుడు 

• దేవస్యః – ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు 

• ధీమహి – ఆత్మలో ఏకమయిన 

• యః – ఆ పరమేశ్వరుడు 

• నః ధ్యః – మా బుద్ధులను 

• ప్రచోదయాత్ – సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.

ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.

“
ఓ భగవాన్! 
‘ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!
‘ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వరప్రదాతవు నువ్వే. 
‘మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.”

గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి. 

ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి. 

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.

మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

•
ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.

గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి. 
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా 
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం. 

అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.

ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం 

తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.

ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు. 

ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.

ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే. 

గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు. 

భర్గో దేవస్య ధీమహి 

భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు. 
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.

దియోయోనః ప్రచోదయాత్

ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.

భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు. 

కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.


ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద 

(
అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)- (29-06-2011)

8, మార్చి 2013, శుక్రవారం

పాత చింతకాయ పచ్చడి - 8


గాభరా 
భార్య వంట చేస్తుంటే మొగుడు హడావిడిగా వొంటి౦ట్లోకి వచ్చాడు.
‘అదేమిటి పోపులో అన్ని మిరపకాయలు వేశావు. జాగ్రత్త! పేలి మొహం మీద పడేను సుమా!
‘అదిగో ఓ పక్క నేను చెబుతున్నా నువ్వు వినడం లేదు. ఒక్కసారి అంత నూనె పోశావు. పోపు మాడి వూరుకుంటుంది. స్టవ్ తగ్గించు. బాగా తగ్గించు. వాటిని కలయ తిప్పు. గరిటేది? కనబడి చావదేమి? నేను చెబుతుంటే అసలు నీకు వినబడుతోందా లేదా?
‘నువ్వెప్పుడూ ఇంతే. వంట చేస్తుంటే నా మాట చెవిన పెట్టవు కదా!
‘సరే కొద్దిగా ఉప్పు తగిలించు. అదెప్పుడూ మరచిపోతూనే వుంటావు. ఇంతకీ ఉప్పెక్కడ? కొద్దిగా వెయ్యి. వేసి గరిటతో తిప్పు. తిప్పు. తిప్పమన్నానా!. తిప్పమంటే అలా చూస్తావేమిటి?’
మొగుడి అఘాయిత్యం చూసి భార్యకు వొళ్ళు మండింది. అతగాడి వంక తీక్షణంగా చూసింది.
‘ఏమంటున్నారు మీరు. ఈ మాత్రం వంట చేయడం నాకు రాదా. కాపురానికి వచ్చినప్పటినుంచి చేస్తున్న వంటే కదా. పక్కన నిలుచుని ఏమిటీ సతాయింపు?’
‘ఇదిగో ఈ మాట అనాలనే ఇలా చేసింది. నేను కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చుని నువ్వు చేసే సతాయింపు కంటే ఇదేమన్నా ఎక్కువా చెప్పు.’ (15-02-2012)

5, మార్చి 2013, మంగళవారం

పాత చింతకాయ పచ్చడి - 7




సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ

చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణం సాగిస్తోంది. కంప్యూటర్ పుణ్యమా అని నాకు ఈ పుణ్యమూర్తి పరిచయ భాగ్యం కలిగింది. అదెలాగో తెలుసుకోవాలంటే- కొద్దిగా వెనక్కు వెళ్ళాలి.
2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకుని వుంటున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి. బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ దగ్గర కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాను. ఈ క్రమంలోనే నాకు సీతమ్మ పరిచయం అయింది. తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మను చూస్తూ నా వాకింగ్ మొదలయ్యేది.
అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్టపడేది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటువుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు.
అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ , వస్తూనో పోతూనో కాసేపు ఆగి ఆమెతో మాటలు కలిపేవాడిని. అన్ని విషయాలు ఒక్కసారే చెప్పకపోయినా కొద్ది కొద్దిగా ఆమె తన గురించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది.

సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్న తనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవుకానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. అప్పటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.
ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళల్లో పాచిపనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొ ప్పుకోలేదు. వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటివాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్టచెబుతుంది.
సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పడు పది రూపాయలనోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.
బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.
‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తుంది. - భండారు శ్రీనివాసరావు

చిత్రకద



నూటొక్క జిల్లాల అందగాడు మాదిరిగా ఇది నూటొక్క సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ పత్రిక. టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయినప్పుడు బోస్టన్ గ్లోబ్ ఆంగ్ల దినపత్రిక 1912 ఏప్రిల్ 16 వ తేదీన మొదటి పుటలో ప్రచురించిన వార్తాకధానం తాలూకు ఛాయాచిత్రం -


NOTE:Courtesy image owner 

చిత్ర కధ - చిత్రమయిన కధ




ఈ చిత్రంలో కానవస్తున్నదేమిటి? 


మీ వూహ రైటే! అది తాజ్ మహలే!

మరి ప్రధాన గోపురం పైభాగంలో కనిపించే ఆ కర్రలు ఏమిటి? తాజ్ నిర్మాణంలో వున్నప్పుడు తీసిన ఫొటోనా? కాదెంత మాత్రం కాదు. 1942లో ద్వితీయ ప్రపంచ సంగ్రామకాలంలో యుద్ధ విమానాల బారినుంచి ఈ అద్వితీయ కట్టడాన్ని కాపాడేందుకు ఆ నాటి ప్రభుత్వం మొత్తం తాజ్ మహల్ ను వెదురు కర్రలతో కప్పివుంచింది. ఆ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది.-

4, మార్చి 2013, సోమవారం

పాత చింతకాయ పచ్చడి - 6



సర్కారు దోపిడీ  - (16-09-2011)


పెట్రోలు ధరలు మళ్ళీ పెంచారు.మళ్ళీ పెంచారు అనడం కంటే ఇంకోసారి పెంచడానికి  వీలుగా మరోసారి పెంచారు  అనడం సబబుగా వుంటుంది. ఎందుకంటె పెంచడం  ఇది ఆఖరు సారీ  కాదు, మళ్ళీ పెంచరన్న పూచీ కూడా   లేదు.
పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం – అది ఇప్పటి  యూ.పీ.యే. కావచ్చు ఒకప్పటి ఎన్.డీ.యే. కావచ్చు – చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు. కానీ ఈ సారి  లీటర్ ఒక్కింటికి మూడు రూపాయల పైచిలుకు ఒక్కమారుగా పెంచిన సందర్భంలో పాలకులు ఇచ్చిన వివరణ వేరుగావుంది. మన రూపాయి మారకం విలువ అతి దారుణంగా పడిపోయిందట. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ – రూపాయి మారకం విలువలో వచ్చిన  తేడాల భారత ఆయిల్ కంపెనీలకు  లీటరుకు రెండు రూపాయల పైచిలుకు నష్టం వస్తున్నదట. ఆ కారణంగా పెట్రోల్ రిటైల్ ధరను లీటరుకు మూడు రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు దయతో అనుమతి ఇచ్చిందట.  అందువల్ల భారీగా పెంచిన  ధరను జనం  మంచిమనసు చేసుకుని  భరించాలట. పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా గ్రామఫోన్ రికార్డులా వినిపించే వివరణే ఇది. ఇక ఏమి చెప్పుదు సంజయా అని విలపించడం ఒక్కటే పాలితులకు మిగిలింది. రూపాయి విలువ పడిపోయినప్పుడు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలి. కానీ ఈ  విషయం ఏ వివరణల్లోను కానరాదు. సమయానుకూల మతిమరపుకు ఇది చక్కని ఉదాహరణ.
చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని
ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు.  
ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన  నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన  అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న  ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతా ఇంతాకాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకు వుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే  సులువయిన మార్గం. ఇది  తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. ఇవన్నీ చూసేవారికి  నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.
లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ  సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.
ఈరోజున దేశంలో సాధారణ పౌరులు అనేక వర్గాలనుంచి దోపిడీలకు గురవుతున్నాడు. పెట్రో ధరలను పెంచడం ద్వారా, లేదా కనీసం వాటిపై పన్నులను తగ్గించకపోవడం ద్వారా  సర్కారు కూడా ఈ దోపిడీదారుల సరసన చేరుతోంది.(16-09-2011)
NOTE:Courtesy Cartonist