మాటల ఊరేగింపు
‘ఎందుండి ఎందు బోవుచు ఇందులకేతెంచినారు? అంటాడు ప్రవరాఖ్యుడు తమ ఇంటికి అతిధిగా వచ్చిన యతితో.
('ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడకు పోతున్నారు?’ అని అడగడం మర్యాదగా భావించేవారు కాదేమో ఆ కాలంలో)
అలాగే, నాకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడయిన యాదగిరిని ఈ రెండు ప్రశ్నలు అడగడం అనవసరం.
కాళ్ళకు పసరు రాసుకోకపోయినా, చక్రాలు తగిలించుకోకపోయినా ఎక్కడి నుంచయినా రాగలడు, అలాగే ఎక్కడికి అయినా పోగలడు. అంచేత ఈ రెంటి నడుమ లభించిన విరామంలో అతడు చెప్పింది వింటూ పోవడమే విజ్ఞుల లక్షణం. నేను వయో వృద్ధుడిని. అతడు జ్ఞాన వృద్ధుడు.
యాదగిరి అంటే తెలియని వాళ్ళకోసం జర్నలిస్టు పాశం యాదగిరి అని పరిచయం చేస్తున్నాను.
కూర్చున్నది కాసేపే అయినా చాలా విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూనే చాలా సేపు గడిపాడు. అన్నీ రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. అతడికి మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ అంటూ అవసరం లేదు. దేని మీద అయినా ఆశువుగా మాట్లాడగలడు. సాధికారికంగా మాట్లాడగలడు.
అందుకే యాదోం కి బారాత్ (జ్ఞాపకాల ఊరేగింపు) లాగా అతడు బాతోం కి బారాత్. (మాటల ఊరేగింపు)
"గోల్కొండ కోటలో అభ్సీ గేట్ వుంది తెలుసు కదా!" అన్నాడు. అంటే మనల్ని జవాబు చెప్పమని కాదు. దాన్ని గురించి చెప్పబోతున్నాడు అని అర్ధం.
ఔరంగజీబు సైన్యాలు గోల్కొండపై దాడి చేసినప్పుడు, ఆ కోటకు ఉన్న అయిదు ప్రధాన ద్వారాలలో ఒక ద్వారానికి ఆఫ్రికన్ దేశం అభ్సీనియాకు చెందిన మహమ్మద్ బిలాల్ అనే నీగ్రో బంటు కాపలాగా వున్నాడు. అతడు అక్కడ వున్నాడు అంటే గోల్కొండ ప్రభువులకు అపరిమితమైన భరోసా. అతడి చివరి శ్వాస వరకు చిట్ట చివరి శత్రువు కూడా కోటలోకి అడుగుపెట్టలేడని వారికి ఓ నమ్మకం. అందుకే ఆ గేటుకు అబ్సీ గేటు అని పేరు పెట్టారు (ట).
ఇంతకీ యాదగిరి ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు. బంటు అనేది తెలుగు పదం కాదని చెప్పడానికి.
“సర్కారు జిల్లా తెలుగు అంటారు. నిజానికి అందులో తెలుగు అనే పదం తప్ప తెలుగే లేదని అతడి ముక్తాయింపు. ఏమిటంటే సర్కారు తెలుగు కాదు, జిల్లా తెలుగు కాదు. ఆ రెండూ ఉర్దూ పదాలే.
"నిజం ఒప్పుకోవాలి. అసలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడుకునే భాషలోనే ఎక్కువ ఉర్దూ పదాలు మనకు వినవస్తాయి, కనబడతాయి. భాష విషయంలో వారిది ఉదారవాదం" అని తీర్మానించాడు.
“అమితాబ్ బచన్ వాయిస్ కల్చర్ గురించి గొప్పగా చెబుతారు. నిజానికి ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచన్ కు ఈ ఖ్యాతి దక్కాలి. ఆయన కొడుకు స్వరంలో స్పష్టత రావడం కోసం కఠిన మైన శిక్షణ ఇచ్చాడు. వేదాలు ఎక్కడా రాసిలేవు. వాటిలోని పనసలు ఒక పట్టాన కొరుకుడు పడవు. గురువు ముఖతః వాటిని విని బట్టీయం వేయాలి. శిష్యుల నోట ఎక్కడా ఉచ్ఛారణ దోషం రాకుండా చూడడానికి గురువులు చాలా కష్ట పడేవారు.
"ఒక్కో అక్షరానికి ఒక్కో అర్ధం వుంటుంది. తభావతు లేకుండా పలకాలి. ఉర్దూలో కబర్, ఖబర్ ఈ రెండు పదాలు దగ్గరగా అనిపిస్తాయి. కానీ ‘క’ ‘ఖ’ ఒక్క అక్షరం తేడాతో మొత్తం అర్ధం మారిపోతుంది.
"మసీదుల్లో ప్రార్ధనలు కూడా అంతే! అవి చదవడానికి మదర్సాల్లో గట్టి తర్పీదు ఇస్తారు. మహమ్మద్ ప్రవక్త మొట్టమొదట ఈ ప్రార్థన చదవడం కోసం ఎంపిక చేసుకున్నది బిలాల్ అనే వాడిని. మంచి స్వరం తప్పిస్తే అతడిలో గొప్ప అర్హతలు ఏమీ లేవు. అయినా పవిత్రమైన కార్యం కోసం ప్రవక్త అతడినే ఎంపిక చేసుకున్నాడు.
“సాహెబ్! సాహెబా!
సాహెబా అంటే తల్లి. మసాబ్ ట్యాంక్ అని పిలుచుకుంటున్న చెరువుకు అసలు పేరు మా సాహెబా టాంక్. కాలక్రమంలో మసాబ్ టాంక్ అయింది. చెరువు రూపురేఖలు లేకుండా పోయింది”
ఇలా సాగిపోయింది యాదగిరి వాగ్జరి.
మా పిల్లలు కూడా శ్రద్ధగా వింటున్నారు.
చాయ్ బిస్కెట్ వంటి స్వల్ప ఆతిధ్యం స్వీకరించి 'ఇక వెడతాను' అని లేచాడు.
అప్పటికి రాత్రి బాగా పొద్దుపొయింది.
"జర్నలిస్ట్ కాలనీలో కదా ఇల్లు. ఈ టైంలో ఎలా వెడతావు" అన్న ప్రశ్నకు నవ్వలేదు. సరికదా! రాజ కపూర్ నటించిన శ్రీ 420 హిందీ చిత్రంలోని పాట వినిపించాడు.
“మేరా జూతా హై జాపానీ, ఏ పంట్లూన్ ఇంగ్లిస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ దిల్ హై హిందూస్తానీ!
“నికల్ పడే హై ఖులీ సడక్ పర్ అప్నా సీనా తానే
మంజిల్ కహాఁ కహా రుకానా ఊపర్ వాలా జానే!”
ఇంకాసేపు వుంటే బాగుణ్ణు అనిపించింది.
“పక్కనే మెట్రో. చెక్ పోస్టు దగ్గర దిగితే జర్నలిస్ట్ కాలనీ” అన్నాడు.
పై పాట మళ్ళీ వినిపించింది. యాదగిరి పాడలేదు.
నాకే చెవుల్లో వినిపించినట్టు అనిపించింది, యాదగిరి మాటలు విన్నాక. యాదగిరి వెళ్ళాక.
అలాంటి యాదగిరి, నాలుక మీద సరస్వతి, అరికాళ్ళలో చక్రాలు వున్న యాదగిరి ఏడేళ్ల క్రితం 2019 సాలు చివరాఖర్లో ఆసుపత్రి పాలయ్యారు. స్టెంటు వేసిన డాక్టరు దాసరి ప్రసాద రావు గారు ‘ నీ గుండె గట్టిదే కానీ, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. మితృలు వనం జ్వాలా నరసింహారావు, కొండపల్లి పవన్ కుమార్ గారు నేను చూసివచ్చాము. బాగున్నాడు. కబుర్లు ఎప్పటిమాదిరిగానే చెబుతున్నాడు. దేవుడు చెప్పినా వినని యాదగిరి డాక్టరు చెబితే వెంటాడా!
తోకటపా:
చాలా చాలా ఏళ్ళక్రితం చెన్నై దగ్గరగా వున్న ఆంధ్ర ప్రాంతంలోని శ్రీ సిటీ ఎస్.ఈ జెడ్ వెళ్లేందుకు, వారి ఆహ్వానం మేరకు హైదరాబాదు ఎయిర్పోర్ట్ కు వెళ్ళాము యాదగిరి, నేను.
పనేమీ లేదు కనుక చాలా ముందస్తుగా వెళ్ళాము. ఫ్లయిట్ గేటు దగ్గర కూర్చుని
హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నాము.
నిజానికి అతడు చెబుతున్నాడు, నేను వింటున్నాను. టార్మాక్ పై ఆగివున్న విమానం దగ్గరకు ప్రయాణీకులను తీసుకువెళ్ళే ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయిన సంగతి మేము గమనించలేదు. గేటు క్లోజ్ చేశారుట.
వెళ్లి అడిగితే 'తరువాత ఫ్లయిట్ కు వెళ్ళండి' అని జవాబు. అదీ అయిదారు గంటల తర్వాత. దాదాపు గంట నుంచి గేటు మొదట్లోనే కూర్చుని వెయిట్ చేస్తున్నాము.
సాధారణంగా ఇలాంటి సందర్భాలలో సహనం కోల్పోయేది నేను. అలాంటిది ఆ రోజు యాదగిరి విశ్వరూపం చూసి నేను సైలెంట్ అయిపోయాను.
‘మేము ఎక్కకుండా విమానం ఎలా వెడుతుందో చూస్తాను’ అంటూ అక్కడి సిబ్బంది మీద విరుచుక పడ్డాడు. చివరికి వాళ్ళే దిగివచ్చి, మా ఇద్దరికోసం ఒక బస్సు తెప్పించి, విమానం ఎక్కించారు.
యాదగిరికి కూడా కోపం వస్తుందని ఆనాడు తెలిసింది.
ఈ మధ్య ఆగ్రహంతో మాట్లాడుతున్న యాదగిరి వీడియోలు కొన్ని చూసిన తర్వాత అది ధృవ పడింది.
'కాస్త స్పీడ్ తగ్గించవయ్యా బాబూ' అని చెప్పాలని అనిపిస్తుంది. కానీ అవతలి మనిషి సీతయ్య!ఎవరి మాటా వినడు అన్న సంగతి గుర్తుకు వస్తుంది.
(28-11-2026)
కింది ఫోటో: ఆసుపత్రి పడక మీద యాదగిరి

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి