18, మార్చి 2026, బుధవారం

అసాధ్యులు మన మధ్యలోనే వున్నారు – భండారు శ్రీనివాసరావు

 

“ఉడుముండదె నూరేండ్లును?
పడియుండదె పేర్మి పాము పదినూరేండ్లున్?
మడుగున కొక్కెర యుండదె?”
ఎన్నేండ్లు బతికామన్నది కాదు, ఏమి సాధించామన్నదే లెక్క అన్నది సుమతీ శతకకారుడు చెప్పిన మాట.
ఈ ఫేస్ బుక్ అనేది ఒక మహా సముద్రం. వెతుక్కుంటే ప్రాప్తాన్నిబట్టి గులకరాళ్ళు, మంచి ముత్యాలు దొరికే వీలుంది.
మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారికి మేలిమి ముత్యాలు పంచే ఒక రాయసకాడు ఇందులో కనబడ్డారు. పేరు హరి సింగ్ షెకావత్. ఆయన ఏది రాసినా ఇంగ్లీష్ లోనే రాస్తారు. అనేక విషయాల మీద రాస్తారు. చరిత్రలో మరుగున పడిన అంశాలు గురించి రాస్తారు. తెలిసిన చరిత్రలోనే మనకు తెలియని విషయాలు గురించి రాస్తారు. వ్యక్తుల గురించీ, వ్యవస్థల గురించీ రాస్తారు. అతిగా పొగడడం, అతిగా తెగడడం ఆయన రాతల్లో కనబడదు.
మా అన్నగారు చెప్పడంతో నేను వెతికి మరీ పట్టుకున్నాను. అన్నీ ఇంగ్లీష్ రచనలే. మచ్చుకు ఒకటి తెనుగు చేశాను. అదే ఇది.
“అద్భుతం! ఊహాతీతం! నమ్మశక్యం కాని విషయం!
మనదేశంలో ఒక వ్యక్తి వున్నాడు. కాదు, ఇటీవలి వరకు వుండేవాడు.
డాక్టరు, లాయరు, ఐపీఎస్, ఐఏఎస్, వైస్ చాన్సలర్, ఎం.ఎల్.ఎ., మంత్రి, ఎంపీ, పెయింటర్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్టు, సంస్కృతం, గణిత శాస్త్రంలో పండితుడు, చరిత్రకారుడు, కవి, రచయిత. వాట్ నాట్!
ఆయన చదవని చదువులేదు, చేయని డిగ్రీ లేదు. ఎం.బీ.బీ.ఎస్, ఎండీ గోల్డ్ మెడలిస్ట్, చరిత్ర, సోషియాలజీ, ఇంగ్లీష్, హిందీ, పొలిటికల్ సైన్స్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, సైకాలజీ మొదలైన వాటిల్లో ఎమ్మే చేశారు. ఇరవైకి పైగా డిగ్రీలు చేసి గిన్నిస్ రికార్డులకెక్కారు. 1978 బ్యాచ్ ఐపీఎస్, 1980 బ్యాచ్ ఐఏఎస్, 1981 లో ఎం.ఎల్.ఎ అయ్యారు. 1992 to 1998 నడుమ రాజ్యసభ సభ్యుడిగా వున్నారు.
విభిన్న రంగాల్లో విశిష్టంగా రాణించిన ఈ వ్యక్తి పేరు డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్ (DR. SHRIKANT JICHKAR) మహారాష్ట్రలోని ఒక సంపన్న మరాఠా కుటుంబంలో 1954లో జన్మించారు. 1973 నుంచి 1990 వరకు చదువులే శ్వాసగా బతికారు. చదవడం, పరీక్షలు రాయడం, డిగ్రీలు సాధించడం ఇదే ఆయన లోకం.
యువతకు ప్రధాన లక్ష్యం అయిన ఐఏఎస్ సాధించి కూడా ఆ సర్వీసులో పనిచేసింది నాలుగు నెలలే. తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి, 26 ఏళ్ళ ప్రాయంలోనే దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే గా మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. తరువాత మంత్రి అయ్యారు. ఆ పిమ్మట రాజ్యసభ సభ్యత్వం.
1999లో కేన్సర్ మహమ్మారి పాలపడ్డారు. వ్యాధి ముదిరింది. బతికేది కేవలం ఒక నెలే అని డాక్టర్లు చెప్పేశారు. అయినా ఆయన కుంగిపోలేదు. ఆ తరుణంలో ఒక యోగి ఆయన్ని చూడడానికి వెళ్ళాడు. ‘నువ్వు కోలుకుంటావు. నువ్వు చేయాల్సిన పనులు ఇంకా వున్నాయి’ అన్నాడు. సంస్కృతం అభ్యసించమని ప్రోత్సహించాడు. ఆయన ఆదేశాన్ని పాటించాడు. ఆయన అన్నట్టే, డాక్టర్లు విస్తుపోయేలా, శ్రీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు. సంస్కృతంలో డి.లిట్ పట్టా సాధించారు.
పుణే లో సందీపని పేరుతో ఒక విద్యాసంస్థ స్థాపించారు. నాగపూర్ లో కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. దానికి వైస్ చాన్సలర్ ఆయనే.
2004 లో ఊహించని ఘోరం జరిగిపోయింది. జూన్ రెండో తేదీన రోడ్డు ప్రమాదం లో శ్రీకాంత్ కన్నుమూశారు.
భయంకరమైన కేన్సర్ ని సయితం జయించిన ఆయన ఆ ప్రమాదంలో మరణాన్ని ఎదుర్కోలేక, 49 ఏళ్ళ పిన్న వయస్సులోనే తలవాల్చేసారు. ఏదైనా సాధించాలి అంటే వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించి ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. సుమతీ శతకకారుడి వాక్యాన్ని నిజం చేశారు.
(COURTESY : SHRI HARISINGH SHEKHAWATH)
కింది ఫోటో:
డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్ (DR. SHRIKANT JICHKAR)








కామెంట్‌లు లేవు: