15, మార్చి 2026, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (282) : భండారు శ్రీనివాసరావు

 

‘దొర’కునా ఇటువంటి అధికారి
ఫిబ్రవరి 27 - మార్చి 13
ఈ మధ్యలో ఎన్ని రోజులు? కేవలం పద్నాలుగు. ఇంతలోనే ఆయన కన్నుమూత.
ఆయన్ని తలచుకుని, ఆయన రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం గురించి రాసిన తర్వాత ఆయన జీవించింది పద్నాలుగు రోజులే. మొన్న మధ్యాన్నం టీవీల్లో మాజీ డీజీపీ హెచ్ జే దొర మరణం అనే స్క్రోలింగ్ చూడగానే నెత్తిన పిడుగు పడిన ఫీలింగు.
వెంటనే మాజీ ఐ పి ఎస్ అధికారి మా మేనకోడలు మొగుడు అయిన రావులపాటి సీతారామారావు గారికి మెసేజ్ పెట్టాను. ఆయన ‘అవును ‘ఇప్పుడు అక్కడికే వెడుతున్నాను’ అనే జవాబు ఇచ్చారు.
దొరగారి తలితండ్రులు ఏరికోరి మంచి పేరు ఆయన బారసాల నాడే పెట్టారు. పేరుకు ముందు శ్రీ అక్కరలేని పేరు. ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా దొరగారు అనాల్సిందే.
స్పురద్రూపి అంటే దొరగారే. చూడగానే ఆకర్షించే అయస్కాంతం లాంటి మనిషి. దానికి తగ్గ వ్యక్తిత్వం. కోపం లేని ఈ మనిషికి పోలీసు ఉద్యోగం ఎవరిచ్చారు అనిపించేటంత మంచితనం. చిదిమితే పాలు కారుతాయనిపించే సుకుమ కోమల వదనం, మృదువైన శరీర ఛాయ. సదా దరహాసంతో కనబడే దొరగారిలాంటి పోలీసు అధికారిని నేనైతే చూడలేదు.
అల్లాటప్పా పోలీసు ఉద్యోగం కాదు. ఏకంగా పోలీసు శాఖకే సర్వాధిపతి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. దేశం గర్వించే సీబీఐ సంస్థకు డైరెక్టర్ చేసిన వ్యక్తి. అలాంటి మనిషితో చిరకాల పరిచయం వుండడం అనేది రేడియో విలేకరిగా నా అదృష్టం.
నిన్నా ఈరోజు మీడియాలో పత్రికల్లో దొరగారి మరణ వార్తలే. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగిన జూబిలీ హిల్స్ మహాప్రస్థానంలో దొరగారి భౌతికకాయాన్ని వుంచిన పాడెను ప్రస్తుత తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు కమిషనర్లు సజ్జనార్, రమేశ్ మోస్తూ కనిపించిన దృశ్యాలను చూసినప్పుడు, రిటైర్ అయి దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా పోలీసు అధికారుల గుండెల్లో ఆయన పట్ల ఆనాటి గౌరవ ప్రతిపత్తులు అలాగే చిరస్థాయిగా ఉన్నాయన్న విషయం విదితమైంది.
ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి దినపత్రిక మాజీ ఎడిటర్, ఒకానొక కాలంలో జ్యోతిలో నేను కలిసి పనిచేసిన పాత్రికేయ మితృలు ఐ.వెంకట్రావు గారు ఫోన్ చేసి దొరగారితో తన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే తాను దొరగారిని కలుసుకున్నానని చెబుతూ, ఇంత త్వరగా ఈ దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. 2011లో జరిగిన ఎన్టీఆర్ తో నేను అనే పేరుతొ దొరగారు రాసిన పుస్తకం ఆవిష్కరణ విశేషాలను ఓ పదిహేను రోజుల క్రితం నేను ఫేస్ బుక్ లో పంచుకున్న విషయాన్ని తాను దొరగారికి షేర్ చేసిన సంగతి చెప్పారు.
అలనాటి విలేకరులు అందరికీ దొరగారితో ఇదే విధమైన సాన్నిహిత్య సంబంధాలు వున్న సంగతులను రెండు రోజులుగా నేను చదువుతూనే వున్నాను. ఏం రాయాలో తెలియని అయోమయ స్థితి. ఒకటా రెండా అనేక అనుభవాలు ఆయనతో.
దొరగారు డీజీపీగా వున్నప్పటి మాట. నేను రేడియో స్టేషన్ కు వెళ్ళడానికి ఖైరతాబాదు మీదుగా వెడుతుంటే లక్ డి కా పూల్ వద్ద ట్రాఫిక్ జామ్. ముందు చూస్తే చాలా వాహనాలు ఆగిపోయి వున్నాయి. అందులో ఒకటి దొరగారిది. ఆయనా అందరిలానే ట్రాఫిక్ లో చిక్కుకుపోయి వున్నారు. కాసేపటి తర్వాత ఆఫీసుకు చేరి ఆయనకు ఫోన్ చేశాను. ‘మీరు కూడా ట్రాఫిక్ లో ఓపిగ్గా అలా ఎలా వుండగలిగారు? తలచుకుంటే నిమిషాల్లో క్లియర్ చేసేవాళ్ళు కదా!’ అని అడిగాను. ఆయన అన్నారు.
’నా ఒక్కడి సమస్య కాదు కదా! సమస్యకు పరిష్కారం వెతకాలి. ఇప్పుడు అదే పని మీద వున్నాను’ అన్నారు ప్రశాంతంగా.
దొరగారి మరణంతో తెలుగు రాష్ట్రాలు ఒక మంచి పోలీసు అధికారిని కోల్పోయాయి.
కింది ఫోటోలో: ఎడమనుంచి కుడికి:
శ్రీయుతులు హెచ్, జే. దొర, (Former DGP), ఎస్. రామచంద్రరావు, (Former CPRO to then CM NTR), భండారు శ్రీనివాసరావు, ఎస్.వి. ప్రసాద్, ( Former Chief Secretary of United AP), రావులపాటి సీతారామారావు, ( Former IGP), జ్వాలా నరసింహారావు (Former CPRO to first CM of Telangana, KCR), దేవీప్రియ (కవి, రచయిత)






15-03-2026
(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: