4, మార్చి 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (277) : భండారు శ్రీనివాసరావు

 

రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా?
ఆరేళ్ల క్రితం వరకూ నాది వారాలబ్బాయి జీవితం. పూటకు ఒక ఇంట్లో భోజనం మాదిరిగా నేను ప్రతి వారం ఒక టీవీ స్టూడియోకి వెళ్ళే వాడిని. సోమవారం ఒక ఛానల్ కు వెడితే మళ్ళీ వారం తర్వాత కానీ అదే ఛానల్ కు వెళ్ళే వాడిని కాదు. (మధ్యాహ్నాలు, సాయంత్రాలు మినహాయింపు, అలా రోజుకు మూడు పూటలు టీవీ చర్చలకు వెళ్ళిన సందర్భాలు అనేకం) మొదట్లో ఈ పద్దతి టీవీల వాళ్లకి నచ్చేది కాదు. ఆ రోజు అంశాన్ని బట్టి విశ్లేషకుడిని పిలవాలని అనుకునేవారు. కానీ చాలా సార్లు చెప్పాను కదా! నేనో సీతయ్యను, ఎవరి మాట వినను అని. చివరికి వాళ్ళే సర్దుకుపోయారు. ఆ విధంగా వారాలబ్బాయి అనే పేరు స్థిరపడింది.
ఉబెర్లు, ఓలాలు లేని రోజుల్లో టీవీల వాళ్ళు, వాళ్ళ కార్లు పంపేవాళ్ళు. ఈ సౌకర్యం వచ్చిన తర్వాత వాళ్ళు బుక్ చేసిన ఈ కార్ల లోనే వెళ్లి వస్తుండేవాడిని. ఆ రోజుల్లోని ఓ జ్ఞాపకం ఇది.
ఓనాడు ఉదయం ఇంటి నుంచి మహా న్యూస్ ఛానల్ కు వెడుతున్నాను. క్యాబ్ డ్రైవర్లు మాటామంతీ కలపడం మామూలే. కానీ ఈ కరుణాకర్ అనే క్యాబ్ డ్రైవర్ అన్న ఒక్క మాటే నన్ను ఆశ్చర్యపరిచింది. ఆలోచనలో పడేసింది. కొంచెం కట్టె విరుపుగా వున్నా, అందులో నిజం లేకపోలేదు.
“మీరు మహా టీవీకి వెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు గారికి అనుకూలంగా కొన్ని మాటలు చెబుతారు. నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చాలా రోజులుగా టీవీల్లో చూస్తున్నాను. ఈ మధ్య తరచుగా రావడం లేదు. అది వేరే సంగతి”
ఏమనాలో తోచలేదు.
నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ ఓలా క్యాబ్ డ్రైవర్ పేరు కరుణాకర్. (OLA CAB : KARUNAKAR, TS 15UB 3347)
కరోనా ఉధృతం తగ్గి ప్రజాజీవనం మళ్ళీ గాడిలో పడుతున్న కాలం. మూతి గుడ్డ పెట్టుకుని మాట్లాడడం వల్ల ముందు అతనేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను కల్పించుకుని చెప్పేలోగా అతడే ఇంకా ఇలా అన్నాడు.
“మొన్న మిమ్మల్ని సాక్షిలో చూశాను. అక్కడా ఇంతే. జగన్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడారు. నేను తప్పు పట్టను. మీలో నాకో సుగుణం కనిపించింది. బాబు అనుకూల ఛానల్లో బాబు వైపు మొగ్గు చూపినా, జగన్ గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా నోరు తెరిచి చెప్పరు. అలాగే సాక్షిలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతారు కాని బాబు గారికి వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టినా మాట్లాడరు. అయినా మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే, ఏ టీవీలో మాట్లాడినా మధ్యలో ఎక్కడో వీలు చేసుకుని ఆ ఛానల్ వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా, మీ మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అందుకే ఏ ఛానల్లో కనపడ్డా, యూ ట్యూబ్ లో కనపడ్డా నేను తప్పకుండా చూస్తాను”
అన్నాడు కరుణాకర్.
ఇంతకీ పొగుడుతున్నట్టా, తెగుడుతున్నట్టా! ఏదైనా దాచుకోకుండా మనసులో మాట చెబుతున్నాడు. జనం నాడి తెలుసుకోవడానికి ఇలాంటివాళ్ళే బెటరు.
“రాజకీయాలు అంటే ఇంట్రస్టా” అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలని.
“నాకొకటి చెప్పండి. వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుందండీ. నాకొక దోస్త్ వున్నాడు. వాడూ ఒకప్పుడు నాలాగే డ్రైవర్. ఒక నాయకుడి దగ్గర చేరి ఎక్కువ కాలం కాలేదు. ఏదో ఎన్నికల్లో మా వాడిని మా ఊరి వార్డు మెంబరు చేశారు. ఇప్పుడు అతడి వైభోగం వేరు. సొంత కారుంది. చిన్న ఇల్లు కట్టాడు. చాలా ఖరీదు చేసే సెల్ ఫోన్లు తరచూ మారుస్తుంటాడు. ఒక వార్డు మెంబరు అయితే ఇంత సంపాదన ఉంటుందా! ఈ లెక్కన బడా బడా నాయకుల రాబడి ఎంత వుంటుందో మరి”
జవాబు చెప్పే వ్యవధానం లేకుండా చేరాల్సిన గమ్యం చేరుకోవడం వల్ల అతడి ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు.
మర్నాడు ఉదయం మరో ఛానల్ కు వెళ్లాను. చర్చా కార్యక్రమం పూర్తయ్యాక చాయ్ తాగుతున్నప్పుడు చర్చలో పాల్గొన్న చోటా రాజకీయ నాయకుడు ఒకరు తన జేబు నుంచి యాధాలాపంగా తీసినట్టు ఒక పెద్ద నోట్ల కట్టలు రెండు బయటకు తీసి, మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. అంత పొద్దున్న పొద్దున్నే అంత డబ్బు జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏమి వుందో తెలవదు. వాటిని అలా బహిరంగంగా ప్రదర్శించాల్సిన సందర్భం కూడా కాదు.
అంతకు ముందు రోజు ఓలా డ్రైవర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.














(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: