'రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది)
దాని నట్టనడుమ రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు.
ప్రధాన భవనంలో మెట్లకింద, తెల్లని పంచె, లాల్చీ కండువా ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే, మేము ఒక పది మందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం, శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం.
‘రామ శబ్దం ఆకారంత పుంలింగం. రామః రాముడు ఏకవచనం. రామౌ ఇద్దరు రాములు, ద్వి వచనం, రామాః అనేకమంది రాములు, బహువచనం
అలాగే రామః, ప్రధమా విభక్తి, హే రామః, సంబోధన ప్రధమా విభక్తి’
ఇలా సాగిపోయేవి మాస్టారి నోటి వెంట సంస్కృతం పాఠాలు. అంతా భట్టీయమే. ఎంత వంట బట్టిందన్నది ఆ దేవుడికే ఎరుక.
ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా, ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ మేడ మెట్ల కిందే నడిచేది. అది ఒకప్పటి జ్ఞాపకం.
మరొకప్పటి మరో జ్ఞాపకం . చాలా కాలం క్రితం, నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం. అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం.
లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతి వేళ్ళపై గట్టి పట్టు చిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది. ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్ని భాగాలను ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
లండన్ లోని ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునే వాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.
మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!
అన్నట్టు గతంలో ఆకాశవాణిలో సంస్కృతం పాఠాలు బోధించేవాళ్లు. మరిప్పుడు పరిస్థితి ఏమిటో Sivaramaprasad Kappagantu శివరామ ప్రసాద్ కప్పగంతు వారు చెప్పాలి.
తోకటపా: మొన్న సంక్రాంతికి మా ఊరు కంభంపాడు వెళ్ళాము. కంచిలో ఒక సంస్కృత విద్యాలయంలో వేదం అభ్యసిస్తున్న ఒక కుర్రవాడు మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ తాతగారు ఇంగువ పురుషోత్తమ శర్మగారు, సంస్కృతం మీద తనకున్న భక్తి గౌరవాలతో మనుమడు చిరంజీవి విజయ కృష్ణ శర్మను అక్కడ చేర్పించాడు.
చదువు, బస, భోజనం అన్నీ ఉచితం. కాకపోతే మెడిసిన్ లాగా చాలా ఏళ్ళు చదవాలి. కష్టపడి చదవాలి. తెల్లవారుఝామున నిద్ర లేవాలి. బావి దగ్గర చేదతో నీళ్ళు తోడుకుని తల స్నానం చేయాలి. గోవులకు మేత వేసి పాలు పితకాలి. అక్కడ చదువుకునే పిల్లలు అందరూ ఆవు పాలే తాగాలి. గోక్షీరంతో తయారైన పెరుగుతో భోజనం చేయాలి. మొత్తం సాత్వికాహారం. అంత చిన్నతనంలో అంత దూరం వెళ్లి సంస్కృతం నేర్చుకుంటున్న ఆ పిల్లవాడిని చూస్తే చాలా ముచ్చటేసింది.
కింది వీడియోలో తాను నేర్చుకున్న సంస్కృత పనసలను మాకు వినిపించాడు.
https://www.facebook.com/reel/1468401071626669
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి