నగరానికి ఏమైయింది?
1975 వ సంవత్సరం.
రేడియోలో విలేకరి ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు చేరకముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ కడ్డీలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు పచ్చటి అనాబ్ షాహీ ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి. ఇప్పుడు అదే తటాకం, ఏడాదిలో చాలా నెలలపాటు వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
నేను రేడియోలో చేరిన తొలి రోజుల్లో స్టేట్ బ్యాక్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను హైదరాబాదు విలేకరులకు చూపించడానికి ఒక వ్యానులో కొందరు పత్రికా ప్రతినిధులను తీసుకు వెళ్ళారు. ఆ బృందంలో నేను కూడా వున్నాను. అరగంట లోపలే నగరం పొలిమేరలకు చేరాము. (ఇప్పుడది అసాధ్యం అని అందరికీ అనుభవైకవేద్యమే!
అక్కడినుంచి అడవి దారిలో మా ప్రయాణం సాగింది. బాటకు ఇరువైపులా పొడవాటి చెట్లు. ఆ వెనుక దట్టమైన అడవి. ఇప్పుడు అడవి సరే, పెద్ద పెద్ద చెట్లు కనబడడం కూడా అపురూపం. వన మహోత్సవాల పేరుతొ రహదారులకు అటూ ఇటూ నాటిన చెట్లు కనబడతాయి. నిజానికి ఈ ఉత్సవాల సమయాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రకటించుకున్నట్టు, నాటిన మొక్కలు అన్నీ పెరిగి పెద్దవి అయివున్న పక్షంలో గత యాభయ్ ఏళ్ళలో నగరాలు, పట్టణాలు అన్నీ దట్టమైన అడవుల మధ్య వుండేవి.
నా చిన్నతనంలో కాలువ గట్ల మీద వరసగా అనేక చెట్లు వుండేవి. వాటిపై నెంబర్లు వేసేవాళ్ళు, ఎవరైనా దొంగతనంగా చెట్టు నరికితే కనిపెట్టడం కోసం. అక్రమంగా చట్లు నరికితే శిక్షలు కఠినంగా వుండేవి. కనుకనే చెట్టు నరకడానికి భయపడే వాళ్ళు. ఇప్పుడా భయమేదీ! ఆ భయమే వుంటే వెనుకటి అడవులు ఎలా మాయమయ్యేవి?
నేను ఖమ్మం స్కూల్లో చదువుకొనేటప్పుడు, అప్పుడు డీపీఆర్వోగా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి వెంట ఒకసారి ఆయన వ్యానులో భద్రాచలం వెళ్లాను. కొత్తగూడెం, పాల్వంచ తరువాత అన్నీ కారడవులే. రాత్రి వేళల్లో క్రూర మృగాలు సంచరిస్తాయని ప్రయాణాలు చేయడానికి సంకోచించేవాళ్లు. ఇప్పుడా అడవులు లేవు, ఆ భయాలు లేవు. పచ్చని చెట్లే కనబడకుండా పోయాయి.
ఎండలు మండుతున్నాయని, అకాల వర్షాలు కురుస్తున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయం కృతం.
తోకటపా:
కింది చిత్రాన్ని చూడండి.
ఈ పాటి ఎత్తు ఎదగడానికి నాకు 80 ఏళ్ల టైమ్ పట్టింది. నా వెనుక వున్న వృక్షం ఆకాశమంత ఎత్తు ఎదగడానికి ఎన్ని దశాబ్దాలు గడిచి పోయాయో మరి. ఇంత కాలం దానిని నరకకుండా కాపాడిన వారిని మెచ్చుకోవాలి. మనదేశం కాదు కనుక బతికిపోయింది.
గత పాతికేళ్లలో నేను అనేక సార్లు అమెరికా వెళ్లాను. అక్కడి అనేక నగరాల మాదిరిగానే మా వాడు వుంటున్న సియాటిల్ కూడా పచ్చని నగరం. ఇన్నేళ్ళలో చెట్టు కాదు కదా చెట్టు కొమ్మ కొట్టడం కూడా నేను చూడలేదు.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి