ముసలితనంలో వసంతాలు
ఫోటో: 500 KB JPG
సంతకం : 500 KB JPG
ఆధార్: I MB PDF
ఏవిటో అంతా అయోమయం, ఒక్క ముక్కా అర్ధం కాదు.
యాభయ్ అయిదేళ్ళ క్రితం ఒక ఆగస్టు నెలలో నేను బెజవాడ బందరు రోడ్డు పి.డబ్ల్యు.డి. గ్రౌండ్ స్టాపులో పోరంకి వెళ్ళే ఒకటో నెంబరు సిటీ బస్సు ఎక్కి పశువుల ఆసుపత్రి వద్ద దిగి అక్కడికి దగ్గరలో వున్న ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారి ఛాంబర్ లోకి వెళ్లి కలిసి నమస్కారం పెట్టాను. పెట్టి నేను పలానా అని చెప్పాను. వారు నా వైపు తేరిపార చూస్తూ, ‘మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా!పో పైకి వెళ్ళు. అక్కడ ఉపేంద్రబాబును కలువు. కలిసి నేను పంపాను అని చెప్పు’ అన్నారు. అలా నా తొలి ఉద్యోగం ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా చేరిపోయాను.
నార్ల గారి నోటి మాటే నా నియామక పత్రం.
అయిదేళ్ళ జ్యోతి కొలువు తర్వాత, 1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియో, ప్రాంతీయ వార్తావిభాగంలో అసిస్టెంట్ ఎడిటర్ (రిపోర్టింగ్) అనే డిజిగ్నేషన్ తో మరో ఉద్యోగంలో చేరాను. నిజానికి అది రిపోర్టర్ ఉద్యోగం. స్టేషన్ డైరెక్టర్ పేషీలో రిపోర్ట్ చేసి న్యూస్ యూనిట్ కి వెళ్లాను.
ఆ రోజు బాగా జ్ఞాపకం వుంది. వెళ్లేసరికి రంగనాధరావుగారు ఏదో పని చేసుకుంటూ కనిపించారు.
పరిచయాలు అయిన తర్వాత ఏం పని మీద వచ్చావన్నట్టు నా వైపు చూసారు. నా మొహంలో రంగులు మారడం చూసి, “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది? రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులు చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు.
“ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడిటేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా! తెలిసిందా!” అన్నారు.
ఆ విధంగా ఉద్యోగంలో చేరిన రెండో రోజే నాకు రేడియో విలేకరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డు, దాన్నే అక్రిడిటేషన్ కార్డు అంటారు, పెద్ద శ్రమ లేకుండానే చేతికి వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభయ్ ఏళ్ళ పాటు నిరాఘాటంగా ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కార్డు నాకు అందుతూనే వుంది. కాకపోతే ఉద్యోగం చేసే రోజుల్లో రేడియో ప్రతినిధి అని, రిటైర్ అయిన తర్వాత ఇండిపెండెంట్ జర్నలిస్టు అని కార్డులో చిన్న మార్పు చేశారు.
ఈ కార్డు ద్వారా ప్రయోజనాలు కొన్ని వున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మూడో వంతు చార్జీ చెల్లించి ప్రయాణాలు చేయవచ్చు. ఈ కార్డు చూపించి రైల్వే నుంచి పొందే మరో కార్డు ద్వారా రైళ్ళలో సగం చార్జి చెల్లిస్తే సరిపోతుంది. అసలు ముఖ్యమైన వృత్తిపరమైన ప్రయోజనం సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలోకి ప్రవేశం.
ఉద్యగంలో సర్వీసు పెరుగుతున్న కొద్దీ బస్సు రాయితీని చాలామంది జర్నలిస్టులు వాడుకోవడం మానేశారు. రైల్వే వాళ్ళు తమంతట తామే రాయితీ ఇవ్వడం మానేశారు. సంఖ్య పెరగడం వల్లనో ఏమో సచివాలయం వంటి చోట్ల కొన్ని ఆంక్షలు పెట్టారు.
2005లో రిటైర్ కావడానికి ముందు నుంచే నేను ఆర్టీసీ, రైల్వే రాయితీలు తీసుకోవడం మానేశాను.
యాభయ్ ఏళ్ళ క్రితం ఉన్న కొన్ని వెసులుబాట్లు ఇప్పుడు బొత్తిగా లేవనే చెప్పాలి. మరి ఎందుకు ఈ కార్డు? కేవలం గుర్తింపు. అంతే! సీనియర్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వగల ఏకైక గౌరవం ఇదొక్కటే.
వెనుకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క ఐ ఏ ఎస్ అధికారి వుండేవారు. మరిప్పుడో. పెరుగుతున్న అవసరాలను బట్టి ఉద్యోగుల సంఖ్య పెరగడం అనివార్యం.
నేను ఆంధ్రజ్యోతిలో చేరిన కాలంలో ఒకే ఒక విలేకరి, అదీ పార్ట్ టైం విలేకరే, బెజవాడకు సంబంధించి అన్నీ చూసుకునే వారు.
ముఖ్యమైన నగరాల్లో సొంతంగా స్టాఫర్లను నియమించుకునే పద్దతులు చాలాకాలం తర్వాత అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు పేట పేటకు, వాడవాడకు విలేకర్లు.
యాభయ్ ఏళ్ళ క్రితం విలేకరుల సంఖ్య కూడా తక్కువే. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పది కుర్చీల్లో రెండు ఖాళీ వుండేవి. ఇప్పుడో. స్టేడియంలో పెట్టినా జాగా సరిపోయేలా లేదు అని హాస్యోక్తిగా అనుకునే పరిస్థితి.
ఎలక్ట్రానికి మీడియా ఆవిర్భావం తర్వాత ఈ సమస్య బాగా పెరిగింది. పూర్వం విలేకరి, కెమెరామాన్, కెమెరా మోసే మనిషి, లైట్ బాయ్ ఇలా ఒక్కో సంస్థ నుంచి ఎందరో. న్యూస్ కవరేజ్ కి ఇంతమందీ అవసరమే ఆ రోజుల్లో.
సాంకేతికత పెరిగింది. కెమెరా సైజులు తగ్గాయి. ఓబీ వ్యాన్లు వచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలు పెరిగాయి. ఎక్కడి నుంచయినా అప్పటికప్పుడు వార్తలు, వీడియోలు పంపే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సోషల్ మీడియా ఆగమనంతో అసలు మీడియా స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
ప్రతి వ్యక్తికి కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు వుంటాయి. వ్యక్తి స్వాతంత్రం రాజ్యాంగం పౌరులకు ప్రసాదించింది. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి పూర్వకాలంలో లేని అవకాశం, స్వేచ్ఛ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా లభించాయి.
ఈ మార్పు ఇప్పుడు అందరి అనుభవంలోకి వస్తోంది. చేతిలో మొబైల్ వుంటే ఒక పత్రిక చేతిలో ఉన్నట్టే. దానితో రాజకీయ పార్టీలకు ఇదొక అవకాశంగా కనబడింది. ఫలితం ప్రతి పార్టీకి సొంతంగా మీడియా విభాగాలు. తప్పేమీ లేదు. సాధారణ మీడియా కూడా ఇటువంటి వాటికి అతీతంగా ఏమీ లేదు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల మీద పరిపాలనా వ్యవస్థలకు కొన్ని కంటికి కనపడని అదుపాజ్ఞలు వుంటాయి. ఈ సోషల్ మీడియాకు అలాంటివి లేవు.
‘నేనే రాజు, నేనే మంత్రి’ తరహా జర్నలిజం. కానీ చిన్నచూపు చూడడం, నిర్లక్ష్యం చేయడం కానీ కుదరని పని. భవిష్యత్తు ఈ మీడియాదే అని స్పష్టంగా కనబడుతుంటే కాదనడం సాధ్యమా! మార్పుని అంగీకరించక తప్పదు.
స్వేచ్ఛకు సంకెళ్ళు వేయడం ఎంత గర్హనీయమో, మితిమించిన స్వేచ్ఛ కూడా అంతే ప్రమాదకరం.
ప్రభుత్వాలు పరిమితి విధించే పరిస్థితులు లేనప్పుడు మీడియానే లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. సరే ఇదొక అనంతమైన విషయం ఇంతటితో వదిలేద్దాం.
తామరతంపరగా వస్తున్న ఈ కొత్త మీడియాకి కళ్ళెం వేయడం కుదరని పని. అంచేత గుర్తింపు కార్డులు ఇవ్వడం ప్రభుత్వాలకు అలవికాని పనిగా మారింది. ఫలితంగా కమిటీలు, సబ్ కమిటీలు. రిపోర్టులు. వీటి ఫలితం అక్రిడిటేషన్ల ప్రక్రియకు ఆన్ లైన్ పద్దతి అందుబాటులోకి తెచ్చారు. మంచిదే.
బస్సు, రైళ్లు, విమానాల టిక్కెట్లు, తిరుపతి దర్శనాలు, పాస్ పోర్ట్లు, వీసాలు అన్నింటికీ ఆన్ లైన్ ధరకాస్తులు. అలాగే అక్రిడిటేషన్లకు. అయితే ఇబ్బంది అల్లా ఈ ధరకాస్తుల అప్ లోడ్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా వుండాలి.
ఉదాహరణకు:
ముందే చెప్పినట్టు, ఫోటో: 500 KB JPG
సంతకం : 500 KB JPG
ఆధార్: I MB PDF
ఏవిటో అంతా అయోమయం, ఒక్క ముక్కా అర్ధం కాదు. రాయడం, పోస్టు చేయడం తప్పిస్తే నా బోంట్లకు ఇలాంటి కంప్యూటర్ పరిజ్ఞానం సున్నా.
గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చొన్నా ఫలితం వుండడం లేదని కొందరు వయోధిక జర్నలిస్టుల ఆవేదన.
(కింది ఫోటోలు: 1975 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నాకు మంజూరు చేసిన అక్రిడిటేషన్ కార్డులలో పోయినవి పోగా మిగిలినవి కొన్ని)
(ఇంకా వుంది )
1 కామెంట్:
Pity government and pity veterans like you.
కామెంట్‌ను పోస్ట్ చేయండి