చెదరని జ్ఞాపకం
ఇలా కూడా జరుగుతుందా అనిపించే సందర్భాలు జర్నలిస్ట్ జీవితంలో ఎదురవుతుంటాయి.
నాలుగేళ్ల క్రితం 2022 లో సరిగ్గా ఇదే రోజు.
ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది.
“భండారు శ్రీనివాసరావు గారా! సీఎం ఆఫీసు నుంచి. సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి” అంది ఓ గొంతు.
ఓ పాతికేళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం కలిగించేవి కావు. రిటైర్ అయి పదిహేడేళ్లు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం.
“శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి” అంటున్నారు అవతల కేసీఆర్ గారు. అయోమయంలోనే విన్నాను.
కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గరే వున్నాను’ అన్నాడు.
రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు.
డ్రైవర్ ని ఉండమని చెప్పి, అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు.
లిఫ్టులోపైకి వెళ్లేసరికి, 'రండి రండి భోజనం చేద్దాం' అని ఆహ్వానించారు కేసీఆర్.
చేసేవచ్చానని చెబితే, 'ఇలా మాతో వచ్చి కూర్చోండి' అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ.
భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు.
కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన.
ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి 'ఎక్కండి' అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేడేళ్లు. అందుకే నిబిడాశ్చర్యం.
హెలికాఫ్టర్ లో పక్కన కూర్చోబెట్టుకున్నారు.
అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు.
బహిరంగ సభలో ప్రసంగిస్తూ, 'నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు' అని ఆయన మైకులో చెబుతుంటే మతి పోయింది.
సభ ముగిసింది.
తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్.
పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు.
ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను.
'ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి' అన్నారు అక్కడ ఎవరితోనో.
ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను.
అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది.
కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎంతో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్.
అయితే నిజమే అన్నమాట.
ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు? ఈ భేతాళ ప్రశ్నలకు సమాధానం లేదు.
జరిగి నాలుగేళ్లు అవుతున్నా జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలి పోయాయి.
కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడడం ఒక్కటే మిగిలింది.
(ఈరోజు ఫిబ్రవరి 17, కేసీఆర్ గారి పుట్టినరోజు )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి