6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

రాజ్యం లేని భోజరాజు – భండారు శ్రీనివాసరావు

ఆయనకు, కవులు, రచయితలు, పాత్రికేయులు, సమాజంలోని వివిధ రంగాల వాళ్ళు బహు ఇష్టులు. ఒక్కముక్కలో చెప్పాలి అంటే ఆయనకు మనుషులంటే ఇష్టం. ఎప్పుడూ నలుగురిలో వుండడానికి అంతగా ఇష్టపడే మనిషిని మరొకర్ని చూడలేదు. ఆయన నిజమైన హ్యూమనిస్ట్. మానవతావాది.
అందుకే నిన్న హైదరాబాదులో జరిగిన ఆయన సంస్మరణ సమావేశానికి అంతమంది తరలి వచ్చారు. వారిలో పెక్కురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నలుగురితో పంచుకున్నారు.
ఇంతకీ ఆయన ఎవరంటే, మొన్నీమధ్య కన్ను మూసిన వెనిగళ్ళ వెంకట రత్నం గారు.
‘మంచి పనులు చేయడానికి వనరులు అక్కరలేదు, మంచి మనసు వుంటే చాలు అని నిరూపించి నిశ్శబ్దంగా మన మధ్యనుంచి నిష్క్రమించిన వ్యక్తి వెంకట రత్నం’ అని ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు వక్తలు పేర్కొన్నారు.
మంచి మనసే కాదు, అవసరంలో వున్నవారికి సాయపాడాలి అనే తపన కూడా ఆయనకు వుంది. ఆ తపన ఎంతవరకూ అంటే తాను చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్ధులకు ఉపయోగపడడానికి దానం చేయాలని కుటుంబసభ్యులకు నచ్చచెప్పే వరకూ వెళ్ళింది. వారూ ఆయన అంతిమ కోర్కెను తీర్చి, వెంకటరత్నం గారి భౌతిక దేహాన్ని ఒక వైద్య కళాశాలకు అప్పగించారు.
ఈ సమావేశానికి హాజరైన వారిలో కూడా కొందరిలో దేహ దానం చేయాలనే స్పూర్తి రగిలింది అంటే, మరణానంతరం కూడా ఆయన జీవిస్తున్నట్టే లెక్క.
అక్కడికి వచ్చిన వారిలో చాలామంది ఒక మాట చెప్పుకోవడం వినపడింది. నిజానికి మంచి ఆలోచనే.
డెబ్బయి దాటిన బంధు మిత్రులను చూడాలని అనిపించినప్పుడు, వాయిదా వేయకుండా వెంటనే వెళ్లి చూడాలి. ‘మొన్న ఆ పెద్దమనిషిని కలిసాను, నిన్ను గుర్తు చేసుకున్నారు’ అని ఎవరైనా చెబితే, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లి, ఆయన్ని చూసి రావడం మరీ మంచిది అనేది ఈ మాటల సారాంశం.



(05-02-2026)

కామెంట్‌లు లేవు: