7, మే 2022, శనివారం

ఈ నగరానికి ఏమైయింది? – భండారు శ్రీనివాసరావు

 1975 వ సంవత్సరం.

రేడియోలో విలేకరి ఉద్యోగంలో చేరడానికి హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు కూడా చేరకముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ కడ్డీలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేరవరకు ద్రాక్ష తోటలు.

నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.

నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను. పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దగ్గర అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. అందులో నిండుకుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.

ఇప్పుడా లోయాలేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు. అవీ ప్రభుత్వం వారికి కారు చౌకగా ఇచ్చిన స్థలాల్లో.

హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమయిపోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.

గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. (అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి) ఇప్పుడు అదే తటాకం వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.

ఎండలు మండుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయం కృతం.

కామెంట్‌లు లేవు: