8, మే 2022, ఆదివారం

ముఖ్యమంత్రుల ‘ఇంటి’ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 08-05-2022, SUNDAY, today)

 

దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరాబాదుకు మారగానే ఆయన మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన వున్న దిల్ కుశ్ గెస్ట్ హౌస్ లో వుండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని వుండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలావుంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా! ఈ ఇల్లు ఎంత పెద్దగా వుందో చూస్తున్నారు కదా! మా ఆవిడ ఏ గదిలో వుందో కనుక్కోవడానికి అరగంట పడుతోంది’ అని నవ్వుతూ బదులిచ్చారు. తరువాతి కాలంలో సంజీవరెడ్డి బేగంపేట లోని గ్రీన్ లాండ్స్ ప్రభుత్వ అతిధి గృహాన్ని తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు సంజీవయ్య ఖుర్షిద్ జా అనే ఒక ప్రైవేటు భవంతిలో నివాసం వుండేవారు.

సంజీవయ్య గారి ప్రసక్తి వచ్చింది కనుక, కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని స్వగ్రామం  పెద్దపాడులో ఆయన సొంత ఇంటి పరిస్థితి గురించి చెప్పుకోవడం సముచితంగా వుంటుంది. పైగా  ఈరోజు మే ఎనిమిది ఆయన వర్ధంతి కూడా. 

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.

ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన దరిమిలా  ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు. 

నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత. 

"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.

ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది. 

ఢిల్లీ నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు. 

ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. 

 కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా రెండేళ్ళ తర్వాత సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా రోజులు ప్రస్తుతం విద్యుత్ సౌధకు సమీపంలోని ఏరువాక ప్రభుత్వ భవనంలో వుండి, తరువాత బేగంపేటలో గ్రీన్ లాండ్స్ ఎదురుగా, రోడ్డుకు ఆవలవైపు ఉన్న మరో ప్రభుత్వ భవనాన్ని(ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్) తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత అధికార నివాసభవనం ఉండాలనే బ్రహ్మానందరెడ్డి ఆలోచన ఫలితంగా ఆనందనిలయం రూపుదాల్చింది. వాస్తు చూసి ఏర్పాటుచేసుకున్నా ఎక్కువరోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవడంతో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. ఆంధ్రఉద్యమం కారణంగా రాజీనామా చేసి తప్పుకునేంతవరకు ఆయన కూడా ఆనంద నిలయంలోనే కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో వుంది.

తదనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో హోంమంత్రిగా వున్న సమయంలో పంజాగుట్ట ప్రాంతంలోని ద్వారకాపురి కాలనీలో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు అరకొరగా ఉన్నప్పటికీ చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చేసారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి. ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు. 

తదుపరి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పరిస్తితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు  బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇల్లు వుండేది. మంత్రిగా, కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఆయన అక్కడే వుండేవారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు. ముఖ్యమంత్రిగా జనాల తాకిడి ఎక్కువ. దాంతో ఆయన గతంలో సంజీవరెడ్డి నివాసం ఉన్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అధికార నివాసంగా చేసుకుని, దానికి జయప్రజా భవన్ అనే పేరు పెట్టారు.

ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రాం మాత్రం తాను అంతకుముందు మంత్రిగా వున్నప్పుడు వున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్ లోనే వుండిపోయారు. భవనం వెంకట్రాం తర్వాత ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ భాస్కరరెడ్డి లోగడ పీవీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆనంద నిలయానికి మారారు. 

ఇక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆబిడ్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసాలు ఒకటికి మించి గుర్తించి అందుకు తగిన సదుపాయాలు కల్పించే పద్దతి ఆయన హయాములోనే మొదలయింది. గండిపేటలోని తన ఆశ్రమాన్ని కూడా రెండో అధికార నివాసంగా మార్చుకున్నారు. కొన్నాళ్ళు ప్రతిపక్షంలో వుండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తు బాగుందని భావించారేమో తెలియదు, బంజారా హోటల్ సమీపంలోని తన కుమార్తె పేరిట ఉన్న ఒక చిన్న భవనంలో నివాసం వున్నారు. ప్రభుత్వం పక్కనే ఉన్న మరో భవనాన్ని అద్దెకు తీసుకుని ముఖ్యమంత్రి అవసరాలకు తగిన విధంగా వసతులు సమకూర్చడం జరిగింది. ఒక నెల రోజులపాటు ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు.

1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే నివాసం వున్నారు. హోదాకు, అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వమే కొన్ని వసతులు సమకూర్చింది.

వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నిమాసాలపాటు నాగార్జున సొసైటీలోని తన కుమార్తె ఇంట్లో నివాసం వున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత నివాస భవనం ఉండాలనే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆలోచనను ఆయన మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చారు. బేగం పేట మంత్రుల క్వార్టర్స్ లోని కొన్ని భవనాలను తొలగించి, అన్ని వసతులతో కూడిన విశాలమైన ఒక మంచి భవనాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొద్ది నెలల కాలంలోనే నిర్మించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు అందులోనే నివాసం వున్నారు.

తరువాత ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిన కే. రోశయ్య ఆ భవనంలో చేరడానికి ఇష్టపడలేదు. అమీర్ పేటలోని ప్రకృతి చికిత్సాలయం దాపునే తాను నిర్మించున్న భవంతిలోనే వుండిపోయారు. ముఖ్యమంత్రిగా రోశయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా కాలం జూబిలీ హిల్స్ లోని సొంత ఇంట్లోనే వున్నారు. ఆ తరువాత తన నివాసాన్ని బేగం పేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి మార్చుకున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సొంత ఇంట్లో నివసించిన తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్ళు  వై.ఎస్. హయాములో నిర్మించిన నివాసంలోనే వున్నారు. అక్కడ వున్న సోఫాలను కానీ, ఫర్నిచర్ ను కానీ మార్చకుండా అందులో నివసించారని కేసీఆర్ వ్యక్తిగత అధికారులు చెబుతుంటారు. అక్కడే వుంటూ, పక్కనే కొత్తగా విశాలమైన ఆధునిక వసతులు కలిగిన సీఎం క్యాంపు కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేశారు.

పోతే, అటు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు తాత్కాలికంగా కృష్ణానదీ తీరాన ఒక ప్రైవేటు గెస్టు హౌస్ ను తన అధికార నివాసంగా మార్చుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు దాన్నే తన నివాసంగా ఉపయోగించుకున్నారు. 2019లో  ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షనేత జగమ్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నకాలంలో అమరావతి ప్రాంతంలో నిర్మించుకున్న ఇంటినే ఆయన అధికార నివాసంగా మార్చుకున్నారు.
3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పార్క్ హయతో హోటల్ లో ప్రెసిడెంట్ సూట్ ను చంద్రబాబు రోజుకు లక్షన్నర రూపాయల అద్దెతో గడిపిన అంశాన్ని ఎలా మర్చిపోయారు?

అజ్ఞాత చెప్పారు...

సుదీర్ఘమైన మీ అనుభవం వలన, మీకు చాలా మంది నాయకుల చీకటి రహస్యాలు కూడా తెలిసి ఉంటాయి కదా ? అవి కొన్ని పంచుకోవచ్చు కదా ? ఏమి అనుకోకపోతే మీరు రాసే కొన్ని ఆర్టికల్స్ చప్పగా ఉంటున్నాయి ( మీ రష్యా అనుభవాలని తప్పిస్తే ), కొంచెం వేడి పెంచండి సర్ .

Chiru Dreams చెప్పారు...

రాజకీయనాయకుల చికటి బాగోతాలు కామనేగానీ, ఏమీడియా అయినా అవతలిమీడియా బాగోతాలు పేర్లతో సహా ఎందుకు బయటపెట్టరు?