18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఏడుకొండల వాడా ! – భండారు శ్రీనివాసరావు


తిరుపతి వెళ్లేవారికి సిఫారసు ఉత్తరాలు మొదలైన సాయం చేసేవాడిని కానీ నేను వెళ్ళింది చాలా తక్కువసార్లు. కొండమీద ఈ వీ.ఐ.పీ. ల గొడవ ఏమిటి, దేవుడి ముందు అందరూ సమానులే కదా! అనేది నా వాదన.
దీనికి మా పెద్దన్నయ్య జవాబు చెప్పాడు.
‘నిజమైన భక్తులు, ఆ మాటకు వస్తే సామాన్యజనం తిరుపతిలో సౌకర్యాల కోసం చూసుకోరు. వాళ్లకి అది టూరిస్టు ట్రిప్ కాదు. క్యూ లైన్లలో నానా అవస్థలుపడి దర్శనం చేసుకునేవారిని అడిగి చూడండి, దర్శనం తృప్తిగా అయిందని చెబుతారు. మధ్య తరగతి వారికి దేవుడి మీద కన్నా తమని దాటిపోయే వీఐపీ ల మీదే కన్ను. వారికి అలా ఎందుకు మాకు ఇలా ఎందుకు, అందరం సమానమే కదా అంటారు. అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో భక్తులు అందరూ అక్కడ ఉచితంగా పెట్టే రొట్టెలనే మహాప్రసాదంగా ఆరగిస్తారు. మనం తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా కాకుండా సంపన్నుల విహార ప్రదేశంగా మార్చి వేశాము”
మా అన్నయ్య మాటలు నాకు సదా గుర్తుకు వచ్చి అక్కడికి పోవడం దాదాపు మానుకున్నాను. ఎందుకంటే నేనూ మధ్యతరగతి వాడినే. ఆ మనస్తత్వం వున్నవాడినే.
ఇటీవల అనుభవంలోకి వచ్చిన ఓ విషయాన్ని తెలపడం కోసమే ఇది రాస్తున్నాను.
రెండు రోజుల క్రితం కొత్తగా పెళ్ళిచేసుకున్న ఓ జంట తెలంగాణా టూరిజం ప్యాకేజీలో ఫ్లైట్ లో తిరుపతి వెళ్ళారు. వరుడికి అమెరికాలో ఉద్యోగం.
తిరుపతి భీమాస్ లో, కాలకృత్యాల కోసం డ్రెస్ మార్చుకోవడానికి గదులు ఇచ్చారు. బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి కొండమీదకు తీసుకు వెళ్లి దర్శనం చేయించారు. తర్వాత ‘ఓ గంట టైం వుంది. మీరు ఎటైనా తిరిగి మళ్ళీ ఈ పాయింటుకు రండి. కిందికి దిగగానే భీమాస్ లో భోజనం’ అని చెప్పారు. అమెరికా కుర్రాడు ‘తిరుమల వచ్చి దేవుడి ప్రసాదం తినకుండా హోటల్ భోజనం ఏమిట’ని తిన్నగా వెంగమాంగ భోజన సత్రానికి భార్యను తీసుకువెళ్లి భోజనం చేశాడు. హైదరాబాదు నుంచి వెళ్ళిన తోటి ప్రయాణీకులు కింద భీమాస్ లో భోజనం చేశారు.
(18-02-2022)

5 కామెంట్‌లు:

sasi చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sasi చెప్పారు...

అసలు మాట పడనివ్వరె మీ ప్రభుత్వాన్ని.తిరుమల కొండకి వచ్చాక ఎవరికైనా కొన్ని రొజులు ఉండాలి అనిపిస్తుంది అక్కడ ప్రశాంతతకి, ఆధ్యాత్మతకి. ఎవరైనా అక్కడ ప్రసాదం మాత్రమే తినాలని ఎలా చెప్తారు.మరి అదే విధంగా వసతి కూడా అందరికీ సమానంగా ఇవ్వొచ్చుగా

bonagiri చెప్పారు...

"కొండపై ఎటువంటి వ్యాపారం జరుగకుండా చూడాలి. భక్తులకు సాత్వికమైన భోజనం, పిల్లలకు పాలు మొదలైనవి దేవస్థానం ఉచితంగా అందచేయవచ్చును."
- 13 ఏళ్ల క్రితం నా బ్లాగు లో తిరుమల గురించి వ్రాసిన వ్యాసం లోనిది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Link ఇవ్వగలరా, బోనగిరి గారు? Thanks.

bonagiri చెప్పారు...

https://bonagiri.wordpress.com/2009/02/18/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%ae%e0%b0%b2/