5, ఫిబ్రవరి 2022, శనివారం

కనిపించుటలేదు! – భండారు శ్రీనివాసరావు

 

జీవితంలో చాలా విషయాలు కనురెప్పల కిందే కరిగిపోతున్నాయి.
ఒకానొక రోజుల్లో రిక్షాలు, గూడు రిక్షాలు జన జీవనంలో భాగంగావుండేవి. ఆ రోజుల్లో రోడ్డుమీదకు రాగానే కనబడే మొట్ట మొదటి రవాణా వాహనం గూడు రిక్షా. ఇంటి గేటు వేస్తున్న చప్పుడు కాగానే నెమ్మదిగా రిక్షా లాక్కుంటూ వచ్చి ‘రిక్షా కావాలా బాబూ, ఎక్కడికి వెళ్లాలంటూ’ చనువుగా చేతిసంచీ తీసుకువెళ్ళే రిక్షా తాతలు, అందరి జ్ఞాపకాల్లో పదిలంగా వుండేవుంటారు. రిక్షాలు లాగేవాళ్ళు కధానాయకులుగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలే వచ్చాయంటే గతంలో ‘రిక్షాలు’ ఎలాటి సోషల్ స్టేటస్ అనుభవించాయో అర్ధంచేసుకోవచ్చు.

ఇప్పుడీ రిక్షాల కాలం చెల్లిపోయి వాటితో పొట్టపోసుకునేవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. అభివృద్ధి వల్ల కలిగే అనర్ధాల్లో ఈ పరిణామం ఒక భాగం. కొత్తనీరు వచ్చి పాతనీటిని నెట్టివేయడం కొత్తేమీకాదు. కాకపొతే, అలా మరుగునపడిపోతున్న విషయాలను ఇలా నెమరు వేసుకోవడం వల్ల కలిగే ఆనందమే వేరు. చిన్ననాటి ఫోటోలను చూసుకున్నప్పుడు కలిగే సంతోషానికి వెల, విలువ కట్టగలమా?

2010లో అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలు పాతలోని మధురిమను మరోసారి అనుభవంలోకి తెచ్చాయి. పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా ఇక్కడ ఈ పరాయి దేశం వాళ్ళు యెంత జాగ్రత్త పడుతున్నారో కూడా అర్ధం అయింది.
1889లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.

దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలు అంతస్తుల ఆధునిక సుందర భవనాలను నిర్మించుకున్నారు. అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంటవుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు. ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడగడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే, పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న కొత్త మోజు ఎలాటిదో అర్ధం చేసుకోవచ్చు.

అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను అలాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు. (విజయవాడ లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ఎత్తేసిన తరువాత దాన్ని ఒక రహదారిగా మార్చేసిన సంగతి ఇక్కడ గమనార్హం)

ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
పోతే, గూడు రిక్షాలేకాదు, కలికానికి కూడా కనబడకుండా పోతున్న, అంతరించి పోతున్న వస్తువుల జాబితా మన దగ్గర తక్కువేమీ లేదు. తిరగళ్లు, రోకళ్లు, రుబ్బురోళ్లు, ఎడ్లబళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత. అన్నట్టు చాంతాడు కూడా ఇక ఇలాటి సామెతలకే పరిమితం.


కామెంట్‌లు లేవు: