18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అధికారులూ ! గొడ్డలి దాకా తేవద్దు!! – భండారు శ్రీనివాసరావు

 మా చిన్నప్పుడు పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు వచ్చేవి.

“అందాల సినిమా తార ఇలా చెబుతోంది.

”నా చర్మ సౌందర్యం కోసం నేనెప్పుడూ పలానా టాయిలెట్ సోప్ నే వాడతాను”

ఆ మాటలు నమ్మి ఆ  సబ్బు వాడేవారు ఎంతోమంది.

చర్మ సౌందర్యం బాగుపడక పోయినా ఓ రెండు రూపాయలతో ఆ ఆసక్తి ఆ అనురక్తి  తీరిపోయేది. 

ఇవ్వాళ    ఫేస్ బుక్ లో ఒక ప్రకటన చూశాను. ఇన్ఫోసిస్ సంస్థ స్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని ఇంటర్వ్యూ ఆ వీడియోలో వుంది (అయితే ఆయన వాయిస్ లేదు) .

ఆయన  చెప్పినట్టు రాసిన మాటల సారాంశం ఏమిటంటే పద్దెనిమిది వేలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది రాత్రికి రాత్రి పిల్లల్ని పెడుతుందని. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మడి చేత డబ్బు బదిలీ చేయించి అది ఎలా పెరుగుతుందో ప్రత్యక్షంగా చెప్పించారు, ఆవిడ చేతే.

ముందు చెప్పిన సినిమా తార ఆ సబ్బు పొరబాటున కూడా వాడివుండదు. అంతటి అందాల తార స్వయంగా చెప్పింది కదా అని సామాన్యులు అదే సబ్బు కొంటారు.

ఇప్పుడు నీలేకని గారి ఇంటర్వ్యూ పేరుతొ వచ్చిన ఈ లింక్  టెక్స్టు చూసినప్పుడు ఆ సినీ తార ప్రకటన గుర్తుకు వచ్చింది.

పైగా దీన్ని ప్రచురించింది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక. (న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కాదు, అయితే హైదరాబాదులోని న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ బాధ్యులతో మాట్లాడితే, అది ఫేక్! దానికి  పత్రికతో సంబంధం లేదు అని చెప్పేశారు)

ఇది మోసం కాకపోవచ్చు. నిజంగానే పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరగవచ్చు. కొట్టేయలేము. కానీ, భవిష్యత్తులో  ఏదైనా స్కాం రూపం ధరిస్తే మాత్రం దీన్ని మించిన స్కాం మరోటి వుండదు.

అందుకే అధికారులూ! గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తేవద్దు అని విజ్ఞప్తి చేసేది. జనం మోసపోయి ఫిర్యాదులు చేయకముందే మేలుకోమని చెప్పేది.

(18-02-2022)

 

LINK:

Nandan Nilekani invests ₹892m in new trading platform to make ordinary people richer (crestmoreite.info)

 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“గొడ్డలి దాకా తేవద్దు” అని మీరు దేన్ని ఉద్దేశించి అంటున్నారో నాకు అర్థం అవడం లేదు గానీ మీరన్న
// “ ముందు చెప్పిన సినిమా తార ఆ సబ్బు పొరబాటున కూడా వాడివుండదు.” //
మాట మాత్రం అక్షరాలా నిజం. బాధ్యతారాహిత్యమైన వ్యాపార ప్రకటనలకు తమ పేరు జోడించడం మన సినిమా ప్రముఖులకు (ఇంకా కొన్ని రంగాల సోకాల్డ్ “సెలెబ్రిటీలకు”) అలవాటే అనుకోవాలి. డబ్బు తీసుకుని తెర మీద చిలకపలుకులు (probably ఆ కంపెనీ వాడు వ్రాయించి ఇచ్తినవి?) పలుకుతారు.

“నేను నమ్మాను, మీరూ నమ్మండి” అని వాళ్ళు చెప్పే సూత్రానికి మరొక ఉదాహరణ అలనాటి సినీనటి సుహాసిని (Mrs.మణిరత్నం). వీరికి ఒకడే కొడుకని, అతను ఇంగ్లాండ్ లో ఆక్స్-ఫర్డ్ లో థియాలజీ లో PhD కోసం చదువుతున్నాడనీ వికీపిడియా చెబుతోంది. కానీ ఈవిడగారు ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీ డాక్టర్ చదువుకు చాలా మంచిదని, తను నమ్మాననీ (ఏ basis మీదనో మరి?) టీవీ అడ్వర్టైజ్మెంట్ లో మనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తుంటుంది.

సినిమావాళ్ళు, క్రికెట్ వాళ్ళు అంటే సామాన్య జనాల్లో బాగా … బాగా పెరిగిపోయిన వేలంవెర్రిని వాడుకునే వ్యాపార ప్రయత్నాలు అనేకం. ఆ ప్రకటనలను నమ్మడం ప్రజల అమాయకత్వం.