5, ఫిబ్రవరి 2022, శనివారం

కాకినాడ సంబంధం – భండారు శ్రీనివాస రావు

 


అరవై ఏళ్ళ కిందటి మాట.

అప్పుడు మా వూళ్ళో దోస్తులం అందరం పదో తరగతి చదువుతున్నాం. పాసు కాగానే మాలో కొందరు టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో చేరిపోయారు. నేను మాత్రం పీయూసీ, బీ కాం ఇలా చదువు లాగించాను.

కొన్నేళ్ళు గడిచాయి. వాళ్లందరికీ మా వూళ్ళో, లేకపోతె చుట్టుపక్కల గ్రామాల్లో వున్న చిన్న సర్కారు బడుల్లో  టీచరు ఉద్యోగాలు వచ్చాయి. బతకలేక బడి పంతులు అన్నట్టు ఉండేవి వాళ్ళ జీతాలు, జీవితాలు.

అలా కొన్నేళ్ళు సాగాయి. నా డిగ్రీ పూర్తయింది.

సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. చిన్ననాటి దోస్తులం  అప్పుడప్పుడూ కలుస్తూ వుండేవాళ్ళం.  

‘మేమూ నీలాగా డిగ్రీ చేసివుంటే బాగుండేది. ఏదో మా కర్మ ఇలా తగలబడింది’ అనేవాళ్ళు.

అలా మరి కొన్నేళ్ళు గడిచాయి.

అందరం రిటైర్ అయ్యాము.

వున్న వూళ్ళో ఉంటూ వాళ్లకి వచ్చే పెన్షన్ లో సగం కూడా నాకు హైదరాబాదులో రావడం లేదు.

కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎగుడుదిగుడులు సహజం

నా షరా మామూలు డైలాగు వుంది కదా! గోదావరిలో ఎన్ని నీళ్ళు వున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు  నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు.

ప్రాప్తం! అంతే!

‘మా నాన్న చెప్పిన కాకినాడ/ పిఠాపురం  సంబంధం చేసుకుని వుంటే..’ అనే బాపు కార్టూనులాగా,  ఇప్పుడు ముక్కు చీదుకుంటే ఏమిటి లాభం!

(05-02-2022)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆనాడు మోజుగా ఉన్న ఉద్యోగాల వైపు ఆకర్షితులయ్యారు చాలా మంది.

నేనూ అంతేనండి. కాలేజ్ లెక్చరర్ ఉద్యోగం వైపు గానీ, చిన్నదైనా సరే ఏదైనా ప్రభుత్వోద్యోగం వైపు గానీ అస్సలు దృష్టి పెట్టకుండా బ్యాంక్ బ్యాంకు అంటూ వెంపర్లాడాం. ఆ తరువాత రోజుల్లో వాళ్ళ జీతాలు అనూహ్యంగా పెరిగి పోయాయి. ఉదాహరణకు - ప్రభుత్వ స్కూలు టీచర్ / హెడ్‌మాస్టర్ ఉద్యోగం చేసి రిటైరయిన మా తమ్ముడి భార్యకు నా బ్యాంక్ ఆఖరి జీతం కన్నా ఎక్కువ పెన్షన్ వస్తోంది.

అంతే, ఆహా ఆ “ద్రాక్షారామం సంబంధం” అయ్యుంటేనా అనుకోవడమే మిగిలింది, ప్చ్ ప్చ్.

అజ్ఞాత చెప్పారు...

ఆర్థికంగా ఏ లోటూ లేకపోయినా ,పిల్లలు చక్కగా స్థిరపడి పోయి తమకు సరిపోయే జీతభత్యాలు /పెన్షన్లు అందుకుంటూ కూడా ఇతరులతో పోల్చుకుని అసంతృప్తి గా ఉండటం మానుకోలేము.

ఏదో వెలితిగా ఉండటం నుంచి బయట పడలేము. నాకేమి తక్కువ. ఇంక చాలు అనుకోలేము. మానవ నైజం కావచ్చు.