1, అక్టోబర్ 2018, సోమవారం

ఫస్టు తారీకు – భండారు శ్రీనివాసరావు


1987 లో మాస్కో వెళ్ళేవరకు మా ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు.  అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా మరచిపోగలం!
చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. సూర్యుడు ఎటు పొడిచినా సరే మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలు, ఆరోజు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ ఫాక్స్) లో భోజనం చేయాల్సిందే. ఆ రోజు తప్పిందంటే మళ్ళీ నెల రోజులు, రోజులు లెక్కపెట్టుకుంటూ ఆగాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మర్నాటి నుంచే మాఇంట్లో నెలాఖరు మొదలు కాబట్టి.
మాస్కో  వెళ్ళిన కొత్తల్లో ఏమో కానీ ఆ తరవాత్తరవాత అక్కడ ఫస్ట్ తారీకు అనే మాటే మరచిపోయాము. గమ్మత్తేమిటంటే అక్కడ నెలకు ముప్పయి రోజులు మాకు ప్రతి రోజూ ఫస్ట్ తారీకు మాదిరిగానే గడిచిపోయేవి.
తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ కధ మామూలే. కాకపొతే కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డులు మళ్ళీ మొదటి తారీకును మరచిపోయేలా చేసాయి కానీ, ఆ తరవాత టిక్కెట్టు కొనకుండానే నరకాన్ని కూడా చూపించాయి. ఈ కార్డులు అనేవి లేకపోతే నాకసలు బీపీ అనే జబ్బు వచ్చేది కాదని మా ఆవిడ దృఢ విశ్వాసం.
ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పాత రోజుల్ని రివైండ్ చేసే పనిలో పడ్డాము. పించను డబ్బులు బ్యాంకులో పడగానే, నెట్లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉబెర్ లో బయలుదేరివెళ్లి మల్టీప్లెక్స్ లో  సినిమా చూసేసి, ఎంచక్కా హోటల్లో భోజనం చేసేసి, ఉబెర్లో పడి ఇంటికి చేరుతున్నాము.
కాకపొతే అప్పుడు నలుగురం, ఇప్పుడు ఇద్దరం.    
 

6 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఉబెర్ లోవెళ్లి మల్టీప్లెక్స్ లో సినిమా చూసి వస్తున్నారంటే పెన్షన్ బాగానే వస్తోందే! అర్జెంట్ గా మాస్కో లో ఉద్యోగం వెతుక్కోవాలి!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవకాశాలు ఉండచ్చు, తప్పక ప్రయత్నించండి 👍. ఆ మాటకొస్తే ఐ.రా.స. వారిచ్చేవి మరింత భూరి పెన్షన్లు ... ప్చ్, ఎక్కువగా ఢిల్లీ వారే సర్దేసుకుంటారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య: అవునండీ ప్రతినెలా ఇంటద్దె సక్రమంగా కట్టగలుగుతున్నాము.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు గారు: సూర్యగారు ఏదో వేళాకోళానికి అన్నారు. మాస్కో ఉద్యోగమే కాదు, నేను పనిచేసిన మాస్కో రేడియోనే ఇప్పుడు లేదు. ఇక పెన్షన్ మాటెక్కడిది. అక్కడ సోవియట్ ప్రభుత్వపు అంతిమ ఘడియలు చూసి ఇండియాకు తిరిగొచ్చేసాము.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

🙂

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య: సూర్యగారు ఏదో వేళాకోళానికి అన్నారు. మాస్కో ఉద్యోగమే కాదు, నేను పనిచేసిన మాస్కో రేడియోనే ఇప్పుడు లేదు. ఇక పెన్షన్ మాటెక్కడిది. అక్కడ సోవియట్ ప్రభుత్వపు అంతిమ ఘడియలు చూసి ఇండియాకు తిరిగొచ్చేసాము. అంతే! ఇంతే సంగతులు.