1, అక్టోబర్ 2018, సోమవారం

పునేఠ ఐ.ఏ.ఎస్. – భండారు శ్రీనివాసరావుమొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనిల్  చంద్ర పునేత పేరులో చివర ‘ఠ’ తగిలించి కొన్ని తెలుగు పత్రికలు రాస్తున్నాయి కానీ ఆయనలో అంతటి  కఠినత్వం కనబడదు. అంచేత ఆయన పేరు రాసేటప్పుడు నేను పునేత అనే రాస్తాను.
నేను మాస్కో నుంచి తిరిగొచ్చి రేడియోలో మళ్ళీ విలేకరిగా జాయిన్ అయిన మొదటి రోజుల్లో మా రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్నపబ్లిక్ గార్డెన్ లో పునేత గారు పనిచేసే కార్యాలయం వుండేది. దాన్ని ఉద్యానవనాల శాఖ అనే వాళ్ళు. దానితో ప్రజలకు కానీ, పత్రికా విలేకరులకు కానీ పెద్దగా పని వుండేది కాదు. రేడియో వాళ్ళం కనుకా, పాడీ, పేడా తప్ప మాకు వేరే వార్తలు ఉండేవి కావనే అపప్రధ ఎలాగూ మోస్తున్నాము కనుక అప్పుడప్పుడూ నేనూ, మా సహా విలేకరి పవని విజయలక్ష్మి(ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు) వెడుతుండేవాళ్ళం. ఆ విధంగా పునేత గారితో తొలిపరిచయం.

తరవాత్తరవాత ఆయన ఉద్యోగ పర్వంలో మెట్లెక్కుతూ కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే నేను రిటైర్ అయి, హెచ్.ఎం.ఆర్.ఐ. (104) అనే  సంస్థలో ఒక హోదా అంటూ లేని, ఉద్యోగం అనే పేరు పెట్టలేని కొలువు చేస్తూ ఉండేవాడిని. ఆ పనుల మీద నేను అప్పుడప్పుడూ వారిని కలుస్తూ ఉండేవాడిని. అక్కడ వెంకట్రావు గారనే పియ్యే వుండేవారు. మంచి సహృదయులు. ‘వున్నారా!’ అని అడగ్గానే ఆయన ‘వెళ్ళండి’ అంటూ తలుపు వైపు చేయి చూపించేవారు. తరవాత అర్ధం అయింది ఏమిటంటే పునేత గారిని కలవాలంటే విజిటింగ్ కార్డులు గట్రా అక్కర లేదు. వెళ్లి తలుపు తోయగానే ఆయన బిజీగా వుంటే ‘ఒక్క క్షణం, నేనే పిలుస్తాను’ అనేవారు. లేకపోతే తలుపు తోసుకుని వెళ్లి ఎవరయినా సరే ఆయనతో మాట్లాడానికి వీలుండేది. ఏదైనా సమస్య గురించి చెప్పగానే దాన్ని ఎలా పరిష్కరించవచ్చు అనే పద్దతిలో ఆలోచించేవారు.

ఇప్పుడాయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పరిపాలనాపరంగా చూస్తే, ఒక రకంగా ముఖ్యమంత్రి తరవాత ముఖ్యమంత్రి.

మరిన్ని బాధ్యతలతో కూడిన ఉద్యోగం అయినా  సమర్దుడయిన అధికారి అనే ట్యాగ్ లైన్  కూడా అనిల్ చంద్ర పునేత గారి పేరుకు అనుబంధంగానే  వుంది.

మొన్న సాయంత్రం హైదరాబాదు నుంచి ఫోను చేసి అభినందనలు తెలిపాను. ఆ రోజుల్లో మాతో పాటు కలిసి వెళ్ళిన వాళ్ళను కూడా ఆయన పేరుపేరునా గుర్తుకు తెచ్చుకున్నారు. అదీ ఆయన సహృదయత.         

కామెంట్‌లు లేవు: