31, అక్టోబర్ 2018, బుధవారం

రెండు వార్తలు, పర్యవసానాలు – భండారు శ్రీనివాసరావు


1984 అక్టోబరు 31
ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు బలయిన రోజు.
సంఘటన ఆరోజు మధ్యాన్నమే జరిగినా ముందు జాగ్రత్త కోసం చాలాసేపు మరణ వార్తను అధికారికంగా ప్రకటించలేదు. సాయంత్రం రేడియో వార్తల్లో ఆ వార్త ప్రసారం అయ్యేవరకు శ్రీమతి గాంధి చావుబతుకుల మధ్య పోరాడుతున్నారనే సమాచారంతో జాతి యావత్తూ తీవ్రంగా మధన పడుతోంది. వార్తల అనంతరం దేశవ్యాప్తంగా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. కాల్పులు జరిపిన వారిలో బియాంత్ సింగ్ ఒకరన్న సమాచారంతో అట్టుడికిపోయిన ఆందోళనకారులు   విచక్షణారహితంగా సిక్కులపై ఊచకోతకు తలపడ్డారు. ఈ నరమేధం నాలుగు రోజులు సాగింది. సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని అమాయకులయిన సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ నుంచి  కన్యాకుమారి వరకు జాతీయ రహదారులపై  ట్రక్కులు నడిపే సిక్కు డ్రైవర్లలో చాలామంది అనేక  అరాచకాలకు, దౌర్జన్యాలకు  గురయ్యారు.
వార్తా ప్రసారంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయనడానికి ఇదో ఉదాహరణ.   
1948 జనవరి 30
మహాత్మాగాంధీని ప్రార్ధనా స్థలంలో ఒక వ్యక్తి దగ్గరగా నిలబడి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోదాలో హోం శాఖను చూస్తున్నారు.
పటేల్ రాగల పర్యవసానాలను చప్పున ఊహించారు. తక్షణం స్పందించారు. ఆకాశవాణి ఉన్నతాధికారులతో మాట్లాడి మహాత్ముడిపై కాల్పులు జరిపింది ఒక హిందువు అని ప్రసారం చేయించారు.
అంతకు కొన్ని రోజుల ముందు నుంచే  దేశం యావత్తూ హిందూ, ముస్లిం ఘర్షణలతో అట్టుడికిపోతోంది. మహాత్మా గాంధీపై  కాల్పులు జరిపింది, ఆయన్ని హత్య చేసిందీ ఒక  హిందువు అని తెలియడంతో, అప్పటివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న  ముస్లిములు ఊపిరి పీల్చుకున్నారు.
పటేల్ ముందు చూపు కారణంగా ఆనాడు దేశం ఆవిధంగా ఒక పెద్ద మారణహోమం నుంచి బయట పడింది.  

3 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

---------
కాల్పులు జరిపిన వారిలో బియాంత్ సింగ్ ఒకరన్న సమాచారంతో అట్టుడికిపోయిన ఆందోళనకారులు   విచక్షణారహితంగా సిక్కులపై ఊచకోతకు తలపడ్డారు
---------
ఎవరా ఆందోళన కారులు?ఒక మతానికి చెందినవారైతే కాదు. ఒక పార్టీకి చెందినవారని వినికిడి.
మీరెప్పుడో జరిగినవి చెప్తున్నారు.
ఈమధ్య జయలలిత చనిపోయినప్పుడు ఆమధ్య సత్యసాయిబాబా చనిపోయినప్పుడు ముందు జాగ్రత్తపడినా ఎవరికీ అక్కరలేకుండా పోయింది. అందరూ వివరాలు కావాలని విసుక్కున్నవాళ్లే.

voleti చెప్పారు...

దాడికి కారణం కొంతమంది సిక్కులు ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు..
ఏది ఏమైనా చాలా దారుణంగా దేశం యావత్తూ సిక్కు లపై ఊచకోత కోసారు..అది ముమ్మాటికీ తప్పే..
అప్పుడూ..ఇప్పుడూ కూడా ప్రజల్లో మార్పు లేదు.. నాయకులు చెప్పే మాయమాటలు గుడ్డిగా నమ్మి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు.. మీడియా కూడా fair గా లేదు..

అజ్ఞాత చెప్పారు...

గాంధీజీ ని ఒక ఇతర మతస్థుడు చంపిఉంటే అతని మతం చెబుతారా. పైపెచ్చు హిందువే చంపాడు అని చెప్పే దరిద్రగొట్టు సెక్యులరిజం మనది.