15, అక్టోబర్ 2018, సోమవారం

మా బామ్మ మంచం నా కంచం – భండారు శ్రీనివాసరావు


అరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకం. మా బామ్మగారికి అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే. మా కుటుంబానికి ఆవిడ విక్టోరియా రాణి. మా నాన్నగారు నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు. నలుగురు మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. మగపిల్లలం చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే అయివేజు అంతంత మాత్రం.
ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూ, మా అమ్మగారికీ వెండి భోజనం పళ్ళేలు, వాటి  మధ్యలో ఒక బంగారం పువ్వు. పక్కనే వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లోనే. వాటి తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా. ఇంట్లో మిగిలిన వాళ్ళ  కంచాలు అన్నీ రాతెండివే. బయటనుంచి వచ్చిన వాళ్ళకోసం మా అమ్మగారు దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కుట్టేది.   
కంచమే కాదు, మా బామ్మగారి  మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలు, నవారువీ, నులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్ ప్రకారం దిండ్లూ, దుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే వాళ్లకు నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ మంచాలకు సళ్ళు లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని మా ఆరో అక్కయ్య ప్రేమక్కయ్య పర్యవేక్షించేది. లాంతర్లు, బుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం చేసి, కిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని మా ఏడో అక్కయ్య భారతక్కయ్య మీద పడేది. అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.
 కంచాలతో కదా మొదలు పెట్టింది. అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుకూ ఒకటీ  ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల  జీతం అన్న మాట.  ఇహ అప్పుడు  చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.
మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు  లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.
తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు  వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడి కంచాల గోల లేదు.
మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. మొన్న బజారుకు వెళ్లి దసరా పండుగ సందర్భంగా చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు కంచం కొనుక్కొచ్చింది.
నిన్న దానికి ప్రారంభోత్సవం చేయాలని సంకల్పం. దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద స్టిక్కరు అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో ప్రయత్నించింది. ఆ స్టిక్కరు ఊడిరాకపోగా  అది వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి పొరుగింటి చిన్న ఆడ లేడీస్ (మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం,అంకుళ్ళం! ఆ  చిన్నవాళ్ళను, మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండి, పిల్లలకు పిల్లలు ఉన్నవాళ్ళే, కానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో నొచ్చుకుంటారు) కలగచేసుకుని, నీళ్ళు సలసలా మరగబెట్టి, ఆ  వేడి వేడి నీళ్ళు గుమ్మరించి ఆ కంచానికి అభ్యంగన స్నానం, సంప్రోక్షణ వగైరా   సలక్షణంగా పూర్తి చేశారు కానీ, ఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’ మాదిరిగా అలాగే వుండిపోయింది.
ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి పోయింది.
‘అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్ కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’
   


12 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

టైటిల్ "బామ్మ మంచం నా కంచం"అని ఉండలేమో సరిచూసుకోండి. స్టీల్ కంపెనీ వాడు స్టిక్కర్ కిందివైపు అంటిస్తే తరలింపు లో భాగంగా (లేక షాప్ ఫ్లోర్ లో పెట్టేటప్పుడు) స్టిక్కర్ పైన గీతలు పడటమో లేదా కొద్దిగా చిరగటమో జరగొచ్చు. మనవాళ్ళకి కొనేటపుడు స్టిక్కర్ సరిగా లేకపోయినా కొనబుధ్ది కాదు!
కాలేజ్ రోజుల్లో నేను టిఫిన్ చేసే హోటల్ వాడి స్టీలు గ్లాసు కింద "ఈ గ్లాసు #name కెఫ్టేరియా నుంచి దొంగిలించబడింది" అని రాసిఉండేది. CCTV అవసరం లేని సెక్యూరిటీ కదూ!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


పాతరోజుల జ్ఞాపకాలను మరోసారి తట్టి లేపారు. మధ్యలో బంగారం పువ్వున్న వెండికంచాలు, బాదం ఆకుల విస్తళ్ళు, నవారు మంచాలకు నవారు బిగించడం, లాంతర్లను గూటిదీపాలను ముగ్గుతో తుడవడం, కిరసనాయిల్ని పెద్డడబ్బాలో నుండి పైకి పంపు చేసే బొంబాయి, ... ఓహ్ చాలా nostalgia కలగజేసింది మీ పోస్ట్.

ఒక సందేహం. “రాతెండి” పదం కొత్తగా ఉంది (నాకు). అది ఏమి లోహం 🤔? ఆగండాగండి ... కొంత మెదడుని మథిస్తే ... అ రోజులలో కోస్తా ప్రాంతాలలో ఒకరకం పాత్రలను, కంచాలను “జర్మన్ సిల్వర్” అనేవారు ... అని గుర్తొచ్చింది. అదీ, మీరన్న రాతెండి ఒకటే కాదు గదా?

“అయివేజు” అనే పదాన్ని మీరిక్కడ పొలం మీద ఆదాయం అనే అర్థంలో వాడినందుకు థాంక్స్. ఆ మధ్య దీన్ని గురించి ఒక బ్లాగులో హోరాహోరీ నడిచింది లెండి. వ్యవసాయ భూమి మీద ఆదాయాన్ని శిస్తు అంటారని (😳 😳) ఆ బ్లాగ్ లో ఒకరు వ్రాస్తే, కాదు అయివేజు అంటారని శిస్తు అంటే పన్ను అనీ నేను కామెంట్ పెట్టాను. దాని మీద కొన్ని కామెంట్లు అటూ ఇటూ ఝాం ఝాం అంటూ తిరిగాయి 😀.

మాస్కో ప్రయాణం రోజున మీ ఇబ్బందులేవో మీవి ఉండుంటాయి గానీ మీ లగేజిలో ఒక కంచం బరువైపోయిందిటండీ 😀? పోనీండి, మళ్ళీ ఇన్నాళ్ళకి స్వంత కంచం అమరినందుకు అభినందనలు .... ఆ స్టిక్కర్ త్వరగా తీయించండి 👍. ఒక రాత్రంతా సబ్బునీళ్ళల్లో నానబెట్టుంచి చూడండి ఫలితం ఉంటుందేమో (ఇది నా guess మాత్రమే సుమండీ) .

అజ్ఞాత చెప్పారు...

ఇంతబాగా వ్రాశారు పాతకాలం ముచ్చట్లు. ఇలాంటివే కొనసాగించండి రాజకీయ సుత్తి మీకు సూటవదు.

సూర్య చెప్పారు...

మీ లగేజిలో ఒక కంచం బరువైపోయిందిటండీ...


ఆ అవకాశం ఉందండి. మీకు అనుమానం ఉంటే అద్దె కొంప ఖాళీచేసి ఆన్ సైట్ కి పోతున్న సాఫ్టువేర్ ఇంజనీర్లని అడగండి. వాళ్ళు ఎన్ని వదిలేసి వెళ్లిపోయారో చెప్తారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

థాంక్స్ సూర్య గారూ.
అడక్కడక్క సాఫ్ట్-వేర్ వాళ్ళనే అడగాలీ? ఆన్-సైట్ కి వెళ్ళి అక్కడి వారి యూజ్-అండ్-త్రో గోరోజనం మాత్రం బాగానే అంటించుకుని వస్తారు. దానికి తోడు మనదేశంలో కన్జూమరిజాన్ని ప్రోత్సహిస్తున్న వ్యాపారుల మాయాజాలం ఒకటి. విదేశీయాత్రప్పుడు కాకపోయినా ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా వస్తువుల్ని పారెయ్యడం అనే అలవాటే ఎక్కువగా కనిపిస్తోంది ఈ తరం వారిలో (నా మటుకు).

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

శ్రీనివాసరావు గారూ, “మాలిక” లో “టపాలు” పేజ్ లో మీ బ్లాగ్ టపాలు కనిపిస్తున్నాయి గానీ వారి “వ్యాఖ్యలు” పేజ్ లో మీ బ్లాగ్ కామెంట్లు కనిపించడం మానేశాయండీ గమనించారా? “శోధిని”, “జిలేబివదన” ఎగ్రిగేటర్లలో అయితే కనిపిస్తున్నాయి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు గారూ. మాలిక, శోధిని, జిలేబి వదన వీటిల్లో నా పోస్టులు ఉన్నాయా. ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ధన్యవాదాలు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: "పాతకాలం ముచ్చట్లు. ఇలాంటివే కొనసాగించండి రాజకీయ సుత్తి మీకు సూటవదు." అని రాసారు. ధన్యవాదాలు. మొదటిది ప్రవృత్తి, రెండోది వృత్తి (అంటే సంపాదన కాదు)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత:"పాతకాలం ముచ్చట్లు. ఇలాంటివే కొనసాగించండి రాజకీయ సుత్తి మీకు సూటవదు" అని రాసారు. ధన్యవాదాలు. మొదటిది ప్రవృత్తి, రెండోది వృత్తి (అంటే సంపాదన కాదు, యాభై ఏళ్ళ వ్యసనం) నా ట్యాగ్ లైన్ చూడండి."మీడియా, రాజకీయాలు...మరెన్నో..." అని వుంటుంది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


పోస్టులు కనబడుతున్నాయి. కానీ పోస్టుల క్రింద వచ్చే కామెంట్లు “మాలిక” లో కనబడడం లేదు.

సరే, రాతెండి అంటే ఏమిటో చెప్పారు కాదు.

అజ్ఞాత చెప్పారు...

Same feeling about the sticker. Pour few drops of oil on the sticker and let it soak for few hours, olive oil worked for me.

satya చెప్పారు...

Direct flame మీద ఒక్క నిముషం కంచాన్నీ పెడితే sticker సులువుగా వచ్చేస్తుంది....జిగురు గానీ వుండిపోతే... ఓ రెండు చుక్కలు నూని రుద్ది కాసేపుంచి, ఆనక సబ్బెట్టి కడగండి...ఏమాత్రం గీతలు పడకుండా స్టీల్ సామాన్ల మీది స్టిక్కర్లు తీయాలంటే ఇదే చిట్కా