1987 లో మాస్కో వెళ్ళేవరకు మా
ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు. అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా
మరచిపోగలం!
చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు
కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. సూర్యుడు ఎటు పొడిచినా సరే
మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలు, ఆరోజు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక
సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ ఫాక్స్) లో భోజనం చేయాల్సిందే. ఆ
రోజు తప్పిందంటే మళ్ళీ నెల రోజులు, రోజులు లెక్కపెట్టుకుంటూ ఆగాల్సిందే. ఎందుకంటే
మళ్ళీ మర్నాటి నుంచే మాఇంట్లో నెలాఖరు మొదలు కాబట్టి.
మాస్కో వెళ్ళిన కొత్తల్లో ఏమో కానీ ఆ తరవాత్తరవాత అక్కడ
ఫస్ట్ తారీకు అనే మాటే మరచిపోయాము. గమ్మత్తేమిటంటే అక్కడ నెలకు ముప్పయి రోజులు
మాకు ప్రతి రోజూ ఫస్ట్ తారీకు మాదిరిగానే గడిచిపోయేవి.
తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ కధ మామూలే.
కాకపొతే కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డులు మళ్ళీ మొదటి తారీకును మరచిపోయేలా చేసాయి
కానీ, ఆ తరవాత టిక్కెట్టు కొనకుండానే నరకాన్ని కూడా చూపించాయి. ఈ కార్డులు అనేవి
లేకపోతే నాకసలు బీపీ అనే జబ్బు వచ్చేది కాదని మా ఆవిడ దృఢ విశ్వాసం.
ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పాత
రోజుల్ని రివైండ్ చేసే పనిలో పడ్డాము. పించను డబ్బులు బ్యాంకులో పడగానే, నెట్లో
సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉబెర్ లో బయలుదేరివెళ్లి మల్టీప్లెక్స్ లో సినిమా చూసేసి, ఎంచక్కా హోటల్లో భోజనం చేసేసి,
ఉబెర్లో పడి ఇంటికి చేరుతున్నాము.
కాకపొతే అప్పుడు నలుగురం, ఇప్పుడు
ఇద్దరం.