6, మార్చి 2015, శుక్రవారం

స్మృతుల మననంలో స్నేహితులు


'ఒక్క నిమిషం! గవర్నర్ గారు ఇప్పుడే వచ్చారు'
అన్నాడు తుల్జానంద్ సింగ్. తమిళనాడు గవర్నర్ రోశయ్య గారి వ్యక్తిగత కార్యదర్శి. 
'పది నిమిషాలు తీసుకోండి. పరవాలేదు' అన్నాన్నేను.
మామూలుగా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఇచ్చిన అప్పాయింట్ మెంట్ సమయానికి ఇవతలవాళ్ళే సిద్ధంగా వుండాలి. అలాంటిది ఒక్క నిమిషంలో పిలుస్తానంటే 'పది  నిమిషాలు ఆగండి' అనడం ఒక రకంగా ఇబ్బందే. సింగ్ కాకుండా వేరెవరయినా అయితే వేరేవిధంగా భావించేవారు. కాకపొతే తుల్జానంద్ హైదరాబాదులో పాత తరం, కొత్త తరం జర్నలిష్టులందరికీ సుపరిచితుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి కార్యదర్శిగా పనిచేసిన వాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులకి సన్నిహితంగా మెలిగినవాడు. అన్నింటికీ మించి స్నేహధర్మం తెలిసినవాడు.
కాసేపు ఆగమనడానికి కారణం వుంది. ఈరోజు రోశయ్యగారిని కలవాల్సింది నేను కాదు. 'మేము'. ఈ 'మేము'లో నాతోపాటు మరికొందరు వయోధిక పాత్రికేయులు వున్నారు. వారికి ఆటో పట్టుకుని, అమీర్ పేటలోని రోశయ్య గారి 'గోకుల్ భవన్' చేరుకోవడానికి కొంత టైం పట్టేట్టు వుంది. మొత్తం మీద వాళ్లు వచ్చేసారు. అందరం ఒకేసారి రోశయ్య గారి గదిలో అడుగు పెట్టాం. చేతికర్ర సాయంతో నడిచివస్తున్న వీ. హనుమంతరావు గారిని అయన వెంటనే గుర్తుపట్టారు. పట్టి అన్నారు. 'హనుమంతరావు గారికంటే నేనే ఏడెనిమిదేళ్లు వయస్సులో చిన్నవాడిని' అని.
పెద్దవాళ్ళు కలుసుకున్నప్పుడు యెంత చిన్నవాళ్ళు అయిపోతారో అప్పుడు చూసాను. పాత విషయాలు వారి మాటల్లో దొర్లాయి. సాధారణంగా రాజకీయ నాయకులు కాస్త సమయం 'మించుతోంది' అనిపించినప్పుడు ఆ భావం వారి మోహంలో కనబడుతుంది. కానీ రోశయ్యగారు హాయిగా మాట్లాడుతూ పోయారు. కాసేపు కూర్చుని  హనుమంతరావు గారిని వెంటబెట్టుకుని మళ్ళీ నేనూ, మరో వయోధిక పాత్రికేయుడు వరదాచారి గారు, వీళ్ళందరికీ 'దండలో దారం' అయిన లక్ష్మణరావు గారు ఇళ్లకు మళ్ళాము. హోలీ పండగ  నాడు రంగులు చల్లుకోకపోయినా వారి మొహాల్లో ఒకరకమైన  సంతృప్తి ఛాయలు ఇంద్రధనుసు రంగుల్లా మెరిసాయి.

           

ఒక వయస్సులో వున్నవారికి కావాల్సింది నిజానికి ఇలాటి ములాఖత్తులే. (06-03-2015)

నేషనలైజేషన్


డాక్టర్ : మీరు ఏ సబ్బు వాడతారు?
ఏకాంబరం : పీతాంబరం సబ్బు.
డాక్టర్ :  మీరు ఏ పేస్టు  వాడతారు?
ఏకాంబరం : పీతాంబరం పేస్టు.
డాక్టర్:  మీరు ఏ షాంపూ వాడతారు?
ఏకాంబరం :  పీతాంబరం షాంపూ
డాక్టర్:  ప్రతిదానికీ  పీతాంబరం పీతాంబరం  అంటున్నారు. ఇంతకీ  ఈ  పీతాంబరం ఏ కంపెనీ? ఎక్కడి కంపెనీ. ఆయుర్వేదమా? అల్లోపతా?
ఏకాంబరం : కంపెనీ కాదు. వాడు నా రూమ్మేటు.




(కార్టూనిస్ట్ వీ.వీ.ఎస్. మూర్తి గారికి కృతజ్ఞతలతో) 

దొందూ దొందే!


భార్య: సగం వింటుంది. అందులో సగమే  అర్ధం చేసుకుంటుంది. దాన్ని గురించి ఆలోచిస్తూ  సమయం పాడు చేసుకోదు. కాకపోతే రెట్టింపుగా  స్పందిస్తుంది. అంతేకాదు,  ఒక్క ముక్క కూడా మరచిపోకుండా మొత్తం గుర్తు పెట్టుకుంటుంది.
ఇక భర్త: విన్నట్టు నటిస్తాడు. ఒక్కటీ  చెవిన పెట్టడు. కానీ అన్నీ అర్ధం చేసుకుంటాడు. వున్నవీ లేనివీ ఆలోచిస్తాడు. కానీ చేసేది పూజ్యం. మరో మంచి గుణం ఏమిటంటే ఏదీ గుర్తుంచుకోడు. గుర్తు పెట్టుకోలేడు.




NOTE: Courtesy Image Owner  

5, మార్చి 2015, గురువారం

లాభనష్టాలు


'ప్రతి రోజూ ప్రార్ధన చేస్తుంటావు. పాతికేళ్ళుగా చూస్తున్నా నీ వరస. ఇలా దేవుడ్ని ప్రార్ధిస్తూ వున్నందువల్ల నీకు దక్కింది ఏమిటి? కొత్తగా పొందింది ఏమిటి?  ఒక్కటంటే ఒక్కటి చెప్పు?'

'నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే! ప్రార్ధన చేస్తూ నేను పొందింది ఏమీ లేదు. సంపాదించుకున్నదీ ఏమీ లేదు. కాకపొతే ప్రార్ధనలతో నేను  చాలా చాలా  పోగొట్టుకున్నాను. గతంలో నాకున్న గర్వం, ఈర్ష్యా, అసూయా, మొండితనం, లోభితనం ఇవన్నీ పోయాయి. ఇప్పుడు చెప్పు, నేను సంపాదించుకున్నట్టా! పోగొట్టుకున్నట్టా!'  


(NOTE: Courtesy Image Owner)

'సూర్య' హరనాథ్ ఇక లేరు

  
ఈరోజు పొద్దున్న 10 టీవీ నుంచి ఇంటికి వస్తుంటే 'సూర్య' దినపత్రిక ఎడిటర్, మిత్రుడు సత్యమూర్తి నుంచి ఫోను.
'ఓ శాడ్ న్యూస్. హరనాథ్ చనిపోయారు. ఈ  తెల్లవారుఝామున. కార్డి యాక్ అరెస్ట్ ట.'
'అయ్యో!' అనిపించింది. హరనాథ్ వయస్సులో  నాకంటే ఏడెనిమిదేళ్లు  చిన్న.  కానీ,  అనుభవంలో పెద్దవాడు. అనేక  పత్రికల్లో పనిచేసారు.  ఐదారేళ్లుగా ప్రతి శనివారం ఆయన నుంచి ఫోన్ వచ్చేది. 'అయ్యా! ఈరోజు శనివారం. ఆదివారం ఆర్టికిల్ గుర్తు చేయడానికి చేస్తున్నాను' అనేవారు ఎంతో మర్యాదగా.  గత ఏడాది నుంచి కాబోలు,  వారానికి రెండు సార్లు, ప్రతి గురువారం, ఆదివారం రాజకీయ వ్యాసాలు 'సూర్య' పత్రిక్కి  క్రమం తప్పకుండా రాస్తూ వస్తున్నాను. ఈ రీత్యా హరనాథ్ గారి నుంచి  వారం వారం వచ్చే  ఫోను పిలుపు మరోటి పెరుగుతూ వచ్చింది. మొన్న సోమవారం నేనే ఫోను చేసాను. ఆయన  ఆఫీసులోనే వున్నారు. 'గురువారం (ఈరోజు,మార్చి అయిదు) ఆర్టికిల్ ఒక రోజు ముందే పంపుతున్నాను. ఇంట్లో కరెంటు సరిగ్గా వుండడం లేదు. నెట్ ప్రాబ్లం. అందుకని ముందే మెయిల్ చేస్తున్నాను. కాస్త చూసుకోండి'  అన్నాను. ఆయనే 'అల్లానే, అల్లానే' అన్నారు. ఆ 'రెండు పదాలే'  ఆయన నోటి నుంచి నేను వినే ఆఖరు మాటలు అని అప్పుడు  నాకు తెలియదు. ఈరోజు యధావిధిగా నా ఆర్టికిల్ 'సూర్య' పత్రికలో వచ్చింది. అది చూసిన కాసేపటికే ఆయన లేరనే వర్తమానం.
ఏదో ఒకరోజు అందరూ పోవాల్సిన వాళ్ళే. అయితే,  చిన్నవాళ్ళు పోతూ వుండడం అది పెద్దవాళ్ళు  చూస్తూ వుండడం - నిజానికి ఇది  చేయని నేరానికి పడే పెద్ద శిక్ష. కానీ చేయగలిగింది లేదు.
వచ్చే శనివారం హరనాథ్ గారినుంచి ఫోను రాదు. అది తలచుకుంటే బాధ మరింత పెరుగుతోంది.

హరనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి




4, మార్చి 2015, బుధవారం

గొప్పలు


'నాకెంత పొలం వుందో తెలుసా!  నేను పొద్దున్న కారేసుకుని  ఈ వైపు నుంచి బయలుదేరి వెడితే పొద్దుగూకినా కూడా  ఇంకా పొలం అటు చివరిదాకా చేరడం కష్టం'  ఒకడన్నాడు గొప్పలు పోతూ.
'ఛా! అంత చెత్త కారు ఇంకా యెందుకు వుంచుకున్నావు. నేనయితే ఎదురు డబ్బులు ఇచ్చి ఒదిలించుకునేవాడిని'


NOTE: Courtesy Image Owner 

అలవాటయితే కష్టం



ఏకాంబరం షాపు వాడిని అడిగాడు, 'చీమల కోసం పౌడర్' వుందా అని.
'వున్నా ఇవ్వను' అన్నాడు షాపు వాడు. 'ఎందుకని' అడిగాడు ఏకాంబరం.

'ఎందుకేమిటి? ఇవ్వాళ పౌడర్ అడిగిన చీమలు రేపు లిప్ స్టిక్ కావాలంటాయి. అలా అలవాటు చేయకూడదు' అన్నాడు దుకాణదారుడు.




(NOTE: Courtesy Image Owner)