15, అక్టోబర్ 2014, బుధవారం

తురగా జానకీ రాణి గారు ఇకలేరు


"నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము...."
ఈ పద్యపాదానికి నిలువెత్తు ఉదాహరణ మా జానకీ రాణి గారు.


(కీర్తిశేషులు శ్రీమతి తురగా జానకీ రాణి)

చేరడేసి కళ్ళు, వాటికి కొట్టొచ్చినట్టు ఇంతేసి కాటుక. దూరం నుంచే చూసి చెప్పొచ్చు జానకీ రాణి గారు వస్తున్నారని. ఆ సంప్రదాయాలు, కట్టూ బొట్టూ అన్నీ అంతవరకే. మనసూ, ఆలోచనలు, సిద్దాంతాలు, సూత్రాలు అన్నీ రాబోయే తరానివి. ఆధునిక మహిళ ఆలోచనలు ఎలావుండాలో, ఎలా ఉంటాయో  ఆవిడని కలుసుకుని ఓమారు మాట్లాడితే ఇట్టే అర్ధం అవుతుంది. ఆ మాటలు వింటుంటే చూస్తున్న జానకీ రాణి గారు,ఆ మాటలు  చెబుతున్న జానకీరాణి గారు ఒకరేనా అన్నంత సందేహం కలగడం తధ్యం.
ఆమె రాకను మరో విధంగా కూడా కనుక్కోవచ్చు. ముందు ఆవిడ మాట వినబడుతుంది. తరువాత ఆవిడ కనబడతారు. చిన్నగా పొందికగా వుండే ఆ మనిషిది   ఏళ్ళు మీద పడుతున్నా వాటిని కనబడనివ్వని శారీరక తత్వం. ముందే చెప్పినట్టు మాట కొండొకచో చురుక్కు. ఎక్కువసార్లు చమక్కు.  అంత చక్కగా, శ్రావ్యంగా మాట్లాడుతారని తెలిసే బహుశా రేడియోలో ఉద్యోగం ఇచ్చి ఉంటారని అనుకునే అభిమానులు కూడా ఆవిడగారికి కోకొల్లలు. అలాటి మనిషి ఇక కనబడదనీ, అలాటి పలుకు ఇక వినబడదనీ తలచుకుని దుఃఖపడడమే ఇక మిగిలింది.
ఏవిటో కష్టాలు కట్టగట్టుకుని వస్తాయంటారు. ఈ మధ్యనే అల్లుడు ఒక రకంగా కొడుకూ అయిన నరేందర్ అందర్నీ వొదిలి వేరే లోకానికి తరలిపోయాడు. భర్త పోయిన దుఖం అనాలో, అతడ్ని మరచిపోలేని బాధ అనాలో తెలియక తల్లడిల్లుతున్న  ఉషారమణికి తల్లి పోవడం మరో విషాదం.
ఉషకు, శోభకు ధైర్యం చెప్పే ధైర్యం నాకు లేదు.
అందుకే ఈ నాలుగు మాటలు.

ప్రకృతి ప్రకోపాలు - పాలకులు నేర్వాల్సిన పాఠాలు

(Published by 'SURYA' Telugu Daily in its Edit Page on 16-10-2014, Thursday)

2014 అక్టోబరు 12. 
కాకతాళీయం కావచ్చు కానీ 'అంతర్జాతీయ విపత్తుల అదుపు దినం' - అక్టోబర్ 13 వ తేదీకి ఒక్క రోజు ముందరే  'హుద్ హుద్' తుపాను విశాఖ తీరాన్ని తాకింది.
'హుద్ హుద్' అనేది ఆరబ్ పదం. ఇది ఒక పక్షి పేరు. ముస్లిం ల పవిత్ర గ్రంధం 'ఖుర్ ఆన్' లో కూడా ఈ పక్షి ప్రసక్తి వుంది. అండమాన్ సముద్రజలాల్లో అక్టోబర్ ఆరో తేదీన పొడసూపిన ఈ తుపానుకు, నిండా తొంభయ్ గ్రాముల బరువు తూగని ఈ పక్షి -  'హుద్ హుద్' పేరును, అంతర్జాతీయ నియమావళి ప్రకారం  ఒమన్ దేశం సూచించింది.  అల్పపీడనంగా పురుడుపోసుకున్న ఈ సముద్ర రాకాసి మరునాటికల్లా  తీవ్ర రూపాన్ని ధరించి  రెండు రోజుల వ్యవధిలోనే అత్యంత  తీవ్రమైన పెను  తుపానుగా తయారయింది. అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ  'నాసా' సయితం ఈ తుపాను తీవ్రతను గుర్తించి హెచ్చరికలు  జారీచేయడంతో -  తరువాతి కొద్ది రోజుల్లో ఈ తుపాను  సృష్టించబోయే విలయం ఏ స్థాయిలో వుంటుందో అర్ధం చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, యుద్ధ ప్రాతిపదికపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అధునాతన ఉపగ్రహ  పరిజ్ఞానం పుణ్యమా అని వెనుకటి రోజుల్లో మాదిరిగా కాకుండా తుపాను కదలికలను ముందస్తుగా, అదీ అతి ఖచ్చితంగా తెలుసుకోగల  అవకాశం వుండడం వల్ల ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమై తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో   ప్రాణ నష్టాన్ని దాదాపు పూర్తిగా తగ్గించగలిగారని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వ అధికారులు అభినందనీయులు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న వేలాదిమందిని నచ్చచెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికోసం శిబిరాలు ఏర్పాటు చేసారు. బస్సులు, రైళ్ళు ఆఖరికి విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ ఇతర ఆధునిక ప్రసార సాధనల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు.  తుపాను తీవ్రతను, కదలికలను జనాలకు తెలియచేసారు. ఈ చర్యలన్నీ ప్రాణ నష్టం నివారణకు బాగా దోహదం చేసాయి. వీటికి మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎప్పటికప్పుడు చర్చించుకుని చర్యలు తీసుకోవడం కూడా చక్కగా ఉపకరించింది. తుపాను  తీరం దాటిన  వెంటనే తీరిక చేసుకుని విశాఖకు వచ్చి క్షేత్ర స్థాయిలో విషయాలను అధ్యయనం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆంద్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించిన తీరు ఇందుకు నిదర్శనం.
అనుకున్న విధంగానే, అనుకున్న రీతినే, అనుకున్న రోజునే, అనుకున్న ప్రదేశంలోనే పెనుగాలులతో కూడిన  ఈ భయంకర తుపాను తీరాన్ని తాకింది. వర్షం వల్ల కంటే కూడా పెనుగాలులు సృష్టించిన ప్రళయమే ఉత్తరాంధ్రను ఎక్కువ  వణికించింది. ఎన్నో దశాబ్దాలుగా చరిత్రకు సాక్షీభూతాలుగా నిలచిన వందలాది  పెను వృక్షాలు నేలకొరిగాయి. ఇక మానవ నిర్మితమైన కరెంటు స్తంభాలు, మేడలూ మిద్దెలూ లెక్కాజమా లేకుండా నేలమట్టం అయ్యాయి. ప్రాణనష్టం నివారించగలిగామన్న అధికారుల ఆనందం, తుపాను కలిగించిన అపార ఆస్తి నష్టంతో   ఆవిరైపోయింది.
'హుద్ హుద్' తుపానుకు ముందు, ఆ తరువాత అన్నట్టుగా, విశాఖ నగరం పరిస్తితి తారుమారయింది. ప్రభుత్వానికి అసలయిన పరీక్షాసమయం మొదలయింది. విశాఖవాసులకే కాదు, యావత్ దేశానికీ ఈ తుపాను కంటి మీద కునుకు లేకుండా చేసింది. సమర్ధతతకు మారుపేరుగా పేరు గాంచిన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ, ఆయన ప్రభుత్వానికీ తుపాను తీరం దాటిన తర్వాతి  పరిణామాలు  పెనుసవాలుగా మారాయి. కూలిన చెట్లూ, వాలిన కరెంటు స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లూ, కోతకోసిన సముద్రపు వొడ్లూ,ధ్వంసం అయిన రైలు మార్గాలు,  నేలమట్టమయిన ఇళ్లూ, మేట వేసిన పొలాలు, తెగిపోయిన చెరువులూ, పోటెత్తిన నదులూ, నీట మునిగిన పొలాలు, గాలికి లేచిపోయిన పైకప్పులూ, ఇలా ఆస్తి నష్టం పలు  రూపాలలో ఆవిష్కృతమైంది. నష్టం తొలి అంచనాలు వేయడంలో అధికారులు కాలయాపన చేయలేదు. నివేదికలు తయారయాయి. సుమారు రెండు వేల కోట్ల రూపాయల   సాయం చేయాలని ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తలమునకలుగా వున్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా హుటాహుటిన విశాఖ పట్నం చేరుకున్నారు. హెలికాప్టర్ లో తిరిగి తుపాను సృష్టించిన భీభత్సాన్ని కళ్ళారా చూసారు. తన పర్యటనను కేవలం 'ఏరియల్ సర్వే' కి మాత్రమె పరిమితం చేసుకోకుండా అధికారులతో మాట్లాడి, తుపాను బాధిత ప్రదేశాల్లో కలయ తిరిగి  వాస్తవ పరిస్తితులను స్వయంగా గమనించి  ఒక అంచనాకు వచ్చారు. తుపాను సహాయక చర్యలకు, పునరుద్ధరణ కార్యక్రమాలకు తక్షణం వెయ్యి కోట్ల కేంద్ర ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనాలకు ఊరట కలిగించే ప్రయత్నం చేసారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎలాటి సమయం వృధా చేయలేదనే చెప్పాలి. విశాఖ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకే కాదు, పాలకులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 'ప్రతి దుర్ఘటన పాలకులకు ఒక పాఠం. ప్రతి అనుభవం భవిష్యత్తులో ఇలాటి సంఘటనలు పునరావృతం అయినప్పుడు గుర్తుంచుకుని వ్యవహరించేలా ఒక శాశ్విత విధానాలను రూపొందించు కోవాలి' అని ప్రధాని హితబోధ చేసారు.
నిజమే కదా! తుపాను కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ప్రాణ నష్టం నివారించడంలో విశేష ప్రతిభ కనబరచిన వారు, తుపాను తీరం దాటిన  తరువాత ఏర్పడబోయే సంక్షోభం నుంచి ప్రజలను వొడ్డున పడేసే ముందస్తు చర్యలపై అంతగా దృష్టిపెట్టినట్టులేదు. తీరం దాటిన  తరువాత కుంభ వృష్టి కురుస్తుందనీ తెలుసు. ప్రచండమయిన వేగంతో పెను గాలులు  వీస్తాయని తెలుసు. పెద్ద పెద్ద వృక్షాలే కూకటి వేళ్ళతో కూలిపోయే ముప్పు  పొంచివుందని ముందుగా తెలిసినప్పుడు కరెంటు స్తంభాలు ఆ ఉధృతానికి ఏపాటి. అవి నేలకొరిగితే,  రోజుల తరబడి విద్యుత్  సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందనీ తెలుసు. తుపాను తీరం దాటేది పట్టణ ప్రాంతం అని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వేరేగా వుంటాయి. బియ్యం పప్పు, ఇతర పచారీ సామాను కంటే, వారి అవసరాలు భిన్నంగా వుంటాయి. పాలు, నీళ్ళు కొరత లేకుండా, రాకుండా చూడాల్సిన అవసరం వుంటుంది. కరెంటు లేకపోవడం వల్ల   అపార్ట్ మెంట్లల్లో మోటార్లు పనిచేయవు. నీళ్ళు పైకి ఎక్కవు. రోడ్డు రవాణా  దెబ్బతినడం వల్ల పెట్రోలు, డీసెలు సరఫరాకు ఆటంకం ఎట్లాగు తప్పదు. ఈ విషయాలను అధికారులు గమనంలో వుంచుకున్నట్టు లేదు. ఒకవేళ గుర్తుపెట్టుకున్నా ఏర్పాట్లు సరిపడా చేసి వుండరు. ఫలితం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. చెవులారా వింటున్నాం.
ఇలాటి పరిమాణంలో ఒక ప్రకృతి విపత్తు వచ్చిపడ్డప్పుడు  ఎలాటి లోటుపాట్లు లేకుండా సహాయ కార్యక్రమాలు అమలు చేయడం అన్నది ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అలా జరగాలని ఆశించినా అది అత్యాశే అవుతుంది. కానీ, అలాగని, కొంత ముందు చూపు ప్రదర్శించకపోతే ఎలా వుంటుంది? అన్నదానికి విశాఖపట్నం, తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల దుస్తితే అద్దం పడుతోంది.
వీటినుంచే పాలకులు పాఠం నేర్చుకోవాలి.
మంచి చేసినప్పుడు వెల్లువెత్తిన ప్రశంశలను స్వీకరించినట్టే ఈ రకమైన సద్విమర్శలను కూడా ఔదలదాల్చగల ఔదార్యం వున్న పాలకులు చరిత్రలో మిగిలిపోతారు.(15-10-2014)         

      

14, అక్టోబర్ 2014, మంగళవారం

వయసు నవ్వింది




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.

చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరోచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.

పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి.అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.

రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.

రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.

రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.


ఎందుకంటె నా పేరు వయస్సుకనుక. (10-06-2011)
NOTE: Courtesy Image Owner

13, అక్టోబర్ 2014, సోమవారం

వాసంతి కాదుకదా! వాసంతేనేమో!


ఏకాంబరం ఆఫీసులో వున్నప్పుడు సెల్ మోగింది.
'ఏమండీ ఏకాంబరం గారేనా మాట్లాడేది' ఒక ఆడ గొంతు పలకరించింది.
'అవునండీ. ఇంతకీ ఎవరండీ మీరు' ఏకాంబరం ఆసక్తిగా అడిగాడు.
'నా పిల్లల్లో ఒకరి తండ్రి మీరు. అని మా రికార్డుల్లో వుంది. అతడి విషయం చెప్పడానికే ఫోను చేస్తున్నాను'
ఏకాంబరం గుండెల్లో పిడుగు పడింది. 'ఒక్క నిమిషం' అంటూ ఆఫీసు బయటకు వచ్చి అడిగాడు.
'మీరు వాసంతి కాదుకదా'
'-----------'
'అయితే తప్పకుండా మాధురి అయివుంటారు'
'నాపేరు అది కాదండీ, నేను మీ అబ్బాయి ...'
'ఆగండాగండి కొంపతీసి మీరు వైజాగులో మేమున్నప్పుడు మా పక్కింట్లో వున్న వరూధిని అయి వుంటారు'
'కాదు కాదు నేను..'
'ఇప్పుడు గుర్తొస్తోంది. ఢిల్లీ టూరు మీద వచ్చినప్పుడు హోటల్లో పరిచయమైంది - ఆ ఆ - వైదేహి కదా మీ పేరు'
'నాపేరు వైదేహి కాదు, వరూధిని కాదు, మాధురి వాసంతిని అంతకన్నా కాదు. నేను మీ అబ్బాయి క్లాసు టీచర్ని. క్లాసులోవున్న నలభై మందిలో మీ వాడొక్కడే అన్నిట్లో సున్నా. ఒకసారి స్కూలుకు రండి మాట్లాడాలి'




(నెట్లో ఒక మిత్రుడు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

12, అక్టోబర్ 2014, ఆదివారం

గుర్తొస్తున్న ఓ జ్ఞాపకం


చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో యావత్ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి 'మీడియా సావీ ముఖ్యమంత్రి' గా ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైం లో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న  రోజులవి.  ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు  మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. ఆ కోతల సమయాలు పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. అయినా ముఖ్యమంత్రిగారు 'టీవీ' లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ,  నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్న లోని మర్మం తెలియనివాడు కాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, ' సాంబశివరావుగారూ (ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచేప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
(తుపాను విరుచుకుపడబోయే ప్రాంతాలలో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, అనేక ప్రాంతాలలో కరెంటు సరఫరాకు విఘాతం కలిగిందనీ వార్తలు వస్తున్ననేపధ్యంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి  చేసారని పత్రికల్లో చదివినప్పుడు ఈ సంగతి గుర్తుకు వచ్చింది)

11, అక్టోబర్ 2014, శనివారం

రివర్స్


వాన రాకడ ప్రాణం పోకడ తెలియవని సామెత.

గవర్నమెంటు ఆఫీసుల్లో సిబ్బంది రావడానికీ, తిరిగి ఇళ్ళకు పోవడానికీ నియమిత సమయాలు వుంటాయి. రావడం సంగతి వాళ్ళ ఇష్టం కానీ పోవడం మాత్రం ఠంచనుగా టైముకే అని గిట్టని వాళ్ళు అంటుంటారు. కరెంటు కోతల విషయంలో ఇది తిరగబడ్డట్టు వుంది. తీయడం మాత్రం ఒక నిమిషం అటూఇటూ కాకుండా తీస్తారు. తిరిగి ఇవ్వడం మాత్రం వాళ్ళ దయా మన ప్రాప్తం. 

పార్టీ పిరాయింపులు దేనికి సంకేతం?


తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగు శాసనసభ్యులు, ఒక ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయింది. ముహూర్తం ఒక్కటే మిగిలి వుంది. ఇటీవలి కాలంలో రాజకీయనాయకుల పోకడలు గమనిస్తున్నవారికి ఇదేమంత ఆశ్చర్యం కలిగించే వార్త కాబోదు. లాంఛనాలు పూర్తయి ఆ అయిదుగురు టీడీపీ నాయకులు తమ అనుచరులతో కలిసి గులాబీ కండువాలు కప్పుకునేలోపు అటూ ఇటూ కూడా షరా మామూలు ప్రకటనలు ఎలాగూ వెలువడుతాయి. వెలువడుతున్నాయి కూడా.  'తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయనీ, అంచేతే ఆ పార్టీవారు మునిగే నావను వొదిలి తమ పార్టీలోకి చేరడానికి తొందరపడుతున్నారనీ' పాలకపక్షం వారు అంటుంటే, 'అధికారం వున్నన్నాళ్ళు పదవులు అనుభవించి ఇప్పుడు తమ స్వప్రయోజనాలకోసం పార్టీ వొదిలి పోతూ పోతూ, బట్టకాల్చి పైన పడేసినట్టు తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై నీలాపనిందలు వేస్తున్నారని' టీడీపీ నాయకులు, పార్టీ పిరాయించిన వారిపై నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకో ఈ మాటలు ఎక్కడో, ఎప్పుడో  విన్నట్టు వారికికూడా  అనిపిస్తే చేయగలిగింది లేదు.  గత అయిదారేళ్ళ కాలంలో ఇలాటి సందర్భాలు ఎన్ని రాలేదు, ఇలాటి సన్నివేశాలు ఎన్ని చూడలేదు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకులు తమ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుల గురించి అచ్చు ఇప్పుడు టీ.ఆర్.యస్. వారు అన్నట్లే అన్నారు. టీడీపీ అధినాయకుడి నాయకత్వ లక్షణాలు చూసి ఆకర్షితులై తమ పార్టీలోకి అందరూ కట్టగట్టుకుని క్యూలు కడుతున్నారని అప్పుడు  గొప్పలు చెప్పుకున్నారు. అంతేకాని కాంగ్రెస్ లో ఏళ్ళపాటు పదవులు అనుభవించి ఇప్పుడు మనవైపు ఎందుకు చూస్తున్నారు అని లిప్త కాలం ఆలోచించివున్నా, అలాటి జంప్ జిలానీలకు  గతంలో ఎన్టీయార్ మాదిరిగా తెలుగుదేశం వాకిలి మూసివేసినా, ఈనాడు టీడీపీ నాయకులు పడుతున్న ఆవేదనకు కానీ, వెళ్ళగక్కుతున్న  ఆగ్రహానికి కానీ కొంత అర్ధం వుండేది. అర్ధం చేసుకునే వాళ్ళూ వుండేవారు. అలాగే, ఇంకా కాస్త వెనక్కు పోయి చూస్తె, టీడీపీ నుంచి వై.ఎస్.ఆర్.సీ.పీ. లోకి వరదలా వలసలు సాగుతున్న రోజుల్లో, పార్టీ వీడిపోతున్న తమ నాయకుల విషయంలో చేసిన వ్యాఖ్యలు జనం మరచిపోయేంత సమయం గడవలేదని ఆ పార్టీ వారు గుర్తుపెట్టుకున్నట్టులేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, వై.యస్.ఆర్.సీ.పీ. టిక్కెట్టుపై గెలిచిన  ఒక ఎంపీ, లోక సభ్యునిగా  ప్రమాణ స్వీకారం కూడా   చేయకముందే టీడీపీ లోకి రావడాన్ని, ఆ రాకను తమ పార్టీ స్వాగతించిన విషయాన్ని వారు జ్ఞప్తిలో వుంచుకున్నట్టు లేదు. ఈ రకమైన ద్వంద వైఖరే వారి విమర్శలకు, ఆరోపణలకు, ఆవేదనకు విలువ లేకుండా చేస్తోంది. ఈ విషయంలో ఒక్క టీడీపీ నాయకత్వాన్ని మాత్రమె తప్పుపట్టలేం. ఈ తప్పు చేయడంలో అన్ని పార్తీలదీ ఒకే మాట, ఒకే బాట. టీడీపీ నాయకులు అంటున్నట్టు 'నాయకులు పోయినా కార్యకర్తలు చాలు పార్టీని బతికించడానికి'. కానీ ఈ వాస్తవాన్ని ఈనాడు పార్టీని వీడుతున్న ఆ నాయకులు పార్టీలో ఉన్నరోజుల్లో చెప్పివుంటే, కనీసం పార్టీ జెండాలను ఇన్నాళ్ళు మోస్తూ వచ్చిన సామాన్య కార్యకర్తలన్నా సంతోషపడేవారు. 'రెండు రాష్ట్రాలు తమకు రెండు కళ్ళు' అని చెప్పుకునే పార్టీ,  రెండు రాష్ట్రాల్లో ఒకే అంశంపై రెండు రకాల విధానాలను అవలంబించడం వల్ల కింది స్థాయి నాయకుల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడుతోందని ఆ పార్టీ  అధినాయకత్వం యెంత త్వరగా  గుర్తిస్తే అంత మంచిది.
ఇక అసలు విషయానికి వస్తే, ఈ ఏడాది జూన్ రెండో తేదీన ఏర్పడ్డ రెండు రాష్ట్రాల్లోని  వోటర్లు తమ బాధ్యతను సజావుగా నిర్వర్తించారు. అలాగే కేంద్రంలో కూడా. పాలక పక్షాలకు ఎవరిమీదా ఆధార పడాల్సిన పని లేకుండా పూర్తి మెజారిటీతో గద్దె ఎక్కించారు. కానీ జరుగుతున్నదేమిటి? ప్రజలనుంచి ఇంకా ఎక్కువ ఆశించి భంగపడ్డట్టుగా అధికార పీఠం ఎక్కినప్పటినుంచీ అన్ని విషయాల్లో విభేదించుకునే ఆ రెండు పార్టీలదీ ఒకటే లక్ష్యం. 'ప్రతిపక్షాన్ని ఎలా బలహీనపరచాలి?'  పోనీ  ఏదో బొటాబొటి మెజారిటీతో నెట్టుకొచ్చే పరిస్తితి వుందంటే 'ఈ ఆకర్ష్, వికర్ష్ గారడీ'లను  కొంత అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వాల మనుగడకు వచ్చిన ముప్పేమీ లేకపోయినా మొదటి రోజు నుంచీ ఈ 'ఆకర్ష్ ' మంత్రం వల్లించడంతోనే  డమే పాలక పక్షాలకు పుణ్యకాలం కాస్తా సరిపోతోంది. ఇక కేంద్రంలో, ఎన్నో ఏళ్ళ తరువాత,  రికార్డు స్థాయిలో ఏక పార్టీ పాలనకు అంకురార్పణ చేసిన బీజేపీ జాతీయ అద్యక్షుడయితే, ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా 'కాంగ్రెస్ రహిత భారత దేశాన్ని' కోరుకుంటున్నట్టు తెగేసి చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ఆరోపణలు ఇంతకాలం విన్నాం కానీ, ఇదో కొత్త వరస మొదలయింది. వెనుకటి రోజుల్లో, అంతంతమాత్రం  మెజారిటీతో నెట్టుకొచ్చే ప్రభుత్వాలను పడగొట్టడానికి పాలకపక్షం సభ్యులకు ప్రతిపక్షాలు ఎరవేసే సందర్భాలు ఉండేవి. కానీ, ఇప్పుడో, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగానే, అధికార పక్షాలు మరో పని ఏమీ లేదన్నట్టు ప్రతిపక్షసభ్యులకు గాలం వేసే కొత్త ప్రక్రియ మొదలయింది. ఇలాటి కుచ్చిత వ్యూహాలు ప్రజాస్వామ్యానికి మేలు చేయవని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. 'ఈరోజు ఒకరికి చేసిన కీడు  మరో రోజు మరో రూపంలో మన మెడకే చుట్టుకుంటుంది' అన్న నిజాన్ని రాజకీయ పార్టీలు అర్ధం చేసుకుంటాయని ఆశించడం అత్యాశే అవుతుంది. 'ఈరోజు గడిస్తే చాలు' అనే రోజుల్లో సిద్దాంతాలు, సూత్రాలు పట్టించుకునే తీరిక ఎవ్వరికి మాత్రం వుంటుంది ?                     
పార్టీ ఫిరాయింపులు గురించి ప్రస్తావించుకునేటప్పుడు కొంత పరిణామక్రమాన్ని కూడా గుర్తుచేసుకోవాలి.
ఈ అనైతిక పార్టీ మార్పిళ్లను అరికట్టడానికి చట్టం లేదా అంటే వుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే, 52  వ రాజ్యంగ  సవరణ ద్వారా  పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. అయితే, దాని ప్రకారం, చట్ట సభలో ఒక పార్టీకి వున్న సంఖ్యాబలంలో మూడింట ఒక వంతు మంది వేరే పార్టీలోకి మారితే అది పార్టీ పిరాయింపు కాకుండా వేరే పార్టీలో 'విలీనం' కిందికి వస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకుని వ్యూహాత్మక మార్పిళ్లు జరగడంతో ఆ చట్టం కోరలు పదును పెట్టడం కోసం దరిమిలా దానికి ఎన్నో సవరణలు కూడా చేశారు. అయినా  చట్టంలోని  లొసుగుల్ని వాడుకుంటూ చట్టాలకు తూట్లు పొడవడం ఆ చట్టాల నిర్మాతలయిన ప్రజా ప్రతినిధులకు వెన్నతోపెట్టిన విద్య. అందుకే చట్టం దోవ చట్టానిది,  రాజకీయ నాయకుల దోవ వారిదీ అవుతూవచ్చింది. ఎవరినీ తప్పుబట్టడానికి వీలులేకుండా తప్పులు చేస్తూ పోవడానికి చట్టాల్లో వున్న ఈ లొసుగులే ప్రధాన కారణం. అనేకానేక అధ్యయనాల అనంతరం పద్దెనిమిదేళ్ళ తరువాత అంటే, 2003 లో ఈ చట్టానికి మరో రాజ్యాంగ సవరణ చేసారు. దీని ప్రకారం 'పార్టీ మార్పిడి పిరాయింపు కాదు, మరో పార్టీలో విలీనం కావడం' అని చట్టం దృష్టిలో అనిపించుకోవాలంటే ఆ పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు సమ్మతించాలి. ఈ సవరణ ప్రకారం విడిగా కానీ, బృందాలుగా కానీ పార్టీ మారే చట్ట సభల సభ్యులు తమ సభ్యత్వానికి ముందు  రాజీనామా చేయాలి.  అలా రాజీనామా చేసిన వారు ఆ తరువాత ఎటువంటి లాభదాయక పదవులు పొందడానికి వీలుండదు. నిజానికి ఈ రాజ్యంగ  సవరణ ద్వారా పార్టీ మార్పిళ్లు అనేవి దుర్లభంగా తయారుకావాలి.  కానీ, రాజకీయాల్లో వున్నవాళ్ళు ఘటనాఘటన దురంధరులు. అడ్డువచ్చిన వాటిని ఎలా అడ్డు తొలగించుకోవాలో, అదీ చట్టబద్ధంగా, వారికి కరతలామలకం. ఎన్నికలు కాగానే, గెలిచినవాళ్ళల్లో కొందరు, తాము అధికారం దక్కని పార్టీలో ఉన్నామని గ్రహించిన మరుక్షణం నుంచే గోడదూకే సన్నాహాలు మొదలుపెడతారు.  ఎందుకంటె, ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారికి ముఖ్యం కాదు, పాలక పక్షం అండ దొరికితేనే 'ప్రజాసేవ' చేయడానికి వీలుంటుంది అన్న నమ్మకం పుష్కలంగా పెంచుకున్నవాళ్ళు వారు. అందుకే అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరిపోయి, తమ రాజీనామా ద్వారా ఉత్పన్నమైన ఖాళీలో జరిగే ఉపఎన్నికలో  పోటీ చేసి,  అధికార పార్టీ ప్రాపకంతో మళ్ళీ  అనతికాలంలోనే చట్టసభల్లో ప్రవేశించిన ఉదాహరణలు  కోకొల్లలు.  పార్టీ పిరాయింపులను నిరోధించడానికి రూపొందించిన చట్టాన్ని ఆ విధగా కొందరు నీరుకార్చివేస్తున్నారు. 'ఇది నైతికమా కాదా' అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కానీ, అంతటి  సావధానం కానీ వారికి ఉంటుందనుకోలేము. ఇక, 'ఇలా చేతికి అందిన రాజీనామాలు 'ఆమోదించాలా తిరస్కరించాలా లేదా పెండింగులో పెట్టాలా' అనే విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాలను  సమీక్షించే లేదా తిరగతోడే అవకాశం న్యాయస్థానాలకు  కూడా లేదు. గత అయిదారేళ్ళ కాలంలో రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తూ వస్తున్నవారికి  ఇటువంటి సందర్భాలు లెక్కకు మిక్కిలి అన్నవిషయం తేలిగ్గానే బోధపడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలో వున్న పార్టీదే పైచేయి.  అందువల్ల, పిరాయింపులు అనేవి పాలకపక్షాల ఇష్టాఇష్టాల ప్రకారమే అటు చట్టబద్దం కావడమో, ఇటు చట్ట విరుద్ధం కావడమో జరుగుతోంది. అయితే, చట్టంలో వున ఈ లొసుగుకు  సుప్రీం కోర్టు ఓ మేర అడ్డుకట్టవేసింది. గోవా శాసనసభ స్పీకర్ ఇద్దరు సభ్యులపై వేసిన 'అనర్హత వేటు'ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.  కానీ రాజ్యాంగం పదో షెడ్యూల్లో పొందుపరచిన మిగిలిన అధికరణాలను మాత్రం సుప్త్రీం కోర్టు తప్పుపట్టలేదు.
మంచి చేయబోతే చెడు ఎదురయినట్టు, ఈ చట్టం వల్ల కొందరు నిజాయితీపరులయిన సభ్యులు ఇబ్బంది పడే అవకాశం వుంది.  అనర్హత వేటుకు భయపడి, ఇష్టం వున్నాలేకపోయినా పార్టీ అధినాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను, బిల్లులను వాటి  మంచి చెడులతో నిమిత్తం లేకుండా సమర్ధించాల్సిన పరిస్తితి వారిది.
ఇండిపెండెంటు సభ్యులకు  ఈ చట్టంలో కొంత వెసులుబాటు వుంది. వారు తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు తెలపవచ్చు. కానీ అందులో చేరడానికి వీలులేదు. ఇండిపెండెంటుగా గెలిచినా వాళ్ళు ఇండిపెండెంటు హోదాలోనే కొనసాగాలని   చట్టం నిర్దేశిస్తోంది. హర్యానాలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన అభ్యర్ధులు   అధికార పార్టీలో చేరినట్టు టీవీల్లో వార్త  ప్రసారం అయింది. ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ఏకంగా వారే ఈ విషయం చెప్పినట్టు వచ్చింది. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. వారు కోర్టును ఆశ్రయించారు. చివరికి  సుప్రీం కోర్టు కూడా  స్పీకర్ నిర్ణయాన్నే  సమర్ధించింది.
పొతే, మనం సాధారణంగా  'పాలిటిక్స్' అని వాడే ఇంగ్లీష్ పదం  గ్రీకు భాషలోని 'పొలిటికా' అనే పదం నుంచి వచ్చింది. అమెరికా దేశపు  అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్,  ప్రజాస్వామ్య ప్రభుత్వానికి  ఇచ్చిన నిర్వచనాన్నే మన రాజకీయ నాయకులు తరచూ ఉటంకిస్తుంటారు. 'ప్రజాస్వామ్య ప్రభుత్వం  అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం' అని. 'పొలిటికా' అనే  ఈ గ్రీకు పదానికి కూడా ఇంచుమించు  అదే అర్ధం. అయితే కాలక్రమంలో 'నేతిబీరకాయ సామెత' మాదిరిగా ప్రజాస్వామ్యంలో 'ప్రజలు' అడుగంటి పోయి 'నాయకస్వామ్యం'గా మారడం మొదలయింది. 'దీనికి ఎవ్వరు కారకులు? ప్రజలా? పాలకులా? పార్టీలా?' అంటే, 'తిలాపాపం తలా పిడికెడు' అన్నట్టు అందరికీ ఇందులో భాగం వుంది.  ఎవరో అన్నట్టు రాజకీయాలు అనేవి ఒక బుడుగు మాదిరి. దాంట్లోకి ఒకసారి దిగితే అంతే  సంగతులు. తిరిగిరావడం వారి చేతిలో వుండదు. అందుకే,  ఒక పార్టీలో తమకు భవితవ్యం  లేదనుకున్నప్పుడు సిద్దాంతాలు, సూత్రాలు గాలికి వొదిలేసి వేరే పార్టీలోకి దూకుతున్నారు. ఇలా గోడలు దూకేవాళ్ళు కొందరయితే, దూకడానికి తటపటాయించేవారిని దింపడం కోసం గోడలకు నిచ్చెన వేసే పార్టీలు మరికొన్ని. చేపలకు 'ఎర'  వేస్తున్నారా, లేక చేపలే వచ్చి గాలానికి చిక్కుకుంటున్నాయా అనేది జవాబు దొరకని ప్రశ్న.
చివరికి  చెప్పేదేమిటంటే, చట్టాలు చేసేవారే వాటిని 'ఎలా ఉల్లంఘించాలా' అనే దారులు వెతకడం మొదలు పెడితే, అసలు వాళ్ళు చేసిన చట్టాలకు అర్ధం వుండదు, అవి తయారయ్యే చట్టసభలకూ  అర్ధం వుండదు. తరువాత తీరిగ్గా విచారించినా ప్రయోజనం వుండదు.
అన్ని రాజకీయ పార్టీలు ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్య సౌధం పునాదులు బీటలువారకుండా వుంటాయి. (11-10-2014)