2, మార్చి 2014, ఆదివారం

పాతికేళ్ళనాటి మాస్కో - 8



దేవుడ్ని నమ్మని దేశంలో పిల్లలే దేవుళ్ళు

ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే - ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయినా  సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. 'మా అబ్బాయి డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము' అంటే అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష - (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు)- పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో - తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే బాధ్యత కూడా సర్కారుదే కావడంవల్లా, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్లా, వారికీ అభ్యంతరాలు వుండవు.


(మా పిల్లలకు వేసవి వినోదం - చేపల వేట - ఫోటో కోసం)

మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కంటే  ప్రోత్సాహకాలు అంత ఎక్కువగావుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న 'సంతానలక్ష్ములను' జాతీయ అవార్డులతో సత్కరిస్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచిసుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి అడుగులు వేసే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.

ఒకే గడి ముడి - 1 (కొత్త ప్రయోగం)


తినే కాయలు కావు, గోకుడు కాయలు (6)

జవాబు : లుయకాటమచె (తిరగేయండి)     

1, మార్చి 2014, శనివారం

"పిసినారిని మించిన దాత లేడు"

ధర్మ సందేహం
అప్పుడెప్పుడో  అర్ధరాత్రి దూరదర్శన్ సప్తగిరి పెడితే 'ధర్మసందేహాలు' కార్యక్రమం నడుస్తోంది. దాంట్లో వినవచ్చిన ఓ మంచిమాట.
"పిసినారిని మించిన దాత లేడు"

"ధనవంతుడయిన ఓ పిసిని గొట్టు - జగదేకసుందరి లాంటి అమ్మాయిని వెతికి పట్టుకుని ఆమెను పెళ్ళాడి, పిల్లాడు పుడితే ఆస్తి పట్టుకు పోతాడేమో అని పిల్లాడ్ని కనకుండానే చనిపోయాడు. దాంతో అతడి ఆస్తి  అంతా పరాధీనం అవుతుంది. రూపాయో అర్దో ఇచ్చి పేరు తెచ్చుకునే దాతలకన్నా సమస్తాన్ని పరాధీనం చేసివెళ్ళిన ఆ పిసినారే పెద్ద దాత" 

పాతికేళ్ళనాటి మాస్కో - 7


స్త్రీ బాలవృద్దులదే హవా!

అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది. 


సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతో, ఆమె తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా  ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే - మాస్కోలో వున్నన్ని రోజులు మా పిల్లలే మాకు దుబాసీలు. 

మందు కిక్కిచ్చిందీ లేనిదీ తెలుసుకోవాలని వుందా?


అయితే ముందీ పనిచేయండి.ఈ లింక్ పై నొక్కండి.* http://www.selfcontrolfreak.com/slaan.html అప్పుడు *కనిపించే ఫోటోలో ఈ వ్యక్తిని చూస్తున్నారు కదా.* * * * మీ చేతిలోని **'**మౌస్**' **తో అతగాడి ముక్కుమీదక్లిక్ చేయండి.* *కొత్త విండో తెరుచుకుంటుంది. మళ్ళీ ఓ సారి అతడి ముక్కుపై క్లిక్ చేయండి.చేయగలిగితే మీకు కిక్కు ఎక్కనట్టే లెక్క.* (లేదా బొమ్మ పక్కన కనిపించే selfcontrolfreak.com  మీద క్లిక్ చేయండి.
ఇదీ పనిచేయకపోతే లింక్ ని పేస్ట్ చేసి ప్రయత్నించండి.

నవ్వు గ్యారంటీ (షరతులు వర్తిస్తాయి)


(ఆర్.వీ. ప్రభు గారి సౌజన్యంతో -)
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపారు.పోలీసులు వచ్చారు. పుష్ప గుచ్చంతో..
కారులోకి తొంగి చూసారు. ముగ్గురు వున్నారు కారులో.
"
మీరు ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తున్నందుకు, సీటు  బెల్టు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నందుకు మిమ్మల్ని ఈ వారం ఉత్తమ వాహనచోదకుడిగా గుర్తించి, మీకు అయిదువేల రూపాయలు బహుమతి ఇస్తున్నారు, ఈ "లాస్యా క్లబ్" వాళ్లు. మీరు ఈ డబ్బుతో  ఏం చేస్తారో చెప్పమని అడుగుతున్నారు' అన్నారు పోలీసువాళ్ళు.
కొడుకు అబద్ధకుమార్ గునుస్తూ చెప్పాడు.
'నేను నేనయితే ఈ డబ్బుతో డ్రైవింగ్ లైసెన్సుకి అప్లై చేస్తాను.'  
'వాడి మాటలు నమ్మకండి, వాడు బాగా తాగేసి వున్నాడు' అంది తల్లి జాణేశ్వరి.
ఇంతలో వెనుక సీటులో పడుకున్న తండ్రి కేటుకుమార్ నిద్ర నుంచి లేచి ఆవులిస్తూ చెప్పాడు.
"నేను అనుకుంటూనే వున్నాను. దొంగిలించిన కారులో మనం ఎంతో  దూరం వెళ్లలేమూ, చట్టం  చేతులు చాలా పొడవైనవీ, పోలీసులు ఎక్కడో అక్కడ కాపేసి పట్టుకుంటారు అని. చూశారా. ఇప్పుడు అదే జరిగింది.'
Top of Form


పాతికేళ్ళనాటి మాస్కో - 6


'జీవితమే ఉచితమూ..'
మాస్కో గురించిన మరపురాని అనుభవం మాకు మంచినీళ్ళతో మొదలయింది.1987 లో మాస్కో బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో మంచినీళ్ళకు బాగా కటకటగా వుండేది. తెల్లవారుఝామున ఎప్పుడో ఒక గంటసేపు నల్లాల్లో నీళ్ళు వొదిలేవాళ్ళు. అదీ రెండురోజులకోమారు. తాగే నీళ్ళనూ వాడే నీళ్ళను పరమపొదుపుగా వాడుకునేవాళ్ళం. అలాటి పరిస్తితుల్లో మాస్కో వెళ్ళిన మాకు రాత్రీ పగలూ అని లేకుండా కొళాయిల్లో నీళ్ళు రావడం చూసి మతి పోయింది. బాతురూముల్లో, వంటింటిలో ఎక్కడ చూసినా మంచినీళ్ళ పంపులే. ఒకటి తిప్పితే ఫ్రిజ్ వాటర్ లాంటి చల్లటి, శుభ్రమయిన మంచినీళ్ళు. మరోదాంట్లో పొగలుగక్కే వేడినీళ్ళు. ఈ ఏర్పాటు ఏటిపోడుగునా అందుబాటులో ఉండడమే కాదు, పూర్తిగా ఉచితం కూడా. మాస్కో జీవితంలో మేము ఎన్నో ఉచితాలు రుచి చూసాము. అసలక్కడ- 'జీవితమే ఉచితమూ.. ' అని పాడుకోవచ్చు అని మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాడిని.


(విందులు - వినోదాలు) 


పోతే, మాస్కో విషయాలు ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడివారికి తెలియదు. వంటింట్లో వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ లేదు. పైగా కరెంటు, నీళ్ళు, గ్యాస్, ఫోన్ అన్నీ ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు.   జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి రూబుళ్ళు.


( స్త్రీబాలవృద్ధులదే అక్కడ అసలు హవా - అదేమిటో ఇంకో మారు)