సోవియట్ యూనియన్ లో స్టాలిన్ అనంతరం అధికారానికి వచ్చిన కృశ్చెవ్ వీలు
చిక్కినప్పుడల్లా స్టాలిన్ విధానాలను తూర్పారబడుతుండే వాడు. నిజానికి స్టాలిన
హయాములో కృశ్చెవ్ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. స్టాలిన్ ఏం చెప్పినా పెదవి విప్పి ఏమీ చెప్పలేకపోయేవాడు.
స్టాలిన్ తదనంతరం కృశ్చెవ్ సోవియట్
కేంద్ర కమిటీ అధినాయకుడిగా పదవి చేపట్టిన తర్వాత ఆయన స్టాలిన్ ను పదేపదే విమర్శించే తీరు కృశ్చెవ్ అనుయాయులకు విచిత్రంగా
తోచేది. స్టాలిన్ జీవించి వున్న కాలంలో ఆయనకు వీర విధేయుడుగా ఉంటూ, ఆయన ఏమి చెప్పినా గొర్రెలా తల ఊపే కృశ్చెవ్ ఇతడేనా అనే అనుమానం వారిని తొలుస్తుండేది.
‘ఆ రోజునే ఇలా ఎందుకు మాట్లాడలేకపోయారు, ఇప్పుడెందుకు ఇలా దుయ్యబడుతున్నారు’ అని
అడగాలని వారికి వున్నా పైకి అనే ధైర్యం
ఎవరికీ లేదు. ఒకరోజు కృశ్చెవ్ ని ఒక యువ
నాయకుడు ధైర్యం చేసి మనసులో మాట అడిగేశాడు. కృశ్చెవ్ నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు ఈరోజు నా ముందు నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నారా!
ప్రతిదానికి తందానా అంటున్నారా లేదా! ఆరోజుల్లో నేనూ అదేపని చేశాను’
ఇది ఒక జోక్ కావచ్చు. కేంద్రీకృత
అధికార రాజకీయాలకు అద్దం పడుతుంది.
రోజూ టీవీ చర్చల్లో “మీరు ఆరోజు ఎందుకు
మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు నిలదీస్తున్నారు” అని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు
ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకుంటూ వుంటే ఎందుకో ఏమో ఈ జోకు జ్ఞాపకం వస్తుంటుంది.