కొత్తగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల తక్కువ వ్యవధిలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. ఈ పార్టీ కుదురుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఏమాత్రం నమ్మకంలేని ఆ నాటి జర్నలిష్టులు చాలామందిలో నేనూ ఒకడిని. ఎన్టీఆర్ పార్టీ విషయంలో రాజకీయ నాయకులు, పాత్రికేయుల అంచనాలు చాలా విచిత్రంగా వుండేవి. కొత్త పార్టీ గెలిస్తే బాగుంటుంది అని మనసు మూలల్లో ఆశ, గెలవదేమో అని అదే మనసు మరో మూలలో సందేహం. ప్రాంతీయ పార్టీ గెలిస్తే ఇక రాష్ట్రం గతి అధోగతే అని భయపడేవాళ్ళు కొందరు. గెలవక పోయినా ప్రధాన ప్రతిపక్షంగా వుంటే, కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలకు అడ్డు కట్ట పడగలదని ఇంకొందరు. పోటీ చేయడానికి పదిమంది అభ్యర్ధులు ముందుకు వస్తే అదే గొప్ప అని మరికొందరు. ఇలా నిరంతరంగా సాగేవి వారి నడుమ చర్చలు. మొహానికి రంగు పూసుకుని వేషాలు వేయడం వేరు, రాజకీయం చేయడం వేరు అని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా వున్నారు. ఎన్టీఆర్ గెలిచి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తే ఆయన వేష ధారణ, మాట తీరు ఎలా వుంటుందో ఊహించి చెప్పి నవ్వుకున్న సందర్భాలు వున్నాయి. హైదరాబాదు రాజకీయ వర్గాలలో మాత్రం ఆయన పార్టీ పట్ల అంత సానుకూల ధోరణి కానవచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుల్లో అయితే కొత్త పార్టీ పట్ల చులకన భావం, తమ విజయం పట్ల అతి విశ్వాసం కొట్టవచ్చినట్టు కనబడేవి. రోశయ్య వంటి సీనియర్ నాయకులు దాదాపు ప్రతిరోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్టీఆర్ పై, ఆయన పార్టీపై విమర్శలు గుప్పిస్తుండేవారు. ఈ భ్రమల్లో వుండిపోయి మరో పక్క ముంచుకు వస్తున్న పెనుముప్పును కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఏమాత్రం పసికట్ట లేకపోయారు.
నాకు మొదటి సంకేతం మా ఊరి నుంచి వచ్చింది. మా
స్వగ్ర్రామంలో వుంటున్న మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు పొడవాటి వెదురు
గడలు మూడు ఒకదానికొకటి కలిపి కట్టి,
దానికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టి, మా ఇంటి ముందు వేపచెట్టుపై ఆ జెండాను, ఊరి పొలిమేరల వరకు కనిపించేలా ఎగురవేశాడు. మొదటి నుంచి మా గ్రామం కాంగ్రెస్
పార్టీకి కంచుకోట. కొంత కమ్యూనిష్టుల ప్రభావం ఉన్నప్పటికీ అది నామమాత్రం.
కాంగ్రెస్ లోనే గ్రూపులు వుండేవి తప్పిస్తే గ్రామ పంచాయతి ఎప్పుడు కాంగ్రెస్
పార్టీదే. ఇలాంటి నేపధ్యం ఉన్న మా ఊరిలో తొలిసారి తెలుగుదేశం పార్టీ పతాకం
రెపరెపలాడింది. ఎందుకింత రిస్క్ అంటే ఆయన నవ్వి,
గ్రామాల్లో పరిస్థితి హైదరాబాదులో ఉండేవాళ్లకు అర్ధం కావడానికి టైం పడుతుంది
అన్నాడు. చివరకు ఆ మాటే నిజమైంది.
తెలుగు
దేశం పార్టీ పుట్టేనాటికి నాకు ముప్పయ్ ఆరేళ్ళు. ఆ పార్టీలో నాడు కొత్తగా
చేరినవాళ్ళలో చాలామంది వయసులో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు. వాళ్ళల్లో చాలామంది
మంత్రులు అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ
వయస్సు నలభయ్ రెండు దాటింది. వాళ్ళ వయసు డెబ్బై దాటి వుంటుంది.
ఆ
పార్టీ ఆవిర్భావం నాటికి నేను రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. మొదట రామకృష్ణా
సినీ స్టూడియోలో విలేకరులను పిలిచి తాను త్వరలో రాజకీయ పార్టీ
పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ స్వరూప స్వభావాలను గురించి గుచ్చి గుచ్చి
ప్రశ్నించినా వాటికి ఆయన నుంచి జవాబు లేదు. ఊహా జనితమైన వేటికీ సమాధానం చెప్పనని చెప్పేశారు.
అయితే
చెప్పే ముహూర్తం త్వరలోనే వచ్చింది. మళ్ళీ విలేకరులకు పిలుపువచ్చింది. ఈసారి
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలుసుకున్నారు. పెట్టబోయే పార్టీ పేరు “తెలుగుదేశం పార్టీ”
అనగానే అందరూ విస్తుపోయారు. ఒక పార్టీకి, అందులోనా ఒక ప్రాంతీయ పార్టీకి దేశం
అనే పదం జోడించడం ఏమిటని అనుకున్నారు.
ఇక
అక్కడనుంచి ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.
తెలుగువారి
ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందన్నారు. ఒక తాసీలు
ఆఫీసులో గుమాస్తాను బదిలీ చేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూపులు చూసే పార్టీ, తెలుగు ప్రజలకు ఏం ఒరగబెడుతుందని
ప్రశ్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాలం నాటి కాంగ్రెస్ యెంత మాత్రం
కాదన్నారు. ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు వున్నాయో కాంగ్రెస్ అన్ని రకాలుగా
చీలిపోయిందని ఎద్దేవా చేసారు.
పార్టీ
ప్రచారం కూడా వినూత్న పద్దతిలో సాగింది. ముందు హెలికాప్టర్ పై రాష్ట్రాన్ని చుట్టి
రావాలని అనుకున్నారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని
కాంగ్రెస్ పైనే నెపం వేసారు. దానికి ఒక పత్రిక విస్తృతమైన ప్రచారం ఇచ్చింది.
ఎన్నికల పర్యటనల కోసం తమ ఇంట్లో ఓ గరాజులో మూలపడివున్న, ఎప్పుడో ముచ్చట పడి కొనుక్కున్న నల్ల
రంగు చవర్లెట్ వ్యాన్ ని బయటకు తీసి కొత్త
నగిషీలు చెక్కారు. వ్యాను పైకెక్కి ఉపన్యసించడానికి వీలుగా మైకులు ఏర్పాట్లు చేసారు. ఈ వాహనానికి చైతన్య రధం అని
పేరు పెట్టారు. ఎన్టీఆర్ భోజనం, పడక అంతా అందులోనే. ఎన్టీఆర్
కుమారుడు నందమూరి హరికృష్ణ చైతన్య రధసారధి.
ఉదయం పూట రోడ్డు పక్కనే స్నానాలు. పత్రికల్లో
వాటి ఫోటోలు. అంతవరకూ ఇలాటి ప్రచారం
ఎరుగని వారికి వింతగా అనిపించింది. ఒక్క పత్రిక తప్ప మిగిలిన తెలుగు
దినపత్రికలన్నీ అప్పుడు కాస్తో కూస్తో కాంగ్రెస్ అనుకూల వార్తలు రాసేవి. రామారావు
గారు సాగిస్తున్న ఈ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ‘డ్రామా రావు’ అని
అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు జీ. వెంకటస్వామి గారు ‘అది తెలుగు
దేశం కాదు, కమ్మ
దేశం’ అంటూ నేరుగా ఆ పార్టీకి కులాన్ని ఆపాదిస్తూ ప్రకటన చేసారు. అప్పుడు
కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విలేకరులం కలిసి ‘
మీ మామగారి పార్టీలో చేరతారా అని అడిగితే, ‘పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ
చేస్తా’ అని బదులిచ్చారు. నేను ఆయన ముందే, ఫోన్ చేసి ఆ వార్తను రేడియోకి ఇచ్చాను. ఆ సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో, మరునాడు పత్రికల్లో ‘మామగారిపై
పోటీకి రెడీ అంటున్న చంద్రబాబు’ అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి.
కింది
ఫోటో:
ఎన్టీఆర్, హరికృష్ణ, పర్వతనేని ఉపేంద్ర
(ఇంకావుంది)
2 కామెంట్‌లు:
తెదేపా వయసు 42 . 52 కాదు.
థాంక్స్. సరిచేసాను
కామెంట్‌ను పోస్ట్ చేయండి